కనువిప్పు - శింగరాజు శ్రీనివాసరావు

Kanuvippu

నెల్లూరులో బ్యాంకు పరీక్ష ఉంటే వ్రాద్దామని వచ్చాడు రాఘవ. నిరుద్యోగ జీవితం ఎంత భయానకమైనదో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. అతనికి యం.బి.ఏ చేసినా ఎక్కడా కనుచూపు మేరలో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరత్వం తక్కువని మొదట్లో మొగ్గుచూపలేదు. కేవలం ప్రభుత్వ బ్యాంకులనే నమ్ముకుని ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడేమో ప్రైవేటు బ్యాంకులు కూడ అవకాశం ఇవ్వడం లేదు. ఆరు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా అంగుళం మేర పురోగతి కనిపించలేదు. అదే ఆలోచనలతో కాళ్ళీడ్చుకుంటూ నెల్లూరు వీధుల వెంట తిరుగుతున్నాడు. తలనొప్పిగా ఉంటే టీ తాగుదామని ట్రంకురోడ్డు లోని ఒక బంకు దగ్గర ఆగి టీ ఆర్డరిచ్చాడు. జనం రద్దీ ఎక్కువగా ఉంది. అయినా ఆ గది చాలా శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. "సర్. ఇదిగోండి టీ" అంటూ ఒకతను గ్లాసు చేతికిస్తూ రాఘవను చూసి "మీరు రాఘవ కదూ" అన్నాడు. అప్పుడు పాలించి చూసి "శీనూ నువ్వేంటి ఇక్కడ" ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. "ఈ టీ బంకు నాదే" "నువ్వు టీ బంకు నడపడమేమిటి?" అర్థంకాక అడిగాడు. "అవన్నీ తరువాత. ముందు లోపలికిరా" అని టీ కాచే కుర్రాడిని బంకు చూసుకోమని చెప్పి రాఘవను వెనుక గదిలోకి తీసుకువెళ్ళాడు. "కాలేజి టాపరువి. నీవు ఇలా..." ఆగిపోయాడు రాఘవ. "చదువనేది విజ్ఞానాన్ని పెంచుకోను, సంస్కారాన్ని నేర్చుకోను అంతే. నా సంగతి సరే, నువ్వేం చేస్తున్నావు. ఉద్యోగం వచ్చిందా" "ఈ జన్మకు ఆ భాగ్యం లేదు. ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తాయే తప్ప, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయరు. అంతా మోసం" "అందరూ ప్రభుత్వ ఉద్యోగాలని కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎక్కడ తేగలరు. అందుకే నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను" "ఉద్యోగ ప్రయత్నమే చేయలేదా?" "చేద్దామనుకున్నాను. కానీ ఎందుకో నాకు ఉద్యోగాల కోసం తిరిగి కాలం వృధా చేయాలనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వాల మీద ఆధారపడడం, వాటిని దుమ్మెత్తిపోయడం నాకు నచ్చలేదు. మనకు తెలివితేటలు ఉన్నాయి. స్వతంత్రంగా బ్రతికే శక్తి ఉన్నది. పట్టుదల, దీక్ష ఉంటే చేసే ఏ చిన్నపనినైనా గౌరవంగా చేసుకోవచ్చు. ఎంతసేపూ ప్రభుత్వాన్ని నిందించడం కాదు. స్వయం ఉపాధితో మనం బ్రతకలేమా అని ఆలోచించుకోవాలి. మనకంటే గొప్పగా చదువుకుని ఆటోలు తోలుకునో, కర్రిపాయింటు పెట్టుకునే బ్రతుకుతున్నారు చాలామంది. సొంత వ్యాపారంలో ఉన్న ఆనందం మరెక్కడా రాదు. చదువుకున్నామనే అహంకారం, భేషజం మనలో ఉండకూడదు. ఏ పనయినా నిబద్ధతగా చేసే లక్షణం ఉంటే చాలు. బాగా బోరు కొట్టించానా" చెప్పాల్సినదంతా చెప్పి అడిగాడు శీను. "లేదు శీను. కనువిప్పు కలిగించావు. ఇన్నాళ్ళు ఉద్యోగమంటూ కాలం వృధా చేశాను. మాకు వారసత్వంగా వస్తున్న అర్చకత్వాన్ని పక్కనబెట్టి తప్పుచేశాను. నీ మాటలతో నాకు బ్రతుకుబాట చూపించావు. నీకు కృతజ్ఞతలు" అని శీనుకు వీడ్కోలు చెప్పి స్థిరనిశ్చయంతో కదిలాడు రాఘవ. అతని మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతున్నది ఇప్పుడు. ***********

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు