పుస్తక సమీక్ష: తెలుగు సినిమా స్వర్ణయుగం - సిరాశ్రీ

Book Review - Telugu Cinema Swarna Yugam
పుస్తకం: తెలుగు సినిమా స్వర్ణయుగం 
రచన: డా. ఎం వీ రమణా రెడ్డి
వెల: 100/-
ప్రతులకు: విశాలాంధ్ర 
 
తెలుగు పుస్తకాల్లో కవిత్వం, కథ, నవల, పద్యం వంటి విభాగాల సరసన గత దశాబ్దం 'సినిమా' కూడా వచ్చి చేరింది. పాఠకుల్లో సినిమాల పట్ల ఆసక్తి కారణంగా పుస్తకాల్లోకి కూడా సినిమా దూరింది. ఒక రకంగా సినిమా సాహిత్యానికి ఇప్పుడున్న శక్తి చలచిత్రేతర సాహిత్యానికి లేదనే చెప్పాలి. అందుకే ఈ కోవలో వందలాది పుస్తకాలు వస్తున్నాయి. అందులో కొన్ని ఆణిముత్యాలుగా నిలుస్తున్నాయి. అలాంటి ఒక ఆణిముత్యం డా|| ఎం వీ రమణారెడ్డి వ్రాసిన ఈ "తెలుగు స్వర్ణయుగం". 
 
రమణారెడ్డి గారు స్వర్ణయుగ చిత్రాలుగా ఎంచుకున్నవి 8. మల్లీశ్వరి, జయభేరి, దొంగ రాముడు, దేవదాసు, బంగారుపాప, పాతాళభైరవి, మాయాబజార్, విప్రనారాయణ. ఈ సినిమాలు చూసిన వారికి, చూడని వారికి కూడా మళ్ళీ ఓ సారి ఆ సినిమాలను కుదిరితే యూట్యూబులోనో, కుదరకపోతే డీవీడీలోనో చూసెయ్యాలనే ఆసక్తిని కలిగిస్తుంది వీరి రచన. 
 
పాత తరం చిత్రాలు చూడడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి కొంతమంది కొత్త తరం సినీ దర్శకులు భయపడడం నాకు తెలుసు. వాటి ప్రభావం తాము తీసే సినిమాలపై పడి పాతచింతకాయ పచ్చళ్లవుతాయనే భ్రమ!! కానీ ఏనాటివైనా మేటి చిత్రాలు చూడడం చాలా అవసరం; వృత్తి పరంగా సినీ దర్శక రచయితలకైనా, వినోదం కోసం ప్రేక్షకులకైనా. ఈ మాటల్లో ఏదైనా సందేహం ఉంటే ఈ పుస్తకం చదివాక ఉండదు. 
 
ఇరవయ్యో శతాబ్దం మధ్యకాలం వరకు నిర్మించిన తెలుగు చిత్రాల్లో సంభాషణ నిదానంగా, మాటలు ఈడ్చినట్టుగా ఎందుకు ఉండేవో ఒక చక్కని సంకేతిక కారణం చెప్పారు రమాణా రెడ్డి గారు. అది తెలియని చాలా మంది అప్పటి దర్శకులకి స్పీడ్ తెలీదు, కొత్త తరం వచ్చాకే స్పీడ్ పెంచారు అనుకుంటారు. వాళ్లందరికీ కళ్లు తెరుచుకుంటాయి. అదేమిటొ తెలుసుకోవాలంటే పుస్తకం చదవండి. ఇక్కడ లీక్ చేయను. 
 
అలాంటి చారిత్రాత్మకమైన సాంకేతిక విషయాలతో పాటు అప్పటి చిత్రాలు విజయవంతమవ్వడానికి కారణాలు కూడా తెలుస్తాయి ఈ 192 పేజీల గ్రంథంలో. విలన్ పాత్ర లేకుండా, కేవలం విధినే విలన్ గా చూపిస్తూ, ప్రేమికుల మధ్య "ప్రేమ" అనే పదం రాకుండా సంభాషణలు రాసి రక్తి కట్టించి సూపర్ హిట్టు కొట్టిన "మల్లీశ్వరి" కి సంబంధించిన విషయాలు చదువుతుంటే ఆ సినిమా చూసిన వారికి, చూడని వారికి కళ్ల ముందు రీలు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అల్లసాని పెద్దన శైలిలో దర్శకుడు రాయమన్న ఒక్క పద్యం కోసం 108 రకాల పద్యాలు తయారు చేసిన దేవులపల్లివారి శ్రధ్ధ, ప్రతిభ తెలుస్తాయి. ఎంత తపన పడితే పదికాలాలు నిలిచిపోయే సినిమాలు తీసారో తెలుస్తుంది. కాసులు పండిస్తూనే హృదయానికి హత్తుకునే సినిమాలు ఎలా తీసారో బోధపడుతుంది. 
 
"మాయాబజార్" గురించి రమణా రెడ్డిగారు రాసిన వ్యాసంలో లోతైన మహాభారత విశేషాలు తెలుస్తాయి. అసలు కృష్ణుడికి శకుని ప్రియమైనవాడు ఎందుకయ్యాడు (ప్రియదర్శిని లో కృష్ణుడికి శకుని కనిపించే సన్నివేశం గుర్తుంది కదా..), సాత్యకికి (నాగభూషణం) అంత ప్రధాన పాత్ర ఎందుకిచ్చారు వంటి విషయాలు చాలా ఆసక్తిగొలుపుతాయి. మహాభారతాన్ని ఎంత లోతుగా విశ్లేషించి ఈ మహాభారతంలో లేని కథను మహాభారతమే అనిపించేంత గొప్పగా ఎలా తీసారో, అందుకు స్క్రీన్ ప్లే ఎంతటి పాత్ర పోషించిందో తెలుసుకుని తీరాలి. 
 
అలాగే మద్రాసు పానగళ్ పార్క్ వద్దనున్న థియేటర్ కి వెళ్లి ఒకే ఒక్క పాట చెవిన పడడం కోసం ఎస్ వీ రంగారావు ఎలా వేచి ఉండేవారో, ఆ పాట ఎవిటో తెలుసుకోవడం సరదాగా ఉంటుంది. 
 
సంభాషణల్లో మాడ్యులేషన్ గురించి, తెరపై పాత్రల్ని ఎలా ప్రవేశ పెడితే ప్రేక్షకుడిని దర్శకుడు తన వశం చేసుకోవచ్చు వంటి అంశాలు చారిత్రక ఆధారాలతో ఒక పాఠం నేర్చుకుంటున్నట్టు ఉంటుంది ఇందులో కొన్ని పేజీలు చదువుతుంటే. 
 
"దొంగరాముడు" సినిమాలో మల్టిపుల్ క్లైమాక్స్ లు ఎలా పెట్టి, ప్రేక్షకులని ఎంత ఉత్కంఠకు గురి చేసారో అది సినిమా విజయానికి ఎలా దోహదపడిందో తెలుసుకోవచ్చు. 
 
తెలుగు నటులు తప్ప తెలుగు వాసనే లేని "దేవదాసు" తెలుగు ప్రేక్షకులకి దగ్గరవ్వడానికి గల కథన సామగ్రి ఎమిటో దర్శనమిస్తుంది. 
 
జంధ్యాల "సుత్తి" పదంలాగా తెలుగు భాషలో, వాడకంలో చిరస్థాయిగా నిలిచిపోయిన "గురూ" అనే సంబోధన, "ధైర్యే సహసే లక్ష్మీ" అనే వాక్యం, "హాం ఫట్" అనే ధ్వని "పాతాళ భైరవి" నుంచే వచ్చాయని మరో సారి గుర్తొస్తుంది. 
 
కాలక్షేపానికి కాలక్షేపం, సమాచారానికి సమాచారం, విజ్ఞానానికి విజ్ఞానం ఇలా అన్నీ ఒకేసారి ముందేస్తుంది ఈ "తెలుగు సినిమా స్వర్ణ యుగం". 
 
చదవండి. 
 
-సిరాశ్రీ

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు