పుస్తక సమీక్ష: మోహన మకరందం - సిరాశ్రీ

mahanamakarandam book review
పుస్తకం: మోహన మకరందం
విభాగం: అనుభవాలూ- జ్ఞాపకాలు
రచన: డా|| మోహన్ కందా (ఐ ఏ ఎస్)
వెల: రూ 200/-
పుటలు: 252
ప్రతులకు: http://kinige.com/book/Mohana+Makarandam
 
ఆటవిడుపు..అంతలోనే ఆధ్యాత్మికత.. మధ్యలో రాజనీతి.. మరోపక్క వ్యక్తిత్వ వికాసం...జీవితానికి అవసరమయ్యే లౌక్యం...తొంగి చూసి పలకరించే వేరు వేరు శాస్త్రాలు...ఇవన్నీ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? ఒక పంచతంత్రం లాగ, ఒక మోహన మకరందం లాగ ఉంటుంది. 
 
మోహన్ కందా గారిది విస్తృతమైన నేపథ్యం. "కల్యాణం పణ్ణిప్పార్" (పెళ్లి చేసి చూడు), "ధర్మదేవత", "పెంపుడు కొడుకు" వంటి 28 తొలితరం తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బాలనటుడిగా నటించారీయన. వీరి తండ్రిగారు న్యాయమూర్తి. తల్లిగారు సామాజీక కార్యకర్త. చదివింది ఐ ఏ ఎస్. 
 
సాధారణంగా చాలామంది ఎటువంటి వారినైతే ఒక్కసారన్నా ప్రత్యక్షంగా చూస్తే చాలని అనుకుంటారో, అటువంటి దిగ్గజాల వద్ద పనిచేసిన అనుభవం డా మోహన్ కందాది. ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇలా ఎందరో ఏరి కోరి మోహన్ కందాని తమ పక్కన పెట్టున్నారు. ముఖాలు రాజకీయ నాయకులవే అయినా వారి మెదడు ఐ ఏ ఎస్ ఆఫీసర్లదేనని అందరికీ తెలుసు. 
 
కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఈయన జీవితాన్ని సార్ధకం చేసే పని ఒకటి చేసారు. అదే, వారి జీవితాన్ని గ్రంథస్థం చేయడం. విజ్ఞతనెరిగినవారు కనుక పాఠకులకి, అందునా యువతకి ఎటువంటి విషయాలు తెలుసుకోవల్సిన అవసరం ఉందో అవే ప్రస్తావించారిందులో. పైన చెప్పినట్టు ఎంతమంది ఉద్దండ నాయకులకో మేధస్సుని ధారపోసిన డా మోహన్ కందా చెప్పిన విషయాలు ఒక జ్ఞాన నిధి. చదవడం మన విధి. 
 
ఈ పుస్తకంలో ఉన్న ఒక విశేషం ఏమిటంటే- ఎవరో ఐ ఏ ఎస్ ఆఫీసర్ వేదిక మీదనుంచి స్పీచ్ ఇస్తున్నట్టు కాకుండా...సొంత మేనమామ సరదాగ చెప్పే కబుర్ల లాగ ఉండడం. ఉదాహరణకి మంత్రి గారి సద్దాం హుస్సేన్ దర్శనం, జార్డాన్ రాజు రిస్ట్ వాచ్ ప్రహసనం, ఎంటీయార్ "వారుణవాహిని" విశేషం, కుక్కని ఎందుకు పెంచుకోవాలో చెప్పే అనుభవం, ఉపరాష్ట్రపతి ఆఫీసులో మిస్ అయిన ఒక కాగితం కథ, ట్రైనింగ్ కాలేజీలో ఈల గోల...ఇంకా హిందీ పాటలు, తెలుగు పద్యాలు,..ఒకటి కాదు ఎన్నో సరదా అంశాలు. ఆ సరదా కథల్లోనే బోలెడంత విజ్ఞానం, జీవితంపై ఒక అవగాహన, పాజిటివ్ దృక్పథం పెంచుకునే మార్గం వంటివెన్నో పాఠకులకి అందుతాయి. 
 
వ్యాస భారతం గురించి నన్నయ చెప్పినట్టు, "ధర్మతత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని, ఆధ్యాత్మ విదులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని, కవివృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు...." అన్నట్టుగా ఈ "మోహన మకరందం" కూడా ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిలో ఉత్తమంగా కనిపిస్తుంది. ఈ సమీక్ష ప్రారంభంలోని పంచతంత్రంతో పోలిక, ఈ ముగింపు వాక్యాలు చాలు..ఈ పుస్తకం ఎందుకు దగ్గర పెట్టుకుని చదవాలో చెప్పడానికి. 
 
కనుక ఇక ఆలశ్యం చేయకుండా ఈ పుస్తకం చదివేసి మీ భుజం మీరు తట్టుకోండి. మిత్రులకి గిఫ్టుగా పంచిపెట్టుకోండి. 
 
-సిరాశ్రీ 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు