స్మార్ట్ జీవితం పుస్తకసమీక్ష - .. - మంజు యనమదల

smart life book review
జన జీవితంలోని ఒడిదుడుకులను కథా వస్తువులుగా తీసుకుని డాక్టర్ లక్ష్మీ రాఘవ కథా సంపుటాలు వెలువరించారు. వాటిలోనిదే ఈ "స్మార్ట్ జీవితం " కథా సంపుటి. సమాజంలో మనిషి మనుగడ, మానవత్వపు విలువలు, సర్దుబాట్లు, దిద్దుబాట్ల గురించి తనదైన శైలిలో మనకందించిన మణిహారం "స్మార్ట్ జీవితం " లో ఏముందో చూద్దాం.

కోరికేదైనా అది తీరితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇల్లు కట్టుకోవడం దగ్గర నుండి ఆ ఇంటి మీద ప్రేమ పెంచుకోవడం, అనుకోని కారణాలతో ఆ ఇంటికి దూరమైనా, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ మళ్ళీ అదే ఇంటికి చూడాలని రావడం, అనుభూతులు పంచుకోవడం..చదువుతుంటే కళ్ళ ముందు ఆ సంఘటనలన్నీ కనిపించిన అనుభూతి కోరిక కథలో. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు హేళన చేసిన సహోద్యోగులతోనే శబాష్ అనిపించుకోడానికి తన అవసరానికి ధైర్యాన్ని కూడగట్టుకున్న శాంతలాంటి ఎందరో తల్లుల మనోగతం ఈ అవసరం కథ. పల్లె జీవితాలకు మానసిక నిపుణులు అవసరము, సమస్యల పట్ల అవగాహన కల్పించడం వంటి విషయాలను ఝాన్సీ కథ ద్వారా చెప్పడం బావుంది. ఏ బంధము లేని మనుష్యులు ఎలా దగ్గరౌతారో, అయిన వారి నిరాదరణ, శరణాలయాల ముసుగులోని లొసుగులు చెప్పే కథ శరణాలయం. ఇద్దరి మధ్య పెళ్ళి జరగడానికి కావాల్సింది నమ్మకం కాని ఎంక్వయిరీ కాదని చెప్పే కథ ఎంక్వయిరీ. శుచి కథ ఎందరో బడుగు మహిళల బయటకు చెప్పుకోలేని సమస్య. ప్రత్వం ఆలోచించి పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే కథ. అయినవారికి అవసరానికని ఇచ్చిన డబ్బులు వారి పతనానికి, వ్యసనాలకు కారణమైతే ఏర్పడే పరిస్థితి అపాత్రదానం కథలో తెలుస్తుంది. మనిషి నమ్మకాలను సొమ్ము చేసుకోవడమెలాగో బాబాల మాయల లీలలేమిటో తెలిపే కథ కలలు.

ఈనాటి పిల్లల, తల్లిదండ్రుల ప్రవర్తన గురించి చక్కని విశ్లేషణతో కూడిన కథ నిఘా. సామాన్యులకు నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను చూస్తూ ఓ బాంక్ ఉద్యోగి పెద్దాయనకు చేసిన సాయమే చిదంబర రహస్యం కథ. తల్లి బిడ్డకు ఎందుకు దూరంగా ఉంటుందో, అత్తగారు అమ్మగా మారిన కారణం చెప్పిన అయిష్టం కథ. పాత తరం నవతరానికి ఇచ్చే సూచనలు, సలహాలతో పాటు జీవితాన్ని సద్వినియోగము చేసుకోవడమెలాగో చెప్పిన కథ నాన్న డైరీ. రాయలసీమలో అనావృష్టి మూలంగా పడే ఇబ్బందులకు వర్షం ఎక్కువైతే వచ్చే అతివృష్టి ఇక్కట్ల గొడవే కరువు సీమలో అతివృష్టి కథ. లోకం తీరు చెప్తూ చెప్పుడు మాటల గురించి జాగ్రత్త పడమని చెప్పే కథ లోకులు. బిడ్డలకు మలి వయసులో భారం రాకూడదని ఓ తల్లి తీసుకున్న నిర్ణయమే మారిన మజిలీ కథ. సమాజంలో లంచాల మెాసాలు చూపిస్తూ, దైవం పేరు చెప్పుకుంటూ భక్తితో బతకడమెలాగో చివరకు ఇదీ కథలో తెలుస్తుంది.

పెంచిన అమ్మకు ప్రేమతో తన మనోగతాన్ని వివరిస్తూ తన విశ్వాసాన్ని చాటుకున్న జీవి చెప్పిన కథ అమ్మకు ప్రేమతో.టెక్నాలజీ మాయలో పడి కోల్పోతున్న కుటుంబ బంధాలను, మర్చిపోతున్న బాధ్యతలను గుర్తు చేసిన కథ స్మార్ట్ జీవితం. గత వైభవాన్ని తల్చుకుంటూ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటూ తన చాతనైన పని చేయాలని సంకల్పించిన ఓ గొప్పింటి పేద కోడలి కథ గతం గతః. బాధితుడెప్పుడూ సామాన్యుడేనంటూ, మాటల్లోనే నీతులు. చేతలకు పనికిరాని నీతులు కూడు పెట్టవని చెప్తూ న్యాయనికి భయపడే మనుషుల మనస్తత్వాలను తెలిపే కథ నీతి. పల్లె నుండి పట్టణానికి చదువు కోసం వెళ్ళే ఆడపిల్లలకు బస్లలో ఎదురయ్యే అగచాట్లు, వెకిలి చూపులు ఎలా తప్పించుకోవాలో చెప్పిన కథ ఎలాంటి మార్పు. తిరుమల శ్రీవారి పుష్పయాగంలో పాలు పంచుకున్న పూల మనసు మాటలు వినిపించిన పుష్పయాగంలో పుష్పాల సందడి కథ. నాటి నుండి నేటి వరకు పెళ్ళిళ్ళ తీరు, అది సహజీవనాలుగా మారిన వైనం చూపిన కథ నాడు....నేడు. వద్దన్న నిక్కరు మళ్ళీ రావాలనడం వెనుక కథే నిక్కరు.

బాంక్ లో బోలెడు డబ్బులున్నా అవసరానికి అందుబాటులో లేని ఏటియం మెషిన్, అవసరం తీరే మార్గం చెప్పిన కథ ఆపద్బాంధవుడు. పెళ్ళి విషయంలో ఈ కాలపు పిల్లల ఆలోచనలను తెలిపే కథ సంబంధం. కొన్ని మన నమ్మకాలకు పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సందర్భాల కథే వెక్కిళ్ళు. పెద్దలకు కావాల్సింది పిల్లల సంతోషమే అని చెప్పిన కథ ఇదే. శరీరంలో మార్పులకు కారణం ధ్యానంలో మెట్లు ఎక్కడం కాదు, అనారోగ్య సూచన అని అమెరికాలో ధ్యానం కథలో తెలుస్తుంది. కార్యక్రమం ఏదైనా ఎవరి పని వారిదేనని, భక్తి నటిస్తూ చేసిన మెాసం తెలిపినకథ ఆహా! ఏమి భక్తి. నిర్మాల్యంలో అమూల్యం అంటూ దేవుని అలంకరణకు వినియెాగించిన పూలను తీసివేసేటప్పుడు వాటి మనోభావాలను మనకు వినిపిస్తారు. కాలం మారింది చాలా అంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంగతులను జ్ఞాపకాలుగా మన ముందుకు తెచ్చిన స్వగతంలో 70 ఏళ్ళ జీవితం కనిపిస్తుంది సంపూర్ణంగా. అనుభవాలను కదంబమాలగా పేర్చి కూర్చిన కథల పొత్తంలో ఎన్నో జీవితాల ఆటుపోట్లు, అతివల అంతరంగాలతో పాటుగా, పూల మనోగతాన్ని కూడా చేర్చడం చాలా బావుంది. విద్యాధికురాలు, ఉద్యోగ బాధ్యతలతో పాటుగా కుటుంబ బాధ్యతలను చాకచక్యంగా నెరవేరుస్తూ, ఎందుకు పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తూ, అదే నేర్పు, ఓర్పుతో అతి సుళువైన శైలిలో, అలంకారాలు, ఆర్భాటాలు లేకుండా వర్ణనకు తావీయని కథలు రాయడంలోనూ చేయి తిరిగిన డాక్టర్ లక్ష్మీ రాఘవ మరిన్ని కథలను మనకందించాలని కోరుకుంటూ, చక్కని కథల పొత్తం " స్మార్ట్ జీవితం " కి హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు