రాచపాలెం కవిత్వావరణం - అఖిలాశ

Rachapalem Kavitvavaranam Book Review

కుకవి కంటే కువిమర్శకుడు చేసే సాహిత్య ద్రోహమే ఎక్కువ అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కావున విమర్శ చేస్తున్నవారు తన మన భేదం లేకుండా చేయగలిగినప్పుడే మంచి సాహిత్యం వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కవులు, రచయితలు సరైన మార్గంలో నడవడానికి కారణమే విమర్శకులు. విమర్శే లేకపోతే నేటికి సాహిత్యం నిలబడేది కాదు. విమర్శ ఒక బాధ్యత దానిని సరిగా నిర్వహించకపోతే సాహిత్యానికే కాదు సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. తద్వారా మంచి పుస్తకాలు మరుగున పడి సాహిత్య విలువలు లేని పుస్తకాలు రాజ్యమేలుతాయి. విమర్శ కేవలం తప్పులనే కాదు ఒప్పులను కూడా చూపుతుంది కనుక మంచి పుస్తకం నిలబడుతుంది. నేడు విమర్శ లేదు అనే ఆరోపణ ఒప్పుకోవాల్సిందే కానీ గత నలభై సంవత్సరాలుగా నిర్విరామంగా విమర్శా సాహిత్యంలో కృషి చేస్తూనే ఉన్నారు మన రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. కథ, కవిత్వం, నవల ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలపై వారి పదునైన విమర్శలు చేస్తూనే ఉన్నారు.

రాచపాలెం గారు కవిత్వంపై చేసిన విమర్శలను “రాచపాలెం కవిత్వావరణం” పేరుతో 2018 లో తెలుగు సాహిత్య లోకానికి అందించారు. డాక్టర్ తన్నీరు నాగేంద్ర గారు సంపాదకత్వం వహిస్తే ఆర్. ఆనంద్ కుమార్ గారు ప్రచురణ చేశారు. మొత్తం 19 వ్యాసాలు పుస్తకంలో ఉన్నాయి. అన్నమయ్య దగ్గరి నుండి నేటి ఆధునిక కవి కెరె జగదీశ్ గారి వరకు తన విమర్శను ఎక్కు పెట్టారు రాచపాలెం గారు. ఈ పుస్తకం చదవడం ద్వారా నాటి నుండి నేటి వరకు ఉన్న పూర్తి కవిత్వాన్ని అవగతం చేసుకోవచ్చు. సూపర్ రీడర్ తప్ప మామూలు రీడర్ అయితే అంతమంది కవులను చదవడం కష్టమౌతుంది అందుకే ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల అంతమంది కవుల కవిత్వాన్ని తెలుసుకోవడమే కాకుండా అందులోని తప్పులు కూడా తెలుస్తాయి. తద్వారా కొత్తగా రాసే వారు తప్పులు తాము రాసే సాహిత్యంలో చేయకుండా ఉంటారు. కవిత్వం చదవడమే కాదు కవిత్వంపై వచ్చిన విమర్శ చదివినప్పుడు కవిత్వంపై కొత్త కవులు పట్టు సాధించగలరని నా అభిప్రాయం.

అన్నమయ్య గారి సాహిత్యంపై రాసిన వ్యాసంలో రాచపాలెం గారు “సాహిత్యం సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తుంది” అన్నారు. అంటే కవితా వస్తువు కవులు తమ జీవితంలో నుండి తీసుకున్న కూడా ఆ వస్తువును విమర్శనాత్మకంగా, కళాత్మకంగా రాయకపోతే అలాంటి సాహిత్యం సాహిత్య చరిత్రలో నిలబడదని అర్థం. వస్తువును ఎంచుకోవడంలో దాన్ని కవిత్వంగా మలచడంలో కవి ప్రాపంచిక దృక్పథమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కవి సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటే ఆ విధంగానే వస్తువును కవిత్వంగా మలుస్తాడు. తీసుకున్న వస్తువుపై అవగాహన ఉండటమే కాదు సమాజంలో ఆ వస్తువుకు జరుగుతున్న లాభనష్టాల గురించి పూర్తి విషయ పరిజ్ఞానం ఉండాలి అప్పుడే కవిత్వం నా అనే పదం నుండి మనం అనే పదం మీదుగా అందరూ (సమాజం) పదంపై స్వేఛ్చగా విహరించగలుగుతుంది. ఏ కవికైనా ప్రాపంచిక దృక్పథం లేకపోతే వారు అమాయకులైనా అయ్యుంటారు ఏడ మోసగాళ్ళైనా అయ్యుంటారని అన్నారు రాచపాలెం గారు. అంటే కవిత్వం రాయడం ముఖ్యం కాదు దాని ఉద్దేశం కూడా ముఖ్యమే.

అసలు పదార్ధం, చైతన్యం ఏది ముందు, ఏది వెనుక? ఈ విశ్వాసం ఎలా ఏర్పడింది? దేవుడు తన రూపంలో మనిషిని స్రుష్టించాడా అనే ప్రశ్నలకు ప్రాపంచిక దృక్పథమే సమాధానం అంటారు. వ్యాసంలో చైత్యనం, పదార్థం గురించి చక్కగా విశ్లేషించడం ద్వారా రీడర్ కి సృష్టి, దేవుడు లాంటి విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది. భావ వాదం-భౌతికవాదం గురించి చెప్తూ “భావ వాదానికి పునాది విశ్వాసం/భౌతికవాదానికి పునాది ప్రశ్న అన్నారు”. అంటే విశ్వాసానికి రుజువులు ఉండవు అవసరం కూడా లేదు అవి కేవలం విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. భావ వాదంలో అనేకమంది కట్టు కథలే సాక్షాలుగా చూపిస్తూ ఉంటారు. అలాంటిది కవిత్వంలో ఉంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని నా అభిప్రాయం. ఇక అభ్యుదయవాదానికి ప్రశ్నే పునాది. ఆ ప్రశ్న భక్తి మీద కావచ్చు, రాజ్యం మీద కావచ్చు, దోపిడీ వ్యవస్థ మీద కావచ్చు ప్రశ్నే లేకపోతే నేటి సమాజానికి చాలా సమాధానాలు దొరికేవి కాదు.

తెలుగు సాహిత్యానికి 850 యేళ్ళ సాహిత్య లిఖిత చరిత్ర ఉందని అందులో 150 ఏళ్ళు ఆధునిక సాహిత్యానికి చెందుతుంది. నాటి తరం కవులంతా భావవాద ప్రాపంచిక దృక్పథం కలవారేనని వేమన మాత్రం భౌతికవాద ప్రాపంచిక దృక్పథం కలవారని రాచపాలెం గారు అభిప్రాయపడ్డారు. పాత తరం కవులను రెండు రాకులుగా విభజించుకొంటే ఒకటి ఆస్థాన కవులైతే మరొకరు ఆస్థానేతర కవులు. రాజుల అజ్ఞానుసారంగ సాహిత్యాన్ని రాసినవారు భౌతికవాదం వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉండదు. రాజులను పొగడటానికే సరిపోతుంది. అందుకే అలాంటి కవులు ఎక్కువగా ఉండటం చేతనే రాజుల తప్పుడు పనులు, బీద ప్రజల అణచివేత, వివక్ష, కులమత తారతమ్యాల విషయంలో మార్పు రాలేదు. ఆధునిక సాహిత్యం వచ్చిన తర్వాతే ప్రశ్నలు పుట్టుకు వచ్చాయి. భౌతికవాద కవుల్లో జాషువా గారు బలమైన గొంతును వినిపించారు. ఆధునిక కవుల్లో శ్రీశ్రీ గారు దానిని కొనసాగించారు.

15వ శతాబ్దంలోనే అన్నమయ్య గారు “బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే” అన్నారు దీని అర్థం అప్పటికే హిందువులు అనేకమంది దేవుళ్ల పేరుతో విడిపోతున్నారు కనుక అలా అనవలసి వచ్చింది అంటారు రాచపాలెం గారు. నిజానికి ఈ సమస్య నేటికి ముదిరింది నేడు ముక్కోటి మంది దేవుళ్లు కాదు అంతకు మించే ఉన్నారు. అయినా దేవుళ్లు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదు అందరూ సమానమేనని అందరూ ఒక్కటేనని అంగీకరించడం లేదు కదా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాదులాడుకుంటున్నారు తద్వారా మనిషి కులాలుగా, మతాలుగా మాత్రమే కాదు భక్తులుగా కూడా విడిపోయారు. అలాగే 1910లో గురజాడ “దేశమును ప్రేమించుమన్నా” అన్నారు దానికి అర్థం అప్పటికీ ప్రజలకు దేశభక్తి లేడని రాచపాలెం గారు అభిప్రాయపడ్డారు. దేశాన్ని ప్రేమించడమంటే క్రికెట్ లో ఇండియా ఓడిపోయిందని బాధపడటం కాదు. దేశం కోసం ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మనం ఏ విధంగా ఉపయోగపడ్డామనేదే ముఖ్యం. చివరిగా అన్నమయ్య గారు సంస్కరణాత్మక  భావ వాద కవి అని తేల్చేశారు. దానికి కారణం భావ వాది అయినప్పటికీ సామాజిక దృక్పథం ఉండి సమాజాన్ని చైతన్యం చేసే రచనలు చేయడమే.

శిల్పాలు తయారు చేసేది దళిత బహు జనులు అవి ప్రతిష్ట అయిన తర్వాత పురోహితుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతాయి. ఇదే విషయాలను వేమన, గురజాడ, జాషువా ప్రశ్నించారని కత్తి పద్మారావు గారి కవిత్వంపై రాసిన వ్యాసంలో వివరించారు. శ్రామిక వర్గాన్ని దోపిడీ వర్గం అనేక రకాలుగా దోచుకోవడమే కాదు వివక్షకు గురి చేస్తూ వచ్చింది. తాను ఉత్పత్తి చేసిన వస్తువుపై హక్కు లేకుండా చేసి తన పబ్బం గడిపింది. ఇప్పుడు అది సాధ్యపడదు. దళిత బహుజనులైన కవులు వాటిని వేలెత్తి చూపడమే కాకుండా మార్పు వచ్చే వరకు పోరాడుతున్నారు కూడా. సాహిత్య విషయంలో దళిత బహుజనులకి జరిగిన వివక్షపై దళిత బహుజన కవులు తమ కలాలను ఝుళిపించి విషయాలను సాహిత్య చరిత్రలో పొందుపరుస్తున్నారు. రికార్డు చేయడమే కాదు పోరాటంతోనే ఇలాంటి వివక్ష నుండి బయటపడతామని గట్టిగా నినదిస్తున్నారు. కుల రహిత సమాజం వచ్చినప్పుడే మనిషి మనుగడ సాఫీగా సాగుతుందని నా అభిప్రాయం.

“వస్తువు ఎంత బలంగా ఉంటుందో దానిని అభివ్యక్తం చేసే రూపం కూడా అంతే బలంగా ఉండాలి”. వస్తువుకు సృజనాత్మక అభివ్యక్తే కదా కవిత్వమని అన్నారు రాచపాలెం గారు. నేటి కవులకు ఒక మెత్తన్ని దెబ్బ ఈ వాక్యం. కవిత్వ వస్తువు విషయంలో ఎక్కువ వస్తు వైవిధ్యం వచ్చింది కానీ వస్తువును కవిత్వంగా మలచడంలో చాలామంది విఫలమౌతున్నారు. కవిత్వం రాయడం మాత్రమే కాదు వస్తువును కవిత్వంగా మలిచే నైపుణ్యం ఉన్నవారే కవిగా నిలబడగలరు. అలా అని అర్థం పర్థం లేని అసహజ దృశ్యాలు కవితలో చొప్పించకూడదు. చాలామంది నేడు పేపర్ పై పెన్ను పెడుతూనే కవిత్వం వస్తుంది అంటారు దీనిని అంగీకరించలేము అలాంటి కవిత్వం నిలబడదు కూడా. కవిత్వం రాయడానికి సంఘటన ప్రేరేపించాలి, వస్తువును మెదడులో మదించాలి అప్పుడే కవిత్వం ధారగా కురుస్తుంది.

“కవి ప్రపంచ బాధపై కవిత్వం రాస్తున్నప్పుడు ప్రపంచేతర శక్తుల జోలికి పోకూడదు అన్నారు.” దీని అర్థం భౌతిక సమస్యలపై పోరాడే కవులు విశ్వాసాలపై ఆధారపడిన శక్తులపై కానీ, ఆ శక్తులను పొగడటం కానీ మంచిది కాదని అర్థం. అందుకే ఈ విషయంలో కవి తన స్టాండు ప్రకటించాలి తను ఎటువైపు ఉన్నడో తనకే తెలియకపోతే తన కవిత్వాన్ని చదివేవారు కవిని కాని తన కవిత్వాన్ని కాని అర్థం చేసుకోలేరు. కవిత్వం రాయడానికి పేపర్, పెన్ను మాత్రమే కాదు తీసుకున్న వస్తువుకు న్యాయం చేయాలి. న్యాయం చేసే విషయంలో వ్యక్తిగత ఆలోచనలు, విశ్వాసాలు కవిత్వంపై పడకూడదు ఒకవేళ వస్తువుపై ఆలోచన పాజిటివ్ గా ఉండి కవిత్వం నెగిటివ్ గా రాస్తే తనని తాను మోసం చేసుకున్నట్టే. అలాగే వస్తువు గురించి నిజాలను నిక్కచ్చిగా తెలియపరచాలి అప్పుడే కవిత్వం నిలబడుతుంది.

అసమానత్వం, వివక్ష అనే సమాజ సర్పాన్ని చంపడానికి పుట్ట మీద కొట్టడం కాదు పుట్టను తవ్వి పడేయాలి అనేది వేమన సిద్ధాంతమని రాచపాలెం గారు చెప్పడం జరిగింది. దీని అర్థం సమస్య ఉన్న చోట కేవలం సాహిత్య దెబ్బలు వేస్తే తప్పదు. అక్షరాలతో దాడి చేయాలి, పదాలతో ధ్వంసం చేయాలి. కవిత్వ వాక్యాలతో సమస్యను సమూలంగా పెరికి పడేయాలని అర్థం. అలాంటి కవులు మాత్రమే సాహిత్య చరిత్రలో నిలబడగలరు. “కవి నివసించే ప్రాంత ప్రకృతి కవిత్వంలోకి జొరబడక తప్పదు” అవును రాయలసీమ కవులు కరువు గురించి రాస్తే, ఉత్తరాంధ్ర కవులు నీటి గురించి ఎక్కువగా రాస్తారు. నా ఉద్దేశంలో ఇది కొంతవరకు సబబే కనీ ప్రతి వస్తువులోని ప్రాంత పదజాలం వస్తే కవిత్వం నిలబడదు. ప్రపంచ వస్తువును కవిత్వంగా చేసేటప్పుడు ప్రపంచ కవితా భాషలోనే కవిత్వం ఉంటే కవిత్వం విస్తృతి పొందుతుంది.

“వస్తువు మూలం మాత్రమే కాకుండా దాని చరిత్ర కూడా తెలియాలి. ఆ చరిత్రను కవితలో కరిగించాలి. వస్తువు నినాదం కాకుండా జాగ్రత్తపడాలి.” నేటి కవులు ఈ వాక్యాన్ని భద్రంగా దాచుకోవాలి. సంఘటనాత్మక కవిత్వం పలుచబడి పోతోంది. సంఘటన అనుభవించి రాయడం వేరు సంఘటనను తెలుసుకొని అప్పటికప్పుడు రాసే కవిత్వంలో గాఢత ఉండదు. ఉదాహరణకు ఇస్రో రాకెట్ లాంచ్ విజయవంతం అయ్యిందని నేను ఒక కవిత రాశాను. అది మరుసటి రోజే అచ్చు అయ్యింది కానీ ఆ మరుసటి రోజు ఆ ప్రయోగం విఫలం అయ్యిందని పత్రికలో చదివాను మరి నా కవిత సాహిత్యంలో ఎలా నిలబడుతుంది. అందుకే నిజానిజాలు తెలుసుకొని వస్తువుపై పూర్తి అవగాహనతో మాత్రమే కవిత్వం రాయాలి. ఒక యువ కవిగా ఇలాంటి ఎన్నో విషయాలను రాచపాలెం గారి విమర్శనాత్మక వ్యాసాల్లో చదివి నేర్చుకున్నాను అందుకే నేడు ఆచి తూచి అవగాహనతో కవిత్వాన్ని రాస్తున్న. 

“వాస్తవికత నుండి స్వప్నంలోకి ప్రయాణమే కవిత్వం.” ఉన్నది వాస్తవికత ఉండవలసినది స్వప్నం అంటారు రాచపాలెం గారు. అంటే ప్రతి కవికి ఒక స్వప్నం ఉండాలి. ఆ స్వప్నం సాకారం కోసమే తన సాహిత్య మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఇలా అనేక విషయాలను విమర్శనాత్మకంగా యువ కవులకు కోసం అందించిన అరుదైన పుస్తకం. ఈ పుస్తకాన్ని యువ కవులు తప్పకుండా చదవాలి. తన విమర్శ ద్వారా మాలాంటి యువ కవులను సరైన మార్గంలో పెడుతున్న రాచపాలెం గారి పాద కుసుమాలకు వందనాలు తెలుపుతున్నాను.

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు