స్వామీజీ యువతను ఇలా జాగృతం చేసారు ఒక ఆశయాన్ని ఎంచుకోండి! ఆ ఆశయాన్ని మీ జీవితంగా మార్చుకోండి! దాని గురించే ఆలోచించండి! దాని గురించే కలగనండి! దాని కోసం బతకండి! మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతీ అవయవం... దానితోనే నిండిపోనీయండి! మిగతా అన్ని ఆశయాల్ని పక్కకు పెట్టేయండి! విజయానికి ఇదే మార్గం...విజయ రహస్యం అన్నాడు వివేకానందుడు. వివేకానందుడు కనిపించని దేవుడి గురించి మాట్లాడలేదు. ఉందో లేదో తెలియని స్వర్గం గురించి చెప్పలేదు. దరిద్ర నారాయణుల గురించి బోధించాడు! దుర్భరస్థితిలో ఉన్న మాతృభూమి శోకాన్ని పొగొట్టమని ప్రబోధించాడు! సాటి భారతీయుల ఆకలి మంటలు చల్లారనంత వరకు... మనకు మోక్షమెక్కడిదని ప్రశ్నించాడు? నేను మళ్లీ మళ్లీ పుట్టినా సరే... వేలాది దుఃఖాల్ని అనుభవించినా సరే... నేను మాత్రం ఏ ఒక్క దేవుడైతే నిజంగా ఉన్నాడో... అతడ్నే ఆరాధిస్తాను. ఆ ఒక్క దేవుడ్నే విశ్వసిస్తాను. అతను ఆత్మలన్నీ ఏకమైన పరమాత్మ! ఆ భగవంతుడు. దుష్టుడు! ఆ భగవంతుడు, దుఃఖితుడు! ఆ భగవంతుడు, అన్ని తెగలు, జాతుల్లోని పేదవాడు! అతనే నా ప్రత్యేక ఆరాధ్య వస్తువు’ ఇలాంటి ధీరమైన పలుకులు స్వామి వివేకానంద పలకటానికి కారణం... రామకృష్ణుని బోధనలే. కేవలం ముక్కు మూసుకుని తపస్సులు చేయటాలు, సమాజాన్ని వదిలేసి కొండల్లోకి, గుహల్లోకి వెళ్లిపోవటాలు మతం లక్ష్యం కాదని రామకృష్ణ బోధించారు. మానవసేవే మాధవసేవ అని. మతమంటే ప్రత్యేక్షంగా అనుభూతి చెందేదే తప్ప... ఒట్టి మాటలు కావని చెప్పారు.
కమ్యూనిస్టు విప్లవం మొట్టమొదట రష్యాలో వస్తుందని మార్క్సిజం ప్రవక్తలైన మార్క్స్, ఏంగిల్స్‌లే ఊహించలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీలో మొదట శ్రామిక విప్లవం వస్తుందని, చిట్టచివర రష్యాలో వస్తుందని వారు దృఢంగా నమ్మారు. అదే తిరుగులేని సత్యవాక్కు అని అక్టోబరు విప్లవానికి కొద్ది రోజుల ముందు వరకు మహా మేధావులందరూ అనుకున్నారు. మొట్టమొదట రష్యాలో కష్టజీవులు లేస్తారని రెండు దశాబ్దాల కంటే ముందు కచ్చితంగా చెప్పినవాడు ప్రపంచం మొత్తంలో వివేకానంద ఒక్కడే. అంతేకాదు. ఢాకాలో తనను చూడటానికి వచ్చిన యువకులకు వివేకానంద స్వామి ఇలా చెప్పారు. ‘‘ ప్రపంచంలో శూద్రులు లేస్తారు. కాలపు ముసుగులోంచి నేను రాబోయే ఘటనల నీడను చూడగలను. ఖగోళ శాస్తజ్ఞ్రులు టెలిస్కోపు నుంచి తారల కదలికలను చూసినట్టే ప్రపంచ గమనం నా దృష్టిపథంలో పడుతుంది. నేను చెబుతున్నా వినండి. ఈ శూద్రుల తిరుగుబాటు మొదట రష్యాలో జరుగుతుంది. అనంతరం చైనాలో. ఆ తర్వాత ఇండియా లేస్తుంది. భావి ప్రపంచాన్ని మలచడంలో కీలక భూమిక వహిస్తుంది.’’ వివేకానంద స్వామి ఏనాడో చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. శ్రామిక విప్లవం రష్యాలో వచ్చింది. చైనాలోనూ వచ్చింది. ఇక ఇండియా లేవటమే మిగిలి ఉంది. భావి ప్రపంచాన్ని మలచడంలో మనమే కీలక పాత్ర పోషించనున్నమన స్వామి వాక్కే భారత జాతికి ఉత్సాహం నింపి, వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది.
వివేకానంద స్వామి మంచి చతురులు కూడా.
స్వామీజీ రెండవసారి అమెరికా పర్యటనకు వెళ్ళిన తర్వాత అతను తిరిగి భారతదేశానికి వచ్చే సమాచారం మఠంలోని వారెవరికీ తెలియదు. ఒకరోజు వివేకానందులు ఏ విధమైన సమాచారం లేకుండా అమెరికా నుండి ఈజిప్ట్ ద్వారా బొంబాయికి ఓడలో వచ్చాడు. అక్కడి నుండి కలకత్తాకు రైలులో వచ్చాడు.స్వామీ వివేకానందులు అప్పుడు బ్రిటిష్ దుస్తులు ధరించి ఉన్నాడు. కలకత్తాలోని మఠం దగ్గరికి వెళ్ళి గోడ దూకి లోనికి వెళ్ళాడు.అప్పుడు మఠం లోని స్వాములు భోజనం చేసే సమయం. దూరం నుండి బ్రిటిష్ దుస్తులలో ఉన్న వివేకానందులను వారు గుర్తించలేక భయపడి స్వామి వివేకానందుల వద్దకు కర్రలతో పరుగెత్తుకొచ్చారు.దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించి సంతోషం పట్టలేకపోయి మఠం అంతా చాటింపు వేశారు.తోటి స్వాములతో వివేకానందులు "మళ్ళీ ఆలస్యం ఐతే భోజనపదార్థాలు అయిపోతాయని గోడ దూకి వచ్చాను" అని అన్నాడు. అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అలసట లేక హాస్యాన్ని పండించడం చూసి ఆ స్వాములు ఆనందించారు.
ఇంకోక సారి ఇలా జరిగింది.
స్వామివివేకానందుల తోటి స్వామి ఒకరికి, వీరి మాటంటే ఇక తిరుగులేదు. ఒకసారి అందరూ భోంచేస్తుండగా వివేకానందులు ఉన్నట్టుండి తన తోటి స్వామితో "మీకు ఈ విషయం తెలుసా? ఈ సారి "గుడ్‌ఫ్రైడే" ఆదివారం వస్తోంది తెలుసా" అన్నాడు. అప్పుడు తోటి స్వామి అమాయకంగా "అవునా? ఇందులో విశేషం ఏముంది స్వామీజీ" అన్నాడు. మిగతా భోంచేస్తున్నవారు స్వామీజీ మాటలలోని అర్థం, హాస్యం గమనించి విరగబడి నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియని ఆ తోటి స్వామికి ఏమీ అర్థం కాలేదు.
ఇంకో సంఘటన.
ఒకసారి రామకృష్ణమఠంలో ఒక సన్యాస సాధువు దిగులుగా కూర్చుని ఉన్నాడు. వివేకానందులు కారణం ఏమిటని అడిగారు. అప్పుడు ఆ సాధువు "స్వామీజీ! కూరగాయలు, ఆకుకూరలు తరగడానికి ఒకే చాకు ఉంది. ఈ రోజు కూరలు తరుగుతుంటే ఆ చాకు విరిగిపోయింది" అన్నాడు. అప్పుడు వెంటనే వివేకానందులు దిగులు నటిస్తూ "నిజం చెప్పాలంటే ఈ చాకులు ఎంతో అదృష్టం గలవి. ఎందుకంటే వీటి ఆయుష్షు ఈ విధంగా ఒకేసారి తీరుతుంది. అదే మనుషులకైతే ఎన్నో రోగాలు, వ్యాధులూ" అని అన్నాడు. ఈ వ్యాఖ్యానం విని ఆ సాధువు పగలబడి నవ్వాడు.