పుస్తక సమీక్ష - ఇడ్లి ఆకిడ్ ఆకాశం - సిరాశ్రీ

book review - Idli Arkid Akasam
పుస్తకం: ఇడ్లి ఆకిడ్ ఆకాశం 
విషయం: ఆకిడ్ హోటల్ అధినేత విఠల్ కామత్ ఆత్మకథ 
రచన: యండమూరి వీరేంద్రనాథ్ 
వెల: 100/-

ప్రతులకు: కినిగె (http://kinige.com/book/Idli+Vada+Aakasam)

ప్రతీ వాడికీ ఒక ఆత్మకథ ఉంటుంది. కొన్ని రాయబడతాయి, మిగతావి రాయబడవు. అంతే తేడా. బాగా కీర్తి గడించిన వారి ఆత్మకథలు చదవడానికి పాఠకుల్లో ఆసక్తి ఉంటుంది. కానీ అన్ని ఆత్మకథలకీ గాంధీగారి ఆత్మకథకొచ్చినంత పేరు రాదు. అసలు ఆత్మకథలంటే చాలామంది పాఠకులకి ఒక అపోహ. ఒక పట్టాన తెమలకుండా అదే పనిగా సాగుతూ విసిగిస్తాయని, 300 పేజీలకి తగ్గకుండా ఉండి చూప్పుల్తోటే భయపెడతాయని..ఇలా!

అయితే ఆత్మకథని పుస్తకంగా రాస్తున్నప్పుడు తమకు నచ్చిన అంశాలు కాకుండా, ఎదుటివారు చదవడానికి ఏది బాగుంటుంది, వారికి ఏది ఉపయోగపడుతుంది..అనే విజ్ఞతతో రాయబడిన అతి కొన్ని ఆత్మకథలకు మాత్రమే జనాదరణ పొందుతాయి. అటువంటి ఆత్మకథ ఈ "ఇడ్లీ ఆకిడ్ ఆకాశం". వినడానికే వింతగా ఉన్న టైటిల్. కవర్ పేజీమీద ఇడ్లి ప్లేటు నుంచి ఆకాశానాకి నిచ్చెన. కొత్తగా ఉన్నా ఔచిత్యం ఉన్న ఆలోచన. ఎందుకంటే ఇది ఒక హోటల్ అధినేత ఆత్మకథ కనుక.

తొలుత ఇంగ్లీషులో వచ్చిన ఈ పుస్తకం ఎంత గొప్పగా కదిలించిందంటే మన సుప్రసిధ్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం కదిలేంత. ఆయన ఏకంగా ఈ పుస్తకాన్నితెలుగించడానికే పూనకున్నారంటే ఇక అర్థం చేసుకోండి. పైగా ఇది తన తొలి అనువాద రచన అని గర్వంగా చెప్పుకున్నారు కూడా. అంతే కాదు ఈ పుస్తకం 14 భాషల్లోకి ఆల్రెడీ అనువాదమైపోయింది. రెండు యూనివర్సిటీలకి నాన్ డిటైల్డ్ కూడా.

ఒక యువకుడు చిన్న కాకా హోటల్ నుంచి ప్రపంచ ప్రసిధ్ధ హోటల్ యజమానిగా ఎదిగిన వైనం, అణువణువునా ఆశావాదంతో ఆకాశానికి నిచ్చెన వేసి అనుకున్న స్వర్గాన్ని అందుకున్న విన్యాసం ఈ ఆత్మకథలో హీరోని చూపిస్తే ....సమాజాన్ని అర్థంచేసుకునే పధ్ధతి, తన గుణపాఠాలు మనకు పాఠాలుగా చెప్పే నైపుణ్యం మొదలైన గుణాలు మనకొక గురువును చూపిస్తాయి.

ఇందులో మార్క్ చేసుకుంటూ పోతే ఎన్నో సూక్తులు కనిపిస్తాయి.

"రాజకీయాల మీదా, లంచగొండితనం మీదా నెపం వేయొద్దు. గెలుపు రాలేదంటే అది మన చేతకాని తనం".

"చాలా దేశాల్లో మనుషులు బధ్ధకస్తులు. అమెరికా వంటి దేశంలో మాత్రం కాదు. అయినా వారు పనిచేయగలరు గానీ, వ్యక్తులుగా భారతీయులంత తెలివైనవారు కాదు. కానీ వారికున్న సాంకేతిక పరిజ్ఞానం వారిని గొప్పవారిగా చూపిస్తోంది".

"సంపాదన పెరిగాక కొందరు విరాళాలు ఇస్తారు, కొందరు గుళ్లు గోపురాలు కడతారు...నేను మాత్రం మరో కొత్త పెట్టుబడి పెడతాను. దాని వల్ల మరో వెయ్యి మందికి ఉపాధి కలుగుతుంది. ఇది నా థియరీ".

ఇలాంటి సూటైన అభిప్రాయలు ఎన్నో. ఇక పుస్తకంలో కథానాయకుడు హోటల్ యజమాని కనుక సాంబారు రుచి పోకుండా ఉండాలంటే హోటల్లో ఏమి చేస్తారు, ఏమి చెయ్యడం వల్ల అంట్లు తోమే వాళ్ల ఖర్చు తగ్గించొచ్చు వంటి సూత్రాలు చెప్పారు. ఇవి అందరికీ అర్థమయ్యే విషయాలు కనుక (ముఖ్యంగా గృహిణులకి), ఎక్కడా బోర్ కొట్టదు.

జీవితంలో బాగా ఎదిగి, కిందకు పడి మళ్లీ లేవడానికి నీరసపడే వాళ్లకి ఈ పుస్తకం ఒక టానిక్. 176 పేజీలే కనుక తలచుకుంటే ఒక్క రోజులో పూర్తి చేయవచ్చు. అందులోనూ యండమూరివారి శైలి కనుక, తెలుగు పాఠకులకి పర రాష్ట్రానికి చెందిన కథ చదువుతున్న ఫీలింగ్ రాదు.

నా విషయానికి వస్తే, నేను ఎంబీయే చదువుతుండగా చదివిన "లీ అయొకోకా ఆటోబయోగ్రఫీ" తర్వాత అంతలా కట్టిపరేసిన ఆత్మకథ ఇది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇదొక టెక్స్ట్ బుక్ అయితే, ఇంట్లో ఉండే గృహిణులకి చక్కని కాలక్షేప బటాని ఈ "ఇడ్లి ఆకిడ్ ఆకాశం" (కొన్ని చోట్ల "ఇడ్లీ వడ ఆకాశం" అని కూడా ఉంది). టైటిల్ ఏదైతేనేం...విషయం గొప్పగా ఉంది. చదివేయండంతే.

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు