జడ శతకం: పుస్తక సమీక్ష - -సిరాశ్రీ

jada shatakam: book review
పుస్తకం: జడ శతకం
సంకలనం: బ్నిం
అచ్చు ప్రతి: రూ 51/-
ప్రతులకు: బ్నిం -8341450673, [email protected]
ఆన్లైన్ లో: http://jadashatakam.blogspot.in/
 
శతకం అనగానే, ఒక కవి ఒక మకుటాన్ని పెట్టుకుని పూర్తి చేసిన 100 పద్యాల సమాహారం గుర్తొస్తుంది ఎవరికైనా. ఇంతకీ ఒక శతకాన్ని ఒక కవే ఎందుకు రాయాలి? 30-40 మంది కలిసి పూర్తి చేయొచ్చు కదా! అనే ఆలోచన వచ్చింది సుప్రసిధ్ధ రచయిత, చిత్రకారులు అయిన బ్నిం గారికి. అంతే ఆలోచన వచ్చిందే తడవుగా ఫేస్ బుక్ లో శతక పద్యాలను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేసారు. అంశం "జడ". పంపించవలసిన పద్యాలు కందపద్యాలు అయిఉండాలన్నది నియమం. ఈ ఫేస్ బుక్ రోజుల్లో ఛందోబధ్ధమైన పద్యాలు వ్రాసే వారెక్కడ దొరుకుతారని అనుకున్నారు చాలా మంది. అనూహ్యంగా 50 కి పైగా కవులు ఉధృతంగా పద్యాలల్లి పంపడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్ లో ఇంతమంది సాధికారికంగా పద్యాలు రాయగలిగే కవులు ఉన్నారా?! అని ఆశ్చర్యం గొలిపేలా నెల తిరక్కుండా 500 పైగా పద్యాలు రాలాయి. వాటిల్లో 35 మంది కవులు వ్రాసిన ఓ 101 పద్యాలు ఏరి "జడ శతకం" గా అచ్చు వేసి విడుదల చేసారు. ఔచిత్యభరితంగా ఈ శతకాన్ని తమ గురువులైన బాపూ-రమణలకు అంకితం చెసారు బ్నిం. 
 
జడ అనగానే బాపూ-రమణలు గుర్తు రావడం సహజం. "రాధా గోపాళం" లో జడ మీద జొన్నవిత్తులగారు వ్రాసిన పాట కూడా సుప్రసిధ్ధం. తెలుగు పడుచుకు జడ ఎంత అందమో, ఆ జడని అంత అందంగా చిత్రీకరించారు దర్శకులు బాపూ- తన బొమ్మల్లోనూ, సినిమాల్లోనూ కూడా. 
 
ఇక విషయానికి వస్తే ఈ శతకం లోని ప్రతి పద్యంలోనూ "జడ" అనే పదం ఎక్కడో అక్కడ వస్తుంది. సాధారణంగా కంద పద్యాల్లో మకుటాలు చివరి పాదం చివర్లో ఉంటూంటాయి. ఇక్కడ మాత్రం అలా ఉండకపోవడం ఒక ప్రత్యేకత. బహుశా కవుల భావస్వేఛ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. 
 
అసలీ వినూత్న ప్రయోగం ఎందుకు? దీని ప్రయోజనం ఏమిటి?- అంటే చాలానే ఉంది. పద్యం అంటే పండితుల కవిత్వం అనీ, అది ఒక పట్టాన అర్థమవ్వదని చాలా తెలుగు భాషాప్రియుల్లో తిష్ట వేసుకుని కూర్చున్న అభిప్రాయం. పద్యం రాయలన్న ఆసక్తి కొందరు వచన కవుల్లో ఉన్నా, దానికి పెద్దగా ఆదరణ లేదనే కారణన్ చేత కూడా పద్యం జోలికి పోవడం లేదు. ఆదరణ పెరగాలంటే ఇదొక ఉద్యమంలా ఉరకాలి. అది జరగాలంటే ఉన్న పద్య కవులకి ఒక లక్స్యం పెట్టి పరుగెత్తించాలి. ఒక్క కవే ఒక శతకం పూర్తి చేసుకుంటే ఎవరికీ స్ఫూర్తి రగలదు. అదే వందమంది ఒక శతకం రాస్తే ఆ కోలాహలం వేరు. ఆ హడావిడి ఇంకొంత మందిని తాకి కొత్త పద్య కవుల్ని తయారు చేయవచ్చు. ఇదీ బ్నిం గారికొచ్చిన గొప్ప ఆలోచన. ఆ ఆలోచన ఇలా "జడ శతకం" రూపంలో ముందుకొచ్చింది. తనికెళ్ల భరణి గారి వెనుక మాట ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణ. ప్రసిధ్ధ పద్యవాగేయకారులు డా అక్కిరాజు సుందరరామకృష్ణగారు ఈ శతకానికి సంపాదకత్వం వహించారు. ఇందులో ధనాన్ని ఆర్జించే ఆలోచన కించిత్ కూడా లేదు. పూర్తిగా పద్యసరస్వతి సేవ మాత్రమే. 
 
ఇందులో ఉదాహరణకి కొన్ని పద్యాలు ప్రస్తావిస్తాను:
 
సుళ్ళేపస గుర్రానికి
పెళ్ళేపస యౌవ్వనమున, పిరుదులు తాకే
జళ్ళేపస ఆడాళ్ళకు
గుళ్ళేపస తిరుమలయ్య గుడిప్రాంగణమున్
 
తొడపాశము చిన్నప్పుడు,
జడపాశము యవ్వనమున జవ్వని చేతన్.
నడి వయసున ధనపాశము,
కడకా యమపాశమింక కర్మలె మిగులున్
 
విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!
 
రమణీయంగా బాపూ
రమణల పిలిచిందట జడ: "రండ్రండ్రండోయ్, 
కమనీయంగా నా కథ
అమలిన శృంగారరీతి నల్లండయ్యా!
 
పిన్నకు రెండు జడలునూ  
మిన్నగ నోపును పడచుకు మిండుగ నొక్కటి  
వన్నెగ వాల్జడ, పూజడ 
కన్నెకు సొగసగు , నందము  కానగ నెంతో
 
జడ గంటలు ,మెడ గంటలు
జడ చుట్టూ పూలదండ జటిలంబనుచున్ ,
జడ సొగసుకు యంద  మవగ  ,
జడ నల్లక  విరగ బోయు సంస్కృతి పెరిగెన్!  
 
జడయన మన్మధపాశము 
జడబారిన పడినవాడు సరసుండగునే 
జడమతియైనను మరి యా
జడ తాకగ కలుగునింక జ్ఞానోదయమే
 
కడు మిక్కిలి మక్కువతో 
జడ చాటున జంగమయ్య జాబిలినుంచెన్
జడ కీరితి ఎంతని మరి? 
జడ నాట్యం చేసె "సత్య" శృంగారంగా
 
పసికందుకు వేయజడలు
నసపెట్టకయుందరేమి నయమున కురులే
మసలక యుండెడి విధముగ
కొసకొక రబ్బరు బ్యాండే కుదిరిచ చాలున్
 
క్షీరోదధి మథియింపన
పారంబగు సుధ జనించి పడెనో పుడమిన్
గోరంతనదియె జడయై
నారీజన శిరములందు నడయాడె భళీ ! 
 
శ్రీకరుని సత్య కొంగున
నే కారణమున బిగించె నెరుగన్ దరమా?
తా కులికెడు భంగిమలో
నో కరమున నిన్ను బట్టి హొయలొలుక జడా!
 
భామకు వెనకను జడయే
పాముగ తానూగుచుండు, పైనను గనగా
చేమంతిబిళ్ళ మెరయుచు
తామణిగా వెలుగుచుండు తరుణీమణికిన్. 
 
కక్షతొ  యాగము మొదలిడ
దాక్షాయణి ఖిన్నమొంది దహనం కాగా
శిక్షించె మహాకాళుడు
దక్షుని తనజడలుకొట్టి తాభద్రుండై  
 
అబ్బో జడ పొడుగనుచున్
తబ్బుబ్బై పెండ్లియాడి, తననెల జీతం
కొబ్బరినూనెకు మరి ‘తల
సబ్బు’లకే చాల కేడ్చె, సరసుడు శ్యామా!
 
బడి కందము విద్యార్థులు
గుడి కందము వరములిచ్చు కులదైవంబున్
మడి కందము ఫలసాయము
జడ కందము మల్లెపూలు సందర్శింపన్
 
పొడవగు జడగని పరుగున 
పడతిని పెళ్ళాడి యొకడు పంతము పోయెన్ 
పడిపడి వగచెను గదరా 
ముడివిడి సవరము వరునికి ముంగిట పడగన్
 
జడలో మల్లెలు విరియగ
జడకుచ్చులు మెరిసిపోవ జవరాలపుడున్
పడకల గదికే జేరగ
పడిపోవడె యెవ్వడైన పడతుల వలలో
 
జడనుండు పొగరు పడతికి
ఉడిగిన జడ తోడ నుడుగు నుధ్ధతి కూడా
జడ తరిగిన ముడి వేయును
ముడి తోడనె వచ్చు రూపు ముసలి తనమ్మే!
 
నడుమును పిరుదులు దాటుచు 
మెడ వెనుకనె జారిజారి మెలికలు తిరుగున్‌
పడగెత్తు నాగు రీతిని 
జడవంపుల తరచి తరచి జగతిని చూడన్‌!
 
మెడమీదుగ ముందుకుపడు
జడతో మునిమాపు వేళ జక్కని రూపున్
బడసిన కన్యామణి తాఁ
బుడమిని ముగ్గులను వేయ ముచ్చటగొలిపెన్
 
విప్పిన  మేఘము క్రమ్మెడు
చప్పున విసిరిన తెలుపును  జవ్వని వగరున్
ఇంపగు పూలను తురిమిన
ఒప్పగు హరివి ల్లదియెగ ఒప్పెడి తనువున్ 
 
తొడలను కొట్టుచు పోటీ
జడలకు అనుచూ సవాళ్ళు జవ్వనులొసగన్,
గడగడలాడుచు పురుషులు
గొడవలు వద్దని నెలనెల గొరుగింతురుగా!
 
చడి చేయని భంగిమతో
నొడలుప్పొంగగ నిలబడి నొద్దిక తోడన్
జడ సౌందర్యము జూపుచు
పడవేతురు ముగ్గులోన పతులను జాణల్!
 
ఇలా ఇందులో ప్రతి పద్యం ప్రత్యక్షర రమణీయం. మొత్తం 35 కవులు పాల్గొన్న ఈ శతక రచనలో 101 పద్యాలున్నాయి. అయితే జడశతక నిర్వాహకులు ఈ పద్యాలన్నీ ఆన్లైన్ లో ఉచితంగా చూసే వీలు కల్పించారు. ఆ లింక్ పైన ఉంది.
 
"శంకరాభరణం" సినిమా చూసి ఎంత మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారోగాని, ఈ బ్నిం గారి ఆన్లైన్ జడ శతకం పుణ్యమా అని ఎందరో కొత్త పద్యకవులు పుట్టుకురావడం ఖాయం. ఇలా మరో అంశం మీద, ఆపైన ఇంకో అంశం మీద ఎడతెరిపిలేకుండా ఇలాంటి శతకాలు రాయిస్తే పద్యం మరో వెయ్యేళ్లు శక్తి పుంజుకుని బతుకుతుంది. శ్రీకృష్ణదేవరాయలకి 8 మందే, బ్నిం గారికి 35 మంది కవులు. భవిష్యత్తులో ఆ సంఖ్య ఇంకెంతకు పెరుగుతుందో. 
 

-సిరాశ్రీ

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు