శతాబ్దాల సూఫీ కవిత్వం- సమీక్ష - సిరాశ్రీ

centuries sufi kavivam book review

ముకుంద రామారావుగారి పరిశోధనాత్మక రచనలకి సమీక్షలు రాయడం కష్టం. చదివి స్పందన మాత్రమే తెలియజేయగలం. ఎందుకంటే వీరి పరిశోధన ఆ స్థాయిలో ఉంటుంది. వారు చేసిన పరిశోధనకి, సేకరించిన వివరాలకి అబ్బురపడి ఆస్వాదించడం తప్ప మంచి చెడులు చెప్పగలిగే పరిస్థితి సగటు పాఠకుడికి అంత తేలికైతే కాదు.

రామారావుగారు గతంలో నోబెల్ బహుమతి పొందిన రచనల గురించి ఒక గ్రంథం విడుదలజేసారు. వందేళ్లుగా నోబెల్ బహుమతి పొందిన సాహితీ విశేషాల్ని తెలుగులో పరిచయం చేసారన్నమాట. అలా ఇప్పుడు "శతాబ్దాల సూఫీ కవిత్వం" పేరుతో మరొక గ్రంథాన్ని పాఠకలోకానికి అందించారు. ఇందులో ఏముంటుందో టైటిల్లోనే చెప్పబడి ఉంది.

సూఫీ సాహిత్యం గురించి అడప దడపా వినడం, మీర్జా ఘాలిబ్- రూమీ వంటి పేర్లు తారసపడడం, జోధా అక్బర్ లో "ఖ్వాజ జీ.." లాంటి పాటలు వినడం అందరికీ అనుభవంలో ఉన్నవే.

అసలు సూఫీ అంటే ఏమిటి? ఆ పదానికి మూలం ఎక్కడిది? ఈ ప్రశ్నల నుంచి మొదలుపెట్టి అంతఃకరణాన్ని శుభ్రపరిచే అద్భుతమైన సూఫీ సాహిత్యపు లోతుల్లోకి తీసుకువెళ్లారు.

సూఫీలో ప్రేమ, తాదాత్మ్యం, శాంతి, అరిషడ్వర్గాలకి అతీతమైన భావజాలం, తాత్విక స్థితి ఇలాంటివే ఉంటాయి.

కొన్ని మతమౌఢ్యాలని అవహేళన చేస్తూ సత్యాన్ని చూపించే మార్గం కూడా సూఫీ సాహిత్యమే వేసింది.

ఇక ఈ పుస్తకం నుంచి పార్సీ, ఉర్దూ, అరబిక్ భాషలనుంచి తెలుగులోకి రామారావుగారు అనువాదం చేసిన కొన్ని సూఫీ పంక్తులను పరిచయం చేస్తాను:-

మొట్టమొదటిగా క్లుప్తంగా ఉండి భావగాఢతతో ఆకట్టుకున్న పంక్తులు-

"ప్రియతముడి సమక్షంలో
జీవితమంతా
ఒక్క శ్వాస.." (అబూ సయ్యద్ అబుల్ ఖైర్ (967-1049)

నిజమే. ఇష్టమైన వ్యక్తి నిత్యం తోడుంటే జీవితకాలమంతా ఒక చిన్న శ్వాస తీసుకున్నంత తక్కువకాలంలా అనిపిస్తుంది. జీవనభారం ఉండదు. ప్రియురాలో, ప్రియుడో తోడున్నా అంతే. అదే ఆ వ్యక్తి భగవంతుడైతే ఇక చెప్పేదేముంది! అది అనుభంలోకి రావాలి తప్ప, ఊహించుకుంటే అందకపోవచ్చు. ఆ భావనతో తరించినవారు ఎందరో ఉన్నారు.

"నీ నోరు నీ రహస్యం చెప్పలేదు
ఎందుకంటే నీ అస్పష్ట స్వభావాన్ని పదం కొలవలేదు
కానీ ఏదైతే నోరు చెప్పలేదో
దాన్ని చెవి వినగలుగుతుంది.." (ఖ్వాజా అబ్దుల్లా అల్ అన్సారి (1006-1088)

ప్రార్ధనకి పదాలు అవసరమా? మనలో రహస్యంగా ఉన్న కోరికని దైవానికి చెప్పడానికి పదాలు అవసరమా? పదం లేకపోతే ప్రార్ధన చేరాల్సిన చోటుకి చేరదా? స్తోత్రాలు అవసరమా? వీటన్నిటికీ సమాధానం పై నాలుగు పంక్తులు. మనసులో అస్పష్టంగా ఉన్న భావాన్ని కూడా దైవం అనబడే శక్తి స్పష్టంగా వినగలదు.

"సూర్యుడిని సూర్యుడి వెలుగుతోనే చూడగలం"-  ఫరీదుద్దీన్ అత్తార్ (1120-1220)
భగవంతుడూ అంతే. ఎవరూ భగవంతుడిని చూపలేరు. భగవంతుడి వెలుగులోనే భగవంతుడిని చూడగలం. ఈ కవి ఇంకా ఇలా కూడా చెప్పాడు..

"...ఈ ప్రపంచం మూసివేసిన శవపేటిక లాంటిది
...
శవపేటిక మూత తెరవడానికి చావు వచ్చినప్పుడు
రెక్కలుండేవారు శాశ్వతత్వానికి ఎగిరిపోతారు,
లేని వారు శవపేటికలో బంధింపబడతారు;
అంచేత
శవపేటిక మూత తెరిచే లోగా
చేయాల్సింది చేయండి;
దేవుడి దారి తెలిసిన పక్షి కావడానికి
మీ రెక్కల్ని, ఈకల్ని
ధృడం చేసుకోండి".

నాకు నచ్చిన మరొక ఎక్స్ప్రెషన్:

"మొదట్లో నీ ప్రేమ మార్గం
సుళువనుకున్నాను...
....కొన్ని అడుగులు వేసాక తెలిసింది
ఈ మార్గం ఒక సముద్రమని
అయితేనేం..
నేను అడుగుపెడితే
కెరటమొకటి నన్ను ఈడ్చుకుపోయింది" - హమీద్ అల్ అదిన్ కిర్మాని (1238)

ఆధ్యాత్మిక మార్గం, ప్రేమ, భక్తి, దైవ చింతన అనేవి కెరటాలు నిండిన సముద్రం లాంటివే. ఒక్కసారి అడుగుపెట్టి నాలుగడుగులు వేస్తే ఇక వెనక్కి రాలేరు. కెరటాలు లాక్కుపోతాయి అగాధాల్లోకి.

మరొక సూఫీభక్తుడు భగవంతుడికిచ్చిన ఆసక్తికరమైన కానుక చూడండి.

"...నీకో కానుక తెద్దామని
ఎంత వెదికానో...
ఏదీ సరైంది లేదు..
బంగారు గనికి బంగారాన్ని,
సముద్రానికి నీటిని
తీసుకుపోవడంలో అర్థం ఏముంది?
..
అవన్నీ నీలోనే ఉన్నాయి...
అందుకే నీకొక అద్దాన్ని తెచ్చాను;
నిన్ను నువ్వు అందులో చూసుకో
నన్ను నువ్వు గుర్తుంచుకో" - రుమి (1207-1273)
ఈ రూమీ పంక్తుల్లో గడుసుతనం ఉన్నా సత్యం లేకపోలేదు.

ఇక ఇది చూడండి-
"వసంతం ఎర్రని, తెల్లని పూలని చెట్లకు పూయిస్తుంది
కానీ వసతం రంగులేనిది...
రంగులేని మూలానికి పరుగుదీసి దానిలో సంలీనమవు.." - సుల్తాన్ వలాద్ (1240-1312)

సృష్టిని కాదు సృష్టికర్తని ధ్యానించు అనే సూత్రం ఇందులో దాగుంది.

ఇంకా ఇలా ఎన్నో ఆణిముత్యాలు. ఆలోచనల్లోకి నెట్టి మతానికి అతీతమైన నిరకారమైన భగవశ్శక్తి గురించి ఆలోచించే మార్గాన్ని సూఫీ కవులు చూపించారు.

120 పేజీల ఈ పుస్తకం మనసుని కడిగే సూఫీకవితాజలంతో నిండి ఉంది. అసలు సూఫీ ఎక్కడ పుట్టి ఏ మార్గాల్లో ఎలా ప్రయాణించింది? ప్రపంచ సాహిత్యంపై సూఫీ ప్రభావం ఎంత ఉంది? రామారావుగారి పరిశోధనప్రకారం మొట్టమొదటి సూఫీ 7 వ శాతాబ్దం నాటి ఒక మహిళ. ఆమె ఎవరు? ఆమె చెప్పింది ఏమిటి?  1460లో దక్కనీలో వచ్చిన మొదటి సూఫీ కావ్యం సంస్కృతపదాలతో ఎలా ఉంది? ఇలా ఒకటి రెండు కాదు శాతాబ్దాలవారీగా 13 చాప్టర్లుగా విడదీసి, ఆయా శాతాబ్దాల్లోని సూఫీకవులను పరిచయం చేస్తూ, వారి సాహిత్యాన్ని మాత్రమే కాకుండా ప్రతి కవి యొక్క వ్యక్తిగత విషయాలని కూడా సేకరించి ప్రచురించారు. ఇది చాలా శ్రమతో కూడిన పరిశోధన, సేకరణ. సూఫీ కవిత్వం గురించి ఇంత సాఫీగా చెప్పిన ముకుందరామారావుగారికి ఏ ట్రోఫీనైనా ఇవ్వచ్చు.

Contact details of Sri Mukunda Rama Rao- [email protected],
9908347273

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు