సుశాస్త్రీయం: బహుముఖ ప్రజ్ఞావంతుడు డాక్టర్ కట్ట'మంచి' రామలింగారెడ్డి గారు - టీవీయస్. శాస్త్రి

DR. Cattamanchi Ramalinga Reddy biography

శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు(డిసెంబర్, 10, 1880 -- ఫిబ్రవరి, 24, 1951) ప్రముఖ విద్యావేత్త, కవి, హేతువాది, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆర్ధిక నిపుణుడు. వీరిని సమకాలీకులు మరియు సోదర తెలుగుప్రజలు ప్రేమతో సర్. సి. అర్. రెడ్డి అని పిలిచేవారు. వీరు తెలుగు భాషలో ఛందోబద్ధమైన కవిత్వాన్నే గాక ఆంగ్ల భాషలో కూడా తన రచనా ప్రక్రియను పండితజన ప్రశంసలు పొందేవిధంగా కొనసాగించారు. డాక్టర్ సి. అర్. రెడ్డి ఆంధ్రదేశంలోనే గాక యావత్ భారతదేశంలో పేరెన్నికగన్న ప్రముఖవిద్యావేత్త. విద్యార్ధులను జ్ఞానవంతులుగా తీర్చే అత్యంత ప్రాముఖ్యమున్న అనేక విద్యావిధానాలను ప్రవేశ పెట్టిన ఘనుడు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి, బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా ఆ మహనీయుని సర్ బిరుదుతో సత్కరించారు. ఆయన ఆంద్రవిశ్వవిద్యాలయ స్థాపకుడు. అంతే కాకుండా, ఆంద్రవిశ్వవిద్యాలయానికి 1926 నుండి 1931 వరకు ఉపకులపతిగా కూడా పనిచేసి, విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. మరల రెండవసారి, అనగా 1936 నుండి 1949 వరకు , పదమూడు సంవత్సరాలు ఎటువంటి విమర్శలు, వివాదాలకు లోను కాకుండా విజయవంతంగా, సమర్ధవంతంగా ఆ పదవిని నిర్వహించి, ఆ పదవికే వన్నెతెచ్చారు. ఆ మహనీయుని జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం!

శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు చిత్తూరు పట్టణం పొలిమేరలోని ఒక పల్లెటూరు అయిన కట్టమంచిలో డిసెంబర్, 10, 1880 న జన్మించారు. తండ్రి గారైన సుబ్రహ్మణ్యరెడ్డి గారికి రామలింగారెడ్డి గారు ద్వితీయ కుమారుడు. సుబ్రహ్మణ్యరెడ్డి గారు చిత్తూరులో ప్రముఖ న్యాయవాది. వీరు ఋజువర్తనలు, నిజాయితీపరులు, సచ్ఛీలురు. శ్రీ కట్టమంచి వారి తల్లి పేరు నారాయణమ్మ. వీరిది పండిత వంశం. ముత్తాత పెద రామలింగారెడ్డి గొప్పకవి. పండితుడు. తండ్రి విద్వాంసుడు, ముత్తాత భాస్కర శతకకర్త. తండ్రి భారత సారరత్నావళి, భాగవత సార ముక్తావళి అనే రెండు సంకలనాలను రచించిన సాహితీ పిపాసి. తన తండ్రిని గురించి ముసలమ్మ మరణం ఉపక్రమణికలో రామలింగారెడ్డి ఒక చక్కని పద్యాన్ని ఈ క్రింది విధంగా వ్రాసారు.

'భారత భాగవతోజ్జ్వల
వారధి గత సారపద్య వరమణి చయమున్
హారముగఁ గూర్చె నెవఁడా
సూరిని మజ్జనకుఁ దలఁచి చూడుడు నన్నున్'.

-- రామలింగారెడ్డి పితృభక్తిని తెలియజేసే పద్యమిది. ఈయన పాఠశాల ఉన్నతవిద్యను 1896 లో ప్రధమశ్రేణిలో పూర్తిచేసారు. తరువాత కళాశాల విద్యకోసం 1897 లో మద్రాస్ క్రీస్టియన్ కాలేజీలో చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు రెవ్. Dr. మిల్లర్ గారు ప్రిన్సిపాల్ గా ఉండేవారు. డాక్టర్ స్కిన్నర్ గారు ఫిలాసఫి ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ కెల్లెట్ ఆంగ్ల భాషాధ్యాపకునిగా ఉండేవారు. శ్రీ రెడ్డి గారు వీరందరి మెప్పు పొందటమే కాకుండా, వారికి ప్రియతమ శిష్యుడిగా కూడా అయి అనతికాలంలోనే విద్యార్ధిగా తన ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. కళాశాలలో ఉండగానే, తెలుగు భాషపై కూడా పట్టు సాధించారు. అంతేకాకుండా, స్కాలర్ షిప్ ను కూడా పొందారు. 'ముసలమ్మ మరణం' అనే కావ్యాన్ని సాంప్రదాయ ప్రబంధ గ్రందాల రీతిలో రచించి, ప్రఖ్యాతి గాంచారు. 1899లో వ్రాసి, 1900లో ప్రచురింపబడిన 'ముసలమ్మ మరణము' 107 పద్య, గద్యాల కావ్యం. ఇది మద్రాసు క్రైస్తవ కళాశాలకు చెందిన 'భాషాభిరంజని సమాజం' పోటీ కోసం వ్రాసినది. ఆయన స్నేహితుడు అయిన నారాయణస్వామి నాయుడి గారింట బ్రౌన్ ప్రచురించిన 'అనంతపుర చరిత్రము' ను చదివి, నారాయణస్వామి చెప్పిన పల్లెజీవితాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపడిన రామలింగారెడ్డి గారు, ఆ ప్రేరణతో ఈ కావ్యరచన చేసారు.

నేటికీ అనంతపురం - తాడిపత్రి మార్గంలో అనంతపురం దగ్గర మండల కేంద్రంగా ఉంది బుక్కరాయసముద్రం అనే ఊరు. పెద్ద వర్షాలు కారణంగా ఆ ఊరి చెరువు నిండి, కట్ట తెగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గ్రామంలోని బసిరెడ్డి గారనే మోతుబరి రైతు చిన్నకోడలు ముసలమ్మ బలి అయితే కట్ట తెగిపోదని ఆకాశవాణి ఊరి ప్రజలకు చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న ముసలమ్మ తన పల్లె కోసం త్యాగం చేయటానికి సిద్ధపడి, ఆత్మార్పణం చేసుకోవటమే ఈ కావ్య వస్తువు. విన్న ఆధారాలను తీసుకొని, దానిని కథావస్తువుగా తీర్చిదిద్దటం ఇందలి ప్రత్యేకత. వర్ణనలకోసం కథ కాకుండా, కథకోసం వర్ణనలనే పద్ధతిలో కావ్యం సాగుతుంది. పూర్వ ప్రబంధ నాయిక కేవలం శృంగార రసాధిదేవత. కానీ , దానికి భిన్నంగా వీరి నాయిక త్యాగం అనే గుణానికు ప్రతీక అయింది. ఈ విధంగా స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చిన కావ్యం తెలుగులో అంతవరకూ లేదు. 'స్త్రీలకుపయుక్తంగా నొప్పిన యెడల నా ప్రయాస సఫలత నొందినట్టే' అని కట్టమంచి గారే కావ్యంలో వ్రాసారు. కావ్య నామకరణం కూడా విశేషంగా ఉంది. పూర్వ కవులు విషయాన్ని పేజీలకు పేజీలు వర్ణించేవారు. కట్టమంచి విపరీత వర్ణనల జోలికి పోలేదు. ఈ విషయంలో తనకు మార్గదర్శకంగా ఎవరిని ఎంచుకున్నారో మనం గమనిస్తే కట్టమంచి ఎంత పొదుపుగా, ప్రతిభావంతంగా వర్ణనలు చేసివుంటారో అర్థం చేసుకోవచ్చు. పదవ పద్యంలో ఇలా ప్రార్థిస్తారు:

"కవికుల బ్రహ్మ దిక్కన గణనచేసి,
సూరనార్యుని భావంబు సొంపు బొగడి,
వేమన మహాత్ము సహజ విద్యా మయాత్ము
మ్రొక్కి, కవన మొనర్పంగ బూని నాడ. "

'ఒక ఉద్యమం (స్వాతంత్య్రోద్యం) విజయవంతం కావడానికి పురుషులే కాదు, స్త్రీలు కూడా భాగస్వాములు కావాలన్నది కట్టమంచి అభిప్రాయం. 'సాంఘికమైన వస్తువు; సామాన్యులైన నాయికా నాయకులు; వీరరసాత్మకమైన రచన; ప్రబంధ పద్ధతి భోగవస్తువు కాకుండా నాయిక త్యాగమూర్తి కావడం; నాయిక ప్రధానంగా కావ్యం సాగడం; కావ్యం శుభాంతం కాకుండా నాయిక మరణాంతం కావడమనే ఆరు కారణాలు కావ్యపు వస్తునవ్యతను పట్టిచూపుతాయి. 'ఇది పింగళి లక్ష్మీకాంతం గారి అభిప్రాయం (గౌతమి వ్యాసములు). రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు నవ్యాంధ్ర సాహిత్య వీధులు గ్రంథంలో రాయప్రోలు సుబ్బారావు గారు భావమార్గంలో ఆద్యులని 1913లో వెలువడిన 'తృణకంకణము'; గురజాడ అప్పారావు గారు రచనామార్గంలో ఆద్యులని 1910లో ప్రచురింపబడిన 'ముత్యాలసరాలు' అని పేర్కొని, వస్తుమార్గంలో ఆద్యులెవరో పేర్కొనకపోవడం వలన --- 1900లో నూతన కావ్య వస్తువుతో వెలువడిన ముసలమ్మ మరణము గురించీ, కట్టమంచి వారిని గురించీ పేర్కోనకపోవటంవలన కురుగంటి సీతారామయ్య గారు అన్ని విషయాలు సోదాహరణంగా పేర్కొని వస్తు మార్గానికి ఆద్యుడు కట్టమంచి అని ఋజువు చేసి , గురజాడ (1910), రాయప్రోలు (1913) కన్నా కట్టమంచి (1900) ముందువాడని నొక్కి వక్కాణించారు. అది తెలుగు సాహిత్యంలో శ్రీ కట్టమంచి వారి స్థానం.

'ముసలమ్మ మరణం' లోని కొన్ని పద్యాలను నేను హైస్కూల్ లో విద్యార్ధిగా చదువుకున్నాను. శ్రీ కట్టమంచి 1901లో ఫిలాసఫిలో డిగ్రీ పట్టాను పుచ్చుకోవటమే కాకుండా అనేక విశ్వవిద్యాలయాల నుండి బహుమతులను పొందారు. అటు పిమ్మట ప్రభుత్వ ఉపకార వేతనంతో 1902లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. కేంబ్రిడ్జిలోఆయన చదివిన కాలేజి పేరు సెయింట్ జాన్స్ కాలేజి. ఇదే కాలేజిలో ప్రముఖ ఆంగ్లకవి విలియం వర్డ్స్ వర్త్ కూడా చదువుకున్నారట! మద్రాస్ క్రీస్టియన్ కాలేజిలో లాగానే, ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ప్రధముడిగా నిలిచారు. ఆ రోజుల్లోనే ప్రముఖ వక్తగా కూడా రాణించారు. లిబరల్ క్లబ్ అనే సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తొలి విదేశీయుడీయనే! జాన్ మేనార్డ్ కేయన్స్ అనే వ్యక్తి సెక్రటరీగా ఉండేవారు. (తరువాతి రోజుల్లో ఈయనే ప్రఖ్యాత ఆర్ధిక వేత్తగా పేరొందారు). 31-10-1905న శ్రీ కట్టమంచి, గోపాలకృష్ణ గోఖలే గారిని ప్రసంగించటానికి క్లబ్ కు ఆహ్వానించారు. అక్కడ చదువుకునే రోజుల్లోనే రామలింగారెడ్డి గారు అక్కడ జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ తరఫున ప్రచారం చేసి, ఆ పార్టీ అధికారంలోకి రావటానికి కారకులయ్యారు. అక్కడ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తిచేసుకొని, 1907 లో స్వదేశానికి తిరిగి వచ్చారు. శ్రీ అరబింద్ ఘోష్ వలన ఖాళీ అయిన వైస్ ప్రిన్సిపాల్ పదవిలో బరోడాలోని బరోడా కాలేజీలో చేరారు. ఆయన ఒక ప్రముఖ ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం రూపశిల్పి కట్టమంచి రామలింగారెడ్డి. అయితే 1930లో సత్యాగ్రహుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ దమననీతికి నిరసనగా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. సహాయ నిరాకరణోద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ ఛాన్సెలర్ అయిన మద్రాస్ గవర్నర్కి వ్రాసిన లేఖలో ''నా సోదర సోదరీమణులు చేస్తున్న త్యాగాలు, పడుతున్న బాధలు చూసి ప్రస్తుత పదవిలో నేనుండలేకపోతున్నాను. ఈ మానసిక క్షోభల మధ్య ఉపాధ్యక్ష పదవి సంతోష ప్రదమనీ, గౌరవదాయకమనీ భావించడం లేదు'' అని వ్రాసి సూటిగా తన ఆవేదనను వ్యక్తం చేసారు. ప్రముఖ పత్రికా సంపాదకులు ఖాసా సుబ్బారావు గారు ఈ లేఖను ''మన దేశభక్తి సాహిత్యంలో మహాకావ్యం''గా అభివర్ణించారు.

రామలింగారెడ్డి గారి తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి ఉపాధ్యక్షులయ్యారు. వారు 1936లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళడంతో సి. ఆర్. రెడ్డి గారు తిరిగి ఉపాధ్యక్షులుగా నియమితులై 1949 వరకు సమర్థవంతంగా పనిచేసారు. ఆ తర్వాత 1949 సెప్టెంబర్ లో మైసూరు విశ్వవిద్యాలయ ప్రొ-ఛాన్సెలర్ గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కొనసాగించిన సంస్కరణలను, విద్యావిధానాలను నేటికీ కన్నడ ప్రజలు తలచుకుంటారు. మహాత్మా గాంధి గారి కన్నా ముందే హరిజన సంస్కరణలు ప్రారంభించిన గొప్ప సంస్కర్త ఈయన. విద్యను అభ్యసించటానికి కులం అడ్డుకాదని నొక్కి వక్కాణించిన చైతన్యమూర్తి శ్రీ కట్టమంచి. దేశ విభజన కట్టమంచి వారిని బాధించింది. 1942లో లభించిన సర్ బిరుదును స్వాతంత్య్రానంతరం త్యజించిన కట్టమంచి వారు విద్యా సంస్కృతులను అక్షరాస్యతతో ముడిపెట్టరాదన్న నిశ్చితాభిప్రాయం కలిగి ఉండేవారు. భారతీయులు విద్యావంతులు కారన్న సందర్భాన్ని పురస్కరించుకొని ''ఈ అభిప్రాయానికి నేనెప్పుడూ వ్యతిరేకిని, విశ్వవిద్యాలయ విద్యార్థిలా అందరు అక్షరాస్యులు కాకపోవచ్చు. కాని అతని అంత విద్యావంతులై ఉండవచ్చు. వినడం వల్ల మనం నేర్చుకొంటాము. శీలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, భావోన్నతిని గడించేందుకూ మన జీవితాలను మెరుగు పరచుకునేందుకు రామాయణ భారతాల కంటే శ్రేష్టమైనవి ఉన్నాయా? మన గ్రామసీమల్లో నివసించే స్త్రీ పురుషులు మన ప్రాచీన సాహిత్యంలో నిష్ణాతులు, విద్యావంతులు. వారు విద్యావంతులే, అక్షరాస్యులు కాకపోవచ్చు'' అని వివరణ ఇచ్చారు. వ్యాసమంజరి, పంచమి, ముసలమ్మ మరణం, నవయామిని, భారత అర్థశాస్త్రము, Speeches on University Reform, Congress in Office, Democracy in Contemporary India అనేవి కట్టమంచి వారి రచనలు. ఇక రెడ్డిగారి ఛలోక్తులు , హాస్య చతురత , సమయస్పూర్తి ప్రశంసనీయం!

ఆయన చతురోక్తులు కొన్ని--
ఒకసారి ఆయన తన అల్లుని(అన్నగారి అల్లుడు) ఇంటికి వెళ్ళినప్పుడు , ఇంటి ముందు కారు దిగి, అక్కడ "కుక్కలున్నాయి జాగ్రత్త " అన్న బోర్డ్ చూసి, " ఇక్కడ ఇంతకు ముందు మనుషులుండేవారు కదా?" అని చమత్కరించారట. ఇంకొకసారి ఆయన ప్రసంగిస్తుండగా కరెంటు పోయిందట . అప్పుడు, " చీకట్లో మాట్లాడటం నాకు అలవాటు లేదు, బ్రహ్మచారిని కదా!" అని ఛలోక్తి విసిరారట.

ఆయన సూక్తులు--
"మనం పేద వాళ్ళం కావచ్చు , కానీ బిచ్చ గాళ్ళం కానక్కర లేదు.",
"ఈ నాటి యువత సలహాలు తీసుకోవడం కంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు"

అంటూ ఇలా ఎన్నో ఆణిముత్యాలాంటి సూక్తులను అందించి యువతను ఉత్సాహపరిచారు. వీరు తెలుగుని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని నిర్వచించారు. వీరు ఆజన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. 1951 ఫిబ్రవరి 24న సి. ఆర్. రెడ్డి గారు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వీరి విగ్రహాలు పలుచోట్ల ఉన్నాయి. ఏలూరులో వీరి పేరు మీద ఒక పెద్ద కళాశాలను స్థాపించారు. ఆ కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్ధులు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. ఆ కళాశాలను స్వయం ప్రతిపత్తిగల ఒక విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం గుర్తించింది. కళాప్రపూర్ణ కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ఉదాత్త చరితులు అరుదుగా జన్మిస్తుంటారు. ఆ మహనీయుని అడుగుజాడలలో నడుచుకోవటమే ఆయనకు మనమిచ్చుకునే ఘనమైన నివాళి!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు