కిడ్నాప్ - Dr.Vivekanand Rayapeddi

Kidnap

"కిడ్నాప్ చేశాము మిమ్మల్ని ఇద్దర్నీ"

కరకు గొంతుతో అతను చెప్పిన ఆ మాటల్నిజీర్ణం చేసుకోవటానికి ఆ చిన్నారులిద్దరి కాస్తా సమయం పట్టింది. కాలనీ రోడ్డు పై కారు నిశ్శబ్దంగా వెళుతోంది.

"మీరు గట్టిగా అరిచినా, ఏడ్చి గోల చేసినా అద్దాలు మూసి ఉంచిన కారు లోంచి బయట ఎవ్వరికీ వినిపించదు. పైగా నల్ల రంగు అద్దాలు ఉండటం వల్ల మేము ఏమి చేస్తున్నది ఎవ్వరికి అర్థం కాదు. మీరు నోరు మూసుకుని ఉంటే మీకే మంచిది. ఎక్కువ అల్లరి చేస్తే ఇక్కడే నరికి పారేస్తాము" కరకు గొంతు వాడు తీవ్రమయిన పదజాలంతో హెచ్చరించాడు.

కార్లో వెనుక సీట్లో ఈ ఇద్దరు పిల్లలు, వారితో పాటుగాఈ కరకు గొంతు వాడు.

కారు డ్రయివ్ చేస్తున్న సూటి ముక్కున్న, తెల్లటి వ్యక్తి తలెత్తి అప్పుడప్పుడు అద్దంలో వెనుక సీట్లో ఏమి జరుగుతోందో అని ఒక కన్నేసి ఉంచాడు. అతని పక్కనె కూర్చున్న సన్నటి రివట లాంటి వ్యక్తి భావ రహితంగా కూర్చుని ఉన్నాడు.

ఇలాంటి వ్యవహారంలో చాలా అనుభవుమున్న వారివలే చాలా నింపాదిగా ఉన్నారు ఆ ముగ్గురు యువకులు.

ఇంకో రెండు మలుపులు తిరిగితే, దిల్‍షుక్‍నగర్ మెట్రో స్టేషన్ వద్ద విజయవాడ హైవే ఎక్కేస్తుంది కారు. ఆ ఒక్క సిగ్నల్ అధిగమిస్తే ఇక ఏ అడ్డు లేకుండా నగరాన్ని దాటేయవచ్చు.

కౄరమృగానికి చిక్కిన కుందేలు పిల్లల్లా బిక్క చచ్చి పోయారు ఆ పిల్లలు. వారిలో ముద్దులొలికే చిన్నమ్మాయి వయసు ఆరేడేళ్ళూ ఉంటాయి, ఆమె పేరు శ్రావణి అని స్కూలు బ్యాగు మీద ఉన్న లేబుల్ పై వ్రాసి ఉంది, పెద్దవాడు అబ్బాయి. మహా అంటే ఆ చిన్నారి కంటే ఓ రెండేళ్ళు పెద్ద వాడుంటాడు. వాడి పేరు రాజేష్. ఇద్దరూ స్కూలు యూనిఫాంలో ముద్దొస్తున్నారు.

తాము ఎలా ప్రతిస్పందించాలి అన్న విషయం కూడా అర్థం కానంత అయోమయంలో మునిగిపోయారు ఆ ఇద్దరు పిల్లలు.

స్కూలు నుంచి వచ్చేటప్పుడు మూసారాంభాగ్ వద్ద బ్రిడ్జి దాటంగానే మలుపులో ఈ కారు ని లిప్ట్ అడిగి ఎక్కటం గొప్ప పొరపాటు అయింది అన్న విషయం వాళ్ళకు ఆలశ్యంగా బోధపడింది.

వాళ్ళ ఇల్లు చాలా దగ్గర స్కూలుకి. నడచి వెళ్ళి , నడచి వచ్చేస్తారు. కాకపోతే మెయిన్ రోడ్ వెంబడి కాస్తా నడవాలి. ట్రాఫిక్ తో నిండిన మెయిన్ రోడ్ ని అట్నుంచి ఇటు దాటవలసిన పని లేదు. రోడ్డు వెంబడే నడచుకుంటూ వచ్చి మలుపు తిరిగితె వచ్చేస్తుంది వాళ్ళ ఇల్లు.

ప్రతి రోజు స్కూలు నుంచి వచ్చేటప్పుడు ఆ చిన్న కుర్రాడు ఒకటి గమనించాడు.

రోడ్డుపై వెళ్ళే కొందరు చేతి బొటన వేలిని ’థంప్స్ అప్’ లాగా చూపితే రోడ్డు పై వెళ్ళే మోటార్ సైకిళ్ళూ , ఒక్కోసారి కార్లు ఆగి వారిని ఎక్కించుకుని వెళ్ళటం చూశాడు.

ఇంట్లో ఒకసారి వాళ్ళ నాన్నగారిని అడిగితే ఆయన యధాలాపంగా చెప్పారు ఆ పద్దతిని ’లిఫ్ట్ అడగటం అంటారు అని’ స్వంత వాహనాలు లేని వారు ఎక్కడికైనా త్వరగా వెళ్ళాలి అంటే అలా రోడ్డుపై వెళ్ళే వాహనాల్ని ఆపి ’లిఫ్ట్’ అడిగి వెళుతుంటారని, లిఫ్ట్ ఇచ్చేవారు మానవత్వంతో అలాంటి వారిని ఎక్కించుకుంటారని, అది చాలా మంచి పని అని చెప్పుకోచ్చారు ఒక రోజు.

ఆ కుర్రాడి మనసులో ఎలాంటి ఆలోచనతో ఈ ప్రశ్న అడిగాడో తెలిసుంటే ఆయన తన సమాధానం ఇచ్చే విధానంలో కాస్తా జాగ్రత్తపడి ఉండేవాడేమో.

ఈ అంశం వాడి చిన్ని బుర్రలో బాగా నాటుకుపోయింది. అదే వాడి కొంపముంచబోతోంది అన్న విషయం వారెవ్వరికీ చూచాయగా కూడా తెలియదు ఆ క్షణం.

మెయిన్ రోడ్డు మీద బ్రిడ్జి దాటాకా మలుపు తిరిగి, పిల్లలు ఉండే కాలనిలోకి ప్రవేశించింది కారు.

"అంకుల్ మా ఇల్లు దాటి వచ్చేశాం. కార్ ఆపండి" నెమ్మదిగా చెప్పాడు రాజేష్.

అప్పుడు చెప్పాడు కరకు గొంతుతో "మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం" అని

కార్ శాలివాహన నగర్ పార్క్, దిల్‍సుఖ్‍నగర్ అంధుల హాస్టల్ దాటి మూసీ నదికి సమాంతరంగా పయనిస్తూ చైతన్యపురి వైపుగా వెళ్ళ సాగింది.

వాళ్ళు చాలా పకడ్బందీ ప్రణాళికతో ఉన్నారని అర్థం అవుతోంది.

అలాగే నేరుగా వెళ్ళి పండ్ల మార్కెట్ వెనుకగా వెళ్ళి, బీఎస్‍ఎన్‍ఎల్ మలుపు వద్ద రోడ్డెక్కి మలుపు తీసుకుంటే ఒక్క సిగ్నల్ కూడా రాకుండా నేరుగా విజయవాడ హైవే ఎక్కవచ్చు అని వాళ్ళ ప్రణాళిక.

కానీ అక్కడ ట్రాఫిక్ జాం అవటం వల్ల తప్పని సరి పరిస్థితులలో దిల్‍సుఖ్‍నగర్ మెట్రో వద్ద మెయిన్ రోడ్ లోకి ఎక్కారు.

కళ్ళలోంచి ఉబికి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ’అన్నయ్యా! ఇప్పుడెలా’ అన్నట్టు వాడి వంక బేలగా చూస్తోంది ఆ పిల్ల. ఆ అమ్మాయికి ఒక భరోసా ఏమిటి అంటే, పక్కన అన్నయ్య ఉంటే ఏ ఆపద రాదని.

దిల్‍సుఖ్‍నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్రదీపం వెలగటం తో కార్ ఆపాల్సొచ్చింది. ఇక్కడ నిజానికి రోడ్ జంక్షన్ ఏమీ లేదు. నిరంతరం రద్దీగా ఉండే ఆ రోడ్డులో పాదచారులు రోడ్ దాటటానికి వీలుగా సిగ్నల్ ఏర్పాటు చేసి వాహనాలను ఆపుతుంటారు. అక్కడ ఒక వారగా ట్రాఫిక్ పోలీసులు మోటార్ సైకిళ్ళను ఆపి హెల్మెట్ లేని వారికి చలాన్లు రాస్తున్నారు ఆ సమయంలో.

ఒక ఆఫీసర్ లాంటి వ్యక్తి మారుతి జిప్సీ బానెట్ మీద చలాన్ల బుక్ పెట్టి వ్రాస్తున్నాడు. క్రింది స్థాయి కానిస్టేబుల్స్ ఓ ముగ్గురు చురుకుగా రోడ్డ్ మీదకు వచ్చి హెల్మెట్ లేని యువకులను పట్టేసి వాళ్ళ మోటర్ సైకిళ్ళని రోడ్డు పక్కకు మళ్ళిస్తున్నారు.

ఈ పరంపరలో ఒక బక్కపలచటి పోలీసు కానిస్టేబుల్ వీరి కార్ పక్కన నడవసాగాడు.

వెనుక సీట్లో డ్రైవర్ వెనుక ఉన్న సీట్లో కిటికీ పక్కన శ్రావణి, మధ్యలో రాజేష్, ఇటు చివర కిటికి ప్రక్కగా కరకు కంఠం వాడు కూర్చున్నారు.

కానిస్టేబుల్ దృష్టిని ఆకర్షించటానికి కిటికి అద్దం మీద దబ దబ మని బాదటం మొదలెట్టాడు రాజేష్ చెల్లి వైపున్న కిటికి అద్దం వద్దకు జరిగి.

అతని ప్రయతం వృధా ప్రయాసే అవుతుంది అనుకున్నాడు వెనుక సీట్లోని కిడ్పాపర్. ట్రాఫిక్ రద్దీలో ఇంజన్ల శబ్దాలు, హారన్ల శబ్దాలు వీటి మధ్య ఈ చప్పుడు వినిపించదని అతని భరోసా. ముందు సీట్లోని వ్యక్తులు కూడా నిబ్బరంగానే ఉన్నారు.

ఈ లోగా అనుకోకుండా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

ఒక మోటార్ సైకిల్ ని ఆపడంలో భాగంగా వేగంగా పరిగెత్తుకుంటు వచ్చిన ఆ ట్రాఫిక్ కానిస్టేబులు ఎందుకో అనుమానంగా ముందు అద్దం లోంచి కార్లోకి పరిశీలనగా చూశాడు.

’హెల్ప్ హెల్ప్’ రాజేష్, శ్రావణి చేతులు చాచి ఊపుతూ కేకలు వేశారు. వాళ్ళను ఆపే ప్రయత్నం కూడా ఏమి చేయలేదు ఆ కరకు గొంతు వాడు. వాళ్ళను అణిస్తే పోలీసుల దృష్టిలో పడతాము అన్నది అతని ఉద్దేశం కావచ్చు.

కానీ ఆ కానిస్టేబుల్ దృష్టి ఎంతసేపున్నా ఎవరన్నా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నది చూడ్డం మీదనే ఉంది. ముందు సీట్లో ఉన్న ఇద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో తృప్తిగా తలూపి ముందుకు కదిలి వెళ్ళిపోయాడు ఆ కానిస్టేబుల్. అతని దృష్టి వెనుక సీట్ వైపు ప్రసరించలేదు అసలు.

ఈ లోగా ఆకుపచ్చ దీపం వెలగడంతో కార్ బయలు దేరింది.

****

"మా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు"

ప్రిన్సిపాల్ గది విశాలంగా ఉంది. ఎయిర్ కండిషనర్ ఉండటం వల్ల చల్లగా ఉంది. టీచర్ల మీటింగ్ ముగించి, కంప్యూటర్ మానిటర్ పై ఏదో ఫైల్స్ చూసుకుంటున్న ప్రిన్సిపాల్, ఆందోళనగా నిండిన వేదా మాటలతో తలెత్తి వేదా వంక చూసింది.

"మా ఇల్లు స్కూలుకి చాలా దగ్గర. స్కూలు వదలంగానే పదే పది నిమిషాల్లొ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు రోజు వచ్చే టైం దాటి అరగంట పైగానే అయింది. ఇంకా ఇంటికి రాలేదు. నాకేదో ఆందోళనగా ఉంది" ఆందోళనగా చెపుతున్న వేదా వంక సాలోచనగా చూసింది ప్రిన్సిపాల్.

"నిజమే. మేము పిల్లల్నందరిని పంపించేసి అరగంట పైనే అయింది. స్కూల్ డే లాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏదన్నా సాంస్కృతిక కార్యక్రమాలకోసం ప్రాక్టీస్ చేయించటానికి కొన్ని సందర్భాలలో పిల్లల్ని ఎక్కువ సేపు ఉంచుకుంటాము కానీ ఇప్పుడు అలాంటి ఈవెంట్స్ కూడా ఏమీ లేవే? ఉండండి, సెక్యూరిటీని పిలుస్తాను" అంటు ప్రిన్సిపాల్ ఇంటర్ కాం లో సెక్యూరిటికి ఫోన్ చేసి రమ్మంది.

స్కూల్ బస్సులన్నీ వెళ్ళిపోయాయి. స్కూలు ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇక ప్రినిపాల్ గారు బయలుదేరి ఆవిడ కారు కూడా వెళ్ళిపోతె గేట్లు తాళం వేసుకోవచ్చు అని ఎదురు చూస్తూ, ఆవిడ కార్ డ్రైవర్ తో కబుర్లు చెపుతూ కూర్చున్నాడు సెక్యూరిటీ గార్డ్.

ఇంటర్ కాంలో పిలుపు రావడంతో లోపలికి వచ్చాడు

వేదా ఆ సెక్యూరిటీ గార్డ్ వంక ఆందోళనగా చూడసాగింది.

పాల మీగడలో కాస్తా కుంకుమ పువ్వు కలిపితే వచ్చే రంగు లాంటి లేత గులాబీ రంగు

శరీర ఛాయ వేదాది. మరీ సన్నం మరీ లావు కానీ అందమైన శరీర సౌష్టవం ఆమెది. రాజేష్, శ్రావణిల వయసున్న పెద్ద పిల్లలకి తల్లి ఆమె అంటే నమ్మదగిన విధంగా ఉండదు ఆమె ఆకృతి. ప్రిన్సిపాల్ కూడా మొదట అదే అనుకున్నది ఆమె అందాన్ని చూసి, ఇప్పుడు ఆమె అందాన్ని అభినందించాల్సిన సందర్భం కాదు కాబట్టి తమాయించుకుని, సెక్యూరిటీ గార్డ్ ని ప్రశ్నించటం ప్రారంభించింది.

వేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక కంప్యూటర్ ట్రెయినింగ్ సెంటర్లో కొన్నాళ్ళుగా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పూర్తి సమయం పిల్లలకే వెచ్చించేది. ఎప్పుడు అయితే పిల్లలు స్కూలు కు వెళ్ళటం మొదలెట్టారో తను కాలక్షేపంగా ఉంటుందని ఉద్యోగం చేస్తోంది.

పిల్లలు స్కూలు నుండి వచ్చే సమయానికి ఇంటికి వచ్చే లాగా తన ఉద్యోగ వేళలను ముందే మాట్లాడి ఒప్పించుకుంది యాజమాన్యంతో.

సెక్యూరిటి సెల్యూట్ చేసి పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారని చెప్పాడు. బస్సుల్లో వెళ్ళే పిల్లల గూర్చి అయితే ఆయా బస్సు సిబ్బందిని కనుక్కోమని చెబుతూ, నడిచి వెళ్ళే పిల్లలు, తలి తండ్రులు వచ్చి తీసుకువెళ్ళే పిల్లలు అయితే అందరు తనకు గుర్తే అని, రాజేష్ శ్రావణీ ’టాటా అంకుల్’ చెప్పి వెళ్ళటం తనకు బాగా గుర్తు ఉందని, వాళ్ళు తమ ఇంటికి వెళ్ళే వైపే వెళ్ళారని, తనకు తెలిసి అనుమానించాల్సిన పరిస్థితి ఏదీ తలఎత్తలేదని గట్టిగా చెప్పాడు.

ప్రిన్సిపాల్ కూడా తన వంతుగా వారి క్లాస్ మేట్స్ ఎవరివైనా పుట్టినరోజులు ఉన్నాయా, ఏదయినా అలాంటి ఫంక్షన్లకు వెళ్ళుంటారా అన్న దిశగా వాళ్ళ క్లాస్ టీచర్లకు ఫోన్లు చేసి కనుక్కుంది.

రాజేష్, శ్రావణీల దగ్గరి మిత్రుల ఇళ్ళకు ఫోన్స్ చేసి కనుక్కుంది. ఏ విధమైన చెప్పుకోదగ్గ ఆధారాలు కనిపించలేదు.

ప్రిన్సిపాల్ చెప్పారు ఇలా "వేదా గారు, మీరొక పని చెయ్యండి. మీరు వీలయినంత త్వరగా ఇంటికి వెళ్ళండి ఈ పాటికి పిల్లలు ఇంటికి వచ్చి ఉండవచ్చు. ఏదైనా వినోదాలు చూస్తూ రోడ్డు మీద ఎక్కడైనా ఆగి ఉండి ఆలశ్యంగా ఇల్లు చేరుకుని ఉండొచ్చు. మీరు ఇంట్లో లేకుంటే కంగారు పడవచ్చు పిల్లలు.

నా వంతుగా నేను కూడా టీచర్లందరితో టచ్ లో ఉంటాను. మనం పిల్లలు దొరికే వరకు ఫోన్లో టచ్ లో ఉందాము." అని భరోసా ఇచ్చి, ’ఇంతకు మించి నేను మాత్రం ఏమి చేయగలను చెప్పండి’ అన్న ధ్వనిలో తన మాటల్ని ముగించింది.

అంతటి ఏసీ గదిలో కూడా వేదా వదనం చెమటతో తడిసిపోయింది. ఒక్కసారిగా ప్రపంచం అంతా గిర్రున తిరిగినట్టు అనిపించసాగింది వేదాకి.

ఎప్పుడూ ఉత్సాహంతో ఉండే ఆమె ఒక్కసారిగా గాలి తీసేసిన బూరలాగా అయిపోయింది.

ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు సబబుగా అనిపించటంతో చేయగలిగింది ఏమీ లేక వేద నిరాశగా లేచి బయలు దేరింది. ఈ లోగా తన భర్తకి కూడా ఫోన్ చేసింది.

తీరా ఇల్లు చేరుతున్నప్పుడు, అనుకోకుండా ఆమెకి ఒక సంఘటన ఎదురు అయ్యింది.

"మీ కొత్త కారు బాగుంది మేడం" అన్న మాటకి తలెత్తి చూసింది.

ఎదురుగా టీవీఎస్ ఎక్సెల్ మీద కూర్చుని తమ కిరాణా షాప్ డోర్ డెలివరీ కుర్రాడు. వాడి వంక అయోమయంగా చూసింది.

"కొత్త కారేంటీ" కీచుగా అరిచింది

"ఇందాక మూసారాంభాగ్ మలుపు దగ్గర ఒక ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళి వస్తూ ఉంటే మీ పిల్లలిద్దరూ స్కూలు నుండి వస్తూ స్కూలు యూనిఫాం, స్కూలు బాగు తో సహా కనిపించారు.

పలకరిద్దాము అనుకునే లోగా మీ కారు కాకుండా వేరే ఏదో కారు ఎక్కి వెళ్ళారు. మీ కారు నాకు గుర్తే. అప్పుడనుకున్నాను మీరు కొత్త కారు తీస్కున్నారేమొ అని." చెప్పాడు ఆ కుర్రాడు

అయోమయాన్ని పటాపంచలు చేస్తూ ఇప్పుడు కొంత స్పష్టత వస్తోంది ఆమెకి. వెంటనే తన భర్తకి ఫోన్ చేసి ఈ విషయం కూడా చెప్పింది. అంటే ఖచ్చితంగా పిల్లలు ఏదో ప్రమాదంలో పడ్డారన్న మాట.

కార్ నెంబర్ చూడలేదన్నాడు ఆ కుర్రాడు. వాడిని అడిగి కారు రంగు, ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు మొదలెట్టింది.

విషయం తెలిసి ఆ కుర్రాడు కూడా అవాక్కయ్యాడు.

"అయ్యో నా కళ్ళ ముందరే పిల్లలు కిడ్నాప్ కి గురయ్యారా?" ఆ కుర్రాడికి నోటెంబడి మాటలు రావడం లేదు.

*****

కార్ దిల్‍సుఖ్‍నగర్ సిగ్నల్ దాటి ఏ ఆడ్డు లేకుండా దూసుకుపోతోంది. పీవీటీ మాల్ దగ్గర సిగ్నల్ ఉన్నప్పటికీ నేరుగా వెళ్ళే వాహనాలు ఆగే పని లేదు కాబట్టి ఇక ఎక్కడా ఆగకుండా ఎల్‍బీ నగర్ వైపు వెళ్ళసాగింది.

ముందు సీట్లో కూర్చున్న రివట లాంటి కుర్రాడు, కారు నడుపుతున్న కుర్రాడి వంక చూసి అస్పష్టంగా ఏదో మాట్లాడాడు.

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దాటి, కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ దాటి హయత్‌నగర్ మీదుగా హైవే పై వెళ్లసాగింది. అక్కడ ఒక వారగా కారు ఆపాడు. హైవే పై వేగంగా వెళుతున్న వాహనాలు మినహాయిస్తే జన సంచారం చాలా తక్కువ ఉంది అక్కడ.

ఏవో ఒకటి రెండు లారీలు ఆగి ఉన్నాయి ఆ దాబా వద్ద.

"ఇదిగో పిల్లలూ ఇప్పుడే టీ త్రాగి వస్తాము. మీరు అతి వేషాలు వేశారా చాలా కష్ట పడతారు. మీతోటి ఈ అంకుల్ కార్లోనే ఉంటాడు" పిల్లలిద్దరి వంక చూస్తూ కారు నడిపిన కుర్రాడు హెచ్చరిక జారి చేసి టీ త్రాగటానికి వెళ్ళాడు. ముందు సీట్లో కుర్చున్న కుర్రాడు కూడా అతనితో వెళ్ళాడు.

కార్లో ఆ పిల్లలిద్దరూ, కరకు కంఠం వాడి అధీనంలో బిక్కు బిక్కు మంటూ కూర్చున్నారు.

మధ్యలో ఉన్న రాజేష్, ఇటు చివర ఉన్న శ్రావణికి సైగ చేశాడు. రాజేష్ సైగని అర్థం చేసుకుని ,శ్రావణి కార్ డోర్ తెరవటానికి ప్రయత్నం చేసింది. కాని చైల్డ్ లాక్ వేసి ఉండటం వల్ల డోర్ తెరచుకోలేదు.

దూరంగా టీ త్రాగుతూ వాళ్ళిద్దరూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు.

***

ఇక్కడ ఇదంతా జరుగుతుండగా వేదా స్కూల్లో మాట్లాడి బయటకు రావడం, ఇంతలో కిరాణా షాపు డోర్ డెలివరీ కుర్రాడు తారసపడితే అతనితో మాట్లాడటం జరిగిపోయాయి.

ఆ కిరాణా షాపు కుర్రాడు కూడా వేదాతో బాటుగా ఇంటి వరకు వచ్చాడు.

అప్పుడు మ్రోగింది వేదా బ్యాగులో ఉన్న ఫోన్.

బ్యాగు తెరచి ఫోన్ అందుకుని కాల్ అందుకుంది వేద. కాల్ చేస్తున్న అవతలి వ్యక్తి తన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓనర్. అతను పాతికేళ్ళ కుర్రాడు నిజానికి. వాళ్ళ నాన్న గారి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న వ్యాపారాలలో ఒకటైన వేదా పని చేస్తున్న కంప్యూటర్ ట్రెయినింగ్ సెంటర్ నిర్వాహణ చూస్తుంటాడు అతను.

చిన్న వయసులోనే వ్యాపార దక్షుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

కాస్తా ఇబ్బందిగా కదిలింది వేదా. ఇతను ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడేమిటబ్బా అని ఆలోచిస్తూ, హలో అని చెప్పి, అవతల నుంచి అతను చెప్పే మాటలు వినసాగింది.

అతను మాట్లాడుతూ ఉంటే వేద మొహంలో రంగులు మారసాగాయి.

ఈ లోగా గేట్ తెరచుకుని వేదా భర్త కూడా రంగ ప్రవేశం చేశాడు. వేదా ఫోన్లో మాట్లాడుతున్నాను అన్నట్టుగా భర్త వంక సంఙ్జ చేసింది.

కిరాణా షాప్ డెలివరీ బాయ్ వేదా భర్తకి విషయం మొత్తం వివరించాడు.

ఆ ఫోన్లో అవతలి వినిపించిన మాటలు ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆమె విపరీతమైన ఉద్వేగానికి గురయింది. నుదుటిపై స్వేదాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది.

తన బాస్ ఏంటి ఇలా మాట్లాడాడు అన్న భావన ఆమె వదనంలో కనిపిస్తోంది.

"ఏమిటి విషయం?" ఆమె భర్త అడిగాడు

భావ రహితంగా చూస్తూ వేదా కిరాణా షాప్ కుర్రాడిని వెళ్ళి పొమ్మని నెమ్మదిగా చెప్పింది.

ఆ తర్వాత భర్తతో తాను ఫోన్లో అందుకున్న సమాచారాన్ని నెమ్మదిగా చెప్పటం ప్రారంభించింది. ఆ క్షణంలో ఆమె వదనంలో ఎన్నో భావాలు.

***

టీ త్రాగటం ముగించుకుని వచ్చారు ఆ ఇద్దరు. వస్తూ వస్తూ మూడో వ్యక్తికి కూడా టీ తీసుకు వచ్చారు. అలాగే పిల్లలకి చిప్స్ పాకెట్స్, బిస్కట్స్ కూడా తీసుకు వచ్చారు.

రాజేష్, శ్రావణి వాటిని కన్నెత్తి కూడా చూడలేదు.

ఆ ముగురు వ్యక్తులు గుంభనంగా నవ్వుకున్నారు.

కార్ తిరిగి బయలుదేరింది. చిత్రంగా కారు ముందుకు వెళ్ళే బదులు, యూ టర్న్ తీసుకుని తిరిగి నగరం వైపుకు బయలు దేరింది.

రాజేష్ , శ్రావణి కారు వెళుతున్న దిశను గమనిస్తూనే ఉన్నారు. ఒక అరగంటలో మళ్ళీ దిల్‍సుఖ్‍నగర్ కే వచ్చింది కారు. మలుపులు తిరుగుతూ తిరిగి శాలివాహన నగర్ పార్క్ వద్దకు వచ్చింది.

’అరె ఇదేమిటి మళ్ళీ మన కాలనీకే వెళుతోందే కార్’ అన్న ఆశ్చర్యం వారి మొహాల్లో కనిపిస్తోంది.

***

వరండాలో కూర్చుని సీరియస్ గా చర్చించుకుంటున్న భార్యా భర్తలు తమ ఇంటి ముందు ఆగిన కార్ ని చూసి గేట్ వద్దకు వచ్చారు.

కార్ డోర్ తెరవంగానె రాజేష్, శ్రావణి పరుగున వెళ్ళి వేదాని కౌగిలించుకున్నారు. వేదా భర్త ఆ ముగ్గురినీ ఇంటిలోనికి ఆహ్వానించాడు.

కార్ నడిపిన ఆ సూటి ముక్కు కుర్రాడే వేదా వాళ్ళ బాస్.

అందరూ సోఫాల్లో సుఖాసీనులు అయ్యాక ఆయన చెప్పటం ప్రారంభించారు.

"నేను ఆఫీసు నుంచి వెళ్ళే సమయానికి ప్రతి రోజు ఆ మార్గంలో ఈ పిల్లలు ఇటీవల లిఫ్ట్ అడగటం గమనించాను మేడం. వాళ్ళు మీ పిల్లలు అని నాకు తెలుసు. మీరు ఇటీవల ఆఫీస్ ఫంక్షన్ కి తీసుకువచ్చారు పిల్లలని అప్పుడు చూసాను.

కొన్ని సందర్భాలలో మోటార్ సైకిళ్ళ వాళ్ళూ, కొన్ని సందర్భాలలో కార్ల వాళ్ళు లిఫ్ట్ ఇవ్వటం గమనించాను. ఆ దృశ్యం చూసిన ప్రతీ సారి నాకు చాలా టెన్షన్ అనిపించేది. రోజులన్నీ మనవే ఉండవు కద అని నా భయం. మీకు చెప్పి పిల్లలకు చెప్పండి అందామని అనుకున్నాను. కానీ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే వాళ్ళు ఈ లిఫ్ట్ ఆట లో చాలా థ్రిల్ అనుభవిస్తున్నారని అర్థం అయింది. మీరు వాళ్ళకు చెప్పినా మీ మాట వినే పరిస్థితిలో వారు లేరని నాకు అనిపించింది. వారికి ఒక సారి షాక్ లాగా తగిలితే తప్ప ఈ ప్రమాదకరమైన ఆటని ఆపేయ్యరని నాకు తోచి, ఈ విధంగా ప్రాక్టికల్ గా వారికి భయం అనేది ఎలాగుంటుందో రుచి చూపించాల్సి వచ్చింది.

వాస్తవానికి చిన్నతనంలో అందర్నీ మంచివారే అని పిల్లలు నమ్ముతారు. నిజానికి సమాజం అలా మంచి వారితో నిండి ఉంటే ఎంత బాగుంటుందో కద. మనం వాళ్ళకు జాగ్రత్త అనే పేరుతో సాటి మనిషి మీద అనుమానం కలిగేలా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది నిజంగా దురదృష్టకరం.

రవీంద్రనాధ్ టాగోర్ వ్రాసిన గీతాంజలిలోని కవితలో లా సమాజం ఉంటే ఎంత బాగుంటుందో

"ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో

ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో

ఎక్కడ ఙ్జానం విరివిగా వెలుస్తుందో

ఎక్కడ స్వఛ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో

ఆ స్వేఛ్చా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు"

అలా ఆ కవితలో లా మన దేశ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తాను. మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టాను , మన్నించండి" అంటూ వేదా భర్త గారి చేతులు పట్టుకుని మన్నింపు కోరాడు కారు నడిపిన ఆ సూటి ముక్కు కుర్రాడు.

పిల్లలిద్దరూ చనువుగా వచ్చి ఆయనకి ఇరుపక్కలా నిలబడి "మాకర్థం అయింది అంకుల్. ఇంకెప్పుడు అలా కొత్తవాళ్ళని లిఫ్ట్ అడగం" అని అన్నారు.

చమర్చిన కళ్ళతో వారినే చూస్తూ ఉండి పోయింది వేదా.

***************

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు