గోవిందుడు అందరి వాడు - కందర్ప మూర్తి

Govindudu andarivaadu

నగరంలో ఒకమూల ఊరూ పేరూ లేని బడుగు బలహీన వర్గాలు నివసించే మురికివాడ ప్రాంతం అది. చెత్తా చెదారం ఈగలు మురుగు దుర్ఘందంతో పరిసరాలు అసహ్యంగా కనబడు తున్నాయి. నిరక్షరాస్యత పరిసరాల అపరిశుభ్రత వీధి కుక్కల సంచారంతో ఆ ప్రదేశం ఎంత వెనుకబడి ఉన్నదీ విశదమవు తోంది. చిన్న చిన్న అట్టలు రేకులు ప్లాస్టిక్ డొక్కుల మీద సినిమా ఫ్లెక్సీలు పేకింగ్ మెటీరియల్ కప్పులుగా గుడిశలే వారి నివాశ గృహాలు. యువకులు, మద్య వయస్కులు , రిక్షాలు తొక్కుతుంటే, మరి కొంతమంది చెత్తా చెదారం ఏరుకోడానికి వీధుల వెంట డంపింగ్ యార్డుల వద్దకు వెళ్లగా, పిల్లలు బిక్ష మెత్తడానికి రోడ్ల వెంబడి పోతారు. వయోవృద్ధులు వికలాంగులు రోగిస్టులు బయటకు కదల లేక గుడిసెల్లో ఉంటున్నారు. ఆకలి అనారోగ్యం ఆ పరిసరాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. రోజూ తిండి సమయానికి గుడిసెల వద్దకు వచ్చి ఆకలి తీర్చే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తల వ్యాను కోసం ఎదురు చూస్తున్నారు వారు. మద్యాహ్నం పన్నెండు గంటల సమయం దాటింది. రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సేవ కార్యకర్తలు తెల్ల వ్యాన్లో వచ్చి మురికి వాడకు కొద్ది దూరంలో ఆపేరు. కొంతమంది యువతీ యువకులు ప్లాస్టిక్ డబ్బాలలో వారికి ఆహారం నీళ్లు తెచ్చారు. ప్లాస్టిక్ ప్లేట్లలో సర్ది గుడిసె గుడిసెకు అందిస్తున్నారు. మరికొందరుఫస్టు ఎయిడ్స్ బాక్సులతో వచ్చి రోగిస్టులకు డ్రెస్సింగ్ చేసి కావల్సిన మందులు ఇస్తున్నారు. పరిసరాల్లో బ్లీచింగ్ పౌడరు ఫినాయిల్ జల్లి వెల్తున్నారు. వారంతా వివిధ సాఫ్టువేరు సంస్థల్లో పని చేస్తున్న ఉధ్యోగులు.యువతీ యువకులు స్వచ్ఛందంగా షిప్టుల వారీగా ఒక బ్రిగేడ్ గా ఏర్పడి హోటళ్లు రెస్టారెంట్లు ఫంక్షన్ హాళ్ల వద్ద మిగిలి పోయిన ఆహార పదార్థాలు ఇళ్లలో నుంచి హాట్ పేక్ కంటైనర్లలో సేకరించి మురికివాడల్లో అనాథ అశ్రమాల్లో పంచు తారు. రోగగ్రస్తులు వికలాంగులకు ప్రథమచికిత్స చేసి కావల్సిన మందులు పంపిణీ చేస్తారు. మురికివాడల పరిసరాలు ఫినాయిల్ దోమలమందు స్ప్రే చేసి వెల్తారు. మానవతా దృక్పధంతో అభాగ్యులు అనాథలకు వారి వంతు కృషి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నిరక్షరాస్య అమాయక జనాల ఓట్లను నోట్లు మద్యంతో కొని పదవి సంపాదించిన రాజకీయ నాయకులు మళ్లీ ఎన్నికల వరకు ఇటు రారు. వేల రూపాయల జీతం తీసుకునే మున్సిపల్ సిబ్బంది ఇటు తొంగి చూడరు. మురికవాడల ప్రజలు నిరక్షరాస్యత ఆనారోగ్యం పేదరికం సరైన పోషణ లేక రోగాలతో కృసించి చనిపోతున్నారు. ఆకలి దప్పులతో ఆర్థిక సంపాదన లేక యువత మాదకద్రవ్యాల సరఫరా దొంగతనాలు రౌడీలు గూండాలుగా మారి అసాంఘిక చేతుల్లో కీలుబొమ్మలుగా మారి సమజానికి చీడపురుగుల్లా తయారవుతున్నారు. ఈ మురికి వాడల పురోభివృద్ధికి ఏదైనా పరిష్కార మార్గం చూడాలను కున్నారు రాబిన్ హుడ్ ఆర్మీ బ్రిగేడ్ కార్యకర్తలు. కాని సరైన దారి కనబడటం లేదు. ఒకరోజు ఆర్మీ బ్రిగేడ్ స్వచ్ఛంద కార్యకర్తలు గుడిసెల్లో ఆహార పేకెట్లు పంచుతుండగా ఇరవై సంవత్సరాల యువకుడు వారి దగ్గరకొచ్చి ఆకలిగా ఉంది , తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతున్నాడు. మాసిన గడ్డం తైలసంస్కారం లేని జుత్తు మాసిన బట్టలతో నీర్సంగా కనిపిస్తున్నాడు. కాళ్లూ చేతులు బాగానే ఉన్నాయిగా ఏదైన పని చేసుకుని బతకొచ్చుగా అన్నారు కార్యకర్తలు. తను సిటీకి కొత్తని, రెండు రోజులుగా ఆకలితో పస్తులుంటు న్నాననీ ఎవ్వరి నడిగినా పని ఇవ్వలేదని , రోడ్డు మీద బిచ్చ మెత్తుతుంటే పోలీసులు తరిమేసారన్నాడు. ఏమైనా చదువు కున్నావా అంటే ఇంటర్ పాసయ్యానని, ఊళ్లో ఏదీ ఉపాధి దొరక్క సిటీ కొచ్చి ఫుట్ పాత్ మీద గడుపుతున్నాననీ చెప్పేడు. స్వచ్ఛంద కార్యకర్త‌లకు ఒక ఆలోచన తట్టింది. ఈ కుర్రాడి ద్వారా మురికి వాడలో మార్పుతేవాలనుకున్నారు. ఆ యువకు డికి ఆహారం నీళ్ల పేకెట్టు ఇచ్చి నీ ద్వారా ఒక మంచి పని జరగాల్సి ఉందని వారి ఆలోచన తెలియ చెప్పారు. తన పేరు గోవిందనీ పల్లెగ్రామం నుంచి బ్రతుకు తెరువు కోసం సిటీ కొచ్చాననీ కడుపులో ఆకలిమంట తగ్గిన తర్వాత వివరాలు చెప్పాడు ఆ యువకుడు. నువ్వు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడివి, చదువు కున్న వాడివి నీలాగే బ్రతుకు తెరువుకోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ జనాల్లో మార్పు నీ వల్లే సాధ్యమౌతుందనీ వారితో ఉంటూ వారికి చదువు ఆరోగ్య రక్షణ పరిసరాల శుభ్రత దురలవాట్ల నుంచి దూరంగా ఉండేలా చెయ్యాలనీ ,నీకు కావల్సిన వసతులు ఆర్థిక సాయం మేము చేస్తామనీ గోవిందుకి నచ్చ చెప్పగా సరే నన్నాడు. రాబిన్ హుడ్ ఆర్మీ బ్రిగేడ్ సబ్యులు గోవిందును తమ వెంట తీసుకెళ్లి స్లమ్ ఏరియా ప్రజల వ్యవహారశైలి దురలవాట్లు ఆర్థిక సంపాదన జీవన విధానం పట్ల అవగాహన కల్పించారు. అక్కడ ఉండి వారిలో ఒకడిగా కలిసిపోయి మార్పు తేవాలని చెప్పారు. గోవిందు రంగంలోకి దిగాడు. వేషభాషలు మార్చి గెడ్డం జుత్తు పెంచి మురికివాడ పోచమ్మగుడి దిమ్మ మీద మకాం పెట్టాడు. సాయంకాలమయేసరికి రిక్షావోళ్లు లేబరు చిత్తుకాగితాలు ఏరుకునేవారు చిరు వ్యపారులు ఒక్కొక్కరు బస్తీకి చేరు కుంటున్నారు. గుడిసెల మద్య వెలిగే మసకదీపాల కాంతే వారికి దిక్కు. ఇరుకు సందుల్లో గాలి వెల్తురు లేని ప్లాస్టిక్ పరదాలు ఫ్లెక్సీలే వారి నివాసాలు. పగలు సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ భాగం తాగుడు జూదం మట్కాలకే ఖర్చు చేస్తుంటారు. తాగిన మైకంలో కోట్లాటలు అక్కడ సర్వసాధారణం. పిల్లల్లో మాదక ద్రవ్యాల అలవాటు ధూమపానంతో పాటు పోషక ఆహార లోపం అనారోగ్యంతో బక్క చిక్కి కనబడతారు. ఆడవారైతే శరీరం అమ్ముకుంటూ గుప్తరోగాలతో నరకాన్ని అనుభవిస్తున్నారు. పెద్దోళ్లు తాగుడు మైకంలో దేవదాసుల్లా వ్యవహరిస్తూంటారు. పగలు ప్రశాంతంగా ఉండే బస్తీ రాత్రయితే భయంకరంగా కనబడుతుంది. మసక వెలుగులో పోచమ్మ గుడి గట్టు మీద కూర్చున్న గోవిందును చూసి " ఎవడ్రా నువ్వు , ఇక్కడ చేర్నావు?ఏ ఊరు మంది" ఒక తాగుబోతు క్వార్టర్ బాటిల్ మందు ప్లాస్టిక్ గ్లాసులో పోసుకుంటు అడిగాడు. సమాదానం చెప్పి ఒకమూల కూర్చుని వారి వ్యవహారశైలి గమనిస్తున్నాడు. మరికొందరు బీడీలు సిగరెట్లు ముట్టించి తాగిన నిషాలో బిర్యానీ పేకెట్లు విప్పి తింటున్నారు. ఒకవైపు ఆడాళ్లు చీరలు సింగారించుకుని ముఖాలకు సున్నం లాంటి పౌడరు కోటింగుతో అంగడి బొమ్మల్లా తయారై విటుల కోసం ఎదురు చూస్తున్నారు. గుడిసెల్లోని ముసలోళ్లు దగ్గు ఆయాసం బాధలతో సతమతమౌతున్నారు. ఇదంతా గమనిస్తున్న గోవిందు తను పుట్టి పెరిగిన పల్లె వాతావరణానికీ ఇక్కడి మురికివాడల పేదల బతుకులు చూసి చలించిపోయాడు. అలా మురికివాడ బస్తీలో ఉంటూ స్వచ్ఛంద సేవల కార్యకర్తల సహకారంతో వారి జీవనరీతిని గమనిస్తున్నాడు. పగలైతే ఆడ మగ జీవనోపాధికి బయటకు పోతే రోగిస్టులు ముసలోళ్లు అంగవైకల్యం ఉన్నవారు గుడిసెల వద్ద పడి ఉంటున్నారు. మధ్యాహ్నం పన్నెండు దాటగానే రాబిన్ హుడ్ ఆర్మీ బ్రిగేడ్ వాలంటీర్లు వ్యాన్లో టిఫిన్ బాక్సుల్లో ఆహారం మంచినీళ్ల పేకెట్లు ప్రథమచికిత్స బేగులతో వచ్చారు. గోవిందు ఎదురెళ్లి వారితో పాటు సహాయ కార్యక్రమాల్లో తోడ్పడుతున్నాడు. ముసలి వారికి మందులు రోగిస్టుల గాయాలకు శుభ్రం చేసి కట్లు కట్టడం చేస్తున్నాడు. క్రమంగా మురికివాడ బస్తీ జనాల్లో మంచిని సంపాదించి వారిలో ఒకడిగా మసలుతూ చనువు సంపాదించాడు. రాత్రయితే తాగుబోతుల కేకలు జూదగాళ్ల కోట్లాటలు ఆడవాళ్ల వెకిలి చేస్టలకు అలవాటు పడుతున్నాడు. మరికివాడ బస్తీ లీడరు గోవిందు చెప్పు చేతల్లో కొచ్చాడు. సదువుకున్న కుర్రోడు కొలువు కోసం ఊరి నుంచి సిటీ కొచ్చి నాడని తెలిసి మంచిగా మసులుతున్నాడు. అదీగాక స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లతో కలిసి బస్తీలోని ముసలోళ్లకు కుంటోళ్లకు గుడ్డోళ్లకీ వైద్య సౌకర్యం కలగచెస్తున్నాడని విని మర్యాదగా చూస్తూ గోవిందుకి ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దని బస్తీ జనాలకు హుకుం జారీ చేసాడు గల్లీ లీడరు. క్రమేపి గోవిందు తన మాటలు చేతలతో బస్తీ జనాల మంచిని సంపాదించాడు. వారి సహకారం ఆప్రాంత మున్సిపల్ కార్పొరేటరు శాసనసబ్యుడు ఆర్థిక సహాయంతో పోచమ్మగుడి ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మించి జండాదిమ్మ కట్టి జాతీయ దినాలపుడు పండగలకు సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాడు. రాజకీయ నాయకుల సాయంతో చిన్న కిరాణా షాపు తెరిపించాడు. ఇంతలో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చాయి. ఆర్మీ బ్రిగేడ్ కార్యకర్తలు ఆ ఏరియా వార్డుమెంబరుగా కంటెస్టు చెయ్యమన్నారు. ఆ బస్తీ ఓట్లన్నీ గల్లీమేస్త్రి సాయంతో గోవిందుకు పడి ఏరియా వార్డు మెంబరయాడు. ఇప్పుడు గోవిందు వేషభాషలు మారిపోయాయి. ఉండటానికి అక్కడే ఇల్లు సమకూరింది. తిరగడానికి మోటర్ సైకిల్ వచ్చింది. యం.యల్.ఎ.గారు కార్పొరేటరు గారి సహాయ సహకారాలతో బస్తీలో కావల్సిన సదుపాయాలు సమకూరుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. అర్హులందరికీ రేషన్ కార్డులు సమకూరాయి.మున్సిపల్ నీటి టేంకరు కట్టించి ట్యాంకరు లారీ ద్వారా నీరు నింపుతున్నారు.రేకుల షెడ్డు కట్టించి రేషనుషాపు ప్రారంభించాడు. చదువుకునే వయసు కుర్రోళ్లు చెత్తలు ఏరడానికి పోకుండా చదువుల బాట పట్టేరు. వారికి బడిలో కావల్సిన పుస్తకాలు వస్తువులు చిరుతిళ్లు స్వచ్ఛంద కార్యకర్తలు సమకూరుస్తున్నారు. స్త్రీ పురుషులకు వేరు వేరుగా మరుగు దొడ్లు ఏర్పడ్డాయి. రాబిన్ హుడ్ ఆర్మీ బ్రిగేడ్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గోవిందుకి సలహాలిస్తూ బస్తీ పురోభివృద్ధికి సహకరిస్తున్నారు. బస్తీ ప్రజల ప్రవర్తనలో మార్పులు కలుగుతున్నాయి. గోవిందు మాటకు విలువిస్తూ చెప్పినట్లు చేస్తున్నారు. ముందుగా బస్తీ పిల్లల్ని అక్షరాస్యుల్ని చేసి క్రమేపి అభివృద్ధి పనులు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఆడవారికి సంక్షేమ పథకాలు అమలు పరిచి పేపరు సంచులు ప్లాస్టిక్ వైర్లతో చేతి బేగులు కొవ్వొత్తుల తయారి వంటి చేతివృత్తులు ప్రారంభించి వాళ్ళకు ఇళ్లవద్దే జీవనోపాధి కల్పించాలను కున్నాడు. స్త్రీ సంక్షేమ సంఘాల సహాయం తీసుకున్నాడు. ఆ మురికివాడకు గాంధీనగర్ పేరుతో ముఖద్వారం ఏర్పాటు చేసి మహాత్ముని నిలువెత్తు బొమ్మ ప్రతిస్టించారు. కమ్యూనిటీ హాలు పక్కన రెండు గదులు నిర్మించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆ ప్రాంత శాసనసబ్యుని చేతుల మీదుగా ప్రారం భించాడు. ప్రతి గుడిసెకు వెళ్లి చదువుకునే పిల్లల్ని పాఠశాలకు రప్పించి స్వచ్ఛంద సంస్థల సబ్యుల ద్వారా వారికి యూనిఫారాలు పుస్తకాలు ఇతర వస్తువులు సమకూరుస్తున్నారు. మధ్యాహ్న భోజన వసతి జరిగింది. శరీర ఆరోగ్యం పరిశుభ్రత విషయాల్లో అవగాహన కల్పిస్తూ పోషక పదార్థాలు సమకూర్చి ఆటపాటల్లో తర్ఫీదు ఇస్తున్నారు. బస్తీ జనాలకు వాలంటీర్లు దృశ్యమాధ్యమాల ద్వారా మద్య పానం పొగతాగడం గుట్కావంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిమాణాలు తెలియచేసి వారిలో మార్పు తేగలుగుతున్నారు. రిక్షాలు నడపడం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటు డబ్బు పొదుపు పట్ల శ్రద్ద కనబరుస్తున్నారు. వైద్య సదుపాయం పరిసరాల శుభ్రత పోషక ఆహారం వల్ల నవజాత శిసువుల మరణాలు తగ్గుముఖం పట్టేయి. బస్తీలో కాలిబాటలు ఏర్పడి పూలమొక్కల అలంకరణతో పరిశుభ్రంగా కనబడుతున్నాయి. వీధి దీపాలు అంతటా వెలుగుతు కాంతివంతంగా కనబడుతున్నాయి. గుడిసెలకు వెంటిలేషనుతో సిమ్మెంటు రేకులు కప్పులు ఏర్పడ్డాయి. చిల్లరగా తిరిగే పిల్లలు విధ్యార్థులుగా మారి సందడి చేస్తున్నారు. బస్తీలో రోడ్లు పరిశుభ్రంగా కనబడుతున్నాయి. కమ్యునిటీ హాల్లో కలర్ టెలివిజన్ తో పాటు సంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదివరకు పోచమ్మ గుడి దిమ్మ మీద కూర్చొనే తాగుబోతులు పేకాటరాయుళ్లు గుట్కా మాస్టర్లు వాటిని వదిలి టెలివిజన్ కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నారు. బస్తీలో ముసలోళ్ల దగ్గులు రోగిస్టుల బాధలతో కూడిన అరుపులు తగ్గేయి. ఇప్పుడు గాంధీనగర్ బస్తీలో గోవిందు అంటే పెద్ద మనిషిగా లీడర్ గా గౌరవం ఏర్పడింది. ఆయన ఏది చెబితే అదే వేదం వారికి. ఆ ప్రాంత రాజకీయ నాయకులకు ఓటుబ్యాంకుగా మారేడు. ఒకప్పుడు సిటీ చివర ఊరూ పేరూ లేని మురికివాడ గాంధీ నగర్ బస్తీ ఆదర్సబస్తీగా అందరి మన్ననలు పొందుతోంది. సిటీలో ఇతర కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఈ బస్తీలో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రశంసిస్తున్నారు. సినేమా షూటింగుల వారు టెలివిజన్ చానల్స్ వల్ల ఆర్థికంగా బస్తీ కి అనేక వనరులు ఏర్పడుతున్నాయి. బస్తీ జనాలకు తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేసి గాంధీ నగర్ బస్తీకి పెర్మనెంటు ప్రభుత్వ ఆవాశ గృహపథకం మంజూరైంది. వార్తాపత్రికలు ప్రసార మాద్యమాల్లో గాంధీ నగర్ మురికివాడ అన్ని విధాల అభివృద్ధి చెందిన బస్తీగా పేరు సంపాదించింది. పచ్చని పర్యావరణం విద్య వైద్య రక్షిత మంచినీరు పరిసరాల శుభ్రత మురుగు కాలువలు మరుగుదొడ్లు చక్కటి కాలిబాటల మౌలిక సౌకర్యాలతో ఆదర్సంగా పేరు సంపాదించింది. ప్రస్తుతం గాంధీ నగర్ బస్తీలో ఆడవారికి డ్వాక్రా గ్రూపులు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు ఇంటింటికీ రేషన్ కార్డులు వృద్ధాప్య పెంన్షన్లు చదువుకున్న కుర్రాళ్లకి స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకు లోన్లతో ఆటోరిక్షాలు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులతో స్వచ్ఛ భారత్ పోటీలో ప్రత్యేక నగదు బహుమతులు సంపాదించిది. గోవిందు గాంధీ నగర్ బస్తీలో అందరికీ అన్న తమ్ముడు బిడ్డగా అంకుల్ పిలుపులతో అందరివాడయ్యాడు. అధికార రాజకీయ పార్టీ అధిస్టానం దృష్టిలో తదుపరి ప్రాంతీయ కార్పొరేటరుగా ఎన్నిక జరిగే అవకాశం ఏర్పడింది. రాబిన్ హుడ్ ఆర్మీ బ్రిగేడ్ సేవకార్యకర్తలు తమ ఆలోచన పథకం ఫలించి వెనుక బడిన మురికివాడ గోవిందు ద్వారా అభివృద్ధితో ముందంజ వేసినందుకు ఆనందభరితులయారు. ** ** ** **

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు