అవధాన విద్య- ఆరంభ వికాసాలు
రచన: డా|| రాళ్ళబండి కవితా ప్రసాద్
వెల: 250/-
రచయిత విద్యుల్లేఖ: [email protected]
అవధానం అనగానే రొమ్ము రెండంగుళాలు పెరగకపోతే వాడు తెలుగు సాహితీ ప్రియుడే కాడు. చమత్కార సమాధానాలు, పద బంధాల చిక్కులు, వాటిని అవధాని అలవోకగా విప్పే ట్రిక్కులు..ఇలా ఒకటా రెండా ఆ సాహితీ క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెడితే ఓ పట్టాన ఆగదు.
ఇంత అద్భుతమనుకునే అవధానం కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితం కాదన్న విషయం విజ్ఞులు చాలా మందికి తెలుసు.
బాగా ప్రచారమైన అవధాన రీతుల్లో నేత్ర, అంగుష్ట, ధారణ అవధానాదులు ఉన్నాయి. అయితే ఆపుడప్పుడు, అక్కడక్కడ అవధానాల్లో కొత్త రీతులు తారసపడుతుంటాయి. ఇక్కడ 'కొత్త..అ అంటే మనం 'కొత్తగా' తెలుసుకునేవి కనుక.
నిజానికి అవధానంలో 50 రకాలు ప్రాచీన కాలంలోనే ఉన్నాయట. కాల ప్రవాహంలో కొట్టుకు పోయినవి కొన్నైతే కొన్ని మోయగలిగే అవధానులు లేక అంతరించిపోయాయట. ఆ అవధానాలు, వాటి తీరులు, వాటి చరిత్రలు, అన్నీ వివరిస్తూ అవధాన పురుషుని విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసారు డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్ తన 'అవధాన విద్య- ఆరంభ వికాసాలు గ్రంథంలో.
స్వతహాగా అవధాని అయిన డాక్టర్ రాళ్ళబండి సునిశిత పరిశోధనా శీలి. ఆయన సాధన ద్వారా శోధన చేసిన అనేక అవధాన విశేషాలను బోధన చేశారు ఈ పరిశోధనా గ్రంథంలో.
527 పేజీల ఈ గ్రంథాన్ని ఆసాంతం జుర్రుకుంటే తప్ప అవధాన కళా క్షుధార్తి తీరదు.
ఈ గ్రంథంలో అంశాలు అబ్బురపరిచేవి కొన్ని, ఆసక్తిగొలిపేవి ఇంకొన్ని, ధీశక్తిని పెంచేవి మరికొన్ని.
దత్తపదులు, సమస్యలు వంటి పెక్కుమందికి తెల్సిన విషయాలతో పాటు ఇంగ్లీషు అవధానం నమూనా ఆసక్తిని గొలిపే అంశం.
189 వ పేజీలో చెప్పిన పద్యాలు నిజంగా ధీశక్తిని పెంచేవే. ఇంగ్లీషులో గొప్పగా చెప్పుకునే టంగ్ త్విస్టర్స్ వీటి ముందు దిగదుడుపే. ఇక ఏకసంథాగ్రాహ్యవధానం,శతకలశావధానం వంటి వాటి గురించి తెల్సుకోవడం నిజంగా అబ్బురపరిచే అంశం.
అసలు ఈ గ్రంథం గురించి సమీక్ష రాయాలంటే మరో గ్రంథమే రాయొచ్చు. అంత సాహసం చేయకుండా రెండు ముక్కలు చెప్పి ముగిస్తున్నా. ఆరు అధ్యాయాల ఈ గ్రంథం ప్రతి తెలుగు సాహితీ పిపాసికీ 18 అధ్యాయాల భగవద్గీతతో సమానం.
ఈ పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుందంటే- అవధాని శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ తన కవితా ప్రియు’రాళ్ళ బండి’లో ఎక్కించుకుని సుధలూరే ఊరికి తీసుకుపోతున్నట్లుగా ఉంటుంది.
ఆసాంతం చదివాక ఓ కొత్త ఉదయం వెలిగినట్లుగా అనిపిస్తుంది. ఆ భావం ఇలా శుధ్ధ మధ్యాక్కరలో చివరగా-
సుకవితా ప్రియురాళ్ళబండి
సుధలూరు గొనిపోవ రండి
సకలమౌ కళలన్ని కాచి
శాస్త్రాలు వడబోచి చూచి
శ్లోకాలనెన్నో రచించి
శోధించి ఛందం మధించి
వికశితంబాయె మీ హృదయం
వెలుగీనె ఓ కొత్త ఉదయం