పుస్తక సమీక్ష - - సిరాశ్రీ

book review
పుస్తకం: మీరు సామాన్యులు కావడం ఎలా?
వెల: రూ 200/- (హార్డ్ బౌండ్)
పేజీలు: 167
రచయిత: కందుకూరి రమేష్ బాబు
ప్రతులకు: క్రాంతికుమార్ రెడ్డి (పబ్లిషర్)- 8096721184, 9505488844

ఒక పుస్తకానికి సమీక్ష రాయాలంటూ ఒక పబ్లిషర్ నా దగ్గరకొచ్చారు. పుస్తకం టైటిల్ "మీరు సామాన్యులు కావడం ఎలా?". వినగానే ఎటువంటి సరదా కలగలేదు నాలో. టైటిల్ ఏమిటో అలా ఉంది అని మనసులోనే అనుకున్నాను. సరే పుస్తకం అట్ట తిప్పితే "ముందుగా మీకోసం ఒక పాట పాడుతాను. అదే ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం" అనే హెడింగ్ చూసి కాస్త భయపడ్డాను. రచయిత ఎవరా అని చూస్తే కందుకూరి రమేష్ బాబు. ఈయన పేరు కంటే ఆంధ్రజ్యోతి సండే సప్లమెంట్ లో ఈయన నిర్వహించిన "ఫెయిల్యూర్ స్టోరీ" నాకు చాలా సుపరిచితం. కొన్నాళ్లు క్రమం తప్పకుండా చదివాను. పుస్తకం మీద అభిప్రాయం కాస్త మారింది. ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది అనుకున్నాను. 

తర్వాత తీరిగ్గా పేజీలు తిప్పుతుంటే ఒక అనుభూతి. రచయత ఎంచుకున్న శైలికి అలవాటు పడడానికి కొన్ని నిమిషాలు పట్టింది. పేజీలు తిప్పినంత వేగంగా ఈ పుస్తకాన్ని చదివేయొచ్చు. డిజైన్ కాని, లే ఔట్ కానీ అంత బాగుంది. 

స్థూలంగా ఈ పుస్తకంలో కనిపించేది సామాన్యుడి గొప్పతనం, గొప్పవాడైన సామాన్యుడు, గొప్పలు చెప్పుకోని సామాన్యుడు, గొప్పకు లొంగిపోని సామాన్యుడు. 

అప్పటి ముఖ్యమంత్రి వైయస్సార్ 'ఏం కావాలో చెప్పు వరమిస్తానంటే," ఏమాత్రం పొంగిపోకుండా సున్నితంగా అవసరం లేదన్న ఒక పేద సామాన్య వృధ్ధురాలు. 

"నేను జయసుధని" అని ఒక సామాన్య మహిళను పలకరిస్తే "చాలా మంచిపేరు" అని మాత్రమే స్పందించి ఆ మహానటి ఎవరో తెలియదన్న వైనం. 

కూతురు పెళ్ళి పెట్టుకుని ఏ మాత్రం టెన్షన్ లేకుండా హాయిగా పాట పాడుకుంటున్న ఒక సాదా సీదా సామాన్య అరటి పండ్ల వ్యాపారి. 
డబ్బు సంపాదనే జీవితం కాదని, తన దేశాన్ని దుబాయికి తెచ్చుకోలేనందున ఉద్యోగం వదులుకున్న ఒక సామాన్య సైన్ బోర్డు ఆర్టిస్ట్ అయిన నిజమైన దేశ భక్తుడు.

 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ప్రతీ సామాన్యుడు ఒక స్ఫూర్తిప్రదాత లా కనిపిస్తాడు. 

ఇది వ్యక్తిత్వ వికాసం కాదు జీవన వికాసం అని రచయిత పేర్కొనడం బాగుంది. అది నిజమే. 

సాధారణంగా రాజులు, రాజకీయ నాయకులు, సినీ నటులు వంటి వారి జీవితాలు రికార్డ్ అవుతాయి తప్ప సామాన్యుల చరిత్రలు రికార్డ్ కావు. మన ఇతిహాసాలు, చరిత్ర పాఠాలు కూడా రాజుల కథలే తప్ప సామాన్యుల కథలు కావు. చరిత్ర రికార్డు చెయ్యని ఒక సామాన్యుడు ఎంత గొప్పవాడో "లగాన్" సినిమా చూపించింది. అనేక మంది సామాన్యుల ఉన్నత వ్యక్తిత్వం ఈ పుస్తకం సాక్షాత్కరించింది. ఇది నిజంగా జీవన వికాసం సూత్రం. ఎలా ఉండొచ్చొ, ఎలా బతకొచ్చో, ఎలా మాట్లాడొచ్చో సామాన్యుల జీవిత ఘట్టాలు తెలిపే విధానం ఇందులో కనిపిస్తుంది. 

ఈ పుస్తకాన్ని రాయడానికి సంకల్పించిన కందుకూరి రమేష్ బాబు, పబ్లిషర్ క్రాంతికుమార్ రెడ్డి ఇద్దరూ కృతకృత్యులయ్యారు. ఇది కాలదోషం పట్టని పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న సామాన్యులంతా ఇక సామాన్యులు కారు. అసామాన్యులే. ఎందుకంటే రాజులు, రాజకీయనాయకులు మాదిరిగా వారి జీవిత ఘట్టాలు కూడా అక్షరబధ్ధం అయిపోయాయి కనుక. 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు