కరోనా కహానీలు - సంగీత చిలకమర్తి

Karona kahaneelu

కనకమ్మ ఇంట్లో: పొద్దున ఐదు గంటలకే అల్లారం తో పాటు లేచిన కనకమ్మ కరోనా తరువాత పోయిన భర్త ఉద్యోగం గురించి, పిల్లల చదువు గురించి ఆలోచిస్తూనే ఇంటి పనులు వంట పని చేసి స్వప్న మేడం వాళ్ళ ఇంటికి బయలుదేరింది. తను కరోనా లొక్డౌన్ కి ముందు తనూ నాలుగైదు ఇండ్లలో పని చేసేది, ఈ కరోనా వచ్చాక ఒకరొకరిగా అందారు మానిపించారు ఒక్క స్వప్న మేడమ్ తప్ప. ఇక రమేష్ ఏమో అంతకముందు డ్రైవర్గా చేసేవాడు, కరోనా వచ్చిన కొత్తలో ఒక్క సారి మామూలు జ్వరం, జలుబు చేస్తే వాళ్ళ ఓనర్ వాళ్ళు మరీ భయపడి ఉద్యోగంలో నుండి తీసేసారు. స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు లేక పిల్లల సదువు కూడా అంతంత మాత్రంగానే అయిపోయాయి. పెద్దోడు ఎనిమిది, చిన్నోడు ఐదో లో ఉండేవాళ్ళు. పోనీ, ఇంట్లోనే ఆ పుస్తకాలు ఏవో తీయమంటే ఉత్త పుస్తకాలు చదివితే ఏమి అర్థం ఐతాయి, ఇద్దరికి కలిపి కనీసం ఒక స్మార్ట్ ఫోన్ అయినా ఇస్తే ఆ ఫోన్లో పాఠాలు వింటాం అని రోజూ పెద్దోడి గొడవ. వాళ్లకేం తెలుసు ఇంట్లో ఆదాయం ఒకటో వంతు అయిపోతే, ఖర్చులు పదీ అలానే ఉండి పోయాయి అని. ఈ కరోనా ఏంటో, మాములు రోజులు మళ్ళీ ఎప్పటికి ఒస్తాయో అని లోలోపల అనుకుంటూ 7:30 కల్లా స్వప్న మేడమ్ వాళ్ళింటికి చేరుకుంది. వాళ్ళింటికి వచ్చాకా ఇంకా ఇలా అనుకుంటుంది, ఉన్నోళ్ళకి అయితే లొక్డౌన్ ఉన్న ఒకటే, మాములు రోజులు అయినా ఒకటే. స్వప్న మేడమ్ వాళ్ళింట్లో సారూ ఇంట్లోనుండే పని చేస్తడు, ఊరి నుండి పెద్ద అమ్మ గారు అయ్యగారు కూడా వచ్చిండ్రు.రాహుల్ బాబెమో ఒకటో క్లాసే అయినా ఇంట్లో కంప్యూటర్ల సదువుకుంటుండు. ఇలా అనుకుంటూ చీపురు పట్టుకొగానే అప్పుడే బెడ్ పై నుండి లేస్తున్న స్వప్న బాబు ని కూడా లేపుతూ, కనకమ్మా ఈ మధ్య రోజూ లేట్ ఒస్తున్నావు, నువ్వు టైం కి ఒస్తేనే మా పనులు త్వరగా అవుతాయు, లేదంటే రోజంతా హడావిడి అయిపోతుంది అని. కనకమ్మ అది విని కూడా ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. స్వప్న మేడమ్: స్వప్న గబగబా లేచి, బ్రష్ బాత్రూము అన్ని కానిచ్చేసి హడావిడిగా బాబు కి పాలు బ్రేక్ ఫాస్ట్, వాళ్ళ ఆయన శ్రీధర్ కి టి డికాక్షన్ వేసి. అత్త మామలకు కాఫీ కలిపి ఇచ్చింది. ఇలా ఇస్తూనే ఆలోచిస్తుంది, బాబు పుట్టకముందు తను జాబ్ చేసేది, వీడు పుట్టాక శ్రీధరు తన అత్త మామ పట్టుపట్టి మరీ జాబ్ మాన్పించి వేశారు. ఊళ్లో బోలెడు పొలాలు, తోటలు, బంగ్లా, బంగారం ఉన్నాయి అని, ఇన్ని రోజులంటే ఎదో టైం పాస్ కి చేసావు ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటూ బాబు ఆలనా పాలనా చూసుకొవాలని పని వాళ్ళ మీద బాబుని ఒదిలేయొద్దు అని చెప్పి బంగారం లాంటి సాఫ్ట్ వేర్ జాబ్ మాంపించేశారు. హ్మ్ ఊళ్లో పొలాలు తోటలు బంగ్లా అన్నీ ఉన్నాయి. అవన్నీ అనుభవించేది ఎప్పటికో కానీ సిటీలొ ఉండడానికి సొంత ఇల్లు లేదు. చక్కగా ఇద్దరం ఉద్యోగం చేస్తే ఒకరి జీతంతో లోన్ పెట్టుకుని పోష్ ఏరియా లొ ఒక త్రి బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకునే వాళ్ళం. ఇంకో జీతంతో దర్జాగా బతికే వాళ్ళం. తను ఉద్యోగం చేయకున్నా పర్లేదు లే శ్రీధర్ వాళ్ళ ఆఫీస్ తరుపున ఆన్సైట్ వెళ్లే ఆపర్చునిటీ ఒచ్చింది అని సంతోష పడింది, నెలలో ప్రయాణం ఉందనగా ఈ కరోనా మహమ్మారీ వాళ్ళ ఆ ప్రయాణం కాస్త ఆగిపోవడమే కాక ఎలాగూ వర్క్ ఫ్రొం హోమ్ కదా అని ఆఫ్ షోర్ వర్క్ ఆన్ సైట్ వర్క్ రెండు చేయించుకుంటున్నారు ఆఫీస్ వాళ్ళు. మేము అమెరికా వెళ్ళిపోతున్నాము అని, వెళ్లే ముందు ఒక సారి మనవడిని చూసి వెళ్ళిపోతాము అని ఊరి నుండి వచ్చిన అత్తయ్య మామయ్య కాస్త ఇక్కడే పెర్మనెంట్ గా ఉండి పోయారు. వాళ్ళ తిండి వేరు పులుసులు, పచ్చళ్ళు అని మా వారి తిండి వేరు సలాడ్స్, సూప్ లు అని. ఇక వీడేమో రెండు రోజులోకోసారి కేక్ అని ఇంకేదో అని ప్రాణాలు తోడేస్తాడు. ఈ కరోనా భయంతో అన్నీ ఇంట్లోనే చేయాల్సి ఒస్తుంది. దీనికి తోడు బాబు కిండర్ గార్టెన్ ఆన్లైన్ క్లాసుల కోసం కొత్తగా లాప్టాప్, స్టడీ టేబుల్, గెస్ట్ రూమ్ లో అత్తయ్య వాళ్ళ కోసం ఒక బెడ్, వార్డ్ రోబ్ ఇలా ఏవేవో కొనాల్సి ఒచ్చింది. ఆదాయం ఒక్కటై పోతే ఇంట్లో ఖర్చు, పని నాలుగింతలు అయ్యింది. పండగ లేదు, పబ్బం లేదు, కరోనా వచ్చిన కొత్తలో రియూనియన్ అని ఇంకేదో అని వీడియో కాల్స్ అంటూ హడావిడి చేసే వాళ్ళం. ఇప్పుడేమో మొన్న తన బెస్ట్ ఫ్రెండ్ కమ్ ఆఫీస్ కలీగ్ లత టీం లీడ్ ప్రమోషన్ ఒచ్చింది అని హ్యాపీగా కాల్ చేసి చెప్తే కంగ్రాట్స్ అని ఒకే ఒక్క ముక్క చెప్పి పెట్టేసా. ఆల్రెడీ అది, వాళ్ళాయన ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండేది. ఇప్పుడేమో ఈ టైం లో ప్రమోషన్ పైగా కొత్తగా విల్లా కూడా ఎదో కొనుకున్నారంట. ఎంతైనా లక్కీ ఫెల్లో అది ఈ సండే కుదిరితే ఒక గంట అలా వెళ్లి వాళ్ళ కొత్త ఇల్లు చూడాలి లేదంటే కనీసం వీడియో కాల్లొ ఇల్లంతా చూపించమని అడగాలి ఇలా ఎదేదో అనుకుంటూ వంట పనిలొ పడిపోయింది. టీం లీడర్ లత: సండే స్వప్నతో వీడియో కాల్ అయ్యాక లత ఇలా అనుకుంటుంది. నేను, రాజేష్ ఇద్దరం ఇప్పుడే పిల్లలు ఒద్దు అనుకుని పైసా పైసా చూసుకుంటూ ఎలాగో ఈ విల్లా ఒక్కటి కొనగాలిగాము. కార్ లోన్, కొత్తగా ఇంటి లోన్, ఇంటికి సరిపోయే ఫర్నిచర్ కోసం క్రెడిట్ కార్డు ఇన్స్టాల్మెంట్లు ఇవే కాక పల్లెటూల్లో రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళుండే ఇంటికి రిపేర్ లు అవి చేయించాలి అంటే దాని కోసం పర్సనల్ లోన్. ఏంటో ఇద్దరం ఉద్యోగం చేస్తున్న డబ్బులేమి మిగలటం లేదు. ఒకటో తారీకు ఒచ్చే జీతం కాస్త పదిహేనో తారీకు లోపే అయిపోతుంది. పైగా ఈ మధ్య అమ్మ నాన్న వాళ్ళు, అత్తయ్య, మామయ్య, చుట్టాలు, ఫ్రెండ్స్ ఇలా అందరూ ఇళ్లు కొనుకున్నారు కదా ఇంకా పిల్లలేప్పుడు అని అడిగేస్తున్నారు. కొందరైతే ఇన్ఫర్టిలైటీ సెంటర్ డిటైల్స్ అవి కూడా ఇస్తున్నారు. మొన్నటికి మొన్న మా ఆడపడుచు కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గైనకాలాజిస్ట్ అని తనకి కానీ వాళ్ళ అన్నయ్య కి కానీ ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తుంది అని అప్పోయింట్మెంట్ కావాలంటే చెప్పమని గంట సేపు వాయించేసింది. పిల్లలంటే మాటలా, వాళ్ళు పుట్టినప్పడి నుండి ఖర్చులు ఇంకా పెరుగుతాయి, స్కూల్ డొనేషన్, ఫీజులు, బుక్స్ ఇలా అన్ని కలిపి కిండర్ గార్టెన్ కే లక్షలు అవుతాయి. అది కాక పిల్లో పిల్లాడో పుడితే అమ్మ కానీ అత్తయ్య కానీ ఒచ్చి ఒక మూడు నెల్లో నాలుగు నెల్లో చూసుకుంటారు తప్ప పెర్మనెంట్ గా ఉండిపోరు. మామయ్య ఊళ్ళో పొలం పనులు చేసుకుంటారు కాబట్టి అత్తయ్య కూడా ఉండాలి, అమ్మేమ్మో అక్క వాళ్ళకి మొన్నే కవల పిల్లలు పుడితే అక్కడే ఉంటుంది ప్రస్తుతం. ఆఫీస్ లో చూస్తే, రాజేష్ వాళ్ళ కంపెనీ వాళ్ళ పే ప్యాకేజీ బాగుంటుంది కానీ జాబ్ రిస్క్ ఎక్కువ. తన ఆఫీస్ లో ప్రమోషన్ ఇచ్చారు కానీ, తన పనితో పాటు టీం లో ఫైర్ అయినా వాళ్ళ బ్యాక్లాగ్ వర్క్ చూస్కోవాల్సి ఒస్తుంది. వీకెండ్ లేదు వీక్ డే లేదు 24 గంటలు ఆఫీస్ పని తోనే సరిపోతుంది. అత్తయ్య ఊరి నుండి ఇంటి పని, వంట పని అంత చేసే లాగ ఎవరో ఒక అమ్మాయిని కుదుర్చింది, పాపం ఆ అమ్మాయే అంతా చూసకుంటుంది కనీసం రోజూ ఏమి వంట చేయాలో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రాజేష్ అదే అంటాడు బ్రష్, స్నానం, తినడం లాంటివి ఎవరికి వాళ్లే చేసుకోవాలి కాబట్టి చేస్తున్నానని లేదంటే అది ఆ అమ్మాయి తో చేయించేదాన్ని అని. లత ఇలా తన ఆలోచనల్లో ఉండగానే ఆన్సైట్ మేనేజర్ శ్రీవాణి వాట్సాప్ మెసేజ్ చేసింది ఒక థర్టీ మినిట్స్ లో టీమ్స్ లాగిన్ చేయమని మండే రోజూ అర్జెంటు గా క్లోజ్ చెయ్యాలసిన పాయింట్స్ డిస్కస్ చెయ్యాలి అని. గబగబగా డ్రెస్అప్ అవుతూ శ్రీవాణి గురించి ఆలోచిస్తూ, 15 సంవత్సరాల నుండి ఆన్ సైట్ లో ఉంటున్నారు వాళ్ళు ఆవిడ హస్బెండ్ అక్కడ డాక్టర్ వాళ్ళ అత్త మామాలు కూడా డాక్టర్లే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ ఉంది వాళ్లకి. ఇద్దరు పిల్లలు, అక్కడ ఇక్కడ బోలెడు ఆస్తులు అవి ఉన్నట్టే ఉన్నాయి అనుకుంటూ కాల్ టైం అయితే కనెక్ట్ అయ్యి పాయింట్స్ అవి నోట్ చేసుకుని శ్రీవాణి అడిగిన రిపోర్ట్ 2 గంటల్లో పంపిస్తాను అంటూ ఆ పని లో పడిపోయింది. ఆన్ సైట్ శ్రీవాణి: రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ శ్రీవాణి ఇలా ఆలోచిస్తుంది. పొద్దున్న పది అవుతుంది. శ్రీను కానీ పిల్లలు కానీ అసలు బెడ్ రూమ్స్ నుండి బయటికి రాలేదు. శ్రీను కరోనా పేషెంట్స్ ని ట్రీట్ చేసే ఫ్రంట్ లైన్ డాక్టర్, పుల్మనాలోజిస్ట్ (లంగ్స్ స్పెషలిస్ట్). పొద్దున్న ఏడు గంటలకి వెళ్తే రాత్రి పది అయితే కానీ ఇంటికి రాడు మరీ క్రిటికల్ అయితే అక్కడే ఉండిపోతాడు. ఈ సంవత్సరన్నరగా ఇంతే. పిల్లలేమో క్లాసులు ఎప్పుడు అటెండ్ అవుతున్నారో ఎప్పుడు తింటున్నారో కూడా తెలీదు. అసలు విక్కీ గాడైతే ఇంట్లో ఉంటున్నాడో లేదో కూడా తెలీట్లేదు, తేజు మాత్రం అప్పుడప్పుడు నా ఆఫీస్ రూమ్ కి ఒచ్చి మమ్మా హౌ అర్ యూ? అంటుంది ఇది మేము కెనడాకి వచ్చాక పుట్టింది, 8th గ్రేడ్. విక్కీ నెక్స్ట్ ఇయర్ యూనివర్సిటీ వెళ్తాడు. నాకు వీళ్ళ చదువుల గురించి ఇంతే తెలుసు. పండమిక్లో ఆన్ సైట్ టీం లో 50% ఎంప్లాయిస్ ని లేయోఫ్ చేశారు. ఆఫ్ షోర్ టీం అంతా జూనియర్స్ ఒకటికి నాలుగు సార్లు వర్క్ ఎక్సప్లయిన్ చెయ్యాలి ఇంతా చేస్తే ప్రాఫిటబిలిటీ తగ్గిపోయింది అని చెపుతు 60% పే ఇస్తున్నారు. ఇండియా లో లా ఇక్కడ పనివాళ్ళు కూడా ఉండరు కదా బాత్రూంలతో సహా అన్నీ క్లీనింగులు స్వంతంగా చేసుకోవాల్సిందే. పిల్లల రూమ్ లు వాళ్లే చూసుకుంటారు. అమ్మకి అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి వన్ మంత్ పైనే అయ్యింది. అమ్మ ఉన్న ఊరు ఒదిలి ఎక్కడికి వెళ్ళలేను అనీ నాన్న గారు పోయాక కూడా లంకంత కొంపలో ఒక్కత్తె ఉంటుంది. అన్నయ్య ఈ మధ్యే ఆస్ట్రేలియా వెళ్ళాడు ఫ్యామిలీ తో సహా. అత్తయ్య మామయ్య వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కరోనా వచ్చాక ప్రాక్టీస్ ఇంకా ఒద్దు అని క్లినిక్ కూడా క్లోజ్ చెయ్యమని చెప్పాము. మా బావ గారి వాళ్ళు UK లో ఉంటారు. రమేష్ అని ఒక male సెర్వెంట్ ఉండే వాడు డ్రైవింగ్ తో పాటు ఇంట్లో అన్ని పనులు చేసిపెట్టే వాడు నమ్మకస్తుడు కానీ కరోనా వచ్చిన కొత్తలో ఫీవర్, కోల్డ్, కఫ్ ఈ సింప్టమ్స్ చూసి క్లినిక్ ఎలాను క్లోజ్ అయ్యింది అని చెప్పి అతన్ని మానిపించేసాం. ఇప్పుడు వాళ్లిద్దరే 4 బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటూ నెమ్మదిగా కాలం గడిపేస్తున్నారు. ఈ కరోనా లో మేము అక్కడికి వెళ్లలేము, వాళ్ళానీ రమ్మనలేము, ఇక్కడ మేమున్నా చేతి నిండా డబ్బున్న ఏమి చెయ్యలేని పరిస్థితి. ఇలా ఎదో ఆలోచిస్తూ ఏదైనా స్పెషల్స్ చేసి ఈ రోజూ ఎలాగైనా శ్రీనుతో పిల్లలతో కలిసి లంచ్ చెయ్యాలని పప్పు, అన్నం, రసం పెట్టేసి పొటాటో ఎయిర్ ఫ్రయర్ లో పడేసాను. (స్పెషల్స్ అంటే ఇవేనా అనుకుంటున్నారా? రోజూ హడావిడిగా చారు అన్నామో, బ్రెడ్ ముక్కలో తినే మాకు స్పెషల్స్ ఇలానే ఉంటాయి), ఈ లోపు లత పంపే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ పిల్లల్ని, శ్రీను ని పిలవడానికి వెళ్ళింది శ్రీవాణి.

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్