పుస్తకం: సినారె ఛలోక్తులు
వెల: 45/-
ముద్రణ: 1998
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక విక్రయ కేంద్రాలు
మరీ ఆసక్తి గొలిపే కొత్త పుస్తకాలు నా వద్దకు రాకపోవడంతో ఈ వారం నాకు నచ్చిన పాత పుస్తకాన్ని ఒకదానిని పరిచయం చేస్తున్నాను. ఇది 1998 లో ముద్రితమైన "సినారె ఛలోక్తులు". సినారె అంటే పరిచయం అవసరం లేదు. జ్ఞానపీఠ పురస్కార విజేత, సినీ కవి డా సి నారాయణ రెడ్డి. సినారె ప్రసంగాలు చూసిన వాళ్లందరికీ ఆయన భాషాపటిమ, చమత్కార ధోరణి తెలిసే ఉంటుంది.
గతవారం పుస్తక సమీక్షలో పుస్తకం గురించి కన్నా రచయిత గురించి ఎక్కువగా ప్రస్తావించానని ఒక రసజ్ఞ పాఠకమిత్రులు అక్షంతలు వేసారు. వారి సద్విమర్శను దృష్టిలో పెట్టుకుని నేరుగా పుస్తకంలోని విషయాల్లోకి వచ్చేస్తున్నాను.
వివిధ సభల్లో, సందర్భాల్లో గత కొన్ని దశాబ్దాలుగా సినారె విసిరిన ఛలోక్తులని ఆచార్య ఎన్ గోపి ఒక సంకలనంగా తీసుకొచ్చారు. అదే ఈ 108 పేజీల పుస్తకం.
ఇందులో మొత్తం 100 ఛలోక్తులు సంకలనంగా ఉనాయి. ఆ ఛలోక్తులని తమ తమ జ్ఞాపకాల్లోంచి వెలికితీసి అందించిన వారి పేర్లతో సహా ముద్రించారిందులో. ఉదాహరణకి రెండు మూడు రుచి చూపిస్తే స్థాలీపులాక న్యాయంగా మీకే అర్ధమవుతుంది.
1994లో నగర కేంద్ర గ్రంథాలయం లో ఓ గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ సినారె ఇలా అన్నారు. "ఈ రోజుల్లో పుస్తకం రాయడం కంటే ముద్రించుకోవడం కష్టం. కారణం ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. రచన వేళ్లతో కూడుకున్న పని..ప్రచురణ వేలతో కూడుకున్న పని. - ఎస్. రఘు, హైదరాబాద్"
ఓ ప్రసంగంలో ఓ వక్త సినారెని పూజ్యులు పూజ్యులు అని పేర్కొంటున్నారు. అది వింటున్న సినారె కాస్త ఇబ్బందిగా కదిలి అతన్ని ఉద్దేశించి, "మీరు మాటిమాటికీ పూజ్యులు అంటున్నారు. తెలుగులో, సంస్కృతంలో పూజ్యులు అంటే పూజనీయులు అని అర్థం ఉంది. మరి హిందీలో పూజ్య శబ్దం సున్నా అనే అర్థంలో కూడా ఉంది. ఇంతకూ నేను అదా, ఇదా?" అనగానే సభలో నవ్వులు విరిశాయి- నీరజ, హైదరాబాద్"
ఒకసారి సినారెని కలవడానికి ఒక విద్వాంసుడైన నియోగి ప్రముఖుడు, ఆయనతో పాటు ఓ వ్యాకరణవేత్తా వచ్చారు. ఇద్దరూ సినారెకు ఆత్మీయులు. కాసేపు మాట్లాడి సెలవుతీసుకుని ఇద్దరూ స్కూటరుమీద కూచున్నారు. అప్పుడు సినారె వాళ్లిద్దర్నీ చూస్తూ, "బాగుంది జంట. ముందు కరణం, వెనుక వ్యాకరణం" అని చమత్కరించారు"- ఎల్లూరి శివారెడ్డి, హైదరాబాద్".
పేజీకో సందర్భం చొప్పున ఇలా సాగుతుంది పుస్తకమంతా... కాలక్షేపంగా చదివిస్తూ భాషపైన, సినారె ధిషణ పైన మక్కువ పెంచుతుంది ఈ పుస్తకం. కుదిరినప్పుడు ఈ పుస్తకాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.
ఇక ఇందులో లేనిది, నాకు వ్యక్తిగతంగా తెలిసింది అయిన ఒక సినారె ఛలోక్తిని ఈ సందర్భంలో పంచుకుంటాను.
రవీంద్రభారతిలో అలనాటి సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు గారి జయంతి సభ. ఏయన్నారు, సినారె వక్తలు. ముందు కార్యక్రమ నిర్వాహకులు వేదిక మీద ఉన్న ఏయన్నార్ ని ప్రస్తావిస్తూ "కళామతల్లి వరాలబిడ్డ" అన్నారు. తర్వాత సినారె మాట్లాడుతూ, "ఇందాక వారు నాగేశ్వర రావు గారిని కళామతల్లి వరాల బిడ్డ అన్నారు. నేను సాలూరి వారిని కళామతల్లి స్వరాల బిడ్డ అంటున్నాను", అన్నారు. వరాల బిడ్డ.. స్వరాల బిడ్డ...శబ్దార్ధ చమత్కృతి, ఔచిత్యం రెండూ సరిపోయాయి కదూ..!!