నాన్నా ! మీరంటే నామనస్సున భయం నిండిపోయింది. అది చిన్నతనం నుండి పెరుగుతూనే! నేడు మహా వృక్షమై, నాఎదుట నిలిచింది. అదే వృక్షం నీడన సేదతీరుతూ, ఒక్కోసారి ఉలిక్కిపడి నిద్రలేస్తుంటా నేను!. అంతలోనే మీ చల్లని చిరునువ్వు గుర్తు చేసుకుంటా. ఎదను మలయ పవనంలా తాకుతుంది ఎదో చెప్పలేని స్పర్శ. చిన్నతనంలోనే తెలిసీ తెలియక ,అమ్మ చాటు బిడ్డగా పెరిగిన నేను,తొలిసారిగా స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించడానికి భయపడ్డాను,మీ ముందు నిలిచి. కారణం మీకు తెలిసిందేనని ప్రత్యేకంగా చెప్పలేను!అన్ని సబ్జెక్టుల్లో తొంభై శాతం మార్కులు తెచ్చుకునే నేను , హిందీలో మాత్రం నామమాత్రంగానే మార్కులు తెచ్చుకోవడం ఒక కారణం కావొచ్చు!,లేదా హిందీ మీ అభిమాన భాష కావచ్చు. మీకు అంత ఇష్టమైన సబ్జెక్టులో తక్కువ మార్కులు తెచ్చుకునే నేను ధైర్యం చేసి మీముందు నిలుచునే ప్రయత్నం చేయలేక పోవడం ఒక కారణం. ప్రాధమిక విద్య పూర్తి చేసుకుని,కాలేజిలో చేరాలనుకుంటే, సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్స్, అక్కడ కూడా హింది,తెలుగు,సంస్కృతం. "నేను తెలుగు మాత్రమే తీసుకుంటాను,ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తాను" అని ధైర్యంగా మీతో చెప్పలేక,అమ్మ తోడు చేసుకున్న రోజు నాకు ఇంకా గుర్తు. "పండిత పుత్రా పరమ శుంఠహా "అన్నట్లు ,హిందీ మాస్టర్ కొడుకు హిందీ వదిలేసి తెలుగు తీసుకుంటే సహా ఉద్యోగులు నవ్వుతారు." అని మీరు గద్దించిన రోజు నాలో మీ పట్ల భయం మరికాస్త పెరిగింది. ఇంటర్ తరువాత టి.టి.సి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వమని అమ్మతో మీరు చెప్పించిన రోజు, లేదు నేను పోలీసు సెలెక్షన్ ప్రీపెయిర్ అవ్వాలనుకుంటున్నా! అని చెప్పలేక తలవంచుకుని భయంభయంగా ,అమ్మ చాటుగా నిలబడిపోయింది ఇంకా గుర్తు. ఇంటిలో గంభీరంగా తిరిగే మీరంటే ఎందుకో చెప్పలేనంత భయం!. కానీ!నాన్న నా పిల్లలు పెరిగి పెద్దవుతూ,నేటి కల్చర్ కు అలవాటు పడి , తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతూ మాట్లాడుతుంటే,అప్పుడు అనిపించింది! ఇన్ని రోజులుగా నేను భయంను నా మనసులో నిలుపుకున్నా అనుకున్నా! కానీ!మీ పట్ల ఎనలేని గౌరవం నిలుపుకున్నానని ఆనాడు తెలుసుకోలేక పోయాను. ఇప్పుడు తెలిసిన తరువాత భయం మరికాస్త పెరిగింది.అదే గౌరవం ఎల్లకాలం నా గుండెల్లో నిలుపుకోవాలని? ఏక్షణం అది చేజారకూడదని! నాన్నగా నా వెనక ఉండి, మీ ఉనికిని కనిపించనీయక,నన్ను నాలా ఎదిగేలా సహకరించిన మీరంటే, నేటికీ గౌరవంతో చూసే చూపులను మీరు పసిగట్టిన వెళ, మీ కన్నుల్లో కనిపించిన ఆనంద బాష్పాల విలువ ఎప్పటికీ తగ్గకూడదని.,అది నిలుపుకోలేక పోతే ఎలా అనే భయం నన్ను వెంట ఉండి నడిపిస్తుంది. ఇదేనేమో !మీరు నా నుండి ఆశిస్తున్నది. ఇవి మీతో చర్చించాలని ఎప్పటినుండో అనుకున్నా!మీ గంభీర రూపం ముందు అటువంటి ప్రయత్నం చేయలేక నా మనసుకే విన్న వించుకుంటున్నా. నా మనసు చదవగల మీకు ఇది అర్థమౌతుందని తెలుసు కనుక. అందుకే అందరూ అంటారు, "పరంధామయ్య గారికి తగ్గి తనయుడిరా రాఘవా".అని. మరి నాన్న పేరు,తాతగారి పేరు నిలపవసిన బాధ్యత నాదే కదా! అది నా గొప్పేమీకాదు!మీ గొప్పతమే నాన్నా! // శుభం//