ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు,అసాధారణ వ్యక్ట్ నిష్కళంక దేశభక్తుడు ప్రజాక్షేమమే పరమావధిగా ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరముగా ఉంటూ సుమారు ఆరు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి సుందరయ్య. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.కులవ్యవస్థను నిరసించిన ఈయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, కానీ తనపేరులోని లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకొని ,సహచరులచే "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిపించుకొనేవారు.
ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎం లోని ముఖ్య నాయకురాలు.పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో. వెంకటరామిరెడ్డి, శేషమ్మ దంపతులకు 1913 మే ఒకటవ తేదీన జన్మించాడు మే ఒకటవ తేదీ అయన జయంతి సందర్భముగా ఆ మహనీయుడిని స్మరించుకుందాము ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన వర్ధంతి కూడా మే నెలలోనే(మే 19) . ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేసాడు. తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసు లలో చదివాడు
గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై, సుందరయ్య 1930లో తన 17వ యేట ఉన్నత పాఠశాల రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహం లోను, సహాయ నిరాకరణోద్యమం లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతనిని నిజామాబాద్, బోర్స్టల్ స్కూలులో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదల అయినాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, సోలీ బాట్లివాలా వంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్య నిర్వాహక వర్గం సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి, క్రమంగా కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ కార్యదర్శి అయ్యాడు. ఈయనను "కమ్యూనిస్టు గాంధీ" అనేవారు. అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తరువాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్యకు అప్పగించింది. ఈ సమయంలోనే కేరళకు చెందిన నంబూద్రిపాద్, కృష్ణ పిళ్ళై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీనుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు. సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించాడు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చాడు. 1936లో అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించిన వారిలో సుందరయ్య ఒకడు. ఆ సభకు సంయుక్త కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీషు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు, 1939 నుండి 1942 వరకు, నాలుగేళ్ళు అజ్ఞాతంలో గడిపాడు. పెళ్ళి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్ళికాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నాడు అలాంటి త్యాగము మహాభారతములో భీష్ముడు మాత్రమే చేయగలిగాడు.తండ్రినుంచి వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశాడు.పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు.పార్లమెంటు భవనంలో చప్రాసీల సైకిళ్లతోపాటు ఇతని సైకిలు కూడా స్టాండులో ఉండేది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిలును ఉపయోగించాడు గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని పాతతరం నాయకులు వర్ణిస్తారు
1943లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు. బొంబాయిలో మొదటి పార్టీ కాంగ్రెస్ జరిగింది. తరువాత రెండవ పార్టీ కాంగ్రెస్ కలకత్తాలో జరిగింది. రెండుసార్లు కేంద్ర కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యాడు. కలకత్తా సమావేశంలో పార్టీ సాయుధ పోరాటంను సమర్ధిస్తూ తీర్మానం చేసింది. దీనిని "కలకత్తా థీసిస్" అంటారు. అప్పటి సాధారణ కారదర్శి బి.టి.రణదివే ఈ తీర్మానాన్ని బలంగా సమర్ధించాడు. తత్ఫలితంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించారు. త్రిపుర, తెలంగాణ, తిరువాన్కురు ప్రాంతాలలో సాయుధ పోరాటాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది తెలంగాణా సాయుధ పోరాటం ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడు.1952 లో సుందరయ్య మద్రాసు నియోజక వర్గం నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యాడు. తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 1967 వరకు శాసన సభా సభ్యునిగా కొనసాగాడు. మళ్ళీ కొంత కాలం విరామం తరువాత 1978 లో శాసన సభకు ఎన్నికై, 1983 వరకు శాసన సభ సభ్యునిగా ఉన్నాడు.
1952 లో ప్రత్యేక పార్టీ సమావేశంలో మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. పార్టీ అత్యున్నత స్థాయి సంఘమైన "పాలిట్ బ్యూరో" సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. విజయవాడలో జరిగిన మూడవ పార్టీ కాంగ్రెసులోను, పాలక్కాడ్‌లో జరిగిన నాలుగవ పార్టీ కాంగ్రెసులోను కూడా కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
1962 లో చైనా భారతదేశం యుద్ధం సందర్భంగా, పార్టీ నాయకత్వంలో ఎస్.ఎ. డాంగే వర్గం భారత ప్రభుత్వాన్ని సమర్ధించింది. అంతే కాకుండా చైనా, రష్యా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాంగే వర్గం రష్యాకు అనుకూలమైన పంథాను సమర్ధించింది.విభేదాల ఫలితంగా అక్టోబరు-నవంబరు 1964 లో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్‌లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అందులో లెఫ్టిస్టులనబడేవారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేరుతో క్రొత్త పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీకి సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మే 1966 వరకు నిర్బంధంలో ఉన్నాడు. 1975-1977 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించినపుడు అరెస్టును తప్పించు కోవడాని కోసం సుందరయ్య అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
.1985, మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశాడు. హైదరాబాద్ భాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి తను మరణించే సమయానికి సుందరయ్య ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ సాధారణ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. అతని భార్య లీల సుందరయ్య కూడా సి.పి.ఐ.-ఎమ్ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు.ఆంధ్ర ప్రదేశ్ ను ఆహారధాన్యాల మిగులు రాష్ట్రముగా ఎవరైనా పేర్కొంటే ఆయన ఒప్పుకొనే వారు కాదు. లక్షలాది నిరుపేదలు తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తూ ఉంటె మిగులు రాష్ట్రము ఎలా అవుతుంది అని ప్రశ్నించేవాడు.ఆ విధముగా నిత్యమూ పేదల బాగు కోసము అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు సుందరయ్య.
అంబడిపూడి శ్యామసుందర రావు
. .