నేటి యువత పెద్ద చదువులు చదివి విదేశాల్లో పెద్ద హోదా ఉధ్యోగాలు పదవుల కోసం ఆరాట పడుతుంటారు. అందరూ సివిల్ జాబుల కోసం ఎగబడితే రక్షణ దళాలలో పని చేసే దెవరు? యువత దేశ రక్షణ దళాలలో ప్రవేశం పొంది దేశ సేవ చెయ్యాల్సిన భాద్యత వారిపై ఉంది. సివిల్ ఉధ్యోగాల మాదిరి రక్షణ దళాలలో కూడా అందరికీ అనువైన విద్య వైద్య ఇంజనీరింగ్ సాంకేతిక రంగాల జాబులు అందుబాటులో ఉన్నాయి. విధ్యార్హతలతో పాటు శారీరకంగా మానశికంగా ఏ వైకల్యము లేకుండా ఫిట్ నెస్ అత్యవసరం. ఒక సైనికుడిగా, హోదాగల మిలిటరీ ఆఫిసర్ గా దేశ రక్షణ దళాలలో చేరి దేశ సేవ చెయ్యడం అందరికి సాధ్యం కాదు. రక్షణ దళాలలో భాద్యతలు నిర్వర్తించి సుదీర్ఘ సేవ చేసి సురక్షితంగా వచ్చిన వారు కొందరైతే దేశ సరిహద్దు ప్రాంతాల్లో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరులూ ఉన్నారు. అటువంటి అమరవీరుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వాలు ప్రజలు గౌరవించి వారి కుటుంబ సబ్యులను ఆదుకోవల్సిన భాద్యత ఉంది. ఏటా డిశంబరు నెల(7)లో నిర్వహించే రక్షణ దళాల పతాక విరాళ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫ్లాగ్ ఫండ్) దినోత్సవాల్లో ధనం సహాయంగా విరాళాలు ఇవ్వాలి. సైనికుడంటే దేశం కోసం సర్వం త్యాగం చెయ్యాలి. తన మానవ హక్కుల్ని అర్పించి దేశ సరిహద్దుల రక్షణకు ముందుకు రావాలి. ఆకాశం భూమి సముద్ర జలాల్లో కర్తవ్యం నిర్వహించాలి క్రమశిక్షణ ఆరోగ్యరక్షణ సమయపాలన రోజు వారి విధుల్లో పై అధికారుల ఆదేశాలు అమలు చెయ్యాలి. యుద్ధ సమయంలో దేశ సరిహద్ధుల్ని కాపాడటమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వరదలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు అంతర్గత టెర్రరిస్టుల దుశ్చర్యలు అత్యవసర సమయాల్లో సివిల్ పోలీసులకు సహాయ పడతారు రక్షణ దళాలు. సైన్యంలో చేరాలంటే ముందు గుండె దిటవు, ధైర్యం కావాలి. మన కుటుంబాలలో రక్షణ దళంలో చేరిన వారు ప్రాణాలతో తిరిగి రారనే అపోహ. మరణం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా సంభవించ వచ్చు. సైనికుడు తన పౌర హక్కుల్నీ , యవ్వనాన్ని దేశానికి అప్పగిస్తున్నట్లు దేశ జాతీయ పతాకంపై ప్రమాణం చేసి భూమి మీద, నీటి మీద, గాలిలో రాత్రయినా పగలయినా ఎప్పుడు ఏ సమయంలో పిలుపు వచ్చినా దేశం సేవలో నిమగ్న మవుతానని సిద్ధ పడాలి. సైనికుడు దేశసేవ కర్తవ్యం ముందు అమ్మానాన్న, భార్యా బిడ్డలు , అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు , పండగలు పర్వదినాలు, ఆప్యాయతలు, అనురాగాలు మరిచి పోతాడు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు పెద్ద చదువులు చదివి పెద్ద హోదా ఉధ్యోగాలు , విదేశాల్లో సుఖ జీవనం గడపాలని కోరుకుంటారు. కానీ మాజీ సైనిక కుటుంబాల పిల్లలు సైన్యంలో కెళ్లడానికే ఇష్ట పడుతున్నారు. వారి రక్తంలో ఆ ధైర్య సాహసాలు పుట్టుకతో వస్తున్నాయి. నూనూగు మీసాలతో యువకుడిగా సైన్యంలో కాలు పెట్టిన వ్యక్తి ముప్పై సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి నెరసిన జుత్తుతో సివిల్ జీవితంలో కొస్తాడు.తన యవ్వన జీవిత మంతా దేశ సేవకి అర్పిస్తాడు. మరి అటువంటి విశ్రాంత సైనికుల్నీ , వారి కుటుంబాల్నీ ఏ విధంగా గౌరవించాలో అందరూ ఆలోచించాలి. దేశ సరిహద్దుల్లో మనకు రక్షణ కవచాలుగా... తమ దేహం... హృదయం...ప్రాణంతో "కంచె " వేసి రాత్రింబవళ్ళు కావలి కాస్తున్న త్యాగధనులు... మన రక్షకులు... మన వీర సాహస సైనికులు.. పుట్టిన ఊరు కన్నా...జన్మనిచ్చిన అమ్మ కన్న... పెంచి పెద్ద చేసిన నాన్న కన్నా..తోడ పుట్టిన అన్నదమ్ములు.. అక్కా చెల్లెళ్ల అనురాగం కన్నా ... బతుకు పంచిన భార్య కన్నా... కన్నబిడ్డల భవిష్యత్ కన్నా...తన మాతృదేశ రక్షణే ధ్యేయంగా చేసుకుని... నిప్పులు కురిసే ఎడారిప్రాంత ఎండలో, కుంభవృష్టి వర్షంలో,ఘనీభవించిన మంచు పర్వత శ్రేణుల్లో, చలిలో వణుకుతు...క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో... కంటి మీద కునుకు లేకుండా... కడుపు నిండా తిండిలేక... సుఖం అన్న మాటకు అర్థం తెలియకుండా... ఊరు గుర్తుకు వచ్చినా...అమ్మ పిలుస్తున్నా...భార్య తలుస్తున్నా...కేరింతలు కొట్టే కన్న బిడ్డలు ఆటపాటలు జ్ఞప్తికి వచ్చినా... అవేవీ తన అకుంఠిత దేశ సేవకు అడ్డంకి కారాదని... తన హృదయాంతరాల్లో వాటిని బలవంతంగా అణిచివేస్తూ... భారత దేశం నా మాతృభూమి... భారతీయులందరూ నా సహోదరులు అనే అచంచలమైన అంకితభావంతో...దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్న వీరులే మన అమర జవాన్లు... అటువంటి ప్రాణ త్యాగధనులకు మనం ఏమిచ్చినా వారి రుణం తీరదు. అది వెలకట్ట లేని అత్యంత త్యాగం... కానీ తమ బిడ్డలను , తమ భర్తలను దేశ సేవకు అంకితం చేస్తున్న ఆ మాతృ మూర్తులకు, సహ ధర్మచారిణులకు మన మిస్తున్న గౌరవం ఏ పాటిది? తన చనుబాలతో రక్త స్పర్సతో ఒడిలో పెరిగిన బిడ్డలు ముష్కరుల కర్ఖశ దాడిలో రక్తపు ముద్దలుగా... మాంసపు ముద్దలుగా చూసిన ఆ కన్నతల్లుల ఆవేదన... శతృ సైనికుల కిరాతక చర్యల వల్ల సాహస వీరుల దుర్మరణం చూసిన భారతమాత ఆక్రందన వర్ణనాతీతం... మరి, నువ్వూ నేను కార్చామా వారి కోసం కన్నీటి బొట్టు... వారి త్యాగ నిరతిని గుర్తించామా... ఎప్పుడైనా ఒక్క నిముషం సంతాపం తెలిపామా... వారి కుటుంబ సబ్యుల పరిరక్షణకు జండా దినోత్సవం నాడు ఏమైనా ధనసహాయం చేసామా? యుద్ధ సమయం అపత్కాలీన పరిస్థితుల్లో లేక ఏదైనా దుస్సంఘటన జరిగినప్పుడు జాతీయ దినోత్సవాల్లో చూపే ఆదరణ మిగతా సమయంలో ఎందుకు చూపించరు? 'జై జవాన్ ' అని నినాదం కొట్టడం కాదు, జవానే దేశ జన రక్షకుడని తెలుసుకో. వేదికల మీద , వార్తా పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో నాలుగు రోజులు వారిని స్థుతిస్తే కాదు, ఎల్లవేళల వారి త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి. దేశం కోసం అమరులైన వీర సైనికుల త్యాగాలను ప్రాంతియ వారీగా స్మరించాలి. వారి కుటుంబ సబ్యులను సన్మానించినప్పుడే వారికి నిజమైన నివాళి. పండగైనా ,ఇంట్లో శుభకార్యమైనా, పిల్లల జన్మదినమైనా సైనికుడిగా దేశ రక్షణలో అన్నిటినీ త్యాగం చేసి జాతీయ దినోత్సవాలనే తన జన్మదినంగా కొండ కోనల్లో మిత్రుల మద్యే ఆనందంగా జరుపుకుంటాడు. సరిహద్దుల్లో శతృ సైనిక ముష్కరుల చేతిలో తమ సహచరుల్ని ఊచకోత కోసినప్పుడు కసితో మరింత దూకుడుగా శతృస్థావరాల్లోకి అత్యంత ధైర్య సాహసాలతో సర్జికల్ స్ట్రైక్ వంటి చర్యలతో సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చిన వీరుల్ని , అలాగే శతృదేశంలో తన ఫైటర్ విమానం దుర్ఘటన పాలైనా దైర్య సాహసాలతో తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ లాంటి వారికి జై జై నినాదాలతో స్వాగతిద్దాం.వారిలో ఆత్మ స్తైర్యం నింపుదాం. " అందుకు నువ్వూ నేను మనం దేశమంతా కలిసి ఒక్క సారి ' జై జవాన్ ' అని గట్టిగా నినదించి వారిలో ధైర్య సాహసాల్ని పెంచుదాం" దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులైన సైనిక సోదరుల కుటుంబాలకు ఓదార్పు కలిగేలా సంతాపం తెలుపుదాం. * * *