అంతులేని ఓదార్పు - తటవర్తి భద్రిరాజు

Antu leni odarpu

ఊరి లోపలకి వచ్చే రోడ్ చాలా బావుంటుంది. ఒకపక్క పెద్ద చెరువు. మరోపక్క కొబ్బరి చెట్లు, మర్రి చెట్లు.

మర్రి చెట్లు ఊడలు కిందకి వేలాడుతూ ఉంటాయి.

మర్రి చెట్టులకి అక్కడ అక్కడ పెద్ద పెద్ద తేనె పట్టులు. ప్రతీ కొమ్మకీ తలకిందులు గా వేలాడే గబ్బిలాలు .

గబ్బిలాలు రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం వెళ్తాయి. పగలంతా తలకిందులు గా వేలాడుతూ ఈ కొమ్మలకే ఉంటాయి.

రాత్రి పూట ఈ రోడ్ మీద రావాలంటే కొంచం భయం గానే ఉంటుంది.

వేలాడుతున్న ఊడలు చూడడానికి పగలు ఎంత బావుంటాయో రాత్రి పూట అంత బయపెడుతూ ఉంటాయి. ఆ సమయం లో వాటిని చూస్తే పాత సినిమాలలో "మాయల ఫకీరు " ఉండే ప్రదేశం గుర్తుకు వస్తుంది.

కొబ్బరి చెట్ల వెనుక ఉండే పొలాలను చెరువు కింద పొలాలు అని అంటూ ఉంటారు. వర్షాలు బాగా పడి చెరువులో నీళ్లు ఉంటే , ఈ పొలాలలో సవంత్సరా నికి రెండు పంటలు పండేవి.

ఒకప్పుడు ఈ పొలాల్లో ఎక్కువ భాగం వీర్రాజు వే.

ఊరిలో పెద్ద రామాలయం పక్కనుండి పది అడుగులు ముందుకు వెళ్తే పెద్ద వాటర్ ట్యాంక్ వస్తుంది. ఈ వాటర్ ట్యాంక్ నుండే ఊరు అంతా మంచినీళ్లు సప్లై అవుతూ ఉంటాయి.

వాటర్ ట్యాంక్ పక్కనే ఎతైన అరుగులతో ఉన్న బంగాళా పెంకుటిల్లు వీర్రాజు ది.

వీర్రాజు చాలా మోతుబరి రైతు. తాతల కాలం నుండి వారసత్వం గా వచ్చిన పొలాలు, ఇళ్లు తో పాటు, భార్య పసుపు కుంకం గా తెచ్చుకున్న ఆస్తులు, ఇంకా వీర్రాజు కష్టపడి సంపాదించుకున్నవి చాలానే ఉన్నాయి.

వీర్రాజు భార్య మంగతాయారు. ఇంట్లో ఉన్న వంట గది, భర్త తప్ప ఇంకేమీ తెలియదు.

వీర్రాజు ఇంటి చాకలి గంగమ్మ. వారం వారం మాసిన బట్టలు తీసుకువెళ్లి ఉతికి తీసుకు వచ్చేది.
ఇంట్లో మనిషి లా కలిసిపోయేది.

వీర్రాజు కి పిల్లలు లేరు. మంగతాయారు పిల్లల కోసం చాలా పూజలు చేసింది. దేవుడు ఉన్న చోట మెట్లు అన్నీ ఎక్కింది. కనపడిన దేవుళ్ళు అందరికీ మొక్కింది.
ఐనా దేవుడు కరుణించలేదు.

ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి పూజారి గారి భార్య చెప్పిన వ్రతాలు కూడా చేసింది. గుళ్లో పూజారి గారు ఇచ్చారని అప్పుడప్పుడు గంగమ్మ తెచ్చే ప్రసాదం కూడా తింది. ఐనా పిల్లలు పుట్టలేదు.

గంగమ్మ కి మంచి మాటకరిగా పేరుంది. అప్పుడెప్పుడో వచ్చిన పెద్ద తుపాను లో పిడుగు మీద పడి భర్త పోయాడు. ఉన్న ఒక్క కొడుకు చిన్నోడు.

ఊళ్ళో వాళ్ళ ఇళ్లల్లో బట్టలు ఉతికి వాడిని పెంచుతూ ఉంది.

మంగతాయారు కి అనుకోకుండా జబ్బు చేసింది. ఎంత మంది డాక్టర్స్ కి చూపించినా కారణం చెప్పలేకపోయారు.
ఊళ్ళో వాళ్ళు ఏ రీసెర్చ్ లు చేయకుండానే పిల్లలు లేక బెంగ అన్నారు.

ఓరోజు మంగ తయారు కన్నుమూసింది. తనకు వచ్చిన జబ్బు కన్నా ఊళ్ళో వాళ్లే మాటలకే ఎక్కువ కృంగిపోయింది.

భార్య పోయి భాద లో ఉన్న వీర్రాజు కు ఓదార్పు అవసరం అయ్యింది. ప్రతీ రోజు గంగమ్మ తన మాటలతో ఓదార్పు అందించింది.

భార్య వియోగాన్ని మర్చిపోవడానికి మంచి వంటలు చేసి పెట్టేది.

వర్షం పడ్డప్పుడు రాఘవమ్మ చెరువులో దొరికే పులస చేపలతో కూర వండి రుచి చూపించింది.

బొబ్బర్లంక నుండి సొరకాయలు తెప్పించి సువ్వి కూర చేసిపెట్టింది. ఆత్రేయపురం నుండి పూత రేకులు తెప్పించి బెల్లం తో చుట్టి పెట్టింది.

ఆ రుచులకు వీర్రాజు మైమరచిపోయాడు. ఆమె మాటలకు కూడా .

ఎన్నాళ్ళు ఐనా వీర్రాజు మంగతాయారు దూరమైన బాధనుండి కొలుకోలేకపోతున్నాడు......గంగమ్మ ఓదార్పు దూరమవుతుంది ఏమో అనే భయం తో.

ఓ రోజు గంగమ్మ 'ఇల్లు వర్షం లో కూలిపోయింది ' అని చెప్పింది. వీర్రాజు ఇల్లు కట్టించాడు.

రోజు రోజు కు గంగమ్మ మీద వీర్రాజు కు అభిమానం పెరుగుతూ ఉంది. ఆ పెరిగిన అభిమానానికి గుర్తుగా కొబ్బరితోట గంగమ్మ పేరు మీద మారింది.

గంగమ్మ మీద అభిమానం పెరిగే కొద్దీ ...వీర్రాజు ఆస్తులు తగ్గుతూ వస్తున్నాయి.

బండారు లంక లోని వరి పొలం, వడ్లమూరు లోని చెరుకుకుతోట విలువ తెలుసుకుందామని అమ్మకానికి పెట్టాడు. వచ్చిన డబ్బు గంగమ్మ కి ఇచ్చి మరింత ఓదార్పు పొందాడు.

ఉన్న ఇల్లు తప్పించి అన్నీ గంగమ్మ కి ఇచ్చేసాడు.

ఇల్లు గురించి విల్లు రాసాడు. తన తదనంతరం గంగమ్మ కి చెందాలని.

గంగమ్మ కి ఓర్పు ఎక్కువ. చాలా రోజులు చూసింది. వీర్రాజు మంగతాయారు దగ్గరకి ఎప్పుడు వెళ్తాడా అని.

కానీ వీర్రాజు బాగానే ఉన్నాడు. ఓదార్పు పొందుతూనే ఉన్నాడు.

భద్రాచలం నుండి వచ్చే మందులు అమ్ముకునే వాళ్ళ దగ్గర అదేదో పసరు మందు తీసుకుంది.

ఆ మందు తింటే నెమ్మది నెమ్మది గా శరీరం లో విషం గా మారుతుంది.

ఓరోజు పీతల తో పులుసు చేసింది. అందులో మందు కలిపి వీర్రాజు కు పెట్టింది. ఎప్పటిలానే వీర్రాజు ఓదార్పు పొందాడు.

మందు పనితనం గంగమ్మ కు బాగా తెలుసు.

ఎందుకంటే
మంగతాయారు కు ప్రసాదం లో ఈ మందే కలిపి ఎప్పుడో దాని పనితనం చూసింది మరి...!!


మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు