అమ్మా ..అమ్మా అంటూ పిలుపు వినబడింది. లలిత హా వస్తున్నాను అంటూ వీధి లోకి వచ్చింది. 'ఎందుకే ఇక్కడి నుండే పిలుస్తున్నావు ?' అంటూ తన కూతురు ను అడిగింది. అమ్మా రమ కి పెళ్లి చూపులు ట. తను పెళ్లి అప్పుడే వద్దు అంటున్నా వాళ్ళ నాన్న బాలయ్య వినడం లేదు ట అని చెప్పింది. అయ్యో చిన్న పిల్ల అప్పుడే పెళ్లి ఏమిటి? అనుకుంది లలిత. తనకి కూడా చిన్న తనం లొనే పెళ్లి జరిగింది. పూర్తి గా లోక జ్ఞానం లేకుండానే అత్తవారింట అడుగు పెట్టింది. చదువు కోవాల్సిన వయసు లో పెళ్లి చేసుకుని తాను పడిన కష్టాలు తనకి కళ్ళముందు కనబడ్డాయి. తనకు జరిగినట్టు ఎవరికీ జరగకూడదు అనుకుంది. వెంటనే బాలయ్య ఇంటికి బయలుదేరింది. ' చూడు బాలయ్య ఆడపిల్లలను బాగా చదివించాలి. వాళ్ళు శారీరికంగా బలహీనులు ఏమో కానీ మనసికము గా కాదు. చిన్న తనం లో చదివించకుండా పెళ్లి చేస్తే పడే కష్టాలు కు నా జీవితమే ఒక ఉదాహరణ . ....అని చెప్తుంటేనే లలిత కళ్ళ వెంట నీళ్లు ఆగడం లేదు. లలిత కళ్ళ ముందు తనగతం కనపడింది. చూసేవాళ్ళకి 'ఆ కన్నీటి చుక్కలు ఆ జ్ఞాపకాలు ను చెరిపేసినా బావుండును' అనిపించింది. అదో చిన్న పల్లె. మహా ఐతే మూడువేల జనాభా ఉంటారు. ఆ ఊరు కరణం వర్మ. అతని భార్య లలిత. వర్మ కు ఇద్దరు రత్నల్లాంటి ఆడపిల్లలు. ఆ ఊరి లో కరణం అంటే ఎంతో గౌరవం. ప్రజలు వాళ్ల పొలాలు కు సంబందించిన లెక్కలు, సరిహద్దులు, పన్నులు అన్నీ కరణం వర్మ చూసుకునే వాడు. వర్మ కు వారసత్వం గా వచ్చిన ఆస్తులు తో పాటు, తాను కూడా సంపాదించిన ఆస్తులు చాలా నే ఉన్నాయి. లలిత పెద్దగా చదువుకోలేదు. అసలే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. చాలా పద్దతి గా పెరిగిన పిల్ల. చిన్న తనం లొనే పెళ్లి చేసుకుని వర్మ కుటుంబం లోకి అడుగుపెట్టింది. ఉమ్మడి కుటుంబం , పెద్ద కోడలు అవడం వలన ఆ కుటుంబానికి అంతటికీ తలలో నాలుకలా మారి అందరినీ ఆకట్టుకుంది. లలిత వెళ్లిన కొంతకాలానికి అత్తగారు మరణించడం తో అన్ని బాధ్యతలు తన భుజాన వేసుకుంది. మరిది కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. ఇంటి కి సంబంధించిన పాడి పంట లెక్కలు దగ్గర నుండి అన్నీ తానే చూసుకునేది. . గుమ్మం దాటి ఎప్పుడూ బయటకి వెళ్ళలేదు. ఆ ఇల్లు, పిల్లలు, తన భర్త, ఆ పాడి పంటే ప్రపంచం. వర్మ ఎప్పుడూ సంపాదన గురించే ఆలోచించే వాడు. ఒక్కోసారి ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. తన భర్త తమ కోసమే పగలు రాత్రి కష్ట పడుతున్నాడు అని సంతృప్తి పడేది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిపాలనా శాఖ లలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని మార్పులు వలన గ్రామాలలో కరణాల వ్యవస్థను రద్దు చేసింది. దానితో వర్మ ఉద్యోగం పోయింది. కానీ ఆస్థులు ఉన్నాయి కదా బతకడానికి ఏ లోటు లేదు . వ్యవసాయం పై నిలకడగా వచ్చే ఆదాయం ఉండడం వలన ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా ఎప్పటి లాగానే రోజులు గడిచాయి. కొంతకాలానికి ... ప్రభుత్వం తీసేసిన కరణాలకు వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం కల్పించింది. వర్మ కు పక్కనే ఉన్న ఒక ఊరి లో ప్రభుత్వ ఉద్యోగం లభించింది. రోజూ ఉదయాన్నే వెళ్లి , సాయంత్రం కి వచ్చే వాడు. కొంత కాలం బాగానే గడిచింది. కానీ అనుకోకుండా ఒక ప్రమాదం లో వర్మ మరణించాడు. లలిత కు తన ప్రపంచం అంతా ఒక్కసారి కూలి పోయినట్టు అయిపోయింది. తాను నమ్ముకున్న భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడు. నెమ్మది నెమ్మది గా రోజులు గడుస్తున్నాయి. పిల్లలే ప్రంపంచం గా బతుకుతుంది. తనకి ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. ప్రతీ రోజు ఇంటికి వచ్చే అప్పుల వాళ్ళ వలన. వర్మ చాలా మంది దగ్గర పెద్ద మొత్తం లో అప్పులు చేసాడని. తనకి తెలియకుండా కొన్ని వ్యసనాలకు అలవాటు పడ్డాడని . తనకు తెలిసిన భర్త వేరని. రోజు రోజు కు అప్పులు ఇచ్చిన వాళ్ళ వత్తిడి పెరిగింది. అప్పులు తీర్చడం కోసం ఉన్న ఆస్తులు అమ్మక తప్పలేదు. బంధువులు అంతా ఎక్కడ లలిత సహాయం అడుగుతుందో అని రావడమే మానేశారు. ఇంతకాలం కొడుకులా చూసుకున్న మరిది కూడా తన వాటా ఆస్తి తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు లలిత ఒంటరి. ఆస్తులు లేవు. ఆప్తులు లేరు. చదువు లేదు. బయటకి వెళ్లి బతకగలిగే ధైర్యం లేదు. ఉన్నదల్లా పిల్లలు. అప్పుడప్పుడు విధి కొన్ని మంచి పనులు చేస్తుంది. వర్మ సర్వీస్ లో ఉండగానే మరణించాడు కాబట్టి అతని ఉద్యోగం వర్మ కు ఇస్తామని లేఖ అందింది. కానీ వర్మ మొదట అందుకు ఒప్పుకోలేదు. తనకు బయటి ప్రపంచం తెలియదు అని తాను ఆ ఉద్యోగం చేయలేను అని. కానీ వేరే దారి లేదు. కొంత కాలం గడిస్తే తిండి కి కూడా కట కట లాడవాల్సిన పరిస్థితి. ఇంక పిల్లలు ను ఎలా చదివించాలి ? ఎలా పెంచాలి ? అనే ఆలోచనలు చుట్టుముట్టాయి. భవిష్యత్ అంతా అంధకారం గా కనబడింది. తప్పని సరి పరిస్థితి లో ఉద్యోగం చేయాలి అని నిర్ణయించుకొంది. వెళ్లి అధికారులను కలిసింది. లలిత ఆరవతరగతి వరకు మాత్రమే చదవడం వలన ఒక స్కూల్ లో అటెండర్ గా జాబ్ ఇస్తామని చెప్పారు అధికారులు. ఒక్కప్పుడు ఇంటి నిండా పనివాళ్ళు. పాడికి పంటకు లోటు లేదు. ఇల్లు కదలకుండా చూసుకునే భర్త. మహారాణి లాంటి జీవితం. కానీ నేడు ఒక ప్రభత్వ స్కూల్ లో అటెండర్ గా పని చేయాలి అంటే ఎలా ? మనసు మదన పడింది. తనలో తానే చాలా సతమతమైంది. కానీ తప్పదు. పిల్లలు కు మంచి భవిష్యత్ ఇవ్వాలి. వాళ్ళను బాగా చదివించాలి అనే ఒకే ఒక కోరికతో ఆ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంది. ఉద్యోగం లో చేరింది. మొదటిరోజు అంతా కొత్త కొత్త గా ఉంది. తన జీవితం ఎలా గడిచింది. ఇప్పుడు ఎక్కడ ఉంది. దీనికి కారణం ఎవరు? తన భర్త మీద ఉన్న నమ్మకం తో గుడ్డి గా నమ్మడమా ? పూర్తి గా ప్రపంచ జ్ఞానం రాకుండానే పెళ్లి చేసేస్తుంటే ...తన తండ్రి మాట కాదు అనకపోవడమా ? కారణం ఏదైనా కానీ ఈరోజు మాత్రం దాని ఫలితం అనుభవిస్తున్నది మాత్రం తానే ..! అమ్మా అమ్మా... అనే పిలుపుతో మళ్లీ జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది లలిత. అమ్మా వెళ్దామా అన్న కూతురు మాటలను పట్టించుకోకుండా .... బాలయ్య వైపుకి తిరిగి, చూడు బాలయ్య.... స్త్రీ గా పుట్టాక ఒకరి మీద ఆధారపడి జీవించాలి అనే ఆలోచనను మన కుటుంబ వ్యవస్థ తరతరాల గా నూరిపోస్తూ ఉంది. తరాలు మారినా మనిషి ఆలోచనలు మాత్రం మారడం లేదు. ఒకపక్క ప్రపచం లోని ఉన్నత పదవులు అందుకోవడానికి మహిళలు పోటీ పడుతుంటే , అంతరిక్షంలో కి ఆడపిల్లలు అడుగు పెడుతుంటే , ఎన్నో క్లిష్టమైన ఉద్యోగాల్లో , వ్యాపారాల్లో నెగ్గుకు వస్తూ దేశ ప్రగతి కి వెలుగై ఉంటుంటే ...ఇంకా మనలా ఇప్పటికీ ఆడపిల్ల అంటే చదివించక్కర్లేదు, వీలైనంత త్వరగా పెళ్లి చేసి గుండెల మీద భారం దింపుకుందాం అని ఆలోచించే తల్లిదండ్రులు ఎన్నో పల్లెల్లో ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు. నీకు ఒక కొడుకే ఉంటే ఇలా చేసేవాడివా ? మరి ఎందుకు నీకు ఈ తారతమ్యం.? ఒకవేళ నువ్వు చదివించలేక పోతే చెప్పు నేను రమ ను చదివిస్తాను. అంటూ ఒక్క నిమషం ఆపింది. అప్పటి వరకు మాట్లాడకుండా వింటున్న బాలయ్య నన్ను మన్నించండి అమ్మగారు. నేను కూడా ఒక సామాన్య ఆడపిల్ల తండ్రిలానే ఆలోచించాను తప్ప మరేమీ కాదు. తప్పకుండా నేను నా కూతురు ను చదివిస్తా ...అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ మాటలు విన్న లలిత సంతృప్తి గా వెనుతిరిగింది. ..... ........ సమాప్తం.......