నిజాయితీకి రోజులు కావు - కందర్ప మూర్తి

Nijayateeki rojulu kaavu

"ఒరె , పైడిగా ఈ కందిబేడలు పట్నానికి తోలుకుపోయి అమ్మెయ్యరా! సినుకులు పడినాయంటే బూజు పట్టి ఖరాబవుతాయి. పోయినేడు కరోనా రోగం గుబులు పుట్టించి అమ్మకాలు లేక పురుగు పట్టి ఎటూ కాకుండా పోయినాయి. ఈ పాలైనా పంట ఖర్చులైన తెచ్చుకోవాల" కొడుకు పైడయ్యకు నచ్చ చెబుతున్నాడు బక్కరైతు సైదులు. " అయ్యా! పట్నం తీసుకుపోయినా కొనేటోళ్లు లేరు. సేట్లు కాడ మిత్తికి పైసలు తెచ్చి భూమ్మీద పెడితే పంటకి గిరాకి రావటం లేదు.ప్రతి సంవత్సరం పంట మార్పిడి సేసి ఎవసాయం సేస్తున్నా డబ్బులు కానడం లేదు. పోయినేడు పత్తి ఇత్తనాలు జల్లితే సగం కూడా గిట్టబాటు కానేదు. ఆ దుకాణం ఓడు బి.టి ఇత్తనాలని నాసిరకం ఇచ్చి కొంప కూల్చినాడు.అంతకు ముందు సంవత్సరం మిరపతోట ఏస్తే పండుకాయకి చీడ పట్టి సగం పంట ఎందుకు పనికి రాక పోయినాది. పెబుత్వం ఏమో అందరు ఒకటే పంట ఎయ్యకండ్రి , మార్కెట్ లో ఏపంటకి గిరాకీ ఉంటే అందరూ దాని మీదే పడకుండ ఏరు ఏరుగా పంటలు ఏసుకుంటే అందరికీ మేలు జరుగుతాదని సెబుతారు. ఒకపాలి ఉల్లికి మార్కెట్లో గిరాకీ ఉందని అందరూ అదే పంట ఏసి మార్కెట్టుకి తెత్తే రేటు పడిపోయి అందరు నెత్తి మీద సేతులు ఏసుకున్నారు. మరొక పాలి టమోటా పంటకి పైసలు వత్తాయంటే వర్షాలు ఎక్కువై పంట కుళ్లి ఎటు కాకుండా పోనాది. అయ్యా , ఇదివరకటిలా ఎవసాయం గిట్టబాటు కావడం లేదు. మనం ఎండనక వాననక కట్టపడి ఎవసాయం సేసినా మన శ్రమే మిగులుతోంది.దళారోళ్లు లేకుండా మార్కెట్లో పంట అమ్మలేక పోతున్నాం.పెబుత్వం ఏం సెయ్యలేక పోతోంది. ఎరువులు సమయానికి దొరకవు. నకిలీ ఇత్తనాలు. సీడలు పీడల నుంచి పంట కాపాడాలంటే బోలెడన్ని డబ్బులు పెట్టి పురుగు మందులు కొనాల. ఇలాగైతే ఎప్పటికి మన అప్పులు తీరాల. బేంకుల కాడ నుంచి ఋణం కావాలంటే బోలెడు పితలాటకం.ఎలాగరా అయ్యా " ఏకరువు పెడుతున్నాడు పైడయ్య. "తప్పదురా, బతికినా సచ్చినా మన బతుకులు ఈ నేల మీదే పోవాల. పోయినేడు యాదిగాడు పత్తి పంటంతా కాయ తొలుచు పురుగు తినేసిందని పెట్టిన పెట్టుబడి రాక అప్పులు మిగిలాయని బెంగతో పొలంలో పురుగుల మందు తాగి పేణం ఒగ్గేసాడు. అంతకు ముందేడు కిట్టిగాడు వరదలొచ్చి వరిపంట తుడుచుకు పోనాదని పొలం గట్టంట ఏప చెట్టుకు ఉరిపోసుకు పేనాలు తీసుకున్నాడు. మనకా సదువులు లేవాయె. మన పెద్దోళ్లు ఇచ్చిన ఈ ఎవసాయ భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. మన పెద్దోళ్ల సమయంలో సీజను పెకారం వర్షాలు కుర్సేటివి. పంట దిగుబడి మస్తుగా ఉండేది. పసువుల ఎరువులు పచ్చి రొడ్డ ఇలా మంచి ఎరువులు గట్టి ఇత్తనాలు దొరికేవి. పెట్టుబడికి బయం లేకుండేది. ఇప్పుడు కాలం మారింది. సీజను పెకారం వానలు రావాయె. ఎప్పుడు తుఫానులు వరదలు వత్తయో ఎరిక లేదు. బగవంతుడి మీద బారం ఏసి రోజులు గడపాల " కొడుక్కి నచ్చ చెబుతున్నాడు. "అలాగేరా ,అయ్యా! కందిబేడలు ఒకపాలి ఎండబెట్టి బస్తా కెక్కిస్తాలే. ఒక బోరి బస్సు మీద ఏసుకుని పట్నం ఈదుల్లో అమ్ముతా!" అని నాయనకు బరోసా ఇచ్చినాడు. ఒకరోజు ఒక బోరీ నిండా యాబై కేజీల కందిబేడలు నింపి బస్సు మీద పట్నం చేరుకుని అరుచుకుంటు అమ్మకం మొదలెట్టాడు పైడయ్య. ఒక వీధిలోఅరుచుకుంటు వెల్తుంటే ఒక ఇంటి ముందు అమ్మ "కంది పప్పు , ఇలారా" అని పిలిచి బస్తాలోంచి కందిపప్పు చేత్తో పైకి తీసి కెజి ఎంతని అడిగింది. పైడయ్య మార్కెట్ రేటుకి చాలా తక్కువ చెప్పాడు. "ఇదేంటయ్య ఇంత ఖరీదు చెబుతున్నావు. సూపర్ మార్కెట్లో పాలిష్ చేసి పేక్ చేసిన కందిపప్పే తక్కువ ఖరీదుకి వస్తుంటే నువ్వేంటి ఇంత రేటు చెబుతున్నావని" అంటూ నకిలీ సరుకు కాదుకదా అని అనుమానం వ్యక్తం చేసింది. "లేదమ్మా, మా పొలంలో పండించిన నికార్సైన సరుకు. ఊరి నుంచి కొంచం కొంచం సరుకు పట్నానికి తెచ్చి అమ్ముకుంటున్నాను. సరుకు అమ్ముడైతే సాయంకాలం ఊరికి పోతా. చెప్పమ్మా! ఎంత కావాలన్నాడు." "లేదయ్యా, కందిపప్పు రంగు చూస్తుంటే నకిలీ దానిలాగుంది. నేనడిగిన రేటుకైతే రెండు కెజీలు తీసుకుంటానని" సగం రేటుకి అడిగింది. "అమ్మా, సూపర్ మార్కెట్లో మందులు జల్లిన పప్పులు పేకెట్లో ఎట్టి మా దరకి రెండింతలు తీసుకుంటారు. మేము పొలంలో కాయకష్టం సేసి అసలు సరుకు ఈదులంట మీ గుమ్మాల ముందు తెచ్చి అమ్మితే ఇట్టా మాటాడతారు. నాయానికి రోజులు కావమ్మా , తప్పుడు కొలతలు నకిలీ సరుకే జోరుగా అమ్ముడు పోతాది."అంటూ ముందుకు సాగిపోయాడు అమాయక రైతు పైడయ్య.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు