ఈ వ్యాసానికి పెట్టిన శీర్షికకి తెలుగు అనువాదం తెలియక ఆంగ్ల శీర్షికే ఉంచేశాను. అన్యధా భావించొద్దని ప్రార్ధన. క్రిందటిసారి టెన్షన్లు అని వ్రాసినా పాఠకులు స్పందించారని, ఈమాత్రం చొరవ చేశాను. ఈ ఇన్హిబిషన్స్ అన్నవి మన చిన్నప్పటినుండీ మనతోనే వస్తూంటాయి. కాలామాన పరిస్థితులను బట్టి, వాటినుండి బయట పడాలనుకున్నా సాధ్యపడడంలేదు. చిన్నప్పుడు మన పెద్దలు చెప్పినవే మనమీద ప్రభావం చూపెట్టాయనడంలో సందేహమే లేదు. ఆరోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతగా ఉండేది కాదు. అలాగని పెద్దలు చెప్పినవి అన్నీ తప్పనికాదు కానీ, ప్రస్థుత వాతావరణంలో వాటిని ఆచరించడం కూడా కష్టమే. పోనీ మానేద్దామా అనుకుంటే, అయ్యో మన అమ్మగారు అలా చెప్పేరూ, నాన్నగారు అలా చెప్పేరూ, ఇంతవయస్సూ వచ్చి మానేయడం ఎలా అనే సందిగ్ధం లో పడిపోతూంటాము. పోనీ ఇప్పటి తరానికి చెప్పిచూద్దామా అనుకుంటే, పోదూ అదంతా పాతచింతకాయ పచ్చడీ అని కొట్టిపారేస్తారేమో అని భయమూ.
చిన్నప్పుడు అమ్మలు ఏ పేరంటానికైనా వెళ్ళినప్పుడు తన పిల్లాడిని తీసికెళ్ళిందనుకోండి, వాడిని "కోతిపేరంటాలు అని ఏడిపించేవారు. దానితో ఓహో.. మొగాళ్ళు పేరంటాలకి కానీ, ఆడవారి functions కి కానీ వెళ్ళకూడదన్నమాట అనే ఓ inhibition ఏర్పడిపోయేది. మరి ఈరోజుల్లో అలా జరగాలంటే కుదురుతుందా, ఇంటికో భార్యా భర్తా ఓ పిల్లో పిల్లాడో ఉండే రోజుల్లో, ఫలానా పని నేను చేయకూడదూ, నా చిన్నప్పుడు చెయ్యనిచ్చేదికాదూ మా అమ్మా అంటే కుదురుతుందా. ఏ శ్రావణమంగళవారం పేరంటమో చేస్తే, నచ్చినా నచ్చకపోయినా శలవు పెట్టుకుని, శనగలూ, తాంబూలాలూ ప్లేట్లలో సద్దే కుర్రాళ్ళని చూస్తూంటాము. అయినా ఈరోజుల్లో నోములూ, వ్రతాలూ ఎవరు చేస్తున్నారులెండి అనకండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇంకా మన ఇళ్ళల్లో ఆచారాలూ, వ్యవహారాలూ ఇంకా బ్రష్టు పడిపోలేదు. ఇంక పుస్తకాల విషయంలోకూడా అలాగే ఉండేది. కిళ్ళీకొట్లలో వేల్లాడతీసి పెట్టేవారు కొన్నిgenre పుస్తకాలు, అసలు అలాటివాటివైపు చూస్తేనే పాపమేమో అనే అభిప్రాయంతో పెరిగాము. కానీ మగాడన్నా, ఆడపిల్లన్నా అవేవో harmonal changes అనేవుంటాయి కదా, ఆడపిల్ల " పెద్దమనిషి" అయేటప్పటికి అప్పటిదాకా ఆ లొకాలిటీ లో ఉండే అందరు పిల్లలతో ఆడుకునే ఆ పిల్లకి ఓ పరికిణీ, ఓణీ వేసేయడం, ఆ పిల్లేమో ఎవరిని చూసినా పమిట సద్దుకోడం... లాటివి మొదలయ్యేది. ఇంక మగపిల్లాడు, ఇంట్లోవాళ్ళకి కనిపించకుండా, ఆ కిళ్ళీకొట్టు పుస్తకాలు తన నోట్సుల్లో దాచేసి తెచ్చుకోడమూ, ఎవరూ చూడకుండా చదివి చొంగ కార్చుకోడమూనూ. ఎందుకంటే అలాటి పుస్తకాలు ఏక్ దం taboo. మరి వీటినే inhibitions అంటారు. కానీ రోజులు గడిచేకొద్దీ వాటిల్లోనూ మార్పులొచ్చాయి. ఆరోజుల్లో "చలం" గారి పుస్తకాలు చదివినా, చూసినా డొక్క చించేసేవారు. ఓహో ఆ చలం గారు వ్రాసేవన్నీ బూతు పుస్తకాలేమో అనే ఓ దురభిప్రాయంతోనే పెరిగాము. అలాగే కొవ్వలి వారివీనూ;
కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా, మెల్లిమెల్లిగా ప్రతీ రంగంలోనూ ఓ పారదర్శకత"( transparency)లాటిది మొదలయింది. గుర్తుండేఉంటుంది, సినిమాల్లో చూపించేవారు హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా ప్రేమ, అనురాగం లాటివి వస్తే అదేదో పక్షుల్ని దగ్గర చేర్చడమూ, ఆ తరువాతి" కార్యక్రమం కోసం ఓ పువ్వూ, దానిమీద ఓ తుమ్మెదా etc. etc. కాలక్రమేణా హీరో హీరోయిన్లని ఇంకొంచం దగ్గరగా తీసికొచ్చి తరువాతిది.. leave it to our imagination తరువాత్తరువాత బ్లూ ఫిల్ములకీ సినిమాలకీ తేడాయే లేదనుకోండి.. all in the name of entertainment. అసలు ఇలాటి శీర్షికతో వ్యాసం వ్రాస్తాననగానే మా ఇంటావిడ, "ఎందుకండీ లేనిపోనివీ, ఏదో వ్రాస్తున్నారూ, మీమీద అభిమానం ఉన్నవాళ్ళు చదువుతూంటారూ, ఇప్పుడు ఇలాటివి వ్రాయడం అంత అవసరమంటారా, బావుండదేమో..." తో మొదలయింది, ఈ inhibitions తో ఎలా పెరిగి పెద్దయామో చెప్పడానికి. ప్రతీదానికీ ఏదో ఒకటనేవారు. పెద్దాళ్ళు అదీ "అమ్మ" లు కబుర్లు చెప్పుకునేటప్పుడు, ఆటలకి పంపేసేవారు. వాళ్ళు చెప్పుకునే కబుర్లేవో వినాలని ఈ చిన్నపిల్లలకి ఆత్రుత, వాళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు మధ్యలో ఏమైనా ప్రశ్నలేసి ఇరుకులో పెడతారేమో అని భయం కావొచ్చు, లేదా ఆ particular topic గురించి మనకు తెలియచేసే టైము రాలేదనుకోవచ్చు, ఏదో ఒకటీ, చిన్నపిల్లలకి తెలియకూడదూ అంతే... దానితో ఆరోజుల్లో ప్రతీదీ mystery గానే మిగిలిపోయింది! అలాగని అడిగినా తప్పే మళ్ళీ - పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటీ వెధవ ప్రశ్నలూ నువ్వూనూ అంటూ కసిరిపారేసేవారు. మరి వాళ్ళకి అసలు అలాటి విషయాలెప్పుడు తెలిశాయిట అనే ప్రశ్నుండేది కాదు. వాళ్ళకెప్పుడు తెలిస్తే నీకెందుకూ, నువ్వుమాత్రం నోరుమూసుక్కూర్చో, అలా ప్రతీ విషయంలోనూ ఎన్నెన్నో inhibitions. తోటే చిన్నతనమంతా గడచిపోయింది. వాటన్నిటినీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా పెరిగాము కదా అని ఏమీ regret ఏమీ లేదండోయ్. ఆ కాలమానపరిస్థితులకి అలాగే బావుండేది.
ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్నున్నాయి. మెల్లిమెల్లిగా బయటపడ్డానికి ప్రయత్నమైతే చేస్తున్నారు, కానీ టైముపడుతుంది మరి. "శకునాలు" - ఆ రోజుల్లో part and parcel of our daily life ఎక్కడికెళ్ళాలన్నా శకునం చూస్తేనే కానీ కుదరదు. పరీక్షలకైతే ఆ "అమ్మ" గారే ఎదురొచ్చేసేవారు. ఎవరైనా తుమ్మితే కుదరదు. ఇప్పుడో ఏదో dust allergy తో ప్రతీవాడూ తుమ్మేవాడే. ఆ రోజుల్లో స్కూలుకి వెళ్ళేపిల్లలు ఆడైనా మొగైనా నుదుటిమీద బొట్టు లేకుండా ఉండేవారా? కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలమాట దేముడెరుగు, పెద్దాళ్ళకే దిక్కులేదు. పెట్టుకోవలసివచ్చినా అవేవో మ్యాచింగు బొట్లు. అవన్నీ తప్పని కాదు నేననేది మారారా లేదా, ఇళ్ళల్లో తల్లులు కూడా తమతమ inhibitions లోంచి బయట పడుతున్నారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మంగళవారాలు ప్రయాణం చేయకూడదనేవారు. మరి ఈరోజుల్లో కుదురుతాయా అవన్నీనూ, పైగా ఇంతింత దూరాలు వెళ్ళడానికి ఆ weekly once train మంగళవారాలే ఉంటుంది. పైగా ఏ వారారంభంలోనో శలవు తీసికుని, వారం వర్జ్యం చూస్తూ కూర్చోలేము కదా. ఇంక మడీ, తడీ ఆచారాలూ అయితే అడక్కండి. ఆ తడిబట్టతోనే వంటలు చేయడం, ఈరోజుల్లో అయితే అంతంత సేపు అలా తడిగుడ్డలతో ఉంటే, ఏ న్యుమోనియాయో వస్తుందీ, అంటారు. ఆరోజుల్లో మరి ఎవరికీ న్యుమోనియాలు వచ్చిన దాఖలాలే లేవే. అలాటివే ఆ "మూడురోజులూ" నూ. ఈ రోజుల్లోనూ చేసేవారు ఉన్నారనుకోండి, కానీ నూటికీ కోటికీనూ. ఏదో ఒక ఉద్దేశ్యంతోనే పెట్టారనుకోండీ అలాటివన్నీనూ, కానీ ఈ రోజుల్లో అలాటివన్నీ ఆచరించడం అంటే మాటలా మరి. ఎక్కడికక్కడే సరిపెట్టేసికోవాలి. అందుకే అంటారు, ఈ ఆచారాలూ అవీ, కాలమానపరిస్థుతుల బట్టే ఆచరించాలీ అని. ఆ రోజుల్లో జరిగేవి, ఇళ్ళూ అవీ కూడా అలాగే ఉండేవి.
చిన్నప్పుడు ఎవడికైనా ఏ చెయ్యో కాలిందనుకోండి, చన్నీళ్ళు అసలు తగలకూడదూ, బొబ్బలెక్కిపోతాయీ అనేవారు. అలాటిది, ఈ రోజుల్లో ఏక్ దం ఉల్టా-- చన్నీళ్ళే పోయాలిట. మనమేమైనా డాక్టర్లమా ఏమిటీ, ఈ మార్పులన్నీ తెలియడానికీ, limited knowledge తోటే ఇంట్లో కర్మకాలి ఎవరికైనా ఏ చెయ్యో, కాలో కాలితే ఓ సిరా బుడ్డి ఖాళీ చేసేవారం, అదే first aid అనుకునే వారం. తీరా డాక్టరుదగ్గరకు వెళ్తే, చివాట్లేస్తాడు, ఆమాత్రం తెలియదా చన్నీళ్ళు పోయాలనీ అని. చెప్పానుగా తెల్లారి లేస్తే చాలు, ఇలా చెయ్యకూ, అలా చెయ్యకూ, ఫలానాది ఫలానాగానే చెయ్యాలీ అంటూ ఒకటే క్లాసులు. వీళ్ళ బాధ పడలేక వినేసేవారు. అయినా ఆ రోజుల్లో ఎదురు చెప్పేటంత ధైర్యం ఎక్కడేడిసిందీ? వినేయడంతో సరిపోతుందా మరి, వాటిని ఆచరించడం కూడా part of the deal. ఇలా ఆచరించి, ఆచరించి జీవితంలో ఓ భాగం అయిపోయాయి. మరి వాటిల్లోంచి బయటపడాలంటే కొద్దిగా టైము పడుతుంది కదా. ఈ time gap తోటే అసలు గొడవంతానూ. ఈ inhibitions అనేవి వ్యసనాల్లాటివి, ఓ సిగరెట్టు కాల్చడమో, ఓ పెగ్గేసికోడమో, కాదూ కూడదంటే ఓ "పాన్ మసాలా" లాటిది వేసికోడమో, లేదా ఓ "కారా కిళ్ళీ' లాటిది వేసికోడమో లాటిది ఏ విషయం తీసికోండి, తమకి convenient గా ఉన్నది మాత్రమే చేస్తారు, అవతలివాడు ఏమైనా అనుకుంటే అది వాడి కర్మ కానీ, ఇళ్ళల్లో ఉండే ఈ పెద్దాళ్ళున్నారే ప్రతీ దానికీ నసే.
పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారూ, వాళ్ళ పెద్దాళ్ళు చెప్పినవే వేదవాక్కు గా భావించి, అలాగే ఉండాలి కాబోసూ, అని భావించేసి, వాళ్ళు పడ్డ పాట్లూ ( అలాటివి implement చేయడానికి), వాళ్ళ 'నమ్మకాలూ" ఇంట్లోవాళ్ళ నెత్తిమీద రుద్దడానికి ప్రయత్నిస్తూంటారు, అవేమో, వీళ్ళకి నచ్చవూ, పోనీ ఏదో చెప్తున్నాడు కదా అని, ఒకటో అరో విన్నారా, అయిపోతుంది, ప్రతీ దాంట్లోనూ వేలెట్టేస్తారు. పైగా ఈ inhibitions అన్నవి ఇక్కడితో ఆగిపోవు, వాళ్ళ పిల్లలకి చెబ్దామని ప్రయత్నిస్తారు, అలా వంశపారంపర్యం కింద మారిపోతుంది. ఈ పెద్దాళ్ళే మారిపోతే అసలు గొడవే ఉండదుగా, వంశమూ లేదూ, పారంపర్యమూ లేదు. అసలు జీవితమంతా ఏదో ఒక inhibition తోటే వెళ్ళిపోతూంటుంది. వాటిల్లోంచి బయట పడాలంటే మళ్ళీ అదో inhibitioనూ, ఏమిటో అంతా గజిబిజిగా ఉంది కదూ. ఇప్పటి వాళ్ళకే హాయీ, ఏ గొడవా లేదు. పెద్దవాళ్ళేదో చెప్తే వినాలని inhibition ఉంటే కదా, దాంట్లోంచి బయటపడడమెలాగా అని బుఱ్ఱ పగలుకొట్టుకునేదీ, అసలు అలాటిదే లేనప్పుడు ఎంత హాయో కదూ? అందుకే ఈరొజుల్లో వాళ్ళని చూస్తూంటే నాకైతే చాలా envious గా ఉంటూంటుంది. ఈ మాత్రం తెలివితేటలు మనకెందుకు లేకపోయాయీ అని.