పుస్తకసమీక్ష - ..

book review
  " అమ్మభాషను ఊపిరిగా మార్చిన మాండలీకమే అనంత యాస" 

ఎవరికైనా పుట్టిన ఊరు మీద అభిమానం ఉండటం సహజం. పొట్ట చేతబట్టుకుని పరాయి దేశాల వెంట పడుతున్న నేటి రోజుల్లో మాతృభాష మీద అదీ తన ప్రాంత మాండలిక యాస, భాష మీద ఎనలేని మమకారం పెంచుకున్న అతి కొద్దిమందిలో రాయపాటి శివయ్య ఒకరు. తెలుగు సాహిత్యంలో కథ, కవిత్వం, వ్యాసాలు, లఘు రూప ప్రక్రియలు విరివిగా వస్తున్న తరుణంలో పుట్టిన గడ్డ మీద ప్రేమతో అమ్మకు సాటైన మాండలికాన్ని ఆత్మీయంగా హత్తుకుని నలుగురికి ఆ గొప్పదనాన్ని తెలియజేయాలని చాలా శ్రమ పడి పరిశోధన చేసి తమ ప్రాంతం చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాల భాషల, యాసల ప్రభావాన్ని, తన ప్రాంతపు యాస ప్రత్యేకతను తెలియజేయడానికి " అనంత యాస " అనే భాషా పరిశోధనా గ్రంధాన్ని అందించిన రాయపాటి శివయ్యకు అభినందనలు.

చదువుకునే రోజుల్లోనే ఈ పరిశోధనకు అంకురం పడిందని, కొందరు తన యాసను గేలిచేసినప్పటి బాధ నుండి జనించినదే ఈ కోరికని, అదే ఈరోజు ఈ పుస్తక ప్రేరణకు కారణమని చెప్తారు. చక్కని భాష నేర్చుకునే ప్రయత్నంలో ఎన్నో కొత్త పదాలు నేర్చుకున్నానని, అవే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉపయోగ పడ్డాయని చెప్తారు.మానవుడు భావ వ్యక్తీకరణకు భాషను మాధ్యమంగా ఎంచుకున్నాడు. భాషకు మార్పు సహజం. మానవుడు నివసించే ఆ యా మరిసరాల భౌగోళిక పరిస్థితులు, విద్య, వైద్య, నాగరికత వగైరా ప్రభావాలనుబట్టి భాషలో యాసలు చోటు చేసుకోవడం, భాషలో మార్పులు, చేర్పులు రావడమన్నది సహజ పరిణామక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒరిసా రాష్ట్రాల ప్రభావం ఉంది. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగునాడును వివిధ వృత్తి పరమైన పదకోశ పరిశోధన ఆధారంగా నాలుగు భాషా వ్యావహారిక మండలాలుగా విభజించారు. అవి

1. పూర్వ మండలం / కళింగ ప్రాంతం
2. మధ్య మండలం / కోస్తా ప్రాంతం
3. దక్షిణ మండలం / రాయలసీమ ప్రాంతం
4. ఉత్తర మండలం / తెలంగాణ ప్రాంతం.

ఈ విభజనలో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడి ప్రజల వాడుక భాషలోని పదాలను, మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఏర్పరచుకున్న మాండలిక పదాలను చూపే ప్రయత్నమే ఈ " అనంత యాస " పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. అనంతపురం భాషా మాండలీకంపై ఎక్కువగా కన్నడ భాషాయాస ప్రభావం ఉంటుంది. అలాగే తమిళ పదాలు, కడప, కర్నూలు భాషాయాసలు కూడా చోటుచేసుకుంటాయి. ఇక్కడి ప్రజలు  వాడే వస్తువులు, పదార్థాలు వివిధ ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇరవైఏడు భాగాలుగా విభజించి మనకు అందించారు. మొదటగా ఏకాక్షర పదాల్లో ఆ, ఈ, ఉ, ఊ, ఏ ఇలా ఆ యా అక్షరాల వాడుకను, ఉదాహరణలను వివరించారు.

క్వా అంటే తీసుకో - ఇదిగో క్వా. తర్వాత లాల, లాలి, ఆంతిను వంటి పిల్లల సంబంధ పదాలు, చుట్టంరాలు, పొద్దులు అవటం వంటి స్త్రీ పురుష సంబంధ పదాలు, అజ్జి, అవ్వ వంటి వరుసల బంధాల సంబంధ బాంధవ్యాలు, అంగి, ఒల్లి, కమ్మిడి వంటి వాడుక దుస్తుల పదాలు, కడిమి/కడెం, కమ్మలు, దావు(వడ్డాణం) లాంటి ఆభరణాల పేర్లు, కడత, సెయ్యి, దమ్ములు, దొక్క వంటి అవయవాల పదాల వాడుక పేర్లు కొన్ని. అరుగు, అసులు, కమాను, జలాట, గవాసి, వారపాకు, పడసాల వంటి ఇంటికి, ఇంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పదాలు, దువ్వాన, ఇసర్రాయి, పీపీ ఇవి ఇంట్లో వాడే కొన్ని పరికరాల పేర్లు. అనకాగు, ఈలపీట, గిద్ది, గెంటి, పొంత, జోడ వగైరా వంట ఇంటి వాడుక పరికరాలు, ఉర్లగడ్డ, ఎర్ర గడ్డ, ఎల్లిపాయి, మిరక్కాయ వంటి కూరగాయల పేర్లు, అరటికాయ,ఎల్లూరుకాయ, కలంగరికాయ (పుచ్చకాయ) వంటి పండ్లు, కాయల పేర్లు, అవగిరి, ఉక్కిలి, కీరు, గోగాకు, బొరుగులు, మెతుకు, పుగ్యాలు మొదలగు వంటలు, వంట వదార్థాలు, కుసాలనూనె, చమురు వంటి నూనెల పేర్లు, దచ్చినం, తూరుపు, భానువారం, బేస్తువారం, అయ్యాలకాడ, పైటాల, రేత్రి ఇలా దిక్కులు, మూలాలు, వరాలు, సమయాల వాడుక పదాలు ఉదాహారణలతో చెప్పారు.

కొన్ని కొలతలు, ప్రమాణాలు, వ్యవసాయ రంగం, కార్తెలు, వర్షాధారిత పదాలు, జంతువులు, సరీసృపాలు, వ్యక్తిత్వ పదాలు, ప్రశ్నార్థక పదాలు, అనుమతినిచ్చే పదాలు, తిట్లు, శాపనార్థాలు, సాధారణ వ్యవహారిక పదాలను సోదాహరణంగా ఎక్కడ ఎలా వాడతారో వివరించారు. 
పరిశోధన భాష మీద చేయడం చాలా కష్టం. అందులోను మాండలికంపై చేయడమంటే కత్తి మీద సాము చేయడమే. భాషను సజీవంగా తరువాతి తరాలకు అందించాలంటే ఇలాంటి భాషా పరిశోధన గ్రంధాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రతి ప్రాంతపు యాస ఓ ప్రత్యేకతను భాషకు అందిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మన భాషను, యాసను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుందని మర్చిపోకూడ దు.  ఉపాధ్యాయునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, తన ప్రాంతం మీద మక్కువను, అమితమైన ప్రేమను చూపించడానికి " అనంత యాస " భాషా పరిశోధనా పుస్తకాన్ని అందించిన రాయపాటి శివయ్య గారికి హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు