అంతర్జాతీయముగా ఖ్యాతి గడించిన జిడ్డు కృష్ణమూర్తిగారు గొప్ప దార్శనికుడు,విద్యాతత్వ వేత్త రచయిత, కవి ఈయన చిత్తూర్ జిల్లా లోని మదనపల్లె లో 1895 మే 11న నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు 8వ సంతానంగా జన్మించాడు మే 11న అయన జయంతి సందర్భముగా ఈ వ్యాసము తండ్రి తాహసీల్దార్ గాపనిచేసేవాడు తల్లి శ్రీకృష్ణ భక్తురాలు తనకు పుట్టబోయే అష్టమ సంతానము దైవంశ సంభూతుడిగా భావించి పూజా మందిరాన్ని పురిటి గదిగా చేసుకొని పుట్టిన బిడ్డకు కృష్ణమూర్తి అని పేరు పెట్టుకుంది.తండ్రి నారాయణయ్య ఉద్యోగ విరమణ అనంతరము కుటుంబంతో మద్రాసు వెళ్లి అడయార్ లోని దివ్యజ్ఞాన సమాజములో చిన్న ఉద్యోగం లో చేరాడు. అప్పట్లో దివ్యజ్ఞాన సమాజము ప్రముఖులైన అనిబిసెంట్ లెడ్ బీటర్ వంటి వారి ఆధ్వర్యములో నడిచేది. ధర్మ సంస్థాపనకు కరుణామయుడైన మైత్రేయ బోధిసత్వుడు మరల మానవ రూపములో జగద్గురువుగా అవతరించే కాలము ఆసన్నమైంది అని వారు భావిస్తుండేవారు. దివ్యజ్ఞాన ప్రాంగణములో ఆడుకుంటున్న కృష్ణమూర్తిని చుసిన లెడ్ బీటర్ ఆశ్చర్యముతో రానున్న జగద్గురువు ఈతనే అని నిర్ధారించుకున్నాడు. కృష్ణ మూర్తిని ఆవరించి ఒక ప్రభామండలము ఉన్నట్లు తమ దివ్యనేత్రాలతో లెడ్ బీటర్ చూసినట్లు పేర్కొంటారు.
చిన్నప్పటి నుండి కృష్ణమూర్తికి చదువుపై శ్రద్ద లేకపోవటం తల్లి దండ్రులకు ఆందోళన కలిగించేది.కానీ జాతకము ప్రకారము అతను
మహా పురుషుడవుతాడని చెప్పటం వల్ల వారు సర్ది చెప్పుకొనేవారు.శ్రీమతి అనిబిసెంట్,కృష్ణమూర్తిని అతని తమ్ముడు నిత్యానందుడిని కృష్ణమూర్తి తల్లిదండ్రులను ఒప్పించి దివ్య జ్ఞాన సమాజము తరుఫున ఉన్నత చదువులకు ఇంగ్లాండ్ పంపారు కానీ కృష్ణమూర్తి ఎక్కడ ఎక్కువకాలం చదవలేదు స్వతహాగా ఉండే తెలివితేటలతో 15 ఏళ్ల వయసుకే "అట్ ది ఫీట్ ఆఫ్ మాస్టర్" అనే గ్రంధాన్నిరాశారు. ఈ గ్రంధము 27 భాషల్లోకి అనువదింపబడింది ఆ తరువాత 16 ఏళ్లకే మొట్టమొదటి దార్శినిక ఉపన్యాసము ఇచ్చి పలువురిని ఆకర్షించాడు.కృష్ణమూర్తి రూపు రేఖలు కూడా కాంతివంతముగావుండటంతో బెర్నార్డ్ షా వంటి ప్రముఖులు కూడా అటువంటి చక్కని మానవమూర్తిని ఎన్నడూ చూడలేదని మెచ్చుకునేవారు అనిబిసెంట్ రూపొందించిన తారక సమాజ అభివృద్ధికి ఎందరో సంపన్నులు ఆర్ధిక సహాయము చేసేవారు హాలెండ్ దేశస్తుడు ఒక కోటను ఐదు వేల ఎకరాల తోటను ఈ సమాజానికి దానము ఇచ్చ్హాడు
తన సోదరుడు నిత్యానందం ఆకస్మికముగా మరణించటంతో మొదటిసారిగా భాధ అంటే ఏమిటో తనకు అర్ధమయింది అని చెపుతాడు.ఆ బాధే తనలోని విజ్ఞాన జ్యోతి వెలిగినదని నూతన ఉత్తేజము కలుగజేసింది అని చెపుతారు.1922లో అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఒక వినూత్న ఆధ్యాత్మిక అనుభవముకలిగి నూతన సత్యాన్ని దర్శించినట్లు చెపుతారు. ఫలితముగా దివ్య జ్ఞాన సమాజపు ప్రధాన లక్ష్యాలే మారాయని అంటారు.1926లో "ఆర్డర్ ఆఫ్ ద స్టార్ "ను రద్దు చేసి మతాలకు జగద్గురు భావనలకు ఆరాధనలకు అతీతుడుగా నూతన ప్రపంచ నిర్మాణానికి కృషి చేయటము మొదలుపెట్టారు. విద్యను బాల బాలికలకు జాతి దేశ,మత రాజకీయాలకు అతీతముగా అందించటమే నూతన ప్రపంచ నిర్మాణానికి మార్గమని అయన ప్రఘాఢముగా నమ్మేవారు.1928లో అనిబిసెంట్ తో కలిసి స్థాపించిన కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా దేశ విదేశాలలో అనేక స్కూళ్లను నిర్వహించేవాడు. జీవిత సమస్యలను అర్ధము చేసుకున్న మహా వేదాంతి కృష్ణమూర్తి తానూ ఒక అద్దము లాంటి వాడిని అని ఇతరులు వారి జీవితాలను నిజరూపాలను అందులో చూసుకోవచ్చు అని అనేవాడు.ఎలాంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా జీవించ మని అనేవాడు ప్రతి వ్యక్తి తనని తానూ తెలుసుకోవటమే జ్ఞానానికి తొలిమెట్టు అని చెప్పేవారు.జీవితమూ ఒక గ్రంధము లాంటిది అని అందులో అనేక అధ్యయాలు ఉంటాయని వాటిని చదవటానికి అర్ధము చేసుకోవటానికి ఎవరిపైన ఆధారపడవలసి పని లేదని కృష్ణమూర్తి గారు అనేవారు.
కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు భారతదేశములోని మతపరమైన ప్రధాన సంస్థలను ఆకర్షించేవి అయన అనేక హిందూ భౌద్ద మేధావులతో మత పెద్దలతో ఇతర నాయకులతో చర్చలు జరిపేవారు,ఈయనతో చర్చలలో పాల్గొన్న ప్రముఖులలో దలైలామా కూడా ఉన్నారు.ఈ చర్చలను కృష్ణ మూర్తి గారి గ్రంధాలలో అనేక అధ్యాయాలుగా ప్రచురించబడ్డాయి.ఈయన ఉపన్యాసాలవల్ల ప్రభావితము అయిన వారిలో బ్రుస్ లీ ,టోనీ ప్యాకర్, అచ్యుత్ పట్వర్ధన్,మరియు దాదా ధర్మాధికారి లాంటి ప్రముఖులు ఉన్నారు.అయన ఉపన్యాసాలు బోధనలు విన్నవారికి అయన మాటల్లో ఎంతో జ్ఞానము ఉన్నట్లు అనుభవపూర్వకంగా తెలుసుకొనేవారు అయన తన బోధనలను యావత్తు ప్రపంచానికి తెలియజేయాలని ప్రపంచమంతట విస్తృతము పర్యటించేవారు. ఎందరో ఆయనను వ్యక్తి గతముగా కలుసుకొని .వారి సమస్యలకు లేదా బాధలకు పరిష్కారాన్ని పొందేవారు. ఆ విధముగా పొందిన జ్ఞానముతో తృప్తి చెంది సుఖజీవనాన్ని గడిపేవారు.కృష్ణమూర్తిగారు ఉపాద్యాయులతో విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో జరిపిన చర్చలలో ఎన్నో విషయాలను "లైఫ్ ఏ హెడ్ "అనే గ్రంధముగా ప్రచురించారు
అయన తన జీవిత కాలములోసుమారు 700 గ్రంధాలను రచించారు వాటిలో కొన్ని,"ఫ్రీడమ్ ఫ్రేమ్ నోన్" , "ద ఓన్లీ రివల్యూషన్","ద అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్" ,"ద ఇంపాజిబుల క్వశ్చన్", "బియాండ్ వయలెన్స్" మొదలైనవి.ఈ గ్రంధాలన్ని మనిషి జీవిత లక్ష్యాలను నిర్ధేశించేవిగా ఉండేవి ఆయనను గురు తుల్యులు గా భావించే వారి సంఖ్య అభిమానించే సంస్థలు అనేకము ఉన్నప్పటికీ అయన మాత్రము తానూ ఎవరికీ గురువును కానని తనకు శిష్యులు ఎవరు లేరని ఎవరికీ వారే గురువులు అని అంటు ఉండేవారు. .ఇతరుల నుండి ఏమి ఆశించకుండా నీ గురించి నీవే తెలుసుకోవాలని అనేవారు.సుమారు అరు దశాబ్దాల పాటు పలు ప్రాంతాలలో పర్యటించి తన బోధనలు ప్రజలకు వినిపించేవారు.చిత్తూరు దగ్గర రిషి వ్యాలీలో, వారణాసి లో రాజ్ ఘాట్ దగ్గర ఇంగ్లాండ్ లోని బరాక్ ఉద్ పార్క్ దగ్గర, హాంపియర్ ప్రాంతాలలో కృష్ణమూర్తిగారు తన విద్యాసంస్థలను నెలకొల్పారు. ఈ విద్యాసంస్థలలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపకులను తరచూ కలుస్తూ వారితో మాటలాడుతుండేవారు.వారితో మాట్లాడేటప్పుడు దేవుడు అంటే ఏమిటి,? దేవుడిని ఏమికావాలి ?అని అడుగుతాము, పూజ ఎందుకు చేయాలి? మతము అంటే ఏమిటీ ? ప్రార్ధన దాని ప్రాధాన్యత ఏమిటి? డబ్బున్నవాళ్లకంటే పేద వాళ్ళు ఎందుకు సంతోషముగాఉంటారు? ప్రపంచములో దుఃఖము, అశాంతి ఎందుకు ఉంటాయి? లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలను ఉత్కంఠ భరితముగా సాధికారముగాబోధించేవారు. ఈయన ప్రసంగాలను విన్నవారు ఈయనను గౌతమ బుద్ధునితో పోల్చు కొనేవారు . కృష్ణమూర్తి గారిని సంతోషము కావాలనుకోవటం కోరిక అవుతుందా?అని ఒకరు ప్రశ్నిస్తే అది మనిషి స్వభావము అని ప్రతి మనిషి ఎదో ఒక సమయములో భాధ వ్యధ అనుభవిస్తూ ఉండటం సహజము. ఆ భాధలు సమస్యలు వచ్చినప్పుడుపరిగెత్తి పారిపోవాలనుకోవటం సబబు కాదు అని అనేవారు.
కృష్ణమూర్తి గారు 90ఏళ్ల వయస్సులో క్యాలిఫోర్నియాలోని తన ఆశ్రమములో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధి వలన 1986 ఫిబ్రవరి 17 న పరమ పదించారు. అయన పరమపదించిన అయన బోధనలను నాలుగు సంస్థలు ప్రచార భాద్యత తీసుకొని దానికి సంబంధించిన పనులను నిర్వహిస్తున్నారు ఆ విధముగా నేటికీ కృష్ణమూర్తిగారు అయన బోధనలు ప్రజల మనస్సులో శాశ్వతముగా ఉన్నాయి అయన తన బోధనల ద్వార గ్లోబల్ అవుట్ లుక్ ను పెంపొందించారు.మానవత్వము ప్రకృతిలో భాగము అని ప్రచారము చేసేవారు.