''కాల్ ''వచ్చింది! - కొత్తపల్లి ఉదయబాబు

Call vachchindi

భోజనం చేసి మధ్యాహ్నం పూట టీవీ ఆన్ చేసి చానల్ మార్చుదాం అని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను
ఆవిడ డైనింగ్ టేబిల్ సర్దుకుంటోంది.
సవ్యంగా సాగిపోతుంటే వృద్ధాప్యము ఒక ‘వరమే’. ఏ అనారోగ్యం దరిచేరనంతవరకూ..

ప్రస్తుతం నా జీవితం ఆ వర ప్రభావంతో నడుస్తోంది
పిల్లలిద్దరూ జీవితాల్లో స్థిరపడ్డారు
చక్కగా భార్యాభర్తలిద్దరూ ఒకే మాటగా ఒకే బాటగా సంసారాలు చేసుకుంటున్నారు పదవీ విరమణ

నాలుగు సంవత్సరాలు ఉండగానే హాయిగా బాధ్యతలు పూర్తి చేసుకోవడం వల్ల ఆ నాలుగేళ్లు ఉత్సాహంతో పని చేసి మంచి ఆఫీసర్ గా రిటైర్ అయిపోయాను.

పదవి విరమణ అనంతరం వచ్చిన గ్రాట్యుటీ ఇతర అలవెన్సులు డిపాజిట్లు గా పెట్టుకొని ఆ వచ్చే వడ్డీ డబ్బులతో పెన్షన్ తో మేమిద్దరం సుఖంగా జీవితం సాగిస్తున్నాం అనే చెప్పాలి.
సిటీలో వారి వారి ఆశీస్సులు దగ్గరలో సొంత అపార్ట్మెంట్లు కొనుక్కున్న నా పిల్లలు ఇద్దరు 15 రోజులకు ఒకసారి వచ్చి నలుగురు మనవలతో ఇల్లంతా సందడి చేసి వెళ్తూ ఉంటారు.
ఇక నిత్యము మాట్లాడుకోవడానికి ఈ ఆధునిక సాంకేతిక యంత్ర హస్తభూషణ ప్రపంచం ఉండనే ఉందిగా.
అన్నట్టు ఫోన్ అంటే గుర్తుకొచ్చింది.

రోజుకు రెండు మూడు బ్యాంకుల నుంచి ఊరూపేరూ లేని కాల్స్. ‘’మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చిందని, తీసుకోమని, పర్సనల్ లోనూ కావాలా సర్ ‘అని...

ఇలా పేరు లేని నెంబర్ నుంచి ఒకటే కాల్స్. అబ్బాయికి చెప్తే అదేదో ట్రూకాలర్ యాప్ అని ఫోన్ లో పెట్టాడు,

ఎర్రరంగు లో వచ్చిన ఫోన్ కాల్స్ స్పామ్ అయి ఉంటాయని వాటిని లిఫ్ట్ చేయ వద్దని చెప్పాడు.

అప్పటినుంచి వాడి సూచన పాటిస్తున్నాను.

ఏమి జరగకుండా ప్రశాంతంగా జరిగిపోతే జీవితానికి అర్థం ఏముంది? ‘ జీవిత పరమార్థం’ కూడా
దేవుడు చివరి క్షణాల్లో తెలియజేస్తాడు అని తెలుసు. ఉద్యోగ విరమణ అయ్యాక ఈ మధ్యనే ఏదో హడావిడిగా పని ఉన్నట్లు వెళ్ళిపోయిన నా ఇద్దరు. ముగ్గురు స్నేహితుల జీవితాలు ‘’ఆ పరమార్ధమేమిటో’’ తెలుసుకున్నట్లుగా ముగిసిపోయాయి, మనకూ ఎప్పుడో ఒక రోజు వస్తుంది అనుకున్నాను అప్పుడు.

‘’ఏమిటి? రిమోట్ చేతిలో పెట్టుకుని కొండపల్లి బొమ్మ అలా కొయ్యబారి పోయారు?

ఇటు ఇవ్వండి. ఆ దిక్కుమాలిన సీరియల్ లో ఏమైందో ఏమిటో?’’ అంటూ వచ్చి నా చేతిలో రిమోట్ లాక్కుని.

‘’అంత దిక్కుమాలినవనైప్పుడు చూడటం ఎందుకో’’ స్వగతంలో అనుకుంటూ ఉండగానే ‘’కాల్ వచ్చింది’’.

మా శ్రీమతి మీనాక్షి. ‘’మీ గదిలోకి వెళ్లి మాట్లాడుకోండి’’ అంది ఆమె తనకు కావలసిన చానెల్ వెతుక్కుంటూ.

అది చానల్ మార్చుకుంటున్నట్టుగా అనిపించలేదు నాకు. తన ఆనందపు లోకంలోకి ప్రవేశిస్తున్నట్లు గా అనిపించింది. ఆ సీరియళ్లలో పడితే అది పూర్తయ్యేంత వరకూ ప్రపంచమే వారికి పట్టదు.

సెల్ చేతిలోకి తీసుకున్నాను. స్పామ్ కాల్ కాదు కానీ పేరు రాలేదు. మొబైల్ డేటా ఆన్ లోనే ఉంది.

‘’ హలో సార్!’’ అని మొదలు పెట్టాడు,తాను, నేను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు తాలూకు ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని, తమ శాఖ కొంతమంది ‘స్పెషల్ ‘ కస్టమర్లను ఎన్నుకుని మూడేళ్లకు ఒకే సింగిల్ ప్రీమియం ఆఫర్ చేస్తున్నామని దానివల్ల ఉత్తరోత్తరా నామినీకి 50 లక్షలకు వస్తుందని చెప్పడం మొదలు పెట్టాడు.

ఇదేదో ఆసక్తిగా ఉంది అనుకోవడమే నేను చేసిన ‘తప్పని’ చివరలో కనిపించింది.

‘’మీ పేరు, చిరునామా, మీ అకౌంట్ నెంబర్ ఇవే కదా...’’ అంటూ చెప్పాడు. నాకు అది ‘సరైన’

కాలే అనిపించింది. పాలసీ వివరాలు అడిగాను ఒక ఆరు విషయాలకు వర్తించదు అని చెప్పాడు

చివరకు నాకు అర్థమైంది ఏమిటంటే- ఆ పాలసీ క్లైమ్ చేయాలంటే నాకు యాక్సిడెంట్ అయితీరాలి. అప్పుడు ఒకవేళ ఏదైనా కారణంచేత నేను మరణిస్తే నా భార్యకు నెలకు ఒక లక్ష చొప్పున 50 మాసాలు అలా నా అక్కౌంట్ లో కంపెనీ మనీ వేస్తుందట.

మూడు సంవత్సరాల తర్వాత ఏమి జరగకపోతే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేయించుకోవాలట. నేను కట్టిన డబ్బు ఒక్క పైసా వెనక్కి రాదట నాకు ‘ప్రమాదం’ జరగకపోతే.

నేను కేవలం వేల ల్లో ప్రీమియం కడితే, లక్షల్లో నామినికి డబ్బు ఉచితంగా ఇచ్చే ఆ పద్ధతి వల్ల
ఆ కంపెనీకి ఏం లాభమో నాకు అర్థం కాలేదు. ‘శభ మా’ అని పాలసీ ప్రారంభిద్దాం అనుకుంటే ‘’ నీకు ప్రమాదం జరిగి తీరాల్సిందే’’ అని కస్టమర్ ‘నాశనాన్ని’ కోరుకోవడం నాకు ఎందుకొ ‘అపశకునం’ అనిపించింది.

అటు సీరియల్ దృశ్యశ్రవణం చేస్తూనే ఒక చెవి ఇటు పడేసి కాల్ వివరాలన్నీ వింటున్న శ్రీమతి నా దగ్గరగా వచ్చి ‘’మీరు అనవసరమైన వాటికి అన్నింటికీ ‘కమిట్’ అయి పోకండి.మీకు ఏదైనా అయితే నాకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ చాలు నేను ఎవరి మీద ఆధారపడకుండగా బతకడానికి’’
అంది భుజం మీద చేయి వేసి.

అతను నన్ను నియంతృత్వంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు- ఇంద్రజాలికుడీలా మాట్లాడుతూ.

ఊగిసలాడుతున్న నా మనసును ‘స్థిరం’ చేసుకొని నాకు ఇప్పటికే అలాంటివి మూడు పాలసీలు
ఉన్నాయని వాటి పేరు చెప్పి ఫోన్ పెట్టాక, మీనాక్షి నా భుజం మీదనుంచి చేయి తీసెసింది .
‘’బరువు’’ తీశాక నిద్ర పోయాను.

అయితే నిద్ర లేచి చూస్తే ఆ సాయంత్రం వరకు పదిహేను మిస్డ్ కాల్స్ ఉన్నాయి.

‘’నాకు వినపడలేదే ?” అన్నాను మీనాక్షి తో.

‘’ వెధవ – సీరియల్స్ కి అడ్డం అని నేనే సైలెంట్ లో పెట్టేసాను’’ అంది ఆమె. ‘’వెధవ’’ అన్నది ఎవరినో నాకు అస్సలు అర్ధమెకాలేదు.
‘’ఎంత ఎదిగి పోయావ(య్యా) మ్మా.’’ అదేదో తెలుగు సినిమాలో పాట గుర్తుకు వచ్చింది. అయితే నాకు మాత్రం ‘’యాక్సిడెంట్ ప్లస్ 50 లక్షలు’’ మనసులో ముద్రించుకుపోయాయి,

*************
నేను మెల్లగా తెరిచాను. తలకి ఏదో పెద్ద కట్టు ఉన్నట్టుగా బరువుగా ఉంది తల అంతా.
కన్నీళ్ళతో మీనాక్షి ఆతృతతో చూస్తోంది. అది అచ్చు సీరియల్ చూస్తూ ఉన్న ‘ఆతృత’ లాగే ఉంది.

‘’ఎలా ఉంది నాన్న?’’ పెద్దోడి గొంతు అది.
‘’బానే ఉంది రా’’ చిరునవ్వుతోనే సమాధానం చెప్పాను అనుకున్నాను. పెదవులు విచ్చుకున్నాయో లేదో తెలియలేదు.
ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తుకు చేసుకోసాగాను. ఆరోజు ‘కాల్’ వచ్చిన తర్వాత మీనాక్షితో అన్నాను.

‘’పోనీ చేసేద్దమోయ్. 50 లక్షలతో నీ జీవితం సుఖంగా జరిగి పోతుంది’’ అన్నాను రెండు మూడు సార్లు. అన్నప్పుడల్లా నా భుజం మీద తన చేయి పడేది - నా నిర్ణయాన్ని వెనక్కి లాగేసే కళ్ళెంలా .

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ జీవి మొదటి శ్వాసలోంచి రెండవ శ్వాసలోకి, అలా కొనసాగిస్తూ కాలం లోకి లాగబడతాడు. వాడికి ఆయువు ఉన్నంత కాలం లాగుతూనే ఉంటుంది.

‘’పచ్చి మిరపకాయ బజ్జీలు తినాలని ఉంది’’ అన్నాను యధాలాపంగా

‘’షాపుకు వెళ్లి తెచ్చుకోండి ఇంట్లో చేసే పెడతాను’’ అందామె
తొందరగా ‘’వేయించుకుని’’ తినాలని ఆశ తో నడిచి వెళ్లి వస్తే సరిపోయేదానికి బైక్ తీసుకుని బయలుదేరాను.

మలుపు తిరగబోతొంటే సెల్ మోగి ‘’కాల్’’ ఏదో వచ్చింది అనుకుని ఒక చేత్తో బైక్ ను సందు మలుపు తిప్పుతూ సెల్ తీసి చూడబోయాను. అంతలోనే ఎదురుగా ‘రై’ మంటూ వచ్చిన పెద్ద లారీ... పెద్ద శబ్దం .

‘’నేను పాలసీ చేయిస్తాను అన్నాను. నువ్వే వినలేదు’’ మెల్లగా ముద్దగా ఒక్కొక్క మాట అంటున్న

నా మాటల్లోని గాలితో పాటు నన్ను ఎవరో నాకు లాక్కు పోతున్నారు.

మీనాక్షి చెయ్యి పట్టుకున్నానో లేదో ఎంత ఆలోచించినా గుర్తు లేదు!!!



సమాప్తం

మరిన్ని కథలు

Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి