గగనమంత తలలో - పుస్తక సమీక్ష - అఖిలాశ

Gaganamantha Thalalo Book Review

అక్కడ వ్యవస్థ ఉంటే ఏంటి? గదిలోని గగనమంత తల పుస్తకాలపై చూపులను, చూపులతో పాటు హృదయాన్ని ఆవిష్కరణ చేస్తోంది. అవి కన్నీళ్ళో, చెమట నీరో తెలియదు కష్టం మాత్రం తేలియాడుతుంది. ఒక వాక్యం చదివి మరో వాక్యం చదవడానికి సన్నధం అయ్యేలోపే ఎక్కడో ఊపిరి పగిలి ఆత్మహత్య చేసుకుంటుంది. రొమ్ముపై సముద్రాన్ని మోసేవారికి నదులను కలపడం అతి తేలికైన పని. గుత్తులు గుత్తులుగా అక్షరాలను పువ్వుల్ లానో, కత్తుల్ లానో, రాసిన వారే మహోన్నతమైనవారు. శరీరంలో గుచ్చిన ముల్లుల నుండి తేనె సేకరించే వారు జీవితాన్ని జయిస్తారు. పద్యాలు పద్యాలుగా జీవితాన్ని అనుభవిస్తారు. ఆనందమైన, దుఃఖమైన అక్షరీకరించిన కవితా శిఖరానికి కోటానుకోట్ల పాదాభివందనాలు. ఈ తీరం నుండి అవతలి తీరానికి వెళ్ళిన వాడు గొప్ప కాదు అవతలి వైపుకు పుస్తకాన్ని చేర్చినవారు మహోత్తములు. జీవితం నుండి కవిత్వంలోకి కవిత్వం నుండి జీవితంలోకి అక్షరాలు అక్షరాలుగా ప్రయాణం చేసిన శివారెడ్డి గారి కరపద్మలకి సాష్టాంగనమస్కారములు.

మహా అయితే ఏం చేస్తారు? ఒక అవమానాన్ని పరిచయం చేస్తారు. ఒక దుఃఖాన్ని మనముందు పడేస్తారు. సమస్త కష్టాన్ని నింపుకున్నావారు దుఃఖాన్ని కూడా విలీనం చేసుకుంటారు. గాయపరిచానని మీరు ఆనందపడతారు ఒక అనుభవాన్ని అనుభవించేలా చేసినోడికి వందనాలు సమర్పించండి. పైపైకి తేలియాడే క్షణికమైన ఆనందం కంటే నిత్యం మనతో స్నేహం చేసే కష్టమే బాగుంటుంది. అయినా హృదయమున్నోడిని కాకుండా ఎవరినైనా ఎలా గాయపరచగలరు.    స్పర్శ లేనోడికి అనుభూతుల స్మృతులు ఎలా హత్తుకోగలవు?శివారెడ్డి గారు పైపైన ఏదీ రూచిగా ఉండదు ఏదైనా లోతుగా దిగితే తప్ప అంటారు. దుఃఖమైన, ఆనందమైన వాటి లోతులు చూస్తేనే కదా జీవితంలో అనుభవాలు ఘటనలు ఘటనలుగా మిగిలిపోయేది. నిర్భయంగానో, నిస్సందేహంగానో ఉండేవారు స్పటికంలాంటి వారైయుంటారు. మలుపులు, ఒడిదుడుకులు ఉంటేనే పద్యం పచ్చ పచ్చగా ఎగురుతుంది.

ఎవడి లోకంలో వాడు ఉంటే! ఎవడి అన్నం వాడు తింటే! ఎవడి నిద్ర వాడు నిద్రపోతే! సమాజం ఎలా కొనసాగుతుంది. అప్పుడుడప్పుడు వేరేవారి లోకంలో జీవించాలి వారి లోకంలో ప్రవేశించి అడవినో కనీసం ఒక తీగానో నాటితే వారి లోకం కూడా సస్యశ్యామలమౌతుంది. మన కడుపులో జారాల్సిన నాలుగు మెతుకుల్లో కనీసం రెండు మెతుకులను ఎదుటివారి కళ్ళలో పోస్తే ఆకలనే పదం మరణిస్తుంది. అయినా వాడికోసం వాడు బ్రతకడమంటే శ్మాశానంలో జీవించినట్టే. మన పిచ్చి కాని ఎవరి లోకంలో వారు పూర్తిగా బతకలేనివారు, వారిగురించి వారికే పూర్తిగా తెలియని వారు, వారి శరీరాన్ని సంపూర్తిగా చూసుకోనివారు వేరొకరిని ఎలా చూడగలరు. అందుకే ముందు మీ కోసం కాస్త సమయాన్ని వెచించండి. మీ గురించి మీరు అలోచిచండి మిమ్ములను మీరు గుర్తించండి తర్వాత కాస్త సమయాన్ని మీ పక్కనున్నవారికో, ఆ పక్కనున్నవారికో సహాయంగా నిలబడితే జీవితం పరిపూర్ణం అవుతుంది. “ఎవడి లోకంలో” కవితలో “శివారెడ్డి గారు చెప్పిన ఒక వాక్యం నన్ను హత్తుకుపోయింది. ఎక్కడ తిరిగిన ఏ గుర్రమెక్కి బయలుచేరినా చివరికి మొదలైన చోటే ముగింపు.

వాళ్ళ భాష తరతరాలుగా ఉంది. అర్థంకాని భాషగానే మిగిలిపోయింది. ముసలి తల్లి, మూగభాష అర్థం చేసుకున్న వారెందరు? నీటి కోసం తవ్వుకున్న గుంతలోనే మరణం రక్తం రక్తంగా ఉబికి ఉబికి వస్తున్న మరణభాషను ఎలా అర్థం చేసుకోగలరు? చివరిసరిగా శ్వాస తీసుకొని కాలపు అవతలి అంచుకు చేరేవారి భాషను ఎలా అర్థం చేసుకోగలరు? అసలు మరణానికి భాష ఉందా అని వివిధ స్థితులలో మనం పడే భాధలను ప్రస్తావిస్తే సాగిన “మరణ వాంగ్మూలం” కవిత అర్ధతతో నిండి మనసుకు కకావికలం చేస్తుంది.

ఎవరికైనా మనం ఎందుకు లొంగిపోవాలి? మన తలను వేరొకరి చేతిలో ఎందుకు పెట్టాలి. మనలో అంతర్యుద్ధం జరుగుతుందో కల్లోలం జరుగుతుందో, మంట రాజేసుకుంటుందో ఏదైనా కాని వస్తే రాని అన్నింటికీ ఎదురొడ్డి నిలబడాలి. ఎక్కడ ఎవరికీ లొంగిపోవకండి అనే తెలిపే కవితే “నిలబడు”. అంతే కదా నిలబడి సమస్యలను పరిష్కారం చేసుకోవాలి కాని ఎవరో ఎదో అంటున్నారని మన తప్పు లేకున్నా వేరొకరికి లొంగిపోకూడదు. వెల్లకిలా పడకుండా నిలబడి జీవన ప్రయాణాన్ని కొనసాగించండి అలాచేయడమే మానవ స్వభావం అంటారు శివారెడ్డి గారు.

పెరగడమంటే దశలు దాటుతూ రావడం కాదు పెరగడమంటే నేర్చుకోవడమే, అవును కేవలం శరీరం పెరిగితే ప్రయోజనం ఏముంటుంది? మన పెరుగుదలలో ఎన్ని నేర్చుకున్నాము? ఏమి నేర్చుకున్నాము? నేర్చుకున్నా దాని నుండి ఎలా నడుచుకుంటున్నాము. మన నడవడికతో ఎందరికి ఉపయోగపడుతున్నాము? మనవల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో లేదో చూడనివారు దుర్మార్గులు. ఇంకో వాక్యంలో ఇలా అంటారు వాళ్ళు చూస్తారు నువ్వూ చూస్తావు కాని వారిచూపులో లోతు ఉంటుంది. ఇక్కడ చూడటమంటే ఏదైనా విశాలంగా ఆలోచించమని, విస్తృతంగా ఆలోచించమని చూపుల్లో పచ్చని మొక్కలు నాటి జీవించమని. అవును కదా మన చూపులోనే ఏదైనా ఉంటుంది. మంచిని చేడుగా భావించిన, చెడును మంచిగా భావించిన అన్ని మనలోనే మన చూపులోనే కాదు కాదు మన మనసులోనే ఇమిడి ఉన్నాయి. అందుకే చూసేటప్పుడు కళ్ళతోపాటు గుండెను కూడా శుభ్రం చేసుకోండని చెప్పడమే “శివారెడ్డి గారి ఆలోచన.

మన వెనుక నాలుకలు మాట్లాడుకుంటాయి. మన నీడల్ని కూడా అనుసరించే వారుంటారు వారి కోసం మీరు ఒక్కసారి కూడా వెనుదిరిగి చూడకండి. వారిని మీ వెనకమాల అనుసరించని ఏమౌతుంది? ఎదో ఒక క్షణంలోనో, ఒక సందర్భంలోనో వారు మారే అవకాశముంటుంది. అందుకే మీ వెనుకే అనుసరించనివ్వండి అవసరమైతే వారికి మీ కళ్ళు కూడా ఇస్తే మరింత బాగా అనుసరిస్తారు. ఎవరైనా మిమ్ములను అనుసరిస్తున్నారా? అయితే మీరు విజయానికి దగ్గరిలో ఉన్నట్లే అని అర్థం చేసుకోండి. అయినా వారేం చేస్తారు? నీ గురించి నాలుగు పాచి మాటలు మాట్లాడుతారు లేదా నీ వ్యక్తిత్వాన్ని హరించే నలుగు చెత్త దృశ్యాలు నువ్వు జన్మించినప్పటివి చూపించి నవ్వుకుంటారు అంతే కదా! పోనీ వారు అలానే ఉంటారు. నువ్వు మాత్రం అడుగులు అడుగులుగానో, ఎత్తులు ఎత్తులుగానో ఎదుగుతావు అదే విజయం అవుతుంది. ఎవరైనా మిమ్ములనో, మీ నీడనో అనుసరిస్తుంటే ఒక చల్లని నవ్వు విసిరి ముందుకు సాగిపోండి.

వారు తప్పు చేశారు! చేసింది పెద్ద తప్పో చిన్న తప్పో ఆలోచించే సమయం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక చివరి అవకాశం చివరిక్షణంలో ఇవ్వకపోతే ఎలా? వారితోపాటు ఒక కప్పు కాఫీ తాగి జీవితపు విలువను వారికి  తెలియపరచకపొతే ఎలా? జీవించడం ఎలా అని అప్పుడైనా నేర్పకపోతే ఎలా? అందుకే ఒక్కోసారి మనం వారికి అవకాశం ఇవ్వాల్సిందే. కాస్త కరుణ చూపండి లేదంటే వారు మరణిస్తారు వారి ముందు వారే నిలబడే స్థితిలో లేనప్పుడు మన మీద వారిని నిలబెట్టుకోవాలి అలా చేసిన వారే చరిత్రలో కాకపోయిన మనుషుల్లో జీవిస్తారు. ఒక్కోసారి అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. మీ జీవితం మీకు సంబంధం లేనట్టు, మీ జీవితంలో మీరు లేన్నట్టు అనిపిస్తుంది. కొన్ని రోజులను అలా వదిలేయాల్సి వస్తుంది. వదిలేయండి పర్వాలేదు అది మంచిదైతే తర్వత వచ్చే రోజుల్లో ఒక అద్దం మెరుస్తుంది. అందులోని ప్రతిమ మనకు సమాధానంగా తోస్తుంది. అప్పుడప్పడు మీరు తప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటి తప్పుకోండి కొత్త రక్తం ఉత్పత్తి చేయడంలో మీ పాత్రను నిర్దేశించుకొని పనిచేయండి. వారే మిమ్ములను మరో తరానికి నడిపిస్తారు.

ఎక్కడున్న మన స్థలంలోకి మనం రావాలనే ఉంటుంది. అక్కడేమో బంగారు రాలుతున్నా కానీ మన ఇంటి గోడలకు అతుక్కొనున్న మట్టిపెల్లలే గుర్తొస్తాయి. ఏదైనా నువ్వు స్వతంత్రంగా చేయాలంటే నువ్వు నిర్మించుకున్న స్థలం కావాలేమో! ఎక్కడైనా ఏదైనా మన స్థలంలో చేసినట్లు వేరేచోట చేయలేము. దానినే “శివారెడ్డి గారు ఒక కవితలో ఇలా అంటారు మన గదిలో ఉన్నప్పుడే మన గుండె చప్పుడు వినే అవకాశం దొరుకుతుందని.

మరో కవితలో మనిషిలో పెరిగిపోతున్న ఆశ గురించి చెప్తూ నువ్వు నదిని ముట్టుకుంటే అది రెండుగా విరిగిపోతోంది అంటారు. ఆ వాక్యం వెనుకున్న ఉద్దేశం ముందు మనిషి ఏది పట్టుకున్నా అది అభివృద్ధి అయ్యేది. నేడు మనిషి ఏది చేసిన స్వార్థంతో చేస్తున్నాడు దానివల్ల ప్రతిదీ నాశనమౌతోంది. ఎప్పుడైతే మనిషిలో “నా” అనే పదం ముందుకు వచ్చిందో అప్పటి నుండి సర్వం నాశనం అయ్యిందని మనుషుల గురించి రాసిన కవితే అతడలానే.

ఎవరైనా వారి స్వభావం మార్చుకుంటున్న దశలో చేతనైతే వారికి కాస్త చేయూత అందించండి. వారు మారుతున్న దశలో  నీవు అదని, నీవు అలానే చేయగలవని, నీవు ఎవరి చెప్పులోనో నీ పాదాలు పెట్టుకొని తిరిగుతున్నావని చెప్పడం ఎందుకు? వీలైతే తప్పును చెప్పి మార్చే ప్రయత్నం చేయవచ్చు కదా! ఎందుకు వారిని తుంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారిని నిందిస్తే మీ కంట్లో కదిలే నవ్వు చూసి వికారంగా ఉంటుంది. నా జాగా, నా అడ్డా అనుకున్నవాడు పరమపిచ్చోడు. పనికిరాని గతం గురించి మాట్లాడేవాడు భవిష్యత్ గురించి ఏమని మాట్లాడగలడు? ఒకరి స్వేచ్ఛని అరికాళ్ళలో పెట్టుకోవడానికి నీకు హక్కు ఏముంది? వదిలేయండి వారిని స్వేచ్ఛగా వదిలేయండి వారి నడక వారిని నడవనివ్వండి వారి తిండి వారిని తిననివ్వండి. మీ నుండి స్వేచ్ఛ తప్ప ఎవరు ఏదీ ఆశించడం లేదు దానికి బదులుగా మీరు ఏదీ ఇవ్వకండి తీసుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

ఏడుపు గురించి ఒక కవితలో చెప్తూ ఏడుపు మరణానికి పర్యాపదం అంటారు. అవును ఏదైనా చేయలేనని ఏడ్చేవారు మరణించిన వారితో సమానమే. శరీరంపై కాలాన్ని కప్పుకొనో లేదా కాలాన్ని కోసుకుతినడమో చేసేవారు ఎలా ఉపయోగపడుతారు. వారి శరీరం మోత్తం కుప్పలా పడుకోబెట్టినా వారిని ఎవరు నిలబెట్టగలరు? నిలబెట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా ఎంతసేపు నిలబెట్టగలరు? వారికి అంతర్ హృదయంలో నిలబడాలి అనే కోరిక లేకపోతే ఎవరైనా ఏమి చేయగలరు? గట్టిగా కేకలు వేస్తే పడుకున్న వారు లేస్తారేమో! పడుకున్నట్టు నటించేవారు ఎలా లేవగలరు? కాని అప్పుడప్పుడు వారి చెవుల్లో నాలుగు ఆత్మీయ వాక్యాలో, నిప్పులు పూసిన ఉత్తేజపు వాక్యాల్లో నింపితే మార్చు వస్తుంది. అది నమ్మకం కాదు కాదు ఆశ అనంతమైన మంచి ఆశ.

గగనమంత తలలో అనంతమైన కవిత్వం ఈ పుస్తకం. మొదటి వాక్యం నుండి చివరి వాక్యం వరకు ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇందులో మానవ సంస్కృతి ఉంది. చరిత్ర నిర్మాణం తెలుస్తుంది. ఒక ప్రశ్న మన ముందు కదులుతుంది అంతలోనే పరిష్కారం అటువైపుగా వెళ్తూ కనపడుతుంది. పుస్తక శీర్షికతో ఉన్న కవితలో కవి గురించి రాసిన ఆ పది వాక్యాలు ఎప్పటికీ ప్రతి కవి హృదయంలో మెదులుతూనే ఉంటాయి. ఆ స్పూర్తిని స్వీకరించి ఆయన బాటలో నడిచేవారు సముద్రమంత ఆయన కవిత్వంలో సముద్రంలోని చివరి బిందువునైన అందుకోగలము. కవితకి పర్యాపదం శివారెడ్డి గారు ఆ విధంగా ఎదిగిన వారి పాదాలకు నా అక్షర వందనాలు సమర్పిస్తూ...

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు