నాకు సినిమా పిచ్చి కొంచెం ఎక్కువే. మా చిన్నప్పుడు ఇప్పుడున్నన్ని టి.వి. చాన్నళ్ళు , ఇన్ని ఇంటర్నెట్ వేదికలూ లేవు, అంచేత సినిమాలు చూసే అవకాసాలు తక్కువే, అయినా ఉన్నంతలో చూసేవాడిని. నాకు ఆ పిచ్చి ఎలా అంటుకుందో సరిగ్గా గుర్తులేదు, అయినా ఇప్పుడది అసందర్భం. ఆ పిచ్చి ని పెంచి పోషించినది మాత్రం మా మావయ్యలు. వి.సి.ఆర్ లు, సినిమా కేసెట్టులు అద్దెకి ఇచ్చేవారు మా చిన్నతనం రోజుల్లో. వేసవి సెలవుల్లో మా మావయ్యల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎంచక్కా అదే నా పని. బోలెడు సినిమాలు అద్దెకి తెచ్చుకొని అదే పని గా చూసే వాడిని. అలా తెలుగు సినిమా లు చూస్తూనే పెరిగా. ఇక ఆ రోజుల్లో పర బాషా చిత్రాలు చూసే అవకాసం చాలా తక్కువ. బహుసా ఆదివారం దూర దర్శన్ లో మద్యాన్నం మాత్రం పర బాషా చిత్రాలు వేసేవాడు. అర్ధం కాక పోయినా చూసే వాడిని, అంత పిచ్చి సినిమాలంటే. ఆ మధ్యాన్నపు పర బాషా చిత్రాలు అన్నీ అవార్డు చిత్రాలు కావటం చేత, కొంత సాగదీసినట్టు వున్నా, వాటిల్లో కథాంసం నచ్చేది.
వయసు పెరుగుతున్న కొద్దీ నా పిచ్చి ముదురు తూనే వచ్చింది. పెద్ద అయ్యాక మాత్రం ఎ బాషనీ వొదిలి పెట్టకుండా అన్నీ బాషా చిత్రాలూ చూడటం మెదలెట్టా. బాలీవూడ్ , హాలీవూడ్, తమిళ్ , మలయాళం, మరాఠి , బెంగాలీ, యూరోపేన్, జపనీసు, కొరియా ఇలా బాషా బేదం లేకుండా అన్నీ. అందునా ఇంటర్నెట్ యుగమాయే , ప్రపంచమంత విశాలమయిన వల . అన్ని ప్రపంచ బాషల సినిమాల గురించి తెలుసు కోవటానికి మేగజైనులు, ఆన్ లైను ఫోరంస్ , వాటిని వెల వెచ్చించి కొని చూసుకోనే అవాకాశము, అన్నీ వున్నాయి ఇప్పుడు.
ఫిల్మ్ ఫెస్టివల్ అంటే, ప్రపంచము లో దేశ విదేశాల నుంచి కొత్త దర్శకులు , కథకులు నిర్మించిన నూతన సినిమాలు ప్రదర్సించే ఒక వేదిక. అలాంటి ఒక ఉత్సవం నేను వుండే ఊళ్ళో నే జరగటం తో నా ఆనందానికి అవధులు లేవు. మొత్తం ఫెస్టివల్ జరుగుతున్న అన్నీ రోజులకీ టిక్కట్టు కొనేసి, ప్రతీ రోజు అదే పని గా అన్నీ బాషా చిత్రాలు చూడటం లో మునిగి పోయాను. ఇలాంటి ఉత్సవాల్లోనే అసలయిన సినిమాలు వుంటాయని నా వాదన. ఎక్కువ హంగులు ఆర్భాటాలు , గ్రాఫిక్సులు, సి.జి.ఐ లు భారీ బడ్జెట్లు లేకుండా కేవలం కథ కి , కథనానికీ ప్రాధాన్యత వుండే సినిమాలు. దేశ విదేశాలలో మనుషుల జీవితాల్లోకి తొంగి చూసి , వాళ్ళ స్థితి గతులను , విధి విదానాలను, వివిద మానవ దృక్పదాలను అర్ధం చేసుకునే అవకాసం. రాత్రి లేదు పగలు లేదు , నిద్రాహారాలు అసలే లేవు. అలా ఎడతెరపి లేకుండా ఒక ముప్పయి ఆరు గంటలు సినిమాలు చూసి, అలసట తో నా రూం కొచ్చి బొక్క బోర్లా పడ్డా.
**********************************
చుట్టూ చూస్తే బయంకరమయిన చీకటి , ఒక చేతి లో దివిటీ మరొక చేతిలో నా సెల్ ఫోను. ఒక్కటే పరుగు , ఎక్కడా ఆగకుండా పరుగెడుతున్నా. రోడ్డుకి రెండు వైపులా దట్టమయిన అడవి లా వుంది, ఎమో ఎమీ తెలియటం లేదు చెట్లొ పుట్టలో , గాడమయిన చీకటి లో ఎమీ కనపడటం లేదు. ఆగి చూసే దైర్యం కూడా నాలో అప్పుడు లేదు. ఒక్కటే పరుగు , పరుగే పరుగు. నా దివిటీ వెలుగు ఆ నల్లటి తారు రోడ్డు మీద పడటం వల్ల వచ్చిన ప్రతిబింభం లో కొంచెం ప్రకాశం నా అడుగులని నడిపించింది, కాదు , పరిగెట్టించింది.
" తె.సి త.సి మ.సి బా.సి హా.సి కొ.సి యూ.సి "
నన్ను తరుముతున్న దెయ్యం లా వుంది. నా పరుగు వేగం పెంచుతున్న కొద్దీ ఆ స్వరం మంద్ర స్థాయి కంఠ తో
" తె.సి త.సి మ.సి బా.సి హా.సి కొ.సి యూ.సి "
మళ్ళీ పరుగు. రొమ్ములు పగిలిపోయేంత ఆయాసం వస్తున్నా నా పరుగు ఆగలేదు. నా అడుగుల శబ్ధం మినహా అక్కడ అంతా నిశబ్ధం. ఇంతలో నా సెల్ ఫోన్ మోగింది. గుండె ఆగినంత పని అయింది. చేసింది నా స్నేహితుడు కిషోరు
"ఒరెయ్ నువ్వు బద్రం గా వున్నవా " ?
కొంచెం రోడ్డికి పక్కగా ఆగాను. అక్కడ ఒక చెట్టు వుంటే దాని మొదల్లో కూలబడ్డాను.
అసలు ఆ ప్రశ్న కి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు. అంత అర్ధ రాత్రి ఆ ప్రదేశం లో ఎందుకున్నానో , రోడ్ కి అడ్డం గా ఎవరిని తప్పించికోడానికి ఎందుకు ఇలా పరిగెడుతున్నానో , నాకస్సలు ఎమీ గుర్తు లేదు.
రొప్పుతూ కొంత ఆయాసం తీర్చుకున్నా, ఊపిరి మామూలు గతికి వచ్చాక "ఆ నేను సేఫ్ రా.. కాని.." అనేంత లో కిషోరే నన్ను కట్ చేసి
"చంపేసారు రా, కథ ని చంపేసారు" ఒకటే ఏడుపు. వాడు తర్వాత ఎదో చెప్పాడు , కానీ వాడి ఏడుపు లో నాకది అస్సలు అర్ధం కాలేదు.
" ఒరెయ్ కిషోరు... కొంచెం తమాయించు , స్లో డవున్ , కథ ని చంపటం ఎమిటి రా ? ఏ కథ ని".. మళ్ళి నన్ను పూర్తి చెయ్యనివ్వలేదు
"ఒక్క కథ కాదు రా, అన్నీటినీ , అన్నీ కథలనీ కట్ట గట్టి , మొత్తం , ఇక ప్రపంచం లో కథలనేవి లేకుండా , అన్నిటినీ రా ... అన్నిటిని కాల్చేయటమో పూడ్చేయటమో , అదే వాళ్ళ ధ్యేయం" మళ్ళీ ఏడుపు లంకించాడు.. ఇంతలో తేరుకొని
"సరే నువ్వు బద్రం. కథలు అంటే ఇష్టం వున్న ప్రతి వాళ్ళనీ పోలీసు అనుమానిస్తున్నారు. పరిగెట్టకు, ప్రతి రోడ్డు మీదా పోలీసు కారులు తిరుగుతున్నాయి, వీలయితే ఎక్కడన్నా తల దాచుకో, సరే నేను వెళ్ళాలి" అంటూనే ఫోన్ కట్ చేసాడు.
ఇంతలో రోడ్డు మీద పెద్ద సైరన్ తో పోలీసు కారు. నా దివిటి, సెల్ ఫోన్ రెండూ ఆపు చేసాను సమయ స్పూర్తి తో. కొంచెం వుంటే దొరికి పొయ్యే వాడిని.
ఎందుకు ? ఏమిటి ? అని ఆరాలు తీసే సమయము కాదిది, కిషోరు నా శ్రేయోభిలాషి. నా మంచి కోరే చెప్తాడు. దైర్యం చేసి రోడ్డు మీద కాకుండా , గుండె రాయి చేసుకొని అలా చెట్ట్లు పుట్టలు వైపు అడ్డం గా నడవ సాగాను. అలా ఒక గంట సేపు ఆ చలి లో నడిచాక దూరం గా ఒక ఇల్లు, చిన్ని దీపపు వెలుగు కనపడ్డాయి " హమ్మయ్య " అనుకున్నా. బ్రతిమలాడితే ఒక్క రాత్రి కి ఆశ్రయం ఇవ్వరా ఎంత కఠినాత్ములయినా. ధైర్యం వచ్చింది. అదే వెలుగు వైపు నడిచాను. నాకు దూరం నుంచి అనిపించినంత చిన్న ఇల్లు కాదది. చాలా పెద్ద భవనం. ఇదేదో బాగా వున్నవాళ్ళ ఫార్మ్ హవుస్ లా వుంది. నాకు దూరం నుంచి కనపడిన వెలుగు ఒక చలి మంట. దాని వైపు గా నడవ సాగాను. కొంత మంది మనుషులు ఆ చలిమంట చుట్టు వాలు కుర్చీలలో కూర్చున్నారు. వాళ్ళంతా ఎదో చర్చించుకుంటున్నారు. వెనుక ఆవరణము లోంచి రికార్డరు లో , సన్నగా కమ్మని సంగీతము. ఒక్క సారి గా ప్రాణము లేచి వచ్చింది. పరుగు ఆపేసి మెల్ల గా వాళ్ళ వైపుగా నడక సాగించాను.
ఆ భవనానికి ఒక ప్రవేశ మార్గము ఇసక రహదారి, దానికి ఒక ఇనుము ద్వారము. ద్వారానికి తాళము ఎమీ లేకపోవటము వలన, దాన్ని ఒక్క తోపు తోసి లోపలకి వెళ్ళాను, అది చేసిన కీచు శబ్ధానికి , చలి మంట చుట్టు కూచున్న వాళ్ళు నా వైపు తిరిగారు. వాళ్ళలో ఒక్కడు మాత్రం లేచి నుంచొని నా వైపు రాసాగాడు. చక్కటి ఒడ్డు పొడుగు , సూటు బూటు వేషధారణ
" ఒరెయ్ ఎవర్రా అది " అంటూనే చేతి లో వున్న తుపాకీ గాల్లో కి పేల్చాడు " దొంగ వయితే , నీ ఆశలు ఇప్పుడే వొదిలి పారిపో, ప్రాణాలు దక్కుతాయి" అని గట్టి గా నవ్వుతున్నాడు.
నేను వున్న పరిస్తితి కి నాకు దానిలో అంత హాస్యం కనపడలేదు, కానీ వాడి తుపాకి గుళ్ళ శభ్దం బయంకరంగా వినపడీంది. నా రెండు చేతులు గాల్లో కి ఎత్తి , మొకాళ్ళ మీద మోకరిల్లాను.
"మీకు పుణ్యం వుంటుంది, నన్ను రక్షించండి, నేను దొంగ ని కాను, నా ప్రాణాలు కాపాడండి , ప్లీస్" అని వేడుకున్నాను.
వాళ్ళు నన్ను నమ్మి ఆదరించారు. నా దప్పిక తీర్చి నాకు కూడా ఆ మంట చుట్టూ ఒక కుర్చీ వేసారు.
*********
మా పరిచయాలు మొదలాయ్యయి. నేను నా గురించి చెప్పుకున్నాను. ఇంతకీ వాళ్ళు ఎవరో కాదు నేను హాజరవుతున్న సినిమా ఉత్సవానికి విచ్చేసిన అథిదులు. చూడటానికి అందరూ భారతీయుల్లా లేరు, కారు కూడా. వీళ్ళంతా వేరు వేరు చలన చిత్ర సంఘాల నుంచి వచ్చారట. కాని అందరూ తెలుగు లోనే మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు మాత్రం కొంత వింత గా గమ్మత్తు గానే వున్నాయి.
' ఎంటి మీ పేర్లు ఇలా విడ్డూరం గా వున్నాయి ' అని ఆథిద్యం ఇచ్చిన వారిని అడగ దలుచుకోలేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వచ్చిన నాకు ఆశ్రయం ఇచ్చారు.
మొదటి వాడు ' తెసి ', జరీ లాల్చి పట్టు పంచె. మీస కట్టు అదీ చూస్తే, అచ్చం తెలుగు వాడిలా వున్నాడు. చలి మంట తగ్గకుండా ఎప్పటికప్పుడు పాత పుస్తకాలు, బైండరు లోంచి కాగితలు , ఎవో ఒకటి వేస్తూనే వున్నాడు.
రెండో వాడు ' తసి ' పంచె, బనీను, అడ్డ బొట్టు, అరవం వాడి లా వున్నాడు. "ఒరెయ్ తెసి నువ్వు కాగితాలు, పుస్తకాలు వేయకురా మంట లో, చక్కగా పక్కనే చెక్క ముక్కలు కోసి పెట్టాము కదా అవి వెయ్యి రా" వారించాడు తసి.
మూడో వాడు ' మసి ' తెల్ల చొక్కా తెల్ల పాంట్ గుబురు మీసాలు , కొబ్బరి తైలం పట్టించిన నల్లటి నిగ నిగ లాడే జుట్టు, మలయాళం వాడికి మల్లే వున్నాడు.
నాలుగో వాడు ' హాసి ' నన్ను తుపాకీ తో స్వాగతం పలికిన వాడు. చూడటానికి అమెరికా వాడి లా వున్నాడు.
"నాకు చల్ల గా ఒక బీర్ " అన్నాను. " షూర్ " అంటూ పక్కనే పానీయాలు , పానకాలు , సారాయి అన్నీ అమర్చి వున్న టేబల్ వైపు వెళ్ళాడు ఐదో వాడు 'బాసి ' , మంచి పొడుగు పెద్ద దేహ కాయము, ఉత్తర భారతీయుడు లా వున్నాడు. అందరికీ కావలసిన ద్రవ్యం అడిగి మరీ అందజేస్తున్నాడు.
మేమంతా చలి మంట చుట్టూ కూర్చొని పరిచయాలు చేసుకుంటుంటే లోపల నుంచి , తినటానికి తిండి తీసుకొచ్చారు ' కొసి ' ' యూసి '. వాళ్ళు కచ్చితం గా భారతీయులు కారు.
ఒక్క సారి వాళ్ళ పేర్లన్ని వరసగా కలిపి అనుకొని చూసుకుంటే నాకు బయం వేసింది.
" త.సి మ.సి బా.సి హా.సి కొ.సి యూ.సి "
నేను ఇందాక పరుగెడుతున్నప్పుడు పొదల్లోంచి వచ్చిన శబ్ధాలవి. వీళ్ళు దయ్యాలు గానీ కాదు కదా. అయినా పెద్ద గా నేను చెయ్య గలిగింది ఎమీ లేదు. మృత్యువు కోరల్లొంచి తప్పించు కొని ఇటు వచ్చాను. నాకు వేరే మార్గము లేదు. పెనం లోంచి పొయ్య మీద పడ్డానా కొంపదీసి ? నా జాగ్రత్త లో నేను వుండి తెలవార గానే ఇక్కడ నుంచి మెల్లగా జారుకోవాలి.
**************
"ఆ ఇంతకీ ఆ ఫిల్మ్ ఫెస్టివల్ ల్లో ఎ సినిమా నచ్చింది మీకు" అన్నాడు మసి
"ఆ ఆ... అంటే చాలా సినిమాలు చుసా కదా.. .. అన్నీ పేర్లు , అవీ గుర్తు లేవు..ఆ.. " అని ఆలోచన లో పడ్డాను.
"మా దేశపు సినిమా నే మీకు కచ్చితం గా నచ్చి వుండాలి " కొసి అంది ముసి ముసి గా నవ్వుతూ
"నో ... మా దేశపు సినిమా లే మోర్ క్యూట్ ఆండ్ ఫన్నీ " అంది యూసి, వాళ్ళు లోపల కిచన్ లోంచి తెచ్చిన చిక్కన్ ముక్కలు ప్లేట్స్ లో పెట్టి అందరికీ వడ్డిస్తూ
"ఏడిసారు, అసలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద నాటకం బ్రదర్. సుద్ద దండగ, ఇట్స్ ఆల్ ఫార్స్, మోసం. అసలు మా తెలుగు సినిమా ఒక్కటి కూడా ఎంపిక చెయ్యలేదు. బాక్స్ ఆఫీసు లు బద్దలయ్యి కోట్లు గడించిన సినిమాలు బోలెడు పంపించాము, ఒకటి కూడ నచ్చ లేదట వీళ్ళకి"
"చిల్ల్ బ్రో, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఆ పొలిటిక్స్ అన్ని వొద్దనే కదా ఈ చిల్ల్ అవుట్ సెషన్. హేవ్ అ పెగ్, చిల్ల్" అన్నాడు మసి
"ఎంతయినా అవార్డులు ఇచ్చే విషయం లో కొంత పొలిటిక్స్ జరిగాయి " అన్నాడు తసి ఒక చికన్ ముక్క తింటూ.
బాసి హాసి ఇవ్వేం పట్టనట్టు , వాళ్ళ డ్రింకు సిప్ చేస్తూ , ఒక దమ్ము లాగి అలా ఆకాశం లోకి చూస్తున్నారు.
"మన్ ము విసిర్న ఎంగిలి పైసల్ తో జర్గు తావి ఈ చిల్లర్ ఫెస్టివల్స్" అన్నాడు బాసి గట్టిగా దమ్ము లోపలకి పీలుస్తూ. అతని బాష లో తెలుగు పదాలు మా మటన్ కొట్టు మస్తాను కొట్టిన ముక్కల్లాగ తెగి పడి పోతున్నాయి.
గట్టిగా నవ్వుతూ అతనికి 'హై ఫై' ఇచ్చాడు హాసి. ఇద్దరూ గట్టిగా పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు కాలుస్తున్నది మామూలు సిగరెట్టు కాదని ఆ వాసన చెబుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాదేది తెలుగు కి దగ్గరగానే వుంది, కాని ఎదో డబ్బింగ్ సినేమా లా, గొంతులు గంభీరం గా వున్నాయి.
"అది సరే , తమ్ముడూ ... బయట ఎదో పోలీసు సైరన్ వినపడింది, కొంపదీసి నువ్వు గానీ సీరియల్ కిల్లర్ వి కాదు కదా. పోలీసుల నుంచి తప్పించుకొని... " తసి నవ్వుతూనే ఆరా తీసాడు
"అవును, కరెక్టే... ఇంత అర్ధ రాత్రి , ఒంటరి గా ఎలా ? " తెసి దాన్ని ఇంకొంచెం సాగదీసాడు, ఇంకో పెద్ద పుస్తకం తెచ్చి మంటలో వేస్తూ
"అయ్యో అంత లేదు సార్, నా బండి రోడ్ మీద సడన్ గా ఆగిపోయింది.. చాలా సేపు ట్రై చేసా, ఎవరూ ఆపలేదు, నా సెల్ ఫోన్ లో చార్జి కూడ లేదు... ఎదో ఇక్కడ వెలుగు కనపడి ఇలా నడుచు కుంటూ వచ్చా..అంతే" బానే కవర్ చేసా.
అందరమూ కొన్ని డ్రింక్స్ తీసుకున్నాము, కొంచెం ఫింగర్ ఫూడ్స్ తిన్నాక " ఇంక చలి పెరుగుతోంది లోపలకి వెళ్ళి డిన్నర్ చేద్దామా" అన్నది కొసి
అందరూ అంగీకరిస్తూ, వాళ్ళ వాళ్ళ డ్రింక్స్ చేత్తొ పట్టుకొని లోపలకి వెళ్తున్నారు.
తెసి గొణిగాడు " నేను తగల బెట్టాల్సినవి ఇంకా చాలా వున్నాయి" అది ఎవరికీ వినపడలేదు, నాకు తప్ప. "ఆ మీరు వెళ్ళండి , నే వస్తా" అన్నాడు అందరికీ వినపడేలాగా. ఆ మండుతున్న నిప్పు వెలుగు లో అతని మొహం లోని కోపం చాలా స్పష్టం గా కనిపించింది నాకు.
నేను అందరితో పాటూ లోపలకి వెళ్ళినా, ఒక కన్ను బయట వేసి వుంచా. తెసి ఎక్కడి నుంచో కాగితాలు , పుస్తకాలు కట్టలు కట్టాలు గా తెచ్చి మంట లో వేస్తున్నాడు. అతను చాలా సేపే వున్నాడు బయట.
********************
నేను ఒక సారి బాతురూము కి వెళ్ళి వచ్చే లోపల, డైనింగ్ రూం లో టేబల్ మీద బోజనాలు అన్నీ అమర్చి వున్నాయి. అది పది మంది దాకా కూర్చునే పెద్ద టేబల్. కూచున్నాం అంతా తెసి తప్ప, అతను ఇంకా బయట నుంచి రాలేదు.
కొసి యుసి టేబల్ మీద ఒక మూల గా, పక్క పక్క నే కూచొని తింటూ ఎవో ముచ్చట్లు ఆడుతున్నారు. బాసి హాసి తమ ప్లేటు లు తీసుకొని , డైనింగ్ రూం లోంచి హాల్ లోకి వెళ్ళి పొయ్యారు, టి.వి చూస్తూ తినటానికి
నేను అదే టేబల్ కి ఇంకో మూల తసి , మసి ల మద్యలో కూచున్నా.
"ఒరేయ్ తెసి గాడు పరవాలేదా, బాగా హర్ట్ అయినట్టు వున్నాడు" అన్నాడు మసి వడ్డించుకుంటూ
"ఆ కొంచెం వేడెక్కిపోయి వున్నాడు, , వాడిది సీమ రక్తం కదా అసలే ,కూల్ అవ్వడానికి టైం పడుతుంది లే" అని వెటకారం గా నవ్వాడు తసి
"నాకు సంబంధం లేని విషయం అని మీరు అనుకోకపోతే, ఎందుకండి కోపం తెసి గారికి, ఎమిటి ఆయన అదేపని గా పుస్తకాలు కాలుస్తున్నారు, మీరు వొద్దన్నా కూడా" అని అడిగాను నేను
"వాళ్ళు పంపిన తెలుగు సినిమా లకి అవార్డ్ రాలేదని కోపం రా అంతే " అన్నాడు మసి విషయాన్ని కట్ చేస్తూ
"అవార్డ్ కాదు కదా, ఈ ఫెస్టివల్ లో ఒక్కటి కూడ క్వాలిఫై కాలేదు రా . వంద కోట్లు పెట్టి తీస్తాము మా సినిమాలు , ఎందుకు నచ్చటము లేదు వీళ్ళకి అని వాడికి కోపం,
పైగా ఈ సారి ఆ ఫెస్టివల్ జడ్జి ఒకడు ' మీ సినిమా లు మాకు వేస్ట్ ఆఫ్ టైం, ఒక స్టోరీ కూడ వుండదు మీ సినిమాల్లో , ఇలా అయితే నెక్స్ట్ సంవత్సరం నుంచి అసలు మీ సినిమాలని అనుమతించము ' అన్నాట్ట . వీడికి మండి పోయింది" కథ మొత్తం చెప్పాడు తసి
" ఓ అదా, మరి ఏ తగల బెట్టడం.." అన్నాను నేను
"ఈ ప్రపంచం లో వున్న కథలన్నీ కాల్చేస్తాడట , అప్పుడు ఏ సినిమా లో కథలు వుండవు అందరూ చచిన్నట్టు తెలుగు సినిమా ని మెచ్చుకుంటారు అని వాడి బోడి ఉపాయం" అన్నాడు తసి
"వాడి కి ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కావటం లేదు, మాకు వేరే కథలు , పుస్తకాలు ఎమీ అక్కరలేదు. మా చుట్టు జరిగేవే మా కథాంసాలు, మనలా వుండే వాళ్ళే మా కథల్లో నాయకులు ప్రతి నాయకులు , పాత్రలు పాత్రధారులు" అన్నాడు మసి.
"వాడికి జన్మకి అర్ధం కాదు రా మీరు తినండి" అని అందరికి మరి కొంచెం వడ్డించాడు తసి
నేను కూచున్న కుర్చీ లోంచి బయటకి చుసా. చలి మంట, దాని పక్కనే నిలబడి మంటలో పుస్తకాలు వేస్తున్న తెసి కనిపించారు.
బోజనాల తర్వాత అందరూ టి.వి ముందర సోఫాలలో కూలబడ్డారు. నేను మాత్రం, కసి తో రగిలిపోతున్న తెసి పరిస్థితి ఒకసారి చూద్దామని బయటకి వెళ్ళాను. అతను తనలో తాను మాట్లాడుకుంటున్నాడు , బయటకి వినిపిస్తుంది. ఇంట్లొ ఫ్రిడ్జ్ లోంచి రెండు బీర్లు తీసుకొని బయటకి నడిచాను.
"ఎంత పొగరు వీళ్ళకి , ఎంత కష్టపడి తీస్తాము మేము సినిమాలు, గాడిద కి ఎమి తెలుసు గంధం వాసన. వెనకటికి ఎవడో మొగలి పువ్వు ఇస్తే మడిచి వెనకాల పెట్టుకున్నాడట" అంటూ మరికొన్ని పుస్తకాలు కోపం గా వేసాడు మంటలో. మంట ఉవెత్తున ఎగసింది నింగిపైకి. అతను తనలో తాను మాట్లాడుకుంటున్నా అనుకున్నాడు , కాని నాకు స్పష్టం గా వినపడింది.
"హై అండి ..చిల్ల్ బీర్ ?" అంటూ నేను ఒక బీరు తీసుకొని, ఇంకో బీరు అతనికి అందించాను. అందుకున్నాడు. ఇద్దరము కూచున్నాము బీర్ సిప్ చేస్తూ
*******************
"అసలు ఎంత శ్రమ తెలుసా తెలుగు సినిమా తీయటం. ఎంత వ్యయ ప్రయాస... మేము షూటింగ్ చెయ్యని దేశము లేదు తెలుసా. స్పేస్-ఎక్స్ పెర్మిషన్ ఇవ్వగానే మార్స్ గ్రహం లో ఐటం సాంగ్ షూటింగ్ కి మేము రెడీ. మా బడ్జెట్ తెలుసా వీళ్ళకి, మా హీరో ల లెవల్ తెలుసా అస్సలు. ఏం తెలుసని వీళ్ళకి"
"అంటే ఈ ఆవార్డు లకి మీరు అంత ప్రాముఖ్యత ఇవ్వకండి, అందరి మధ్యలో అనలేక పోయా, కానీ చెప్పాలంటే , బోరింగ్ గా అస్సలు వేడుక వినోదము లేకుండా పేలవంగా చప్పగా వుండే సినిమాలకే ఈ అవార్డు లు.. మన తెలుగు సినిమా కి రివార్డులే" అన్నాను కొంచెం ఊరడించడానికి
తృప్తి పడని తెసి "వాళ్ళ బొంద అవ్వార్డు సరే.. మా తెలుగు సినిమాలని డిస్ క్వాలిఫై చేసారు.. బూతులు వస్తున్నాయి ఆపుకుంటున్నా"...కొంచెం ఆగి "అసలు ప్రతి తెలుగు సినిమా లొ ఎన్ని అంశాలు మేళవిస్తాం. .. ఫైట్లు, పాటలు, ఫామిలి వాల్యూస్, కామెడీ, పెద్ద పెద్ద విజిల్ పడే డైలాగులు, పంచ్ లైనులు , ఐటం సాంగ్, చివరి గా సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్...నవరసాల సమ్మేళనం " ఆవేసంతో ఊగిపోయాడు
"అంటే వాళ్ళు కథ కి మాత్రమే..." నన్ను కట్ చేసాడు
"అదే అదే.. ఆ మాటలే విని విని చెవులకి చిల్లులు పడ్డాయి. ఎమన్నా అంటే సినిమాల్లో కథ వుండాలి , యదార్ధానికి దగ్గరగా వుండాలి, కృత్రిమంగా వుండకూడదు..కొత్త కథలు లేకపోయినా కదనం కొత్త ద్రుష్టికోణం లో వుండాలి...ఇలా చాలా విన్నాం. అందుకే ప్రపంచంలో వున్న కథలు అన్ని బూస్తాపితం చేస్తున్నాం. మాకు డార్క్ ట్విట్టర్ లో హాండిల్ కూడా వుంది హాష్ టేగ్ బర్న్ ద స్టొరీస్"...ఒక్క గుక్క లో బీరు అంతా తాగేసి
"మేము మొత్తం తెలుగు సినిమా ప్రేమికులము రెండు లక్షలకు పైగా ఈ ఉద్యమం లో పాల్గొంటున్నాము, ఇది ప్రపంచ వ్యాపితం, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.. రేపు ఉదయం తెల్లవారే సరికల్లా ప్రపంచలో ఏ మూల కూడ ఒక్క కథ కూడ మిగలదు. అప్పుడు ఏం చెస్తారు ఈ మిగతా బాషా చిత్రాల వాళ్ళు , అప్పుడు ప్రపంచం లో ఏ సినిమాల్లొ కథ లు వుండవు"
"మీరు మరీ సీరియస్ గా తీసుకోకండి.. ఇంకో బీరు తెస్తా ఇద్దరికీ " అని లేచి బీర్ కూలర్ దగ్గరకు నడుస్తూ, " పెర్సనల్ అనుకోక పోతే, ఇంతకీ మీకు పెళ్ళి, పిల్లలు... మీ ఫామిలి గురించి చెప్పండి" అన్నాను టాపిక్ మార్చే ప్రయత్నం లో.
నాది వృదా ప్రయాస
"అసలు ఈ మద్య తెలుగు సినిమా ఎంత ఎదిగి పోయిందో. ప్రతీ సినిమా ఒక వాయిస్ ఒవర్ తో మొదలు పెడుతున్నాం ఆశక్తిదాయకంగా. ఆరంభం లోనే ఒక ఒళ్ళు జలదరించే సన్నివేశం తో మొదలెట్టి , అక్కడనుంచి ఫ్లాష్ బాక్. ముందు ది వెనక , వెనకది ముందు, కనీసం మూడు నాలుగు ఫ్లాష్ బాక్స్, స్టొరీ లో ట్విస్టులు, అస్సలు స్క్రీన్ ప్లే ఇరగదీస్తున్నాం"
నేను "స్క్రీన్ ప్లే అంటే....అది కాదేమో" అనేంతలో మళ్ళీ నన్ను కట్ చేసాడు
"ఐటం సాంగ్ కి అసలు వాంప్ ని కాదు పెద్ద పెద్ద హీరో ఇన్స్ నే బూక్ చేస్తున్నాం, వీళ్ళకి అసలు తెలుసా ఎంత కస్టమో వాళ్ళ కాల్ షీట్స్. ఐటం సాంగు సరే, అసలు తెలుగు సినిమా లో కథానాయిక ఎంపిక కోసం మేము పడే పాట్లు. తెలుపుకే నిర్వచనం లా పాలరాతి శిల్పం లా వుండి, పురుష పుంగవులని ఆకట్టుకునే అంగ సౌశ్టవం వున్న మోడల్ ని ఉత్తర భారత దేశం నుంచి దిగుమతి చేస్తాం. అసలు ఆ పద్ధతి ప్రక్రియ దానిలో వున్న సంక్లిష్టం, వీళ్ళకు అసలు తెలుసా అంట" ..." ప్రతి నాయకుడు , కారక్టర్ ఆటిస్టు ఇలా అన్నిట్లో విలక్షణ కోసం మేము పడే తపన. షూటింగు లొకేషన్ సెట్ మీద ఒక్కళ్ళకి తెలుగు బాష రాకుండా , వీళ్ళందరితో తెలుగు లో డైలాగులు చెప్పించడము.. తెలుగు రాని వాళ్ళ తో పాటలు పాడించడము, అసలు మా కస్టం ఈ ఫెస్టివల్ వాళ్ళకి ఎం తెలుసు "
అటు ఇటు తల తిప్పి , ఎవరూ రావటం లేదని రూడీ చేసుకొని " డైమండ్ బాబు కి అరవయి కోట్లు సెట్ చేసా తెలుసా. డైమండ్ బాబు మొదటి సినిమా నా స్నేహితుడు కిడ్నీ రెడ్డి తోనే". అన్నాడు చాలా గర్వం గా
నాకు బీరు ల వల్లో , ఇతని మాటల వల్లో తెలియదు గాని తల తెగ తిరుగుతోంది . " డైమండ్ బాబు అంటే ? " అని ఆగాను, ఎటూ నా మాట ని, దాని లొ వున్న డైమండ్ ని కట్ చేసి కొంచెం వివరిస్తాడని.
"ఒహొ నీకు తెలియదు కదా... మన హీరో గోల్డన్ బాబు వాళ్ళ ఆవిడ కి కడుపు, మాకు కొన్ని వేగుల వల్ల తెలిసింది ఆవిడ కి పుట్టబొయేది బాబు అని, అంతే నేను రాజకీయ చక్రం తిప్పాను. అరవయి కోట్లు గోను సంచులతో అల్ రెడీ పేమెంట్ సెటల్ చెసా.. ఆ బాబు కి పద్దెనిమిది నిండగానే లాంచ్ సినిమా మాదే.. అప్పటికి హిరో రేటు వంద కోట్లు దాటిపోతాయి, అందుకే ఇప్పుడే లాక్ చేసా"..రెండు మార్లు ఊపిరి గట్టిగా పీల్చి " అసలు ఈ ఫెస్టివల్ వాళ్ళకి మేము పడే కష్టాలు తెలుసా అని"
*************************
************************
"దడ్ దడ్ దడ్ "
ఆ సబ్ధానికి లేచాను మత్తు నిద్ర లోంచి , నా రూము తలుపు బడా బడా బాదుతున్నారెవరో "దడ్ దడ్ దడ్"
"ఆ వస్తున్నా ఆగండి రా బాబూ, వస్తున్నా" నిద్ర మత్తు వదిలించుకొని లేచాను
తలుపు తీసి చూస్తే నా మిత్రుడు కిషోరు "ఎంట్రా ఆ మొద్దు నిద్ర ఎన్ని సార్లు ఫోన్ చెసాను రా"
ఇంకా నా నిద్ర మత్తు తీరలేదు
" తె.సి త.సి మ.సి బా.సి హా.సి కొ.సి యూ.సి "
అన్నాను నిద్ర మత్తులో హాలు లోని సోఫా లో కూలబడి.
"ఒరెయ్ పిచ్చి గానీ పట్టిందా , ఎంట్రా ఆ బాష ?" కిషోరు మండి పడ్డాడు " నువ్వు దాదాపు నలబై గంటలు ఏకదాటి గా చుసావు సినిమాలు ఆ ఫెస్టివల్ ల్లో, వచ్చి ఇరవయి గంటలకు పైగా మొద్దు నిద్ర, మరి పిచ్చి పట్టక ఏమవుతుంది" కోపాన్ని నవ్వు గా మారుస్తూ , సోఫా పక్కన వున్న కుర్చీ లో కూర్చున్నాడు.
"ఎమన్నావ్ ? మళ్ళీ అను .. కసి చేసి మసి పూసి యోసొ బాసి " కిషోరు కి నవ్వు ఆగటం లేదు
" తె.సి త.సి మ.సి బా.సి హా.సి కొ.సి యూ.సి "
నాకు తెలియకుండానే ఉచ్చరించాను నా మస్తిష్కం లో ముద్ర పడి పోయిన తారక మంత్రం లా
అప్పుడు తళుక్కున మెరిసింది , బ్రాంతి పటాపంచలయింది. నాకు తెలిసింది , అదంతా నాకు వచ్చింది కల అని. ' తె.సి త.సి మ.సి బా.సి హా.సి కొ.సి యూ.సి అంటే తెలుగు సినిమా తమిళ సినిమా మళయామ సినిమా బాలీవూడ్ సినిమా హాలీవూడ్ సినిమా కొరియా సినిమా యూరోపియన్ సినిమా '
నేను ఇష్టం గా చూసే అన్నీ బాషా చిత్రాలు నా కలలో పాత్రలు పాత్రధారులు అన్నమాట
"ఒరెయ్ కిషోరా పదరా, బుర్ర పని చేయటం లేదు, వేడి వేడి కాఫీ పీకి , కొంచెం ఏదన్నా తిని, మనం మళ్ళీ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్దాం" అంటూ బాతురూం లోకి వెళ్ళాను తయారవటానికి.
"ఆ షూర్, కానీ ఏకదాటి గా ఇరవయి ముప్పయి గంటలు అంటే నావల్ల కాదరదు రెయ్, ఇదిగో నీలాగా పిచ్చి వాగుడు వాగి కొత్త బాష కనిపెట్ట లేను" కిషోరు అనటం నాకు లొపలకి బాతు రూము లోకి వినపడింది
తయారయి బట్టలు వేసుకొని " ఒరెయ్ కిషోరా మనం ఎప్పుడూ తెలుగు సినిమాల్లో కథలు బాగోవు, అస్సలు కథలే వుండవు, ఒక వేళ కథ బాగుంది అంటే అది పర బాష నుంచి తస్కరించ బడి వుంటుంది అనుకుంటాం కదా, అది ఎందుకో నాకు తెసురు రా" అని కారు కీస్ తీసుకొని " పద కాఫీ తాగుతూ ఆ కల నీకు... అదే ఆ కథ నీకు చెప్తా" అంటూ బయటకు బయలు దేరాము ఇద్దరమూ
***** కల సమాప్తం ***