వీధుల్లో పల్లకి సేవల పరమార్థం? - వి.మూర్తి

devudi pallaki in streets
కొన్ని వ్యవహారాలు తరచి చూస్తే కొన్ని నిజాలు తెలుస్తాయి. కొన్ని నిజాలు కొంతమందికి ఆగ్రహం కలిగిస్తాయి.కానీ లాజిక్ గా మాట్లాడుకోవాలి అనుకున్నపుడు నిజం నిష్టూరమైనా చెప్పుకోకతప్పదు. ధనుర్మాసం విశిష్ట పుణ్యప్రదమైనది అందులో సందేహం లేదు. అయితే ఈ కాలంలో మాత్రమే భగవంతుడ్ని ఊరిలో ఊరేగించడం, ఆపై ఒక్క రోజు ఉత్తర ద్వారంలోవుంచి ప్రజలకు దర్శన భాగ్యం కలిగించడం చూస్తే కాస్త ఆలోచించ బుద్ధేస్తుంది. ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠ ద్వార దర్శనంగా, అత్యంత పుణ్య ప్రదంగా, మోక్షప్రదంగా భావిస్తున్నాం. ఆ రోజు పుణ్య క్షైత్రాలన్నీ కిట కిట లాడతాయి. ఈ దర్శనం కోసం మహా మహుల దగ్గర నుంచి సామాన్యుల వరకు తెగ తాపత్రయ పడతారు. ధనుర్మాసము, సూర్యడు, రాశి చక్రం,  వైష్ణవ సంప్రదయాలు, తిరుప్పావై పఠనాలు, ఇతరత్రా సేవల గురించి నాకు తెలియదు. వాటి జోలికి నేను పోదల్చుకోలేదు. కానీ పెద్ద పండుగ కు నెల రోజులు ముందుగా దేవుడ్ని వీధుల్లో ఊరేగించడం, ఆ నెల రోజుల్లో ఓ రోజు మాత్రం విశేష దర్శన భాగ్యం అంటే మాత్రం నాకు దీని వెనుక ఏదో లాజిక్ వుందనిపిస్తుంది.  గడచిన సంచికల్లో చెప్పుకున్నట్లు, వినాయక చవితి లగాయతు ముందుగా లక్ష్మీ, దుర్గ, ఈశ్వర ఆరాధనల అనంతరం మార్గశిరంలో ఇటు లక్ష్మీపూజలు మళ్లీ చేస్తూనే, ఆపై అయ్యవారు పెరుమాళ్లకు ప్రత్యేకమైనది ధనుర్మాసం. ఆ లెక్క ప్రకారం అది ఓకె. కానీ ఏడాదిలో ఎప్పుడూ చేయని విధంగా కేవలం ఈ నెల రోజులు పల్లకి వీధుల్లో ఊరేగడం ఏమిటి? జనం దగ్గర జగన్నాధుడు వచ్చిన వైనం ఇది. ప్రతి ఇంటి ముందు పల్లకి ఆగుతుంది. హారతులు, నైవేద్యాలు, దక్షిణలు మామూలే.

ఇక్కడ నా లాజిక్ ఏమిటంటే, ప్రాచీన కాలంలో, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ గట్టిగా రాజ్యమేలుతున్న కాలంలో, అందరికీ ఆలయ ప్రవేశం లభించని అరాచక కాలంలో ఏర్పాటైన వ్యవహారం ఇది. డిసెంబర్ నెల చివరి రోజులు అంటే వ్యవసాయ ప్రాధాన్యమైన భారతదేశంలో రైతుకు అత్యంత కీలకమైన రోజులు. పంటలు చేతికొచ్చే రోజులు. చేతిలో కాస్త గింజలువుండే కాలం. పైగా రైతు వారీ పనులు తగ్గి, పండగ మూడ్ లోకి వచ్చే కాలం.అందుకే గుడిలోకి రాని(వ్వని) జనం ముందుకు దేవుడ్ని తీసుకురావడం. ఎలాగూ ఆ సమయంలో రైతు వారీ ఖాళీగా వుంటారు, రెండవది తిండిగింజలు గాదెల్లోకి చేరుతూ వుంటాయి, కాబట్టి ఇతోధికంగా భగవంతుడికి కైంకర్యాలు సమర్పించుకుంటారు. ఆ విధంగా జనానికి పుణ్యం, భగవంతుడ్ని నమ్ముకున్న వారికి పురుషార్థమైన ఆదాయం దండిగా లభిస్తాయి. అది కూడా ఎప్పుడు పెద్ద పండుగ వచ్చే ముందు. ఈ నెల రోజుల ఆదాయం, ఏడాది పొడవునా అయ్యవార్ల జీవనానికి సరిపోవాలి మరి.  కేవలం ఇంటి ముందుకు దేవుడ్ని తీసుకువచ్చి దర్శన భాగ్యం కలిగిస్తే సరిపోతుందా..వారినీ కనీసం గుడిదాకా తీసుకురావాలి కదా..అందుకే ఉత్తరద్వార దర్శనం. గుడిలోకి కాకుండా, గుడి ఉత్తర ద్వారంలో దేవుడ్ని వుంచి, వచ్చి చూసి వెళ్లండన్న ఏర్పాటు. అయితే అలా చెబితే జనం ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే వైకుంఠ ఏకాదశి పర్వదినాన, ఉత్తర ద్వారంలో వేంచేసిన స్వామిని చూసి తరిస్తే మోక్షం కలుగుతుందన్నమాట జోడింపు. దాంతో ఊరు ఊరంతా కదలి వచ్చేసేది. రాను రాను అది పెద్ద వ్యవహారంగా మారిపోయింది.

ఇంతకీ ఇప్పుడు ఇదంతా చెప్పడం, పల్లకి తిప్పడం, ఉత్తరద్వారంలో దర్శనం ట్రాష్ అని చెప్పడానికి కాదు. ఒక దాని కోసం ప్రారంభించిన వ్యవహారాలు కాల క్రమంలో ఎలా మలుపు తిరుగుతాయో అన్నది చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్త జనం పడరాని పాట్లు పడుతున్నారు. రోజు ముందు లైన్లలో నిల్చుని, పాసులు, రికమండేషన్లు ఇతరత్రా వ్యవహారాలతో, నానా యాతన పడి, చూసాం అనిపించుకుంటున్నారు. అంతకన్నా ఖాళీగా వున్న రోజున ప్రశాంతంగా భగవంతుడ్ని దర్శనం చేసుకోవమడే ఆనందంగా వుంటుంది.

చిత్రేమేమిటంటే, గుడిలోకి రానివారి కోసం ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనం ఇలా టర్నింగ్ ఇచ్చుకుని పేద్ద ఉత్సవంగా మారిపోతే, ధనుర్మాస పల్లకీ సేవలు మాత్రం నామమాత్రంగా మారిపోయాయి. నూటికి తొంభై ఆలయాలకు పల్లకీలు లేవు. రిక్షాల్లో, తోపుడు బళ్లపై తిప్పుతున్నారు. పల్లకిలు వున్నావాటికి బోయీలు లేరు. లాగుడు రిక్షాయే సరి. ఇక దివిటీలు, వింజామరలు, ఛత్రాలు, అవి పట్టేవారు ఏనాడో మాయమయ్యాయి. మారిన కాలం, సేవకుల దొరకని వైనం గమనించి అయినా, ఆ పదిహేను రోజులు దేవుడి ఊరేగింపులు ఆపడం లేదు. ఆచారం మార కూడదన్న పూజారుల చింతన చూస్తే బాధనిపిస్తుంది. ఇలా అరకొరగ చేసేకన్నా, ఈ వ్యవహారం ఎందుకు ప్రారంభమైందో గమనించి, జనం ఇప్పుడు, ఎటువంటి వర్ణ వైరుధ్యాలు లేకుండా గుడిలోకి రాగలిగే సౌలభ్యం కలిగినందున, ఇక జనం ముందుకు ఈ అరకొర పల్లకీ సేవలు ఆపినా తప్పేమీ లేదేమో? భగవంతుడికి ఓ నమస్కారం పెట్టి, ఊరుకుంటే ఉత్తమమేమో? ఎందుకంటే వీధుల్లో రిక్షాలో ఉత్సవ విగ్రహాలు, పక్కన నడుస్తూ పూజారిని చూస్తుంటే అదోలా వుంటుంది మరి.

ఏది ఏమైనా అసలు వైష్ణవాలయాలు ఎప్పుడూ కళకళలాడుతూ వుంటాయి. ఎందుకంటే విష్ణువు అలంకార ప్రియుడు కనుక. పైగా ధనుర్మాసంలో మరీనూ. వేకువ ఝామన పూజులు, తిరుప్పావై పఠనాలు, వేడి వేడి నైవేద్యాలు, ఓహ్..ఆ సందడే వేరు. అందుకోసమైనా, ఆ వైభవాన్ని కాంచడానికైనా ధనుర్మాసం నెల రోజులు గుడికి వెళ్లాలి. ఆ వైభవమే వేరు. కొలువైన రంగసాయిని చూడ రెండు కళ్లు చాలవు.
పల్లకి ఊళ్లలో తిప్పడం పై లాజిక్ తీయడం తగదని ఎవరైనా భావిస్తే మన్నించండి. ఈ విశేషం గురించి ఈ వారం ముచ్చటించుకున్నందున, మనుధర్మశాస్త్ర విషయాలు, వస్తుగుణ దీపిక వైనాలు వచ్చేవారం మళ్లీ రొటీన్ గా.

- వి.మూర్తి

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు