"తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా" అంటూ తెలుగు జాతిని ముఖ్యముగా మన్యము ప్రాంత గిరిజనులలో చైతన్యము తెచ్చి బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యము వీరుడు అల్లూరి సీతారామ రాజు .సాయుధపోరాటం ద్వారానే స్వాతంత్రము వస్తుందని నమ్మి సీతారామ రాజు జరిపిన సాయుధపోరాటం స్వాతంత్ర ఉద్యమమంలో ఒక ప్రత్యేక అధ్యాయము ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించి మన్యము వీరుడుగా ప్రసిద్ధి కెక్కిన అల్లూరి సీత రామరాజు 27 ఏళ్ల వయస్సులో మన్యము ప్రాంతములోని నిరుపేదలను నిరక్ష్యరాస్యులను పోగు చేసి వారిని ఉత్తేజపరిచి పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యము అనే మహోన్నత శక్తినిఎదుర్కొన్న వీరుడు అల్లూరి సీతారామ రాజు. నిజానికి అయన అసలు పేరు అల్లూరి శ్రీ రామరాజు, రామరాజు అనేది అయన తాత గారి పేరు రామరాజు పేరుతోనే అయన ఉత్తరాలలో సంతకము చేసిన రుజువులు ఉన్నాయి కానీ అయన పేరు సీతారామ రాజుగా స్తిర పడింది సీత అనే యువతి ఆయన ను ప్రేమించినప్పటికీ విప్లవ బాటలో ఉన్న రామరాజు ఆవిడను వివాహము ఆడటానికి ఇష్టపడకపోవటం వల్ల ఆవిడ మరణానంతరము తన పేరును సీతారామ రాజుగా మార్చుకున్నాడు అని కధనాలు ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు 1897జులై 4 న పాండ్రంగి అనే గ్రామములో వెంకట రామరాజు సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు వీరికి సీతమ్మ అనే కుమార్తె , సత్యనారాయణ రాజు అనే మరో కుమారుడు కూడ ఉన్నాడు.వీరి స్వగ్రామము పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్లు గ్రామము కానీ తాత గారి ఊరు అయినా పాండ్రంగి (విజయనగరం జిల్ల) లో సీతారామ రాజు జన్మించాడు సీతా రామరాజు ను చిన్నప్పుడు చిట్టిబాబు అని పిలిచేవారు.
సీతారామరాజు తండ్రి రాజమండ్రిలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ 1908లో కలరావ్యాధికి గురై మరణించాడు చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోవటంతో రాజు జీవితములో ముఖ్యముగా బాల్యములో చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందులవల్ల స్థిరముగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు తిరుగుతూ చివరకు 1909 లో భీమవరం దగ్గర గల కొవ్వాడ గ్రామములో ఉంటూ భీమవరం మిషన్ ఉన్నత పాఠశాలలో చదవటానికి కొవ్వాడ గ్రామము నుండి భీమవరానికి నడిచి వెళ్ళేవాడు పరీక్ష తప్పటం వల్ల చించినాడ గ్రామములో స్నేహితుడి ఇంటి దగ్గర ఉండి గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో రామచంద్రపురం లో ఎడవ తరగతి పాస్ అయి కాకినాడలో మూడవ పారం లో చేరాడు ఈ విధముగా అయన చదువు వివిధ ప్రదేశాలలో జరిగింది. తరువాత పాయక రావు పేటకు మకాము మార్చాడు.రామరాజు కు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనము జరిగింది. తల్లి,తమ్ముడు చెల్లి తాత గారింటికి పాండ్రంగి వెళ్లారు తరువాత విశాఖపట్నములో నాల్గవ పారమ్ లోచేరి అక్కడ సరిగాచదవకపోవటం వల్ల కలరావ్యాధి సొకడము వల్ల పరీక్ష తప్పాడు. ఆ విధముగా ఊళ్లు తిరుగుతూ చదువు అశ్రద్ధ చేయటము వలన పినతండ్రి మందలించటంతో ఇల్లు వదలి తల్లి దగ్గరకు తుని వెళ్ళాడు.అక్కడ కూడా బడికి వెళ్లకుండా తిరుగుతూ ఉంటె ప్రధానోపాధ్యాయుయుడు మందలించటంతో బడి శాశ్వతముగా మానేశాడు
తుని లో ఉన్నప్పుడు చుట్టుపక్కల కొండలు కోణాలు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనించేవాడు .వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యము, వాస్తు,హఠ యోగము, కవిత్వము నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్య శాస్త్రి వద్ద సంస్కృతము, ఆయుర్వేదము నేర్చు కున్నాడు బాల్యము నుండి సీతారామరాజులో దైవ భక్తి నాయకత్వ లక్షణాలు దాన గుణము ఎక్కువగాఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటిస్తూ దేవాలయాల్లోనూ, శ్మశానాల్లోనూ రాత్రిపూట ధ్యానము చేసేవాడు దేవీపూజలు చేసేవాడు. 1916 లో ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు. అప్పుడు బెంగాలులో సురేంద్రనాధ్ బెనర్జీ వద్ద కొన్నాళ్ళు ఉన్నాడు ఆ తరువాత లక్నో లో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరు అయినాడు. తల్లితో చెప్పకుండా కాశీ వెళ్లి కొంతకాలము ఉండి సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. అలాగే ఉత్తర భారతము లోని పుణ్యక్షేత్రాలను అడవి మార్గములో కాలినడకన దర్శించి బ్రహ్మ కపాలము లో సన్యాసం దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు ఈ యాత్ర విశేషాలను గ్రంధముగా వ్రాసుకొని భద్రపరచుకున్నాడు.విలువిద్య, గుర్రపు స్వారీ, కత్తిసాము, వంటి యుద్ధవిద్యలు, జ్యోతిష్యం, హస్తసాముద్రికము కూడా నేర్చుకున్నాడు.
1917 ప్రాంతములో విశాఖ జిల్లాలోని కృష్ణ దేవిపేటలో చిటికెల భాస్కరుడు అనే వ్యక్తితో పరిచయమై దారకొండపై తపస్సు చేసాడు తల్లి తో 1918 వరకు అక్కడే ఉండేవాడు రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది ఆమెకు పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలు దేరేవాడు.అటవీ ప్రాంతాల్లో పేద ప్రజలకు అండగా ఉంటూ చిన్నపిల్లలు పాఠాలు చెపుతూ వైద్యము చేస్తూ జ్యోతిష్యము చెపుతూ వారికి దైవములా ఉండేవాడు.ఈయనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని మన్యము ప్రజలు నమ్మేవారు. ఆ రోజుల్లో మన్యము ప్రాంతములోని ప్రజలను బ్రిటిష్ వారు బాగా హింసించేవారు. వారి శ్రమను దోపిడీ చేసేవారు.గిరిజనుల జీవితాలు దుర్భరముగా ఉండేవి. గిరిజనులకు రోడ్డు వేసేందుకు ఆరణాల కూలి చెప్పి అణానో రెండు అనాలో ఇచ్చేవారు గిరిజనులు ఆకలికి తట్టుకోలేక చింత అంబలి త్రాగి అనారోగ్యాల పాలు అయేవారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు తిరుగుబాటు చేసేవారు వీటినే పితూరీ అనేవారు
అల్లూరి అనేక మంది సాహస వీరులను పోగుచేసి వారికి యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చి 1922లో విప్లవ శంఖము పూరించాడు అల్లూరి సేనలు అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్ల పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనము చేసుకున్నాయి.ఏమేమి తీసుకున్నారో రికార్డు పుస్తకములో వ్రాసి అల్లూరి సంతకము చేసి వెళ్ళేవాడు. ఆ సమయములో పోలీసు స్టేషన్ లో ఉన్న పోలీసులకు ఎట్టి అపాయము హాని తలపెట్టేవాడు కాదు. మేము ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలంటే గూఢచారులను నియమించనవసరము లేదు నా గురించి ఎప్పటి కప్పుడు తెలియజేస్తూ ఉంటాను అని బ్రిటిష్ వారికి సవాలు విసిరేవాడు. ప్రభుత్వ సైన్యానికి రాజు సైన్యానికి పెదగడ్డపాలెము వరిచేలలో పోరాటం జరిగింది. ఆరోజు జరిగిన పోరాటం రాజు అనుచరులు 4 గురు చనిపోయినవారు ఆ రోజు రాత్రి మళ్ళా బ్రిటిష్ సేనలు అల్లూరి స్థావరం పై దాడి చేసి 8 మంది విప్లవ కారులను చంపారు. ఆ తరువాత 4 నెలలపాటు అల్లూరి దళము స్తబ్దుగాఉంది రామరాజు చనిపోయాడని పుకార్లు కూడా వచ్చినాయి.
పోలవరం డిప్యూటీ కలెక్టర్ర్ గాపనిచేస్తున్న ఫజలుల్లా ఖాన్ సహాయముతో అల్లూరి ప్రవాసము నుండి తప్పించుకొని 1922 జూన్ లో మన్యము లో కాలు పెట్టాడు ఆయనకు ఇచ్చిన మాట ప్రకారము తిరుగుబాటు చేయకుండా ఆయన 27-07-1922న ఆకస్మికముగా చనిపోవటంతో ఇక విప్లవానికి అల్లూరి తయారు ఆయి వరుస దాడులు చేయసాగాడు.
వరుస దాడులతో దెబ్బతిన్న బ్రిటిష్ ప్రభుత్వమూ విప్లవాన్ని అణచటానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి లో నియమించింది కానీ రాజు దళము గెరిల్లా యుద్ధ రీతిలో ఆ ఇద్దరి అధికారులను హతమార్చింది వారి శవాలను ప్రభుతాధికారురులు ఊరి వారి మధ్యవర్తిత్వము తో తీసుకొనిపోయినారు.సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి అల్లూరి బలముతో తలపడి వెనుదిరిగి వెళ్ళాడు మొదటిసారిగా డిశంబర్ 6 న రాజు దళానికి ఎదురు దెబ్బ తగిలింది.అందువల్ల కొన్నాళ్ళు విరామము తరువాత రాజు తన అనుచరులతో అన్నవరం వచ్చి స్వామిని దర్శించుకున్నాడు అప్పుడు అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథము పట్టారు.
ఈ విషయము తెలిసిన కలెక్టర్ అన్నవరం వచ్చి రాజును ఆదరించినందుకు ప్రజలపై 4000 జరిమానా విధించాడు. ఈ విషయము తెలిసిన రాజు సాయంత్రము 6గంటలకు శంఖవరం లో ఉంటాను వచ్చి కాలవ వలసింది అని కలెక్టర్ కు వర్తమానము పంపాడు కానీ కలెక్టర్ రాజును కలిసే సాహసము చేయలేదు.రాజు ముఖ్య అనుచరుడైన మల్లు దొర త్రాగుడు వ్యభిచారములకు బానిస అవటం వల్ల పోలీసులకు దొరికిపోయినాడు రాజు దళము విడిపించింది కానీ రాజు మల్లుదొరను దళము విడిచి వెళ్ళమని పంపించాడు ఆ తరువాత పోలీసులకు చిక్కి అండమాన్ లో జైలు శిక్ష అనుభవించి స్వాతంత్రము తరువాత 1952 లో విశాఖ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయి 1969 లో మరణించాడు. .
ఏప్రిల్ 1924 లో విప్లవాలను అణచటంలో సిద్దహస్తుడని పేరు పొందిన రూథర్ ఫర్డ్ ను ప్రత్యేక కమిషనర్ గా నియమించారు 1924 మే 6న జరిగిన కాల్పులలో రాజు ముఖ్య అనుచరుడు అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు) గాయపడి పోలీసులకు చిక్కాడు ఆ తరువాత అండమాన్ జైలులో చనిపోయినాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు.ఆ సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ రాత్రి ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.
తరువాత,1924,మే 7న కొయ్యురు గ్రామా సమీపములో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.ఆవిధముగా మన్యము ప్రజలను పోలీసుల దమన కాండ నుండి రక్షించ టానికి రాజు స్వయముగా లొంగి పోయినాడు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యురులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా మేజర్ గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.కృష్ణదేవిపేట(కే.డి పేట)లో ఆయన సమాధి వుంది. 22-8-1922న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైందనవచ్చును సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు.వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. రాజు బ్రతికి ఉన్నప్పుడు ఏ రకమైన సహకారము అందించని పత్రికలూ నాయకులు మరణించాక ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గము అలంకరించాడని వ్రాసాయి సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్తో పోల్చింది. సీతారామరాజు కుటుంబ సభ్యులు చాలా సాదా సీదాగా బ్రతికారు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మభీమవరంలో 1964 జూలై 8న మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణ రాజు ఉపాధ్యాయుడిగా పదవీవిరమణ చేసి పెద్దాపురం వద్ద బూరుగపూడిలో నివసించాడు. ఇతని కుమారులు శ్రీరామరాజు, వెంకట సుబ్బరాజు, తిరుపతిరాజు ఏ విధమైన ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే జీవించారు.
అంబడిపూడి శ్యామసుందర రావు