రాతి కెరటాలు - పుస్తక సమీక్ష - అఖిలాశ

Rathi Keratalu Book Review

ఊసుపోక రాసుకునేది కవిత్వం అంటే ఒప్పుకునేది లేదు. ఏ కవి పొద్దుపోక కవిత్వం రాసుకోడు. కవిత్వం రాసేవారు రెండు రకాలుగా విభజించుకొంటే 1.తన బాధల నుండి కాస్త విరామం కోసం రాసేవారు కొంద రైతే 2. సమాజం కోసం రాసేవారు మరికొందరు. మొదటి రకం వారు నెమ్మదిగా రెండో రకం కవులుగా మారిపోతారు. అలా మారినప్పుడే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడతారు. కవిత్వం మొదట ఇంటి నుండి మొదలౌతుంది. వ్యక్తిగత జీవితంలో, ఇంట్లో పరిస్థితులు కవిత్వం రాయడానికి ప్రేరేపిస్తాయి. ఎక్కువగా సమస్యల్లో ఉన్నవారే కవిత్వం రాస్తూ ఉంటారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు అక్షర రూపంగా మారుస్తూ మొదలయ్యే కవిత్వ ప్రయాణం. తమ బాధ నుండి సమాజ బాధ వైపుకు అడుగులు వేస్తుంది. వ్యక్తిగత వస్తువు నుండి పరిసర వస్తువు స్థాయికి చేరుతుంది. ఆ తర్వాత విస్తృతం అవుతూ వీధి, ఊరు, రాష్ట్రం, దేశం, ప్రపంచం, విశ్వం ఇలా వస్తు విస్తృతి పెరుగుతూ కవిత్వ బాధ్యతగా తీసుకుంటారు. ఇదొక ప్రాసెస్ లాంటిది కొంతమంది కవులు దశాబ్దాలుగా కవిత్వాన్ని రాసిన వారి వస్తు విస్తృతిని కానీ, కవిత్వ గాఢత కానీ పెరగదు. అది వారి అధ్యయన లోపమే.

కవుల ఆలోచన విధానం లోతుగా ఉండాలి. జరిగిన సంఘటనను ఎన్నో విధాలుగా ఆలోచించి అందులోని వాస్తవం ఎంత? ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోవాలి సంఘటనను విశ్లేషణ చేసుకోవాలి. వాస్తవాలను గ్రహించాలి అప్పుడే ఆ సంఘటనపై కవిత్వాన్ని రాయాలి. అలా కాకుండా రోజుకు పది కవితలు, ఇరవై కవితలు రాస్తే లాభం ఉండదు. రాయడం తప్పు కాదు అలా రాయాలంటే అంతటి పరిజ్ఞానం ఉండాలి మరియు కవిత్వంలో గాఢత తగ్గకుండా చూసుకోవాలి. ఎన్ని కవితలు రాశాము అనేది ముఖ్యం కాదు ఎంత ప్రభావితం చేసే కవిత్వం రాస్తున్నాము అనేదే ముఖ్యం. ఈ విషయాలు కొత్తగా కవిత్వం వైపు అడుగులు వేస్తున్న వారికి తెలియక పోవచ్చు. కవిత్వం ఇలా రాయాలని చెప్పకపోయినా పర్వాలేదు ఇలా రాయకూడదని చెప్పే వారు కావాలి. అలా చెప్పేవారు తండ్రి స్థానంలో ఉండాలి కానీ విమర్శకుడి స్థానంలో కాదు. విమర్శ కాస్త సాహిత్యంలో ఆరితేరిన వారిపై ప్రయోగిస్తే సరిపోతుంది. కొత్తగా రాసేవారిపై విమర్శ కాకుండా విశ్లేషణ ఇవ్వాలి.

ఎవరూ ఏది చెప్పకపోయినా పర్వాలేదు. కొత్తగా కవిత్వం రాసేవారు మన పూర్వ కవుల కవిత్వాన్ని, సహచర కవిత్వాన్ని, కవిత్వంపై వచ్చిన విమర్శను చదవడం, చదివిన తర్వాత పుస్తకంపై అభిప్రాయాన్ని రాసుకోవడం లాంటివి చేసుకుంటే తప్పకుండా మంచి కవిత్వాన్ని అందించగలరు. ఇప్పటికే 25 కవిత్వ సంకలనాలు ముద్రించిన డా.ఎన్.గోపి గారు గత నలభై సంవత్సరాలుగా కవిత్వాన్ని రాస్తున్నారు. ఎంతో మంది కవులకు మార్గ నిర్దేశం చేశారు, చేస్తున్నారు. యువ కవులను ప్రోత్సహిస్తున్నారు. దాని కోసం వారి ఇంట్లోనే 16,000 పుస్తకాలతో గ్రంథాలయాన్ని నిర్మించారు. పరిశోధకుల కోసం ఒక గది కూడా ఏర్పాటు చేశారు. అక్కడే ఉండి పుస్తకాలు చదువుతూ పరిశోధన పూర్తి చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇదే కదా నేటి కవులకు, సాహిత్య పరిశోధకులకు కావాల్సింది. గోపి గారు కవిత్వాన్ని రాయడం మాత్రమే కాదు సాహిత్యాన్ని వారి భుజాలపై మోస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాతి కెరటాలు శీర్షికతో 2011 కవితా సంపుటిని విడుదల చేశారు. 80 పుటలు ఉన్న పుస్తకంలో మొత్తం 44 కవితలు ఉన్నాయి.

కాంతి శీర్షికతో రాసిన కవితలో “పొగలు కక్కే అన్నాన్ని చూస్తే అనిపించింది ముత్యాలకంటే బియ్యం ఎంత అందమైనవో” అన్నారు. వాస్తవానికి అన్నం అందమైనదే కాదు ఆకలిని తీర్చే నైవేద్యం కూడా. ముత్యాలు అలంకరణకు తప్ప ఎందుకు ఉపయోగపడతాయి. ఎన్ని ముత్యాలుంటే ఏం లాభం లేదు. అన్నపు మెతుకులకు విలువ మనిషి గ్రహించాలి. చెమట చుక్కల్ని చూస్తే అనిపించింది శ్రమ సౌందర్యం ముందు నింగి లోని చుక్కలు ఎంత కాంతి హీనమూ అన్నారు. గోపి గారి కవిత్వం తంగేడు పూలు నుండి వృద్దోపనిషత్ వరకు పూర్తిగా కార్మిక పక్షమే నిలబడింది. చెమట దుర్వాసన కాదు. కష్టానికి ప్రతిఫలం. అలాంటి చెమట ఆకాశంలోని చుక్కలతో ఎలా సమానం అవుతాయి. ఏసీ గదుల్లో చెమట అనే పేరే తెలియకుండా పెరిగేవారికి ఎలా తెలుస్తుంది చెమట గొప్పదనం గురించి. ఆనాడే శ్రీశ్రీ గారు రాజ సింహాసనం గొప్ప కాదు దాన్ని నిర్మించిన వారే గొప్ప అన్నారు. కార్మికుడి పట్ల ఆది నుండి వివక్ష జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు అది జరగకూడదు అంటే కవులు, సాహిత్యవేత్తలు కార్మికుల పక్షాన నిలబడాల్సిందే.

ఇప్పుడంటే కాలింగ్ బెల్ వచ్చింది కానీ అప్పట్లో తలుపు దగ్గర అడుగుల చప్పుడుకే నాన్న వచ్చేది తెలిసేదాని తలుపు తీసిన చప్పుడులో అది అమ్మ తీసిందో, అక్క తీసిందో తెలిసిపోయేదాని అన్నారు. గోపి గారు ఈ వాక్య చేయడానికి గల కారణం బలీయ మౌతున్న బంధాలను ఎత్తి చూపడమే. మన ఇంట్లో ఉన్న నలు గురికి ఏది ఇష్టమో, ఏది ఇష్టం లేదో కూడా తెలియకుండా జీవిస్తున్నారు. నాన్న అడుగుల చప్పుడు కోసం ఎదురుచూసే కాలం నాటిదైతే నాన్న ఇంటికి రాక ముందే పిల్లలు పడుకుంటున్న దుస్థితి నేడు.  అలాగే మరో కవితలో నిన్నటి మాటలు ఇంత వేడిగా ఉండేవి కాదు ఇప్పుడు ఎందుకున్నాయని అభిప్రాయపడ్డారు. దానికి కారణం నెమ్మదితనం లేకపోవడం, ఆలోచన రాహిత్యం, మంచి చెడుల విశ్లేషణలు చేసుకోకపోవడం, ఆవేశం, స్వార్థం, అత్యాశ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి గుణాలను వదిలేసి చెడు గుణాలను నెత్తిన పెట్టుకొని తిరగడమే. నీళ్ల సీసపై కవిత్వాన్ని రాసిన గోపి గారు వారి వస్తు వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నీళ్ల కుందేలి పిల్లతో పోల్చారు. చిన్న సీస అయినా చక్కగా చంకలో ఒదిగిపోతుందని అభిప్రాయపడ్డారు. నీళ్ల సీస లేకపోతే శ్వాస లేని పువ్వులా అయిపోతాను అన్నారు. నీళ్ళు లేకపోతే మనిషి మనుగడ కొనసాగడం కుదరదు. అదే విషయాన్నీ జల గీతం గోపి గారు చెప్పడం జరిగింది.

బాగున్నారా అనే కవితలో అమెరికాలో గోపి గారెకి ఎక్కువగా ఆకర్షించినది ఎగ్జిట్ బోర్డులేనని రాసుకున్నారు. దేశం కానీ దేశానికి వెళ్లి అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన పిల్లల కోసం తల్లితండ్రులు అమెరికా వెళ్తూ ఉంటారు. పిల్లలు ఉద్యోగాలకు వెల్తే ఇంట్లో దిక్కుతోచక, మన భారతీయులు కనపడక అక్కడికి వెళ్ళిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ఇదే వస్తువుపై అనేక కథలు కూడా వచ్చాయి. ఇదే విషయాన్ని గోపి గారు చెప్పారు. రాతిలో కూడా హృదయాన్ని చూడటం కేవలం గోపి గారికే సాధ్యం. 

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు