శకున ఫలితం - కందర్ప మూర్తి

Sakuna falitam

అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి గారు వేద పండితుడు. వేదాల్ని ఔపాసన పట్టిన ఘనాపాటి. నిత్య వేద పారాయణ , ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లుతుంది వారి గృహం. జాతక, గృహవాస్తు, వివాహాది శుభ కార్యాలకు పంతులు గారు నిర్ణయించిన ముహూర్తాలకు తిరుగుండదని ఊరి ప్రజల నమ్మకం. శాస్త్రి గారి ధర్మపత్ని కామాక్షమ్మ భర్తకు తగిన భార్య. ముఖాన పసుపు, నుదుటున రూపాయంత కుంకుమ బొట్టుతో సాంప్రదాయ వస్త్ర ధారణ, కాలికి వెండి కడియాలు, నిత్య పూజా పునస్కారాలతో మహలక్ష్మిలా కనబడుతుందా ఇల్లాలు. శాస్త్రి దంపతుల ఏకైక సంతానం పదిహేనేళ్ల మాధవ్. ఇంట్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమయాను సారం సంధ్యా వందనం, గాయత్రీ జప పఠనం చేస్తూంటాడు. తెలివైన వాడు. వినయ విధేయతల పుట్ట. విశ్వనాథ శాస్త్రి గారు కుమారునికి వారి సాంప్రదాయ విద్యతో పాటు ప్రపంచ జ్ఞానం కోసం అధునాతన విద్య కూడా అవుసర మని తలిచి ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రవేశం కలిగించారు. మాధవ్ చదువులో చురుకైన తెలివైన విధ్యార్థి కావడంతో తరగతిలో ఉపాధ్యాయులు బోధించే విధ్యా విషయాలు ఒకసారి వింటే చాలు జ్ఞాపకం ఉంచుకుని వార్షిక పరీక్షల్లో ఎనబై శాతం పై బడిన మార్కులతో ప్రథముడిగా ఉంటున్నాడు. మాధవ్ కనబరిచే వినయ విధేయతలకు ఉపాధ్యాయులు ముగ్ధులయే వారు. రోజులు గడుస్తున్నాయి. మాధవ క్రింది తరగతుల్లో మంచి మార్కులతో పాసవుతు పాఠశాలకి మెరిట్ విథ్యార్దిగా పేరు సంపాదించు కున్నాడు.ప్రస్తుతం పదవ తరగతిలో కొచ్చాడు. ఇప్పుడు పదవ తరగతి వార్షికపరీక్షలు వ్రాసే సమయం వచ్చింది. మొదటి రోజు పరీక్ష రాసే రోజు మొదలైంది. ఇంతవరకూ ఊరి ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తున్న మాధవ్ కి పదవ తరగతి వార్షిక పరీక్ష పబ్లిక్ అయి నందున పరిక్షా కేంద్రం మరొక పాఠశాలకి మార్పు జరిగింది. మాధవ్ రోజూ మాదిరి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని పదవ తరగతి వార్షిక మొదటి రోజు పేపరు వ్రాయ డానికి బయలు దేరుతుంటే వెనుక నుంచి తల్లి కామాక్షమ్మ " శకునం చూసుకుని వెళ్లు బాబూ ! "అంది మాధవ్ తన వ్రాత పరికరాలతో బయలు దేరి వీధి మలుపు తిరుగుతూంటే విధవరాలైన మేనత్త పార్వతమ్మ ఎదురు పడి " ఏంట్రా , మాధవా ! నీ స్కూలు పరీక్షలు ఎప్పటి నుంచి ?" అంటూ పలకరించింది. మాధవ్ కి చిర్రెత్తి ఏదో జవాబు చెప్పి వెనక్కి వచ్చాడు. అసలే సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన మాధవ్ కి అనుమానా లెక్కువ. వెంటనే ఇంటికి తిరిగొచ్చి కాళ్లు కడుక్కుని చెంబుతో మంచి నీళ్ళు తాగి కూర్చున్నాడు. తల్లికి విషయం చెప్పేడు. కామాక్షమ్మ దేవుడి పూజ గది నుంచి కుంకుమ తెచ్చి బొట్టు పెట్టింది. విశ్వనాథ శాస్త్రి గారు వసారాలో పంచాంగం పట్టుకుని ఎవరికో శుభ ముహూర్తం నిర్ణయిస్తున్నారు. కామాక్షమ్మ కొడుక్కి హితవు చెప్పి పూజా కార్యక్రమంలో నిమగ్నమైంది మాధవ్ పరిక్షకి సమయం మించి పోతోందన్న ఆందోళన తో గుమ్మం ముందు నుంచి తొంగి చూసి ఎవరు లేరని నిర్ధారణ చేసుకుని గబగబ అడుగు లెయ్యడం మొదలెట్టాడు. వీధి మద్యలో కొచ్చేసరికి భైరవ మూర్తి గారింట్లోంచి నూనె పోసే తెలుకుల నూకాలు నూనె చట్టితో ఎదురు పడి " చినబాబూ, ఇస్కూలుకి పోతన్నారా? " అంటూ పలకరించింది. మాధవ్ కి చిర్రెత్తింది. పరుగున ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కుని మంచినీళ్లు తాగి కూర్చున్నాడు. తల్లి పూజ గదిలో పూజలో నిమగ్నమై ఉంది. తండ్రి పంచాంగ పఠనంలో కనిపించారు. పరీక్ష సమయం దాటి పోతోందన్న గాబరాతో మాధవ్ మారు మాట్లాడకుండా గుమ్మం దిగాడో లేదో మంగలి పొది పట్టుకుని అప్పన్న " చినబాబూ , తల బాగా మాసిపోనాది. ఎప్పుడు చెయ్యమంటారని" వినయంగా అడిగాడు. మాధవ్ కి ఒకటే భయం పట్టుకుంది. పబ్లిక్ పరీక్ష కేంద్రం మార్పు జరగడం, తను ఇప్పటికే శకునాల అనుమానంతో సమయాన్ని వృధా కావించడం తట్టుకోలేక పోయాడు. పర్యవసానం , పరీక్షా కేంద్రానికి అర్థగంట ఆలశ్యంగా చేరి కంగారుగా పరీక్ష పేపరు రాయడం జరిగింది. మరుసటి దినం నుంచి తల్లినే నీళ్ల బిందెతో ఎదురు రప్పించి మిగతా పరీక్ష పేపర్లు రాసినా ప్రథమ పరీక్ష రోజు ప్రభావం మిగత రోజుల పరిక్షల మీద కనబడింది. పాఠశాలకు ప్రథముడిగా వస్తాడనుకున్న తెలివైనవిధ్యార్థి మాధవ్ మూఢ నమ్మకాల అనుమానంతో పరీక్ష కేంద్రానికి ఆలస్యమవడం , ఆందోళన తో పరీక్ష రాయడం కారణంగా ద్వితీయ శ్రేణిలో పాసవడం దిన పత్రికలో పరీక్షా ఫలితాలు చూసిన ప్రధానోపాధ్యాయుడు మిగతా అధ్యాపకులు ఆశ్చర్య పోయారు. * * *

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు