అనాథ శరణాలయం - సిహెచ్.వి.యస్. యస్. పుల్లం రాజు

Anaatha saranalayam

సువిశాల ప్రాంగణంలో నెలకొన్న పెద్ద భవన ప్రవేశ ద్వారం ముందు స్కూలు బస్సు ఆగింది. విద్యార్థులు ఉపాధ్యాయులు చేస్తున్న సూచనలు పాటిస్తూ, బస్సు లోంచి దిగుతున్నారు. బస్సుని, పిల్లలని గమనించిన రామలక్ష్మి మేడం తన గదిలోంచి బయటకు వచ్చి, లోపలికి వస్తున్న పిల్లల దగ్గరకు హుందాగా నడుచుకుంటూ వెళ్లుతోంది. వరుస క్రమంలో విద్యార్థులు, వారి వెనుకే వస్తున్న ఉపాధ్యాయులని చూస్తోంటే, రామలక్ష్మికి ఎంతో సంతోషం కలిగి, చిరునవ్వుతూ,".శుభోదయం. 'శాంతి నందనం' మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతోంది. స్వాగతం. సుస్వాగతం" అంటూ, వారందరిని ఒక పెద్ద హాల్లోకి తోడ్కొని వెళ్ళింది. లోపులో అనాథ శరణాలయంకు సంబంధించిన సిబ్బంది అక్కడికి వచ్చారు. పరస్పర పరిచయాల పిమ్మట, రామలక్ష్మి, పిల్లలందరిని తన చుట్టూ కూర్చోబెట్టుకొని," రోజు మీ జీవితంలో, మరపురాని రోజు. ఎందుకంటే, మీరు ఒక కొత్త అనుభవాన్ని, అనుభూతుల్ని పొందబోతున్నారు. తమ తల్లిదండ్రులు ఎవరో, ఎలా వుంటారో తెలియని పిల్లలని చూడటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, ఒకరి అనుభవాలను మరొకరితో పంచుకోవడం జరగబోతోంది." అని చెప్పిందావిడ. ఒక్క నిమిషం నిశ్శబ్దం. మళ్లీ ఆవిడ చెప్పడం ప్రారంభించింది," ఎడమ వైపు వున్న భవనం, పాఠశాల. కుడివైపున వున్నది భోజనశాల, అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళితే, పిల్లల వసతి గృహం. ఇప్పుడు గంట మ్రోగుతుంది. పాఠశాల ముగుస్తుంది. మూడు గంటలు విరామం. తర్వాత పిల్లలకి వ్యాయమ విద్య, ధ్యానం వుంటాయి. మీరు మీ ఉపాధ్యాయులతో బాటు మా పిల్లలతో కలిసి తిరగండి, ఆడుకోండి, సంతోషంగా గడపండి."

ఇంతలో గణ గణ మని గంట మ్రోగింది.

💐💐💐💐

" దరిద్రపు రోగిష్టి మొఖం ..వి, పొద్దున్నే ఎందుకు చచ్చావే ఇక్కడికి? " కోపంతో అరిచాడు ప్రశాంత్. "సారీరా నా చిట్టి తండ్రీ! నీ నిద్ర పాడుచేశానా? నిన్ను చూడాలని పించింది…" తల్లి మాటల్ని పూర్తిగా వినకుండానే,"నా గది లోకి రావద్దని చెప్పనా?లేదా? నీకు నోటితో కాదే, చెప్పవలసింది" అంటూ, మంచం మీద నుంచి లేచి ఆమె ముఖం మీదకి మంచినీళ్ల సీసాని విసిరాడు. ఆది విసురుగా వచ్చి, ఆమె మూతికి బలంగా తగిలి,ముందు పలు వరుసలోని పన్ను విరిగి పడింది. నోటిలోంచి స్రవిస్తున్న రక్తం, పగిలిన పెదవుల నొప్పితో, రొప్పుతూ భారంగా బయటకు అడుగులు వేసింది. ఇంకా అత్తగారు, మావగారు, కూతురు ఎవరి గదుల్లో వాళ్లు వున్నారు. తన అదృష్టం బాగుంది కాబట్టి తను చేసిన పని ఎవరికి తెలియ లేదనుకొంది వెర్రితల్లి. బాధని ఓర్చుకొంటూ, కాఫీ తీసుకుని కూతురు గది తలుపు తట్టింది. అప్పుడే స్నానం చేసి వచ్చిన కూతురు, గది తలుపు తీస్తూ, సాసర్, కాఫీ కప్పు చూసి, తల్లిని అక్కడే గది బయటే ఆగమన్నట్టు, కళ్ళతోనే సంజ్ఞ చేసి, తాపీగా ముఖానికి క్రీం పూసుకొనివచ్చి, కాఫీ కప్పు వయ్యారంగా తీసుకుని, ఒక గుటక వేసి," ఒసేదెయ్యం ! కాఫీ ఇంత వేడిగా వుంటే, ఎలా తాగుతారనే బుద్ధి లేదా? రోగిష్టి పీనుగా" అంటూ కాఫీకప్పుని, తల్లి గుండెల మీద పడేలా విసిరి, సాసర్ తో తల మీద మొట్టింది.

ఆరణల మధ్య, ఆంక్షల మధ్య జీవచ్ఛవంలా, ఊపిరి తీస్తూ,తన దుస్థితికి తానే కారకురాలని నమ్ముతున్న అభాగ్యురాలు ఆమె. తరతరాలుగా ప్రాణాల కంటే, పరువు మర్యాదలే ఘనమని నమ్మిన, శుద్ద శ్రోత్రీయకుటుంబం నుంచి వచ్చిన సతీ సుమతి. తల్లిదండ్రులకి కన్న కూతురి సంగతులు తెలిసినా, పెళ్లి చేయవలసిన మరో ఇద్దరి ఆడపిల్లల తలరాతలు తలచుకొని, తలవంచుకొని మౌనంగా, తమలో తామే పెద్ద కూతురి దుస్థితికి కుమిలి పోతున్నారు. అత్తమామలు, భర్త కలిసి ఇల్లాలిని హింసించడం లోకవిదితమే. కానీ, వాళ్ళతోబాటు, కన్న కూతురు, కొడుకు, తల్లిని శారీరకంగా, మానసికంగా బాధించడం అమానుషం. అకారణంగా, కన్న కూతురు, కొడుకు, కర్ణకఠోరభాషలో దుర్భాషలాడటం, అత్యంత ఘోరం. కానీ, అది ఆమె భర్తకు వినోదం.

పెళ్ళి చేసుకున్న మూడు నెలలకి, ఆమె మధుమేహ వ్యాధిగ్రస్తురాలని తెలిసింది. వాస్తవానికి పెళ్ళినాటికి ఆమె పూర్తి ఆరోగ్య వంతురాలు. మోసం చేసి, మధుమేహగ్రస్తురాలని, తమ కొడుకుకి అంటగట్టారని, అత్తగారి ఆక్షేపణ. వాళ్లు కక్ష తీర్చుకొనేందుకు, మనవడ్ని, మనవరాలుని గురి తప్పని జీవాయుధాలుగా వాడుకున్నారు. అలా మొదలైన గృహహింస సంవత్సరాలు గడుస్తున్నా సాగుతూనే వుంది. కన్న పిల్లలే, తల్లిని ఈసడించుకోవడం, తిట్టడం, కొట్టడం, చివరికి పిచ్చిదని ఒక గదిలో పెట్టి, మానసికంగా క్షోభకి గురి చేయడం అమానుషం. శాపాన్ని కూడా వరమనే భావనతో, నిరాశక్తతతో, బానిసలా బ్రతుకుతున్నది అస్వతంత్ర భారత నారి.

💐💐💐💐

"శాంతికి నాలుగు రోజుల నుంచి జ్వరంగా వుందట. మధ్యాహ్నం అల్లుడు ఫోన్ చేశాడు. అసలే కరోనా కాలం. ఏమి చేయాలో పాలుపోవడం లేదు." అంటూ ఆఫీసులో వున్న భర్తతో ఫోన్ లో ఏడుస్తూ చెప్పింది శాంతి తల్లి.

"హాస్పిటల్ లో బెడ్ దొరికితే, చేర్పించవచ్చు. నా స్నేహితులతో చెప్పి, ప్రయత్నం చేస్తా" అన్నాడు శాంతి తండ్రి. బాధని నియంత్రణ చేయలేక బయటకు ఏడ్చినది తల్లి కాగా, రెట్టింపు బాధని మదిలో అదిమి పెట్టి, నిశ్శబ్దంగా రోదించాడు తండ్రి. అదే రోజు సాయంత్రానికి రాష్ట్రమంత్రి సిఫార్సు మీద, ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ఒక బెడ్ సాధించి, అల్లుడికి ఫొన్ చేసి, వివరాలు చెప్పి, శాంతిని హాస్పిటల్ లో అడ్మిట్ చేయమని కోరాడు. కూతురు కష్టాలు కడతేరాలని దేవుడ్ని ప్రార్ధించింది తల్లి.

💐💐💐💐

నిజమే భగవంతుడు కరుణానిధి. అందుకే, ప్రార్థనలకు స్పందించి. శాంతిని కరుణించాడు. తల్లిదండ్రులు శాంతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందితే, శాంతి మొగుడు, ఆకాశమంత ఆందోళన చెందాడు. భార్యని, కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్చి బిల్లు చెల్లించడమా! అని. అందుకే, నాలుగు రోజులు తీరికగా తర్కించుకొన్న తర్వాత, అంబులెన్స్ పిలిపించి, ప్రభుత్వ దవాఖానలో భర్తీ చేయించి, చల్లని సమాచారాన్ని, ఆమె తల్లిదండ్రులకు తెలియపరిచి చేతులు దులుపుకొన్నాడు. ఆసుపత్రి నుంచి కబురు కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూసారు. కానీ, ఆతృతకి, ఎవరి కారణాలు వారివి.

💐💐💐💐

విద్యార్థులకి, అనాథ పిల్లల పట్ల సరియైన అవగాహన కల్పించాలనే భావనతో, పాఠశాల ఉపాధ్యాయులు, కొంతమంది విద్యార్థులని ఒకరోజు అనాథ శరణాలయంకి తీసుకుని వెళ్ళారు. శరణాలయం కోసం, విద్యార్థులు వసూలు చేసిన పదివేల రూపాయల చందాని అందచేశారు.

ఐతే, అనాథ శరణాలయంలో, కొంత మంది పిల్లలు. తల్లి ప్రేమకి నోచుకోని వైనం, మద్యం మత్తులో ఆడ పిల్లలని అమ్మేసి, డబ్బులతో మద్యం సేవించే తండ్రులు, మద్యం కోసం, భార్య, మెడలోని మంగళసూత్రం తెంపిన తండ్రులు, తండ్రి కొట్టిన దెబ్బలకు, తల్లి చనిపోగా, అనాథలయిన పిల్లలు, కూలి పనులు చేస్తూ, పోషించే తల్లి, అనారోగ్యంతో చనిపోగా అనాథలుగా మారిన పిల్లలు, పుట్టుకకు కారకులైన, తల్లిదండ్రులెవరో కూడా తెలియని అభాగ్యులు, ఇలా దురదృష్టవంతుల కథలు విని జీవితంలో తల్లి, తండ్రి లేని లోటు ఎలా వుంటుందో, తల్లి ప్రేమలోని మాధుర్యం పొందడం ఎంత అదృష్టమో, సవతి తల్లుల నీడలో, పిల్లల బ్రతుకెంత దుర్భరమో కూడా పాఠశాల విద్యార్థులకు అర్ధమయ్యి,. శరణాలయంలోని అనాథపిల్లల పట్ల చెప్పలేనంత జాలి, సానుభూతి కలిగాయి, శాంతి కొడుకు చైతన్యకి, కూతురు నందినికి కూడా.

💐💐💐💐

హఠాత్తుగా, ఇంటికి రంగులు ఎందుకు వేయిస్తున్నారో, చైతన్యకి తెలియలేదు. కానీ, తాతబామ్మల సంభాషణలను బట్టి నందినికి అనుమానం కలిగింది. సంగతి తమ్ముడుతో చెప్పింది కూడా. వారం తిరగ కుండా, అది రూపు దిద్దుకొని సవతి తల్లిగా, ఇంటిలో తిరగ సాగింది. తండ్రికి, పిల్లలపై, అకారణ కోపం మొదలయ్యింది. చచ్చిన పాత అమ్మకి, పాచి అన్నంలో పచ్చడి వేసి పెడుతున్న కొత్త అమ్మకి వున్న తేడాని త్వరగానే గ్రహించారు వాళ్లు. నెల తిరిగే సరికి, ఇంటి పనులు నందిని, బయట పనులు చైతన్య చేయడం మొదలయ్యింది. అంతంత మాత్రంగా వున్న వాళ్ల చదువులు నెమ్మదిగా అటకెక్కసాగాయి. నేపథ్యంలో, ఒక నాడు, పాఠశాల స్నేహితులతో కలిసి అనాధ శరణాలయం సందర్శించడం వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి.

💐💐💐💐

శాంతిలోని, ప్రేమ, అణకువ, కుటుంబ నుంచి వచ్చిన సంస్కారం, సుదర్శన్ లో నిద్రావస్థలోవున్న శాడిస్టుని మేల్కొలిపాయి. దానికి ఆతని తల్లిదండ్రులు, వంత పాడారు. పెళ్ళాం, రోగిష్టి దయినా, పడకకి, పిల్లల్ని కనడానికి పనికి వచ్చింది. కానీ, ప్రేమని పంచకుండా, ఆమె బ్రతుకుని నరకం చేసి, పరలోకానికి పంపించాడు. ఒకసారి విడాకులు తీసుకున్న సూర్యకాంతం మెడలో రెండోసారి మాంగల్యం కట్టాడు. కొత్తకారులో, కొత్త పెళ్ళాంతో, కమ్మగా కబుర్లు చెబుతూ, ప్రయాణిస్తున్న సుదర్శన్, బస్సుని తప్పించబోయి, అదుపు తప్పి, ఆగివున్న లారీని వేగంగా ఢీ కొట్టాడు. కుడికాలు, ఎడమ చేతితో మిగిలాడు. స్వల్ప గాయాలతో, కొత్త పెళ్ళాం, ప్రమాదం నుండి, సురక్షితంగా బయట పడింది. ఒక్కప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఆఫీసులో చక్రం తిప్పిన సుదర్శన్ ఈనాడు చక్రాలబండిలకి అంకితమై, జీవితచక్రాన్ని తిప్పలేక నానాతిప్పలు పడుతున్నాడు. వృద్ధులయిన అతని తల్లిదండ్రులు,తమ కనుల ముందు విచిత్రంగా తిరుగుతున్న జీవవనాటక చక్రాన్ని చూస్తూ, ప్రేమమూర్తి శాంతికి చేసిన ద్రోహంలో తమ పాత్రపై పెదవి విప్పలేక మౌనంగా రోదిస్తూన్నారు. కొత్త పెళ్ళి కలిసి రాలేదని, ఎవరైనా కత్తిలాంటి కుర్ర న్యాయవాదిని సంప్రదించి, ఏదో ఒక కుంటిసాకుతో, కుంటివాడికి విడాకులిస్తే, వచ్చే లాభ నష్టాల లెక్కలు వేస్తూ, భావి ప్రణాళికలు రచిస్తోంది సుదర్శన్ ధర్మ పత్ని . ఇంట్లో డబ్బులు తీసుకుని వేరే ఊరు పారిపోయి, అనాథ శరణాలయంలో చేరాలని పిల్లలు ఆలోచిస్తున్నారు. 'శాంతి' లేని సౌధం ఇప్పుడు అనాథ శరణాలయాన్ని తలపిస్తోంది.

సత్యం ఏమిటంటే, ప్రపంచమే ఒక పెద్ద అనాథ శరణాలయం.

💐💐💐💐

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు