ప్రకృతి - పురుషుడు - ఆత్మ - కందుల నాగేశ్వరరావు

Prakrithi-purushudu-aatma

మనం మనల్ని చూసుకున్నపుడు మనకు ముందుగా కనపడేది మన భౌతిక శరీరం. భౌతిక శరీరానికి చైతన్యం అవసరం. ఒకచోటునుండి ఇంకా చోటుకు వెళ్ళాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాపంచిక విషయాలను గ్రహించాలన్నా దేహానికి చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు, జ్ఞానేంద్రియాలు పని చేయవు. అయినా ఊపిరి పీల్చుకోవడం, గుండె కొట్టుకోవడం లాంటి ప్రక్రియలు జరుగుతానే ఉంటాయి. వీటిని అసంకల్పిత ప్రతీకార్య చర్యలు అంటాము. అప్పుడు మనని జీవింప చేసేదే ప్రాణం. అది శ్వాస రూపంలో ప్రాణశక్తిగా మన శరీర అవయవాలను పని చేయిస్తుంది. ఈ సూక్షమైన జీవశక్తినే మన శరీరానికి ప్రాణానికి మధ్య ఉండే సంబంధమని చెప్పవచ్చు. ఆ సంబంధం తెగిపోతే ప్రాణం పోయింది అంటాము. ఆ శరీరాన్ని మృతదేహం అంటాము.

స్వప్నజాగ్రదావస్తలలో ఎప్పుడూ శరీరాన్ని ఆశ్రయించి ఉండే ప్రాణం కూడా ఇంద్రియాలు, మనస్సు లాగే శాశ్వతం కాదు. కాని వీటన్నిటికీ (ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు) కదలిక నిచ్చేది, చిత్త వృత్తుల ద్వారా విషయానుభవం కలిగించేదీ, చూసేవాడి వెనుక నుండేది అయిన చైతన్యాన్ని ఆత్మ అంటారు. ఆత్మ ప్రాణవాయువూ కాదు, మనస్సూ కాదు. అది శుద్ధమైనది అని వేదాలు చెప్తున్నాయి. చూసేది, చూడబడేది, చూపు (కర్త, కర్మ, క్రియ) అన్నీ ఆత్మయే.

మనిషి అంటే దేహము, మనస్సు, ఆత్మల కలయిక. ఆత్మయే చైతన్యవంతమైన శక్తి. చైతన్యవంతమైన ఆత్మనించే పుట్టిన మనస్సు జడమైన దేహంతో కలసి ఇది నేను, ఇది నాది అంటుంది. ఆత్మ లేకుండా మనస్సు నిలువ లేదు. మనస్సు ప్రాణం సహాయంతో దేహానికి కదలికనిచ్చి తను చక్రవర్తిలా దేహేంద్రియాలతో ఇష్టం వచ్చినట్లు పనులు చేయించుకొంటుంది. ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే మనస్సును నిగ్రహించి, జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవచ్చు.

 

విశ్వాత్మయైన పరమాత్మకు స్థానమై, తొలి అవతారమైన విరాట్పురుషుని గర్భం నుండి భూతమయమైన ఈ సమస్త ప్రపంచం పుట్టింది. “ కాలచోదితము – అవ్యక్తము – ప్రకృతి ” అనే మూడు పేర్లతో పిలువబడే తన మాయవల్ల మహత్తత్త్వాన్నిపుట్టించాడు. మాయకు సంబంధించినదీ, కాలమూ మొదలైన గుణములు కలదీ అయిన మహత్తత్త్వం భగవంతుని కంటికి మాత్రమే కనిపిస్తూ ప్రపంచాన్ని నిర్మించాలనే కోరిక కలిగినప్పుడు రూపాంతరం చెందింది. అలా రూపాంతరం చెందన మహత్తత్త్వం నుండి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే బేధాలు ఏర్పడి అవి వరుసగా పంచ భూతాలు – ఇంద్రియాలు- మనస్సు అని రూపాంతరంగా గోచరించాయి.

బ్రహ్మదేవుడు ‘నేను సృష్టిస్తాను’ అని సంకల్పించగానే ఆయనలో అహంకారపూరితమైన దేహాభిమానంగల ‘మోహం’పుట్టింది. దాని నుండి స్త్రీ సంభోగం వంటి గుణాలు కలిగిన ‘మహామోహం’ ఉద్భవించింది. కోరికలకు విఘ్నం కలుగగా‘అంధతామిస్రం’ అనే గ్రుడ్డితనం ఏర్పడింది. శరీర మోహం వలన, శరీర నాశన భయంవల్ల ‘తామిశ్రం’ అనే మృత్యు భీతి ఏర్పడింది. వీటన్నిటి వలన మనస్సుకు ‘చిత్త విభ్రమం’ అనే సంచలనం ఏర్పడింది. ఈ అయిదింటికి కలిపి ‘అవిధ్యాపంచకం’ అని పేరు. అవిధ్యాపంచకంతో కలిసిన భూతకోటిని పుట్టించడం తాను చేసిన పాపకార్యమని తలచిన బ్రహ్మ మనస్సులో పశ్చాత్తాపం చెందాడు. భగవంతుణ్ణి ధ్యానించాడు. భగవధ్యానమనే అమృతం వలన మనస్సు పావనమయిన తర్వాతనే విథాత సృష్టికార్యాన్ని నిర్వర్తించ కలిగాడు. ఎంతటి మహానుభావునకైనా మనస్సును నిగ్రహించి అహంకారం అదుపులో పెట్టడం తప్పనిసరి.

 

ప్రకృతి ఇరవై నాలుగు తత్త్వాలు కలదై ఉంటుంది. ఎలాగంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలూ; చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలు; వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయం అనే పంచ కర్మేంద్రియాలు; మనస్సు, బుద్ధి, చిత్తం,అహంకారం అనే అంతఃకరణ చతుష్టయమూ కలిసి ఇరువైనాలుగు తత్త్వాలు. ఇవికాక కాలం అనేది ఇరవై ఐదవ తత్త్వం. ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతుంది. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియై నిర్విశేషుడై ప్రవర్తించేవాడు భగవంతుడు. ఆ భగవంతుని చేష్టా విషేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది.

 

ఈ దేహం సత్త్వరజస్తమోగుణాలతో నిండింది. ప్రకృతివల్ల ఏర్పడినటువంటిది. జ్ఞానియైన పురుషుడు అటువంటి శరీరాన్ని ఆశ్రయించిన వాడైనప్పటికీ ప్రకృతి సంబంధమైన సుఖదుఃఖాలకు లోనుగాకుండా ఎటువంటి వికారాలు లేకుండా, త్రిగుణాలకు అతీతంగా ప్రవర్తిస్తాడు. అజ్ఞానియైన పురుషుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకుని నేనే కర్తననే అహంకారంతో, వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. దీనివల్ల అతణ్ణి ప్రకృతి దోషాలు ఆవహిస్తాయి. ఈ విధంగా ప్రకృతి దోషాలకు లోనై సుర నర పశు పక్షి వృక్షజాతి నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలలో మునిగి సంసార బంధాలలో చికాకుపడతాడు.

 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జనుడికి ఆత్మజ్ఞానాన్ని ఇలా బోధించాడు. “ఆత్మ నాశనము లేనిది. నాశనంలేని ఆత్మకు ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మకు పుట్టుక, చావు లేవు. మానవుడు చిరిగిన వస్త్రాలను వదిలిపెట్టినట్లుగా ఆత్మ శిధిలమైన శరీరాన్ని విడిచి కొత్త దేహాన్ని పొందుతుంది. ఆత్మకు ఆకారము లేదు, జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. మనస్సు నిశ్చలంగా వున్నపుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది.”

 

ఆత్మ ఒకప్పుడు ఉండటం, మరొక్కపుడు ఉండకపోవడం లేదు. ఆత్మను ఆయుధాలు నరక లేవు. అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ సత్యం, ఆత్మ నిత్యం, సర్వవ్యాప్తం. చలనరహితం, శాశ్వతం. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. దేశకాలమాన పరిస్థితులకు అతీతమైనది. శరీరం లయమైనా ఆత్మ లయం కాదు. ఆత్మ నిత్యము, శుద్దము, బుద్దము (జ్ఞానరూపము), ముక్తము(బంధం లేనిది) మరియు స్వయంప్రకాశం.

 

శ్రీ శంకరాచార్యులు తమ ‘ఆత్మానాత్మ వివేక సారాంశం’ లో మనిషి అత్మయొక్క సత్, చిత్, ఆనంద స్వరూప తత్వాన్ని గురించి తెలియ చేసారు. ఆత్మ అనేది దేని చేతా చంపబడదు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు మూడింటిలోనూ, ఏ విధమైన మార్పు లేకుండా, సృష్టి లో అభిన్న స్వరూపంలో ఉండేది కాబట్టి సత్. ఇతర సాధనాలను వేటిని అపేక్షించకుండా స్వయం ప్రకాశమానమానంగా ఉంటూ తనలోనే ఇతర పదార్థాలను ఇముడ్చుకో గలిగిన తేజోవంతమైన జ్ఞానస్వరూపం కాబట్టి చిత్. పరమ ప్రేమాస్పదమైనది, నిత్యమైనది కాబట్టి ఆనంద స్వరూపం. నిశ్చయమైన బుద్ధితో నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావం కలిగి ‘నేనే బ్రహ్మని’ (అహం బ్రహ్మోస్మి) అని తెలుసుకొనేవాడు ‘ఆత్మజ్ఞానం’ వలన జీవన్ముక్తుడు అవుతాడు.

 

ఆత్మ పరమాత్మలలో ఏది ముందు? ప్రకృతి పురుషులలో ఎవరు ముందు? వ్యక్తం అయ్యేది అస్తిత్వం (Existence). వ్యక్తం కానిది స్తత్వం (Essence). స్తత్వం లేకుండా అస్తిత్వం సాధ్యం కాదు. బొమ్మ బొరుసులలో ఒకటి స్తత్వం, ఇంకోటి అస్తిత్వం. వ్యక్త అవ్యక్తాల సంయోగమే నాణెం. ఆ ద్వైత అద్వైతమే యోగం - ఆత్మ యోగం. Existence జీవాత్మ అయితే Essence పరమాత్మ.

 

ఇంతకీ ఆత్మ పరమాత్మలు రెండా? రెండు అనిపించే ఒకటా? ఒకటి రెండు కావడం, రెండు ఒకటి కావడం సృష్టి. నాణెంలో బొమ్మ గాని బొరుసు గాని ఒకటి వ్యక్తమయితే రెండవది అవ్యక్తమవుతుంద. అటులనే “ఉంది” అనుకున్నపుడు “లేదు” అనేదానికి ఉనికి లేదు. “లేదు” అనుకున్నపుడు “ఉంది” అనేదానికి ఉనికి లేదు. ఆత్మ వర్తమానం. పరమాత్మ వాస్తవం. జీవం వెంట పరుగెత్తే ఆత్మ, పరిగెత్తినంత కాలం “ఇహం”. పరిగెత్తనిది “పరం”. కాబట్టి పరిగెత్తని తత్వం పరమాత్మది. అది అక్షరం, శాశ్వతం. అందువలన ఇహంలోని ఆత్మను “క్షరం” గానూ’, పరంలోని ఆత్మను “అక్షరం” గాను చెప్పుకుంటాము.

 

అందువలన జగత్తులోని సకల ప్రాణికోటిని క్షరంగాను, ఆ ప్రాణికోటిలోని ఆత్మను అక్షరంగానూ చెప్పారు.

దేహం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం.

****

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు