రామాయణం, రామనామం మన జీవితం - Bhamidipati Krishna Murti

Ramayanam, Ramanamam mana jeevitham

రామాయణం , రామనామం మన జీవితంలో ఎంత లోతులోకి వెళిపోయాయంటే మనం వాడుతున్న భాషలోనే ఆవిషయం ప్రస్ఫుటమౌతుంది. ఉదయం లేస్తూనే మనం "అదౌరామ తపో వనాదిగమనం ..." అంటూ ఆ దినం ప్రారంభిస్తాము. మనం భౌతిక మైన, సామాజికమైన విలువల్లో పడి కొట్టుకు పోకుండా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడటానికి నిలబెడుతున్న ఆదర్శ పురుషుడు ఆ శ్రీరాముడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన దర్పణమే ఆ మహానుభావుడు. తన జీవితం ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక వెలుగులను అందించి అమరత్వo పొందే బాటను ఆవిష్కరించిన ఒక అద్భుత దీప్తి శ్రీరామచంద్రమూర్తి. ఆపురాణపురుషుని గాధయే రామాయణము. అటువంటి శ్రీరాముని నామము, వారి చరిత్ర అయినుటువంటి రామాయణములో పాత్రలు, సన్నివేశాలు మన దైనందిక జీవనంలో చాల లోతువరకు చొచ్చుకు పోయాయి. వాటిలో కొన్ని సాధారణంగా మనం వాడే భాషలో అప్పటికప్పుడు నోట వచ్చే వాక్యాలు మనం పోల్చే సంఘటనలు కొన్ని ఇక్కడ సంకలనం చేయటమైనది.

 

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ఏదైనా శుభవార్త వింటే "శుభం. అంతా ఆ శ్రీరాముని దయ .." అంటాం వినకూడని మాట వింటే అనే మాట – రామ రామ ఏదైనా దుర్వార్త విన్నప్పుడు "రామచంద్రా!!" అంటూ మన ఆవేదన తెలుపుతాము ఎవరిమీదైనా జాలి చూపవలసి వచ్చినప్పుడు కూడా "రామ రామ " అని మరో వరుసలో అంటాం మనం బాగా అలసిపోయినప్పుడు ఓచోట కూర్చొని "రామా" అనుకొని కొంత సేద తీర్చుకోవటం చాలా సాధారణం. పెళ్లి శుభలేఖ వేసేటప్పుడు ప్రధమంగా " జానక్యాః కమలామలాంజలి .. " అన్న శ్లోకం తప్పనిసరిగా వేయిస్తాం. చిన్నపిల్లలకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి – శ్రీరామరక్ష - వెయ్యేళ్ళు ఆయుష్షు ." అంటూ ఆరామరక్షను ఆర్ధించటం పరిపాటి. పిల్లలకు పాలు పట్టి ఉయ్యాలలో పడుకోపెట్టి నిద్ర పుచ్చటానికి పాడే పాట రామాలాలీ - మేఘశ్యామా లాలీ…” మనంకూడా రాత్రి నిద్రకుపక్రమించే సమయంలో చదివే శ్లోకం - "రామస్కందం.. " తండ్రి మాట జవదాటని వ్యక్తిని పొగడాలంటే - అతను సాక్షాత్తు శ్రీరాముడే.” అని శ్లాఘిస్తాము భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం. ఎటువంటి కష్టం వచ్చినా గట్టెక్కించే తారక మంత్రంజై శ్రీరామ్ విష్ణు సహస్రం పారాయణ చేసే తీరిక లేకపోతే క్లుప్తంగా చెప్పాల్సిన శ్లోకం –

శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే |

సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే ||

అన్నం కోసం అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా.. వయసుడిగిన వేళ అనాల్సిన మాట – రామా కృష్ణా!! తిరుగులేని ప్రయత్నానికనే మాట - రామబాణం అందర్నీ సమంగా చూసేవానిని అనే మాట - రాముడు సకల సుఖశాంతులకు వాడుకలో ఉన్న మాట - రామరాజ్యం. ఒక వ్యక్తి ఆజానుబాహుడి పోలికకు - రాముడు ఒక బుద్ధిమంతుణ్ణి పోల్చే మాట - రాముడు మంచి బాలుడు ఆదర్శ దాంపత్యానికి ప్రమాణం - సీతారాములు అన్నదమ్ముల అనుబంధానికి మనం వాడే పర్యాయపదం – రామలక్ష్మణులు. కవల పిల్లలకు తరచు పెట్టుకునే పేర్లు - రామలక్ష్మణులు మంచి మిత్రుడు- రాముడు (గుహుడు చెప్పాడు) మంచి స్వామి రాముడు (హనుమంతులవారు చెప్పారు) సంగీత సారం – రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు) లోకంలో అత్యంత రుచికరమైనదిరామనామం. (ప్రత్యేకంగా రామదాసు చెప్పిన మాట) మానసికంగా తాగాల్సిన అమృతం - రామ నామామృతం. (పిబరే రామరసం.. అంటూ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన) గొప్ప విద్యార్ధి రాముడు - (వసిష్ఠ, విశ్వామిత్రులు మెచ్చుకున్న రీతి) కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రామకథ చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు ధర్మం పోత పోస్తే-రాముడు ఆదర్శాలు రూపుకడితే - రాముడు. అందం రాశి పోస్తే-రాముడు. ఆనందం నడిచొస్తే - రాముడు. వేదోపనిషత్తులకు పరమార్థం - రాముడు. లోకం కోసం దేవుడే మనిషిగా పుట్టినవాడు - రాముడు.

ఎప్పటి త్రేతాయుగ రాముడు? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా - ఆ శ్రీరాముడే. ఒక పుత్రునిగా , ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక శిష్యునిగా, ఒక వీరునిగా, ఒక రణధీరునిగా, ఒక ధర్మనిష్టా గరిష్ఠునిగా, సుగుణాల రాశి - శ్రీరాముడు. మనం కొంచెం సునిశితంగా పరిశీలిస్తే భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిబింబిస్తూనే ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఇప్పుడు రామాయణం లోని మరికొన్ని పాత్రలు, సంఘటనల్లోకొస్తే అవి కూడా మన నిత్య జీవితంలో బాగానే అల్లుకుపోయాయి. అటువంటి వ్యావహారిక వాడుకలు కొన్నిక్కడ పొందుపరచటమైనది.

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుందిఅన్న నానుడి చాలా ప్రతీతి విషయం క్లుప్తంగా వివరించటానికి వీలుకాకపోతే – అబ్బో! అదో పెద్ద రామాయణం - అంటూ దాటేస్తారు ఆదేశాన్ని జవదాటడానికి వీల్లేని సందర్భం అయితే - లక్ష్మణ రేఖ - అనటం కద్దు. ఒక వాహనం పైన ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం అంటారు. మన పని ఒక దుష్టుని చేతులో పడి అతని చేష్టలు తప్పించుకోలేనప్పుడు అతనివి కబంధ హస్తాలుఅనటం మామూలే. ఒక పనిని ఎంతవరకు చేయగలమో చూసిరమ్మన్న వ్యక్తి అదే పనిని పూర్తి చేసి వస్తే అందుకు మనం - చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు - అంటాం ఆంజనేయుడిని దృష్టిలో పెట్టుకొని. ఎవరికైనా ఎంగిలి చేసిన పదార్థం ఇస్తే వారిని భక్త శబరి తో పోలుస్తాం. ఒక వ్యక్తి అతిగా నిద్రపోతే - కుంభకర్ణుని నిద్ర - అంటూ ఆక్షేపిస్తాం ఎవరికైనా పెద్ద ఇల్లుంటే – లంక అంత కొంప - అనటం నిత్య వ్యవహారం. ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే అదొక ఋష్యమూక పర్వతం అనటం అతి సహజం. మనకేదైనా జీవితంలో విషమ పరీక్ష ఎదురైతే మనం దాన్ని - అగ్ని పరీక్ష- లా భావిస్తాము. ఏదైనా విషయంలో చాడీలు చెప్పి పేచీలు పెట్టే వారికి మంథర పేరుపెట్టటం మామూలే చిన్న చిన్న సహాయాలు చేసేవారు - ఎదో ఉడతా భక్తి - అంటూ సమర్థిస్తారు. ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే - అది రామరావణ యుద్ధమే - అనటం సర్వ సామాన్యం. ఏదైనా మంట ఎక్కువ సేపు రగుల్తూ వుంటే దాన్ని -రావణ కాష్టం - అనటం వ్యవహారికం.

 

రామాలయం లేని ఊళ్ళు భారత దేశంలో అరుదనే చెప్పవచ్చు. భద్రాద్రిది ఒక కథ.. ఒంటిమిట్టది ఒక కథ.. కొత్తగా నిర్మిస్తున్న అయోధ్యలో రామాలయం – మరో కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం. చెబితే మహా భారతం. అందుకే కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు హిందూయిజం ఒక మతం కాదు...అది ఒక జీవన విధానం అని.మన ప్రస్తుత ప్రధాని గౌ. నరేంద్ర మోదీ గారు గొప్ప రామభక్తుడు. అయన ఓ సందర్భంలో "మనం చేసే ప్రతీ పనికీ ఆ రాముడే స్ఫూర్తి" అంటూ రాముడిపైన రామాయణంపైనా అతనికెంతో నమ్మకమని ప్రసంగించారు. రామాయణ కథలు మనకంటే ముస్లిములధిక సంఖ్య లో గల ఇండోనేషియా లో ప్రదర్శిస్తారంటే, రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు.

|| జై శ్రీ రామ్ ||

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు