మానవతకు స్ఫూర్తి - కందర్ప మూర్తి

Manavataku spoorthi

రాత్రి ఎనిమిది గంటలు దాటుతోంది. చిరు జల్లులు పడుతున్నాయి.తన రాకను గమనించకుండా గడప దగ్గర దీర్ఘ ఆలోచనలో ఉన్న తల్లిని చూసి" ఏమైంది, అమ్మా! అలా ఉన్నావు. ఆరోగ్యం బాగా లేదా? రోజూ గుమ్మంలో పలకరించే నువ్వు నా రాకని కూడా గమనించకుండా ఏదో ఆలోచనలో ఉన్నావు" తల్లిని అడిగింది జానకి. " ఔనమ్మా ! నా ఆలోచనలన్నీ నీ గురించే. పెళ్లీడు కొచ్చిన ఆడపిల్లను బజారులంట తిప్పుతున్నాను. మీ నాన్న బతికుంటే ఏదోలా నిన్నో ఇంటి దాన్ని చేసుండే వారు. ఈ కరోనా మాయదారి రోగం ఆయన్ని మింగేసింది. బట్టల షాపు యజమాని వద్దంటున్నా వ్యాపారం దెబ్బ తింటుందని షాపు తెరిచి వేళాపాళా లేకుండా కష్టపడ్డాడు. శేఠ్ చెబుతూనే ఉన్నాడట , మాస్కు వేసుకున్నా కష్టమర్ల దగ్గర ఏ రోగం ఉన్నదీ తెలవదు కదా , శంకరాన్ని దుకాణం మూసెయ్య మన్నా వినకుండా పనిచేసి కరోనా మహమ్మారి నోట పడ్డాడు. జ్వరం దగ్గు ఒళ్లు నొప్పులంటే కరోనా పరీక్ష చేసినాక ఆ మాయదారి రోగం మీ నాయనకు అంటినాదని టెస్టు సెంటర్ నుంచే ఆసుపత్రికి తీసుకు పోయారు.ముందు నుంచే ఆయనకి ఆస్తమా ఉంది. ఊపిరందక చాలా బాధ పడినాడు. ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చి శేఠ్ ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు.మీ నాయన పోయి సంవత్సరం పొద్దయినాది. చివరికి ఆయన ముఖం చూసే ప్రాప్తం లేక పోయింది. నీ కాలేజీ చదువు పూర్తయినాక మంచి ఉద్యోగం చేయించి పెద్ద అయ్య చేతిలో పెడదామను కున్నాడు. ఇంతలో ఈ చావు వచ్చినాది. ఇంటి భాద్యత నీ నెత్తి మీద పడినాది " జరిగింది తలచుకుని ఏడుస్తోంది సుమతి. "ఏం చేస్తాం అమ్మా , ఏదీ మన చేతిలో లేదు కదా! ఎలా జరగాలో అదే జరుగుతుంది. నువ్వు నా గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. అన్నిటికీ దేవుడే ఉన్నాడు " తల్లిని ఓదార్చి బాత్రూంలో కెళ్లింది జానకి. ఎదురుగా గోడకు వేలాడుతున్న శంకరం ఫోటోను చూసి గతం జ్ఞాపకం తెచ్చుకుంది సుమతి. తన భర్త శంకరం బట్టల వ్యాపారి శేఠ్ పద్మనాభయ్య కుటుంబంలో ఒక సబ్యుడిగా పెరిగి పెద్దయినాడట.శంకరం అమ్మానాన్నలు చిన్నప్పుడే బస్సు ప్రమాదంలో చచ్చిపోతే శేఠ్ నాయన చేరదీసి బట్టల దుకాణంలో కొలువులో పెట్టేడట. ఆళ్ల దగ్గరే తింటూ బట్టల దుకాణం దగ్గరే పడుకునే వాడట. పద్మనాభయ్య శేఠ్ కుర్రోడిగా ఉండి చదువుకు స్కూలుకు పోయేవాడట.పెద్ద శేఠ్ వచ్చే లోపు దుకాణం తుడిచి సర్ది పెట్టే వాడట.మద్యాహ్నం దుకాణం మూసి పెద్ద శేఠ్ తో ఇంటి కెళ్లి బువ్వ తిని దుకాణం తెరిచేవాడట. పెద్ద శేఠ్ కునుకు తీసి వచ్చేలోపు కింద మీద ఉండే బట్టల్ని అరల్లో సర్ది ఉంచే వాడట.పెద్ద శేఠ్ భార్య కూడా ఎంతో ప్రేమగా చూసేదట. పద్మనాభయ్య శేఠ్ స్కూలుకు పోతున్నా శలవు రోజుల్లో షాపుకాడ కూచునే వాడట. శంకరం ఇంట్లో పనివాడైనా అన్నదమ్ముల్లా ఉండేవారట. అలా పెద్దయినాక, పెద్ద బాబే పదవక్లాసు పాసయి అనాథ శరణాలయంలో ఉన్న నన్ను చూసి శంకరం లాగే అనాథ బతుకని తెలిసి గుడిలో గొప్పగా లగ్గం చేసి ఇల్లు చూసి అన్ని సామాన్లు సమకూర్చి కాపరం పెట్టించారు.తర్వాత ఈ విషయాలన్నీ శంకరం చెబితే తెలిసాయి. పద్మనాభం బాబుకి ఆళ్ల బంధువుల్లో అమ్మాయిని చూసి ఆడంబరంగా పెళ్ళి చేసినారు. పద్మనాభం బాబుగారి భార్యకు తొలి చూలుగా బాబు పుట్టినాక శ్రీనివాస్ పేరు పెట్టినారు. తర్వాత ఏడాదికి నేను నెల తప్పితే ఆడపిల్ల జానకి పుట్టినాది. ఆళ్లింట్లో ఏ కథా కార్యమైనా మమ్మల్ని పిలిచి ఆదరించే వారు. పెదబాబు గారి కుటుంబం కోసం ప్రాణాలైనా పెడతాననే వాడు శంకరం. పెదబాబు గారు కాలం చేసాక పద్మనాభం బాబు బట్టల వ్యాపారం చూసుకుంటున్నారు. చినబాబు మంచితనం వల్ల పేరు సంపాదించి వ్యాపారం బాగా నడుస్తోంది. చినబాబు గారి అబ్బాయి శ్రీనివాస్ ను పెద్ద చదువులు చెప్పించి బట్టల దుకాణం మీదకు తెచ్చారు. మా అమ్మాయి జానకిని పెదబాబు గారే హైస్కూలు తర్వాత కాలేజీలో డిగ్రీలో చేర్పించారు. కోవిడ్ వైరస్ కారణంగా కాలేజీలు మూత పడి ఆన్లైన్ క్లాసులు ఇంటి వద్ద నుంచే జరుగుతున్నాయి. అనుకోకుండా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బట్టల వ్యాపారంలో ఒడిదుడుకు లొచ్చాయి. అదేమీ పట్టించుకో కుండా శంకరం బట్టల వ్యాపారం గురించే ఆలోచించే వాడు. పర్యవసానంగా కోవిడ్ వైరస్ సోకి శంకరం హాస్పిటల్లో కన్ను మూసాడు. పరిస్థితులు చక్కబడి లాక్ డౌన్ ఎత్తేసి వ్యాపార సముదాయం తెరుచుకోడం మొదలైంది. ఎవరెన్ని చెప్పినా వినకుండా తండ్రి బదులుగా తను బట్టల షాపులో పని చేస్తానని బయలు దేరుతోంది జానకి. జానకి చలాకీతనం వినయం తండ్రిలా కష్టమర్ల దగ్గర మంచిని సంపాదించుకుంటోంది. పద్మనాభం శేఠ్ తో పాటు శేఠ్ శ్రీనివాస్ కూడా జానకి పని తీరు పట్ల సంతోషంగా ఉన్నారు. గతం గురించి ఆలోచనలో ఉన్న జానకి కూతురు పిలుపుతో ఇహాని కొచ్చింది. పదమ్మా , అన్నం పెడతానని వంట గది వైపు నడిచింది సుమతి. శేఠ్ పద్మనాభయ్య చిన్నప్పటి నుంచి తనతో పెరిగిన శంకరం కరోనా కారణంగా అకాల మరణం చెందడం తట్టుకో లేక పోతున్నాడు. అతని కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలని మదన పడసాగాడు.. అతని మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. పద్మనాభయ్య కుటుంబ సబ్యులతో సంప్రదించగా కొడుకు శ్రీనివాస్, భార్య , తల్లి కూడా సరే నన్నారు. శంకరం కూతురు జానకిని తమ ఇంటి కోడలిగా చేసుకోడానికి అందరు సమ్మతించారు. తమ కూతురు జానకి, శేఠ్ గారింట కోడలిగా వెల్తోందన్న విషయం నమ్మలేక పోతోంది సుమతి. ఇంకా ఈ కాలంలో ఇంతటి పరమాత్ములు ఉన్నారని నిర్థారణ చేసుకుంది. * * *

మరిన్ని కథలు

Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి