భద్రానికీ ఓ కధ ఉంది ! - తటవర్తి భద్రిరాజు

Bhadraniki o katha vundi

చిన్నగా వర్షం పడుతూ ఉంది. కనకదుర్గ వైన్స్ పక్క సందులో ఉండే వక్కల భద్రం ఇంటి ముందు జనం గుమికూడి ఉన్నారు.

కొంతమంది పడుతున్న వర్షాన్ని ఆపడానికి అన్నట్టు గా గొడుగులు పట్టుకున్నారు. మరికొంత మంది ఆ చినుకులలో తడుస్తూ భద్రం ఇంటి లోపల ఏమి జరుగుతుందో అని ఆత్రుత తో ఉన్నారు.

ఈ సందు ఎప్పుడూ ఉదయం నుండి రాత్రి పది వరకూ మందు బాబు లతోనే ఉంటుంది.
ఐతే ఈరోజు భద్రం ఇంటి ముందు ఉన్నది మందు బాబు లు కాదు.

భద్రం బంధువులు. ఇంటి పక్క వాళ్ళు.

భద్రం ఇంటి గోడకు ఆనుకుని నల్ల కుక్క ఒకటి పడుకుని ఉంది. వర్షం చినుకులు దాని మీద పడ్డప్పుడు అల్లా చిన్నగా మూలుగుతూ ఉంది.

కనకదుర్గ వైన్స్ ముందు జనం మాత్రం అలానే ఉన్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.

నిన్నటి వరకూ అందరితో మాట్లాడిన భద్రం ఇప్పుడు ఆ ఇంటి లోపల విగత జీవిగా ఉన్నాడు.

నెమ్మది నెమ్మది గా వర్షం ఎక్కువైయింది. భద్రం ఇంటి ముందు జనం కూడా ఎక్కువయ్యారు.

గోడపక్క నున్న నల్ల కుక్క తడవని మరో చోటు కోసం వెదుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

నిన్నటి వరకు ఆ మంచం పైన ఫ్యాన్ కిందే పడుకునే భద్రం , ఈరోజు ఆదే ఫ్యాన్ కి వేసిన తాడుకు వేలాడుతూ ఉన్నాడు.

అదే గదిలో ఒక పక్కగా గోడకు జారబడి ఏడుస్తూ ఉంది సుజాత. సుజాత భద్రం భార్య.

ఏడ్చి ఏడ్చి సుజాత కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి.

పెరుగుతున్న వర్షానికి ఇంటి పైకప్పు నుండి పడుతున్న నీళ్లు ఎక్కువయ్యాయి.

తలమీద ప్లాస్టిక్ కవర్ వేసుకుని వర్షం లో తడవకుండా నుంచున్న ముసలయ్య 'భద్రం పిరికివాడు కాదు. చాలా ధైర్యవంతుడు. కానీ ఎందుకు ఇలా చేసాడో ? అన్నాడు.

ముసలయ్య ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. నల్ల కుక్క కాళీ చేసిన ప్రదేశం లో పొట్టి రాములు గోడకు జారపడి నుంచున్నాడు.

పెరుగుతున్న వర్షానికి మట్టి రోడ్ పక్కనుండి వర్షం నీళ్లు పిల్ల కాలువలులా పారుతున్నాయి.

చల్లటి గాలి కొంచం వేగంగా వచ్చింది. ముసలయ్య తలపై వేసుకున్న ప్లాస్టిక్ కవర్ గాలికి ఎగిరింది.

వేగంగా వచ్చిన గాలికి గోడ పక్క నుంచున్న పొట్టి రాములు పై వర్షం జల్లు పడింది.

దూరంగా పోలీసు జీపు సైరన్ వినపడుతూ ఉంది.

************

వేసవి కాలం. సూర్యుడు కి కోపం వచ్చిందా అన్నట్టు గా ఎండలు మండిపోతున్నాయి.

మధ్యాన్నం అత్యవసరం ఐతే తప్ప ఎవరూ రోడ్లు మీదకి రావడం లేదు.

ఊరి చివర ఉన్న వినాయక గుడి లో కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు.

ఆ పక్కనే ఉన్న చెరువులో కొన్ని పశువులు బురదలో దొల్లుతున్నాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి వాటికి ఇది అలవాటే.

అప్పటిదాకా గుళ్లో ఆడుకున్న పిల్లలు కూడా చెరువు కేసి పరిగెత్తారు. ఆ నీళ్ళల్లో లోకి దూకారు. ఆ నీళ్ళల్లో ఆడుకున్నారు.

నడినెత్తిన సూర్యుడు మండుతున్నా వారికి ఆ వేడి తెలియడం లేదు. ఆ బాల్యం అలాంటిది మరి.

ఆ చెరువులో స్నానం చేస్తున్న వారిలో సరంగి ప్రసాద్ , వక్కల రాంబాబు కూడా ఉన్నారు.

ప్రసాద్ , రాంబాబు ఇద్దరి లో రాంబాబు కొంచం చిన్నవాడు. ఇద్దరూ బంధువులు కూడా. వరసకి బావా బావమరిది అవుతారు.

ప్రతీ రోజు స్కూల్ కి వెళ్లే వీళ్ళు, సెలవులు వచ్చాయంటే వీళ్ళ పశువులను మేతకు తోలుకు వెళ్తుంటారు. మధ్యాన్నం సమయానికి పశువులను చెరువులో వదిలేసి ఆడుకుంటారు.

తరువాత వీళ్ళు కూడా అదే చెరువులో కాసేపు ఈత కొట్టి సాయంత్రం సమయానికి పశువులను ఇంటికి తోలుకు వెళ్తుంటారు.

స్కూల్ లేనప్పుడు వీరి దినచర్య ఇదే. చెరువులో నీళ్లు ఎప్పుడూ మురికిగానే ఉంటాయి. నీళ్ల లోపల అంతా బురద మయం.
అక్కడే ఒకపక్క రజకులు బట్టలు ఉతుకుతూ ఉంటారు. మరోపక్క పశువులు నీళ్లు తాగుతూ, సేద తీరుతుంటాయి.

నీళ్లు కొంత మురికి గా ఉండడం తో ప్రసాద్ నీళ్లలోకి కొంచం లోపలికి వెళదాం అన్నాడు.

రాంబాబు సరే అన్నాడు.
అలా ఇద్దరూ కొంచం లోపలికి వెళ్లారు. ఇద్దరికీ ఈత వచ్చు.

లోపలికి వెళ్ళాక, ప్రసాద్ ఆ నీళ్లలో ఉన్న బురదలో కూరుకు పోయాడు.

ఎంత ప్రయత్నం చేసినా బయటకి రాలేకపోయాడు.
అది గమనించిన రాంబాబు ధైర్యం చేసి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు.

మొత్తానికి ప్రసాద్ ని బయటకి తీసాడు. కానీ ఆ తొందరలో రాంబాబు ఆ బురదలో ఇరుక్కుని పోయాడు. బయటకి రాలేక పోయాడు. ఆ బురద లో కూరుకుని పోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.

ప్రసాద్ ఈత కొట్టుకుంటూ బయటకి వచ్చాడు. ఒడ్డున బట్టలు ఉతుకుతున్న పెంటయ్య కి జరిగింది అంతా చెప్పి , రాంబాబు ని ఎలాగైనా కాపాడమని ఏడుస్తూ చెప్పాడు.

పెంటయ్య వెంటనే అరుస్తూ లోపలికి ఈత కొట్టుకుంటూ వెళ్లి రాంబాబు ని బయటకి తీసుకుని వచ్చాడు.
కానీ అప్పటికే రాంబాబు ప్రాణం పోయింది.

జరిగిన దానికి ప్రసాద్ చాలా భయపడిపోయాడు.

రాంబాబు తల్లి సుజాత, తండ్రి
భద్రం చాలా ఏడ్చారు.

బంధువులు అందరూ ఎంత ఓదార్చినా అలా ఏడుస్తూనే ఉన్నారు.

పరిగెత్తుతున్న కాలం తో పాటు నెమ్మది నెమ్మది గా కొడుకు మిగిల్చిన బాధను కూడా మర్చిపోతున్నారు

కొద్దిరోజుల తర్వాత వర్షాకాలం వచ్చింది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి.
ఆ వర్షాలకు పొలాల్లో పచ్చగడ్డి బాగా పెరుగుతూ ఉంది.

ఓరోజు పొలం లో పశువులు మేపుతున్నాడు ప్రసాద్. పశువులు పచ్చగడ్డి తింటున్నాయి.

ఆకాశం చాలా ప్రశాంతం గా ఉంది. రాబోయే ఏదో ప్రళయాన్ని గుర్తు చేస్తున్నట్టు గా సంకేతం ఇస్తుంది. దూరం గా ఉన్న కుంకుడి చెట్టు పై ఏదో పేరు తెలియని పిట్ట అరుస్తూ ఉంది.

ఆ పక్క పొలం లొనే ఉన్న భద్రం నీకు సీతాఫలాలను కోసి ఇస్తాను రా అని ప్రసాద్ ని పిలిచాడు.

సీతాఫలాల చెట్లు అన్నీ క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా వరుసగా ఉన్నాయి. వాటి దగ్గరకి వెళ్లిన ప్రసాద్ మెడకు ఒక తాడు చుట్టుకుంది.

వెంటనే కింద పడిపోయిన ఆ పసివాడు ఏమైయిందో తెలియక అరుస్తూనే ఉన్నాడు. ఆ తాడు కొంచం కొంచం గా మెడకు బిగుసుకుంటూనే ఉంది. ప్రసాద్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఊపిరి తీసుకునే వేగం తగ్గింది. స్పృహ కోల్పోయాడు.

అలా స్పృహ కోల్పోయిన ప్రసాద్ ని ఆ తాడుతో నేలపై ఈడుచుకుని వెళ్ళిపోయాడు మెడకు తాడు వేసిన భద్రం....!!

ప్రసాద్ అరుపులు విని చుట్టూ ఉన్న పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు వచ్చారు.

భద్రం ప్రసాద్ ప్రాణాలు పోయాయి అనుకున్నాడు. అక్కడ నుండి పారిపోయాడు.

ప్రసాద్ ని వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. ప్రసాద్ కి ఏమీ కాలేదు. జరిగింది అంతా చెప్పాడు.

వర్షం పడుతూ ఉంది. వర్షం లో తడుస్తూ పోలీసు జీపు ఊళ్ళో కి వచ్చింది.

ప్రసాద్ పై హత్యా ప్రయత్నం చేసినందుకు భద్రం ని అరెస్ట్ చేద్దామని. కానీ అప్పటికే భద్రం ప్రాణాలు కోల్పోయి ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్నాడు.

తన కొడుకు రాంబాబు ను చెరువులో చంపింది ప్రసాద్ ఏమో అనే అనుమానం తో భద్రం రాంబాబు ను చంపాలి అనుకున్నాడు. కొడుకు మీద ప్రేమ రాంబాబు మీద పగ గా మారింది.

కానీ పొలం లో రాంబాబు చనిపోయాడు అనే భయం తో ఇంటికి వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు