పుస్తక సమీక్ష: ప్రాచీన సాహిత్య దర్శనం - సిరాశ్రీ

pracheena saahitya darshanam book review

పుస్తకం: ప్రాచీన సాహిత్య దర్శనం
రచన: మువ్వల సుబ్బరామయ్య
వెల:100/-
ప్రతులకు: మువ్వల పెరుమాళ్లు అండ్ సన్స్, విజయవాడ- 2577828, 8978261496

బాల్యం నుంచి ప్రాచీన సాహిత్యం అభ్యసించే వెసులుబాటు ప్రస్తుత విద్యా విధానంలో లేదు. వెతికితే ప్రాచ్య పాఠశాలలు అక్కడక్కడా కనిపించవచ్చేమో కానీ, వాటిల్లో పిల్లల్ని చదివించే ధైర్యం ఇప్పటి తల్లిదండ్రులు చేయడం లేదు. కొందరు పాఠశాల వయసు దాటి ఆసక్తి మీద సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని మధించాలనే తపనో, ఆయా భాషల్లో అధ్యాపకులవ్వాలన్న తపస్సో, కారణం ఏదైనా తిరుపతి సంస్కృత విద్యా పీఠం లాంటి కేంద్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు ఉన్నారు. అటువంటి వారికి తప్ప విద్యలో భాగంగా ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశం దొరకడం లేదు. చాలా మందికి ప్రాచీన సాహిత్యం పట్ల కొంతైనా అవగాహన కలిగి ఉండాలని ఉన్నా ఆ పద్యాలు, శ్లోకాలు చూసి "ఇది మన వల్ల కాదులే" అనుకుని లోతుల్లోకి వెళ్లడం లేదు.

సరిగ్గా అటువంటి వారి కోసమే అన్నట్టుగా ఈ "ప్రాచీన సాహిత్య దర్శనం" వెలువరించారు మువ్వల సుబ్బరామయ్య. అప్పట్లో వావిళ్ల వారు, ఈ మధ్య ఎమెస్కో వారు ప్రాచీన తెలుగు ప్రబంధాలని ప్రచురించారు. మను చరిత్ర, వసు చరిత్ర, ఆముక్త మాల్యద, శృంగార నైషధం, విజయ విలాసం, పారిజాతాపహరణం మొదలైనవి యధాతధంగా ప్రచురించడం వల్ల కావ్యాలు చదివి అర్థం చేసుకునే ఓపిక, తీరిక ఉన్న వారికి తప్ప ద్రాక్ష పాకాన్ని ఇష్ట పడే వారికి ఆశ్వాదించడం వల్లకాని పని. కొంతలో కొంత, ప్రఖ్యాత రచయితలచేత ఆ పుస్తకాల్లో ముందు మాటలు రాయించారు కనుక అవే ఆ గ్రంథాలని అర్థం చేసుకోవడానికి దిక్సూచులుగా ఉన్నాయి.

కానీ ఇక్కడ సుబ్బరామయ్య గారు పద్యాలు, శ్లోకాల జోలికి పోకుండా కథ, కథనం మీద దృష్టి పెట్టి మూలం నుంచి పక్కకు పోకుండా వచన రూపంలో పలు సంస్కృత, తెలుగు కావ్యాలను కూలంకషంగా పరిచయం చేసారు. ప్రతి కావ్యం కేవలం 20-25 పేజీల్లో ముగుస్తుంది. కావ్యాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న అనుభూతి కలుగుతుంది. కాళిదాసు రాసిన "కుమార సంభవం", "రఘు వంశం", "మేఘ సందేశం", "విక్రమోర్వశీయం", "మాళవికాగ్ని మిత్రం", భవభూతి విరచిత "మాలతీ మాధవం", బాణుడు రాసిన "కాదంబరి", విశాఖదత్తుని "ముద్రారాక్షసం", శూద్రకుని "మృఛ్ఛకటికం" ఈ గ్రంథంలో తెలుగు వచన రూపంలో ఉన్న సంస్కృత కావ్యాలు.

అలాగే అల్లసాని వారి "మను చరిత్ర", భట్టుమూర్తి "వసు చరిత్ర", కృష్ణదేవరాయలి "ఆముక్త మాల్యద", శ్రీనాధుని "శృంగార నైషధం", "కాశీ ఖండం", చేమకూరి వేంకట కవి "విజయ విలాసం", నంది తిమ్మన "పారిజాతాపహరణం", తెనాలి రామకృష్ణుని "పాండురంగ మహాత్యం", పింగళి సూరన "ప్రభావతీ ప్రద్యుమ్నం", నాచన సోముని "ఉత్తర హరివంశం" ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి.

పై కావ్యల్లోని కథ, కథన శిల్పం తెలుసుకుని సంతృప్తి చెందాలనుకునే పాఠకులకి ఈ పుస్తకం పెళ్లిభోజనం లాంటిది. ఇన్ని రుచికరమైన కావ్యాలు ఒక చోటే దొరకడం అంటే అంతే మరి. మూలంలో శ్లోకాలు, పద్యాలు ఆశ్వాదించడం కొరుకుడు పడవని అనుకునే వారికి ఇక్కడ కథ, కథనం చదివితే చాలు..ఆ అనుమానం పోయి మూలాల్లోకి వెళ్లగలుగుతారు కచ్చితంగా. పైగా ప్రతి కావ్యానికి ముందు సుబ్బరామయ్య గారి ఉపోద్ఘాతం కేవలం ఒకటే పేజీలో ముగుస్తుంది. అది చదివితే అంశం కచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత రంజకంగా రాసారాయన. దాంతో కథగా ఉన్న మిగతా 20-25 పేజీలూ చదివేస్తాం.

పలువురు రచయితలు పై కావ్యాల్ని గతంలో వచన రూపంలో అందించిన మాట నిజం. అయితే ఇన్నేసి కావ్యాలు ఒకే చోట చేర్చడం ఈ గ్రంథం ప్రత్యేకత. మొత్తం 245 పేజీలున్న ఈ గ్రంథంలోని ఒక్కో కావ్య కథను హై స్కూల్ వయసు నుంచే విద్యార్థుల చేత చదివిస్తే భావి తరాల్లో ఇప్పటి తరం కంటే ప్రాచీన కావ్యాల మీద మెరుగైన అవగాహన కలవారు కొందరైనా తయారవుతారు.

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు