ఒక మెలకువ పుస్తక సమీక్ష - మంజు యనమదల

oka melakuva book review

" మనసున్న మనిషికి ప్రతిబింబం ఈ ఒక మెలకువ.."

ప్రతి భావుకుడు తన పరిశీలనను నలుగురికి అందించే ప్రయత్నంలో సాహిత్యంలో ఏదోవొక మార్గాన్ని ఎంచుకుంటాడు. అలా కవిత్వాన్ని ఎంచుకుని లఘు ప్రక్రియల్లో, కవితలుగా తెలుగు సాహిత్యానికి అక్షర తూణీరాలను అందిస్తున్న ప్రముఖుల్లో పి శ్రీనివాస్ గౌడ్ ఒకరు.         మనిషిలో మరుగున ఉన్న మరో మనిషిని వెలికితీసే యత్నమే ఈ " ఒక మెలకువ " . జీవితాన్ని ఎంతో కొంత మనం తెలుసుకుని ఎదుటివారికి తెలియజెప్పడం గురించి చక్కగా మొదటి కవిత ఎంతో కొంతలో చెప్తారు. మనసు కదిలిపోయినంత మాత్రాన ఎదుటి మనిషి కన్నీళ్లు  ఆగిపోతాయా? అని బతుకుదెరువు కోసం తోపుడుబండే జీవనాధారమైన వ్యక్తిని కర్కశంగా, పాశవికంగా శిక్షించడాన్ని నిరసిస్తారు ఒక నిప్పురవ్వ కార్చిచ్చు అయ్యే దృశ్యం కవితలో. చెప్పాలంటే చాలా ఉంది ఈ కవితలో చదువుతుంటే దృశ్యాలు అలా కళ్ళ ముందు కదలాడతాయి.

కవి చాలా గొప్పగా ఆవిష్కరించారు వాస్తవ సంఘటనను. తర్కం గురించి నువ్వు - నేను ఒకటే కవితలో నాస్తిక, ఆస్తిక వాదాన్ని వినిపిస్తారు బహు లాఘవంగా. బడిలోని అమ్మ ఆయమ్మ గురించి రాసిన కవిత గురించి ఎంత  చెప్పినా తక్కువే. నే చదివిన మొదటి కవిత ఆయమ్మ గురించి, రాసిన మొదటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. ఇంట వైవిధ్యమైన వస్తువును ఎంచుకున్నందుకు కవికి అభినందనలు. తుపాన్ ముందరి ప్రశాంతత గురించి చెప్పడానికి ఏమి ఉండదు, ఎంతోమందికి అనుభవపూర్వకమే. అది అక్షరాల్లో అద్భుతంగా చెప్పారు. ఆత్మ సౌందర్యాన్ని, మద్యం వలన నష్టాన్ని బాగా చెప్పారు. మగత కళ్ళ పుస్తకాల్లో నిద్ర పేజీల్ని చింపడంలో చిటికిన బాల్యాన్ని, ఆ పసి చేతులు చేస్తున్న కష్టాన్ని, వాడు పడుతున్న ఛీత్కరింపులను చాలా బాగా చెప్పారు అతనికి నిద్ర ఒక కల కవితలో. నది మనసుని అది ప్రవహించినంతమేరా చక్కగా చూపించారు మనకి కూడా. కులమత వర్గ వైషమ్యాలను చెప్తూ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు మన పిల్లలకు ఏ కానుకనిద్దామంటూవాడికి ముఖం లేదు కవితలో. కాసిన్ని అక్షరాల ఆసరాతో, ఒకే ఒక్క వీడలేని చూపుని, ప్రకృతిలో ప్రతి అణువులో నేనుంటానంటూ, అతని సమక్షంలో మరణం లేని జీవితాన్ని, మళ్లీ మళ్లీ అతనే గుర్తుకు రావడాన్ని, విస్తరిస్తున్న శిథిలాల మధ్య అస్తమిస్తున్న వాళ్ళని, వీడని జ్ఞాపకాలను దేదీప్యమానంగా, వాన చుక్కలు వాలడాన్ని ఇలా ప్రతి భావాన్ని చక్కగా అక్షర తూణీరాలుగా మలిచారు. ముంజ కవిత తాటికాయల్లో ఆ ముంజలు ఎలా ఉంటాయో, అబ్బా నిజంగా ఆ ముంజలు తిన్న పసితనాన్ని, ఆ మధురమైన రుచిని మళ్ళీ ఆస్వాదింపజేశారు

తన కవితతో. బయటి ప్రయాణం గురించి మన అందరికి తెలిసిందే. లోపలి ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే ఈ కవిత తప్పక అందరు చదవాల్సిందే. రైతు మృత్యుకోత గురించి హృదయవిదారక వేదనను కోత కవిత చెప్తుంది. దృశ్యాలు.. కలలు.. ఆకాంక్షలు.. , పిల్లలు.. దేవుడు.. మరికొన్ని మాటలు.., మాటల్లేని మొండి గోడల మధ్య, వర్షం పడితే, చీకటి.. వెన్నెలా.., మనసు దుమ్మును దూలపమని ఒక మెలకువను, దూరమైనా అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ  ఏకాకి ప్రేలాపనను, తనను తాను తెలుసుకోవడాన్ని నువ్వొక లోయ-నీలమేఘమాయను కవితలుగా చక్కని వాస్తు శిల్పాలతో చెక్కారు. ఆమె.. ఇంకా అక్కడే ఉందా..? కవిత గురించి చెప్పడం చదివితే మీకు మనసు పొరల్లో ఎక్కడో ఓ జ్ఞాపకం మెదలడం ఖాయం. పల్లెకారుల కడగండ్లు, వారి జీవన విధానము కొట్టుబడి కవితలో కనిపిస్తుంది. ప్రకృతి ప్రణయ గీతాలు ఒక ఋతువు నుండి మరొక ఋతువుకి కవితలో వినవస్తాయి.

తన అభిమానాన్ని చాటుకుంటూ మర్మయోగి గురించి, అక్షరాలా రెండక్షరాలు చేసే అద్భుతాన్ని, ఆబాలను సబలగా చేసి నలుగురికి ఆకలి తీర్చే అమ్మలా ఆ నలుగురు ఏం చేసారో చెప్తారు. వచ్చే రోజుల్లో, ఒక చావు- మరో అసహనం, ఆమె-నేను-కవిత్వం, దుఃఖం ఒక దూదిపింజ కవితలు చక్కని ప్రేమ, బాధలను చెప్పే కవితలు. మూడో తరం - మరిన్ని ప్రశ్నలు, మరణశయ్య మీద అమ్మకు, కారణ జన్ముడు, పసితనం ఓ వరం కవితలు కవి సున్నిత మనసుకు అడ్డం పడతాయి. వాక్యానికి వేయి ముఖాలు... అంటూ వాక్య పాదాల వద్ద కవితలో వాక్యం విలువను చక్కగా చెప్తారు. మిగిలే ఉంటుంది, జెన్ వచనాలు చక్కని అనువాద కవితలు.ఒక మెలకువ కవితా సంపుటిలో కవి పి శ్రీనివాస్ గౌడ్ చక్కని వైవిధ్యమైన వస్తువులతో, అద్భుతమైన భావాలను అందించడంతోపాటుగా, సమాజపు పోకడలను, మనుష్యులలో లోపిస్తున్న మానవతా విలువలను, ప్రకృతి అందాలను అక్కడక్కడా మెరిపిస్తూ, బాల్యాన్ని, కొన్ని జ్ఞాపకాలను, అమ్మను అందరికి గుర్తు చేయడంలో కృతకృత్యులయ్యారు. ఇంత చక్కని వచన కవిత్వాన్ని అందించిన శ్రీనివాస్ గారికి మనఃపూర్వక అభినందనలు.

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు