పుస్తక సమీక్ష - ఎన్.జి.కె.ఆచార్యులు

పుస్తకం : ఎగిరే పావురమా
రచన : కోసూరి ఉమాభారతి
వెల : రూ. 75/-
ప్రతులకు : నవోదయ బుక్ హౌజ్
[email protected] ( ఇండియాలో )
[email protected] (north america ) kinige.com

ఒక ప్రముఖ అంతర్జాల పత్రికలో 18వారాలపాటు ధారావాహికగా వెలువడి, వంగూరి ఫౌండేషన్ వారి ద్వారా నవలగా వచ్చిన ఎగిరే పావురమా గురించి అన్ని పత్రికల్లోనూ సమీక్షలు వచ్చేసాయి. దాదాపు అందరూ ఆకాశానికెత్తేసారు. ఇంతాలస్యంగా ఇంకా మనమేం సమీక్ష రాస్తాం...ఎప్పుడో రాయాల్సింది అనుకుంటూనే నవల చదవడం మొదలెట్టాక అప్పుడనుపించింది...ఈ నవల గురించి ఎంతమంది రాసినా ఇంకా రాయాల్సింది ఎంతో ఉందని. ఇందులో ఊహకందని మలుపులు, సస్పెన్స్, రొమాన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. పదప్రయోగాలూ, పంచ్ డైలాగులతో పాఠకులను ఆకట్టుకోవాలనే ఆరాటం లేదు. అయినా ఒక్కసారి చదవడం మొదలెడితే ఖచ్చితంగా అక్షరాల వెంట పాఠకుల కళ్ళను పరిగెత్తించే కథాంశం ఉంది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయాలనే తపన ఉంది.  అదే ఈ నవలకున్న బలం.

అందరు ఆడపిల్లల్లాగే ఆశలూ-ఆలోచనలూ మది నిండా గూడుకట్టుకొని ఉన్నా, వ్యక్తం చేయలేని ప్రత్యేకావసరాలు కలిగిన గాయత్రి జీవితం ఈ నవల. ఈ పాత్రతో ఎవరెవరు ఎలా ప్రవర్ర్తించారు, ఎలా స్పందిచారు అనేది ఆసక్తికరం.

గాలి వాన ఉదృతంగా ఉన్న ఒక రాత్రి గాయాలతో ఏడుస్తున్న పసికందును చేరదీసి ప్రాణంగా చూసుకుంటున్న సత్యం తాత పాత్ర మీద గౌరవం కలుగుతుంది. అలాగే, అదే సత్యం తాతను చెప్పుడు మాటల ప్రభావంతో అపార్థం చేసుకున్న గాయత్రి పాత్ర పట్ల అక్కడక్కడా కొంచెం కోపం, ఆమె అమాయకత్వం పట్ల జాలీ కలుగక మానవు. అయినా గాయత్రికేం జరగకుండా ఆమె జీవితం ఓ చల్లని నీడలోకి చేరుకోవాలని ఈ నవల చదువుతున్నంతసేపూ అనిపిస్తూనే ఉంటుంది.

గాయత్రికి అక్షర జ్ఞానం కలిగించి, వైద్యం చేయించి, ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాలనే ఉమమ్మ పాత్ర స్పూర్తిదాయకంగా ఉంది.

ఇలాంటి అంశాలు ఇది వరకు వచ్చినా, ఈ ఎగిరే పావురమా ఇంత పాఠకాదరణ పొందడానికి రచయిత్రి కోసూరి ఉమాభారతి గారి నేపథ్యం కూడా ఒక ప్రధాన కారణమనే చెప్పవచ్చు. నర్తకిగా, అమెరికాలో అర్చనా డాన్స్ అకాడెమీ ద్వారా మూడు దశాబ్దాలకు పైగా అనేకమంది శిష్యులకు నాట్య గురువుగా, అప్పుడప్పుడు దర్శక - నిర్మాతగా, ఎన్నో సంఘ సేవా కార్యక్రమాల సారధిగా క్షణం తీరిక లేని, దేనికీ లోటు లేని ఉమాభారతి గారికి ఈ నవలలోని గాయత్రి పాత్ర జీవన శైలి గురించి అవగాహన కలిగి ఉండే అవకాశమే లేదు. కానీ నవల చదువుతున్నంతసేపూ ఎక్కడా అసహజం అనిపించకపోగా గాయత్రి కళ్ళతోనే లోకాన్ని చూసినట్టూ, ఆ అమ్మాయి మనసుతోనే ఆలోచించినట్టూ అనిపిస్తుంది. సాధారణంగా రచయిత ( త్రు ) లు  నేను అనే కోణం నుండి కథ రాసినప్పుడు తమని తాము చాలా హైలైట్ చేసుకుని, ఎంతో ఎత్తు నుండి సమాజాన్ని చూస్తున్నట్టు రాయడం తెలుసు. కానీ ఉమాభారతి గారు అభం శుభం తెలియని అమ్మాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినంత సహజంగా రాయడం అభినందనీయం. వివక్షకు గురవుతున్న స్త్రీల పట్ల ఆమెకున్న ఆవేదనా, వారి సంక్షేమం పట్ల ప్రగాడ కాంక్ష, సమస్యల పట్ల లోతైన విశ్లేషణ ఈ నవల రాయడానికి పురిగొల్పడం వల్లనే అంత సహజత్వం వచ్చిందేమో....

గాయత్రి జీవన ప్రస్థానాన్ని మూడు బొమ్మల్లో చూపిస్తూ, కథాంశాన్ని ప్రతిబింబించేలా టైటిల్ ని డిజైన్ చేసి, ప్రముఖ చిత్రకారులు, గోతెలుగు సంపాదకులు మాధవ్ గీసిన ముఖచిత్రం నవలకి చక్కగా సరిపోయింది. నవల మధ్యలో సన్నివేశాలను బొమ్మలు గీయించడం బాగుంది.

ఎన్.జి.కె.ఆచార్యులు 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు