పుస్తకం: తెలుగు లో సమస్యా పూరణలు
కూర్పు: బూదరాజు రాధాకృష్ణ
వెల: 20/-
ప్రచురణ: ప్రాచీ పబ్లికేషన్స్
తెలుగు వారికే సొంతమైన సాహితీ క్రీడ అవధానం. అందులో సమస్యాపూరణం ప్రత్యేకం. అసందర్భమైన వాక్యాన్ని ప్రాశ్నికుడు ఇస్తే దానిని అర్ధవంతంగా పూరించడం ఒక సాహితీ విన్యాసం. అవధానంలోనే అని కాకుండా పలు సాహిత్య కథల్లో పొడుపు కథలలాగ కొన్ని సమస్యలను మహారాజు గారు ఇవ్వడం, వాటిని కాళిదాసు, తెనాలి రామలింగడు వంటి వారు పూరించడం కొన్ని చదివాం, కొన్ని చూసాం.
ఆదిత్య 369 లో 'బలరాముడు సీతను చూసి ఫక్కున నవ్వెన్" అనే సమస్యను శ్రీ కృష్ణ దేవరాయలు ఇవ్వగానే, దానికి తెనాలి రామకృష్ణుడు చెప్పిన సమాధానం బహుళ ప్రాచుర్యం పొందింది. "బలరాముడు సీతను చూసి నవ్వడమేమిటి"? అదే సమస్య..బలరాముడు అన్న పదానికి ముందు "ధీ" అన్న అక్షరం చేరిస్తే "బుద్ధి బలం గల రాముడు" అని అర్థం మారుతుంది. అలా అర్థాన్ని మార్చి పద్యాన్ని అర్థవంతం చేసాడు ఆ వికటకవి. ఇంతకీ పద్య భావం ఏమిటంటే... దశరధుడు పుత్రకామేష్టి చేసి ముగ్గురు భార్యలచేత పాయసం తినిపించాక వారికి సంతానం కలగడం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, 'పాయసం తాగినంత మాత్రాన పిల్లలు పుట్టేస్తారా?" అని సరదాగా సీత రాముడితో అన్నదట. దానికి రాముడు, "ఆ! పొలం దున్నుతుంటే కూడా పిల్లలు దొరుకుతారులే" అని చమత్కరించి నవ్వాడట. అవును! సీత పొలం దున్నుతుంటే భూమిలో కనపడిందిగా!
"లలనలు పాయసమానిన
కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వన్
పొలమున దొరికెదరని ధీ
బలరాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్"
ఇలాంటి సమస్యా పూరాణలన్నీ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? అదీ ఏకంగా 183 సమస్యలు, వాటి పూరణలు...! గతంలో ప్రసిధ్ధులైన అవధానులు చేసిన సమస్యాపూరణలు సేకరించి బూదరాజు రాధాకృష్ణ గారు ఒక 48 పేజీల పుస్తకాన్ని వేసారు. అదే ఈ 'తెలుగులో సమస్యా పూరణలు".
అయితే అవధాన పద్యాల్లో కొన్నేళ్ళుగా మునిగి తేలే వారికి ఈ పుస్తకంలోని చాలా పద్యాలు తెలిసినవే అయ్యుండొచ్చు. ఇక పండితులకి ఇందులోని దుష్కర ప్రాసతో ఉన్న సమస్యలు, ఉత్పలమాల సమస్య ఇచ్చి దానిని కందంలో పూరించమనడం..వంటివి ఆసక్తి గొలుపుతాయి. ఇక సమస్యా పూరణల మీద అవగాహన లేనివారికి ఆసక్తి కలిగించే ప్రయత్నమే ఈ సమీక్ష.
మచ్చుకు ఈ పుస్తకంలో ఉన్న కొన్ని సమస్యలు రుచి చూద్దాం:
"అక్కా! రమ్మనుచు మగడు ఆలింబిలిచెన్"
ఒక భర్త తన భార్యని, "అక్కా"! అని సంబోధిస్తూ రమ్మన్నాడట. అదీ సమస్య. భార్యని అక్కా అనడమేమిటి?
దానిని ఇలా పూరించారు ఒక కవిగారు:
"వక్కాకు మడిచివేసుక
చక్కెర విలుకాని కేళి సలుపుద మనుచున్
చక్కని ముద్దుల మరదలి
అక్కా! రమ్మనుచు మగడు ఆలింబిలిచెన్"
"చక్కగా తాంబూలం వేసుకుని, మన్మధకేళి మొదలుపెట్టాలి...ఓ ముద్దుల మరదలి అక్కా! ఇటు రా" అని భర్త భార్యని పిలిచాడని పూరణ. భార్యని "మరదలి అక్కా" అనడంతో సమస్య సమసిపోయింది.
అలాగే "ఎలుకలు తమకలుగులోనికి ఏనుగునీడ్చెన్"
ఎలుకలు ఏనుగుని తమ కలుగులోకి ఎలా లాక్కుపోతాయి? అంటే ఇలా..
"ఇలలో ఇద్దరు రాజులు
మలయగ చెదరంగమాడి మాపటి వేళన్
బలమెత్తి కట్ట మరిచిన
ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగునీడ్చెన్".
ఇద్దరు రాజులు చదరంగం ఆడి ఆ బొమ్మలన్నింటినీ దాచకుండా అలాగే వదిలేసారట. దాంతో రాత్రివేళ కొన్ని ఎలుకలు వచ్చి చదరంగంలోని ఏనుగు బొమ్మని తమ కలుగులోకి లాక్కుపోయాయట. ఎంత గొప్ప ఊహో చూడండి.
ఇంకో సమస్య "గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్"
"ఉండ్రాని అడవిలోపల
గుండ్రాయై యున్నయట్టి కోమలిపై గో
దండ్రాముపదము సోకిన
గుండ్రాతికి కాళ్లువచ్చి గునగున నడిచెన్"
కోదండ రాముడి పాద ధూళికి గుండ్రాయిగా ఉన్న అహల్య తన నిజరూపాన్ని పొందిన వృత్తాంతంతో సమస్యను పరిష్కరించారు.
ఇలా ఎన్నో సమస్యలు, వాటి పూరణలు మెదడుకు, మనసుకు పనిచెప్పి మైమరిపిస్తాయి. భాష మీద పట్టు పెంచుకోవాలన్నా, చలోక్తులు తెలియాలన్నా, పద్య సాహిత్యంలోని సమస్యా పూరణల మీద అవగాహన పెంచుకోవాలన్నా ఈ పుస్తకం ఒక దిక్సూచి అవుతుంది. పద్యాల కింద వివరణలు లేకపోవడం వల్ల మెదడుకు మంచి పని పడుతుంది. అయితే దీనిని కొందరు ఈ పుస్తకంలోని లోపం అనుకోవచ్చు, కాని జిజ్ఞాసువులు సాధన చేయడానికి అదే అనువుగా భావించొచ్చు. అన్నీ కళ్లముందు పరిచేయడం కన్నా, పాఠకుడికి నిఘంటువులను ఆశ్రయించి అర్థాలు తెలుసుకునే పని పెడితేనే కొన్ని పుస్తకాలకు సార్ధకత. ఆ కోవకు చెందిన పుస్తకం కనుక జిజ్ఞాస కలవారు దీనిని ఒక పట్టు పట్టొచ్చు.