దిన దిన గండం - తటవర్తి భద్రిరాజు

Dina dina gandam

ఊరిలో రాజుగారి వీధి దాటి ముందుకు వెళ్తే మట్టిరోడ్డు రాళ్లు పైకి లేచి కనపడుతుంది.

ఆ రోడ్ పక్కనే ఒక పక్కకు వంగి ఉన్న ములగ చెట్టు ఎప్పుడు విరిగిపోదామా అన్నట్టు చూస్తూ ఉంటుంది.

రోడ్ పై ఉండే గుంతలు వర్షా కాలం లో నీళ్లతో నిండి చిన్న సైజ్ సిమ్మింగ్ పూల్ లా కనపడుతుంటాయి.

వీధి కుక్కలు ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూ ఆ రోడ్ పై వచ్చే వాళ్ళని బయపెడుతూ ఉంటాయి.

కొంచం ముందుకు వెళ్తే రోడ్ కి ఇరువైపులా పూరి గుడిసెలు ఉంటాయి. వీరభద్రం ఎడమ వైపు నాలుగో పూరి గుడిసలోనే ఉంటాడు. వీరభద్రం భార్య ముత్యం.

వీరభద్రం గీత కార్మికుడు. అంటే తాడి చెట్లు నుండి కల్లు తీసి అమ్ముతుంటాడు.

వారసత్వం గా ఉన్న రెండు ఎకరాల పొలం లో వరి పండిస్తూ ఉంటాడు.

ప్రతీ సవంత్సరం ఊరి చివర న ఉన్న తాడి చెట్లను పంచాయతీ వాళ్ళు వేలం వేస్తుంటారు. ఆ వేలం పాటలో తాడి చెట్లు ను కొని కల్లు తీస్తుంటాడు.

వేసవి లో పూత మీద ఉన్న మామిడి చెట్లు ను కొని మామిడి కాయలు, పళ్ళు కూడా అమ్ముతుంటాడు. పోయిన సవంత్సరం ఇలానే మామిడి చెట్లను కొన్నాడు. కానీ అనుకోకుండా వచ్చిన గాలివాన వలన పూత మొత్తం రాలిపోయి చాలా నష్టం వచ్చింది.

వీరభద్రం తాడి చెట్లు నుండి కల్లు తీసి ఇంటికి తీసుకు వస్తే , ముత్యం ఇంటి దగ్గర కల్లు అమ్ముతుంటుంది.

కల్తీ లేని కల్లు అమ్ముతుంటాడని వీరభద్రానికి మంచి పేరు ఉంది.
ఎంత ఎతైన తాడి చెట్టు ఐనా అవలీల గా ఎక్కయి గలడు వీరభద్రం.

ఓసారి రైస్ మిల్లు పక్కనే ఉండే సందులో ఉన్న తాడి చెట్టు ఎక్కాక వీరభద్రానికి కళ్ళు తిరిగాయి. చెట్టు పై నుండి కిందకి జారిపడ్డాడు. కానీ దేవుడు దయవలన ఏమీ కాలేదు.

వేరే వాళ్ళు ఐతే మళ్లీ తాడి చెట్టు ఎక్కడానికి బయపడేవాళ్ళు. వీరభద్రం ధైర్య వంతుడు కాబట్టి మళ్లీ మళ్లీ చెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. కల్లు తీస్తూనే ఉన్నాడు.

వర్షా కాలం లో ఓరోజు సాయంత్రం వరి పొలం చూద్దామని పొలానికి వెళ్ళాడు.

పొలానికి వెళ్లిన కాసేపడకే ఆకాశం లో మబ్బులు బాగా పట్టాయి. బాగా చీకటి పడింది. పెద్ద గా వర్షం ప్రారంభం అయింది.

వర్షం లో తడుస్తూ ...వేగంగా పొలం గట్టు పై నడుస్తూ... ఇంటికి బయలుదేరాడు.

చలపతి గారి పొలం పక్కనే ఉన్న కాలువ గట్టు దాటుతుంటే కాలికింద , ఏదో తొక్కినట్టు అనిపించింది.
ఆ చీకట్లో సరిగా కనపడకపోయినా అది పామే అని ఇట్టే పసిగట్టగలిగాడు వీరభద్రం.

దేవుడి దయ వలన పాము కరవలేదు. అదే చాలు అనుకుంటూ వేగంగా ఇంటికి చేరాడు.

తరువాత రోజు ఎరువుల కోసం పక్క ఊరికి బయలుదేరుతుంటే వీధి చివరన గోడ పక్కనే ఒక పాము కనపడింది వీరభద్రానికి. చంపేద్దాం అనుకునే లోపే పక్కనే ఉన్న రాళ్ళ లో దూరిపోయింది.

ఇంకో రోజు పొలం లో కలుపు తీయించి ఇంటికి వచ్చాడు.

ముత్యం మామిడి చెట్టు కింద పుల్లల పొయ్య పై వేడి నీళ్లు పెట్టి ఇంటి లోపల పని చూసుకుంటూ ఉంది.

వేడి నీళ్లు తీసుకుందామని మామిడి చెట్టు కిందకి వెళ్లిన వీరభద్రానికి పక్కనే ఉన్న వెదురు పుల్లల్లో మళ్లీ పాము కనపడింది.

తను పొలం లో తొక్కిన పాము పగ పట్టింది అని వీరభద్రం అనుకున్నాడు.

ఆ రాత్రి కి రాత్రే కిళ్లీ షాప్ సూరిబాబు ని తీసుకుని పక్క ఊరిలో ఉన్న పాము మంత్రం వేసే వెంకయ్య దగ్గరకి వెళ్ళాడు.

పాము పగ పట్టింది అని చెప్పగానే వెంకయ్య గసగసాలు ముందర పెట్టుకుని ఎదో మంత్రం చదివాడు.

ఆ మంత్రించిన గసగసాలు ను వీరభద్రానికి ఇచ్చాడు.

వీరభద్రం వాటిని తీసుకుని ఇంటికి వచ్చి తన ఇంటి చుట్టూ చల్లాడు. తాను పడుకునే మంచం చుట్టూ చల్లాడు.

ఎందుకైనా మంచిది అని కొంత కాలం బయటకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు.

ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు ఆ పాము గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ క్షణం ఐనా పాము వచ్చి పగ తీర్చుకుంటుంది అని భయపడుతూ ఉన్నాడు.

వీరభద్రానికి రాత్రులు నిద్ర లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. తిండి తినాలి అనిపించడం లేదు. ముత్యం ఎంత ధైర్యం చెప్పినా వీరభద్రం మనసులో అ భయం అలానే ఉంది.

ఓరోజు వంట గది లో పొయ్యి పక్కనే గోడకు అనుకుని కూర్చున్నాడు వీరభద్రం.

తన చేతి మీద ఎదో కరిచి పక్కనే ఉన్న కుండల్లో కి దూరింది. కరిచిన చోట రక్తం వచ్చింది.

తనని కరిచింది తనని పగపట్టిన పామే అని గట్టిగా అరిచాడు వీరభద్రం.
ఆ అరుపుకు ముత్యం వచ్చింది. ఇంటి పక్క వాళ్ళు వచ్చారు.

పాము ఆ కుండలోకి దూరింది అని చెప్పి కుప్పకూలిపోయాడు వీరభద్రం. వెంటనే ప్రాణం పోయింది.

******* *******

అందరూ కలిపి ఆ కుండలు పగలగొట్టి, పాము ను చంపేద్దాం అని సిద్ధం అయ్యారు. నాలుగు కుండలు పగలు కొట్టేటప్పటికి చిన్న గా శబ్దం చేసుకుంటూ బయటకి వచ్చింది ఓ చిట్టెలుక .

భయం అన్నింటి కంటే భయంకరమైనది.



మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు