మనోవాంఛ - కందర్ప మూర్తి

Manovancha

" అమ్మా ! నాన్న ఇంకా రాలేదు. స్కూలు బస్సుకు టైమయి పోతోంది." తొందర పడుతున్నాడు విజయ్. " వచ్చేస్తారు లే, విజయ్! ఈనెల మొదటి సోమవారం కదా , శర్మోనియం పెరేడ్ ఉంటుంది. రావడానికి కాస్త ఆలశ్యమవుతుంది" అని తల్లి భారతి సర్ది చెబుతూండగా ఫేమిలీ క్వార్టర్ గుమ్మం ముందు సైకిల్ బెల్ వినబడింది. తలుపు తీసుకుని ఆకుపచ్చని యూనిఫాం , నెత్తిన బ్లూ బేరెట్ కేప్ , నున్నని గెడ్డం, నడుంకి బెల్టు , కాళ్లకి నల్లని పాలిష్ తో నిగనిగ లాడుతున్న బూట్లతో స్మార్టుగా నడుస్తూ లోపలికి అడుగు పెట్టాడు ఆర్మీ హవల్దార్ సాగర్. "విజయ్, స్కూలుకి రెడియా "అని తండ్రి పలకరించగా "నేను ఎప్పుడో రెడీ అయాను , మీ కోసమే ఎదురు చూస్తున్నా" అన్నాడు స్కూల్ బేగ్ వీపుపై ఎక్కించు కుంటు. హవల్దార్ సాగర్, భార్య భారతి ఇచ్చిన బ్రేక్ ఫాస్టు తిని కొడుకును వెనక కూర్చోబెట్టి సైకిల్ మీద బయలు దేరాడు. హవల్దార్ సాగర్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఆర్మీలో సేవలు చేస్తున్నాడు. తన తండ్రి ఆర్మీలో హవల్దారుగా విధులు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ ఒడంబడిక ప్రకారం శ్రీలంక సైన్యానికి లిబరేషన్ టైగర్స్ తో ఘర్షణ సమయంలో భారత సైనిక బృందంలో వెళ్లి నప్పుడు అక్కడ జరిగిన లేండ్ మైన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకుని వికలాంగుడిగా పదవీ విరమణ చెయ్యవల్సి వచ్చింది. అప్పుడు విధ్యార్థిగా ఉన్న సాగర్ హైస్కూలు చదువు అవగానే మాజీ సైనికుల పిల్లల కోటాలో సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో , వివిధ ప్రాంతాల్లో భాద్యతలు నిర్వహిస్తు అవకాశం ఉన్న చోట కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కొడుకు విజయ్ ని ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ హోదాలో చూడాలని కోరిక పెట్టుకున్నాడు.అందుకు తగ్గట్టు సెంట్రల్ స్కూల్లో చదివిస్తు కృషి చేస్తున్నాడు. విజయ్ కూడా ఆర్మీ వాతావరణంలో పెరుగుతు సైన్యం మీద అవగాహన పెంచుకుంటున్నాడు.ఇంతలో మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలు రావడంతో సైనిక పిల్లల కోటాలో సెలక్టయి మిలిటరీ స్కూల్లో చేరాడు. చదువుతో పాటు ఆర్మీ శిక్షణ కూడా ఇస్తున్నారు. విజయ్ మిలిటరీ స్కూలు శిక్షణ పూర్తయిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవేశ పరిక్షలో ఉత్తీర్ణుడై ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో ప్రవేశం పొంది బెస్టు కేడెట్ గా పాసవుటయాడు. ఇంతలో హవల్దార్ సాగర్ కూడా సర్వీస్ సీనియారిటీతో జూనియర్ కమీషన్డు ఆఫీసర్ తర్వాత సీనియర్ గా సుబేదార్ ప్రమోషన్ తీసుకుని భాద్యతలు నిర్వహిస్తున్నాడు. విజయ్ కి ఇండియన్ కమీషన్డు ఆఫీసర్ కెప్టెన్ హోదాలో తండ్రి సాగర్ విధులు నిర్వహిస్తున్న ఆర్మీ యూనిట్ కి పోస్టింగు ఇచ్చారు. సైనిక రోజూ విధుల నిర్వహణ సమయంలో హోదాను అనుసరించి ఎన్నో ఏళ్ల సర్వీస్ ఉన్న తండ్రి సాగర్ సావధానంగా నిలబడి , కొత్తగా ఆఫీసర్ హోదాలో వచ్చి కుర్చీలో కూర్చున్న కొడుకు విజయ్ కి సెల్యూట్ చెయ్యాల్సి వస్తోంది. యూనిఫామ్ సర్వీసులో కుర్చీలో కూర్చుండే వ్యక్తి హోదాకే కాని వయసుతో సంబంధం ఉండదు. అదే తీరు ఇక్కడ జరుగుతోంది. ఇంటి దగ్గర తండ్రిగా సాగర్ కి గౌరవం ఇస్తున్నప్పటికీ డ్యూటీలో ఆఫీసర్ హోదాలో విజయ్ తండ్రిని చూడాల్సి వస్తోంది. ఈ తీరు కెప్టెన్ విజయ్ కి బాధగా అనిపించి పై అధికారుల్ని రిక్వెస్ట్ చేసి మరో యూనిట్ కి ఆఫీసర్ గా బదిలీ చేయించు కున్నాడు. ఏమైనప్పటికీ , అనుకున్న ప్రకారం తన కళ్ల ముందు పుట్టి పెరిగిన కొడుకు ఆర్మీ కమీషన్డు ఆఫీసర్ గా తన కన్న పెద్ద హోదాలో కనబడటం ఎంతో తృప్తి నిచ్చింది జుత్తు నెరిసిన సుబేదార్ సాగర్ కి. . * * *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు