ఎందరో మహానుభావులు... - సిహెచ్.వి.యస్. యస్. పుల్లం రాజు

Endaro mahanubhavulu

"ఒరే శ్రీధర్ ! ఎలా వున్నావురా? ఓహ్,మరిచిపోయా..బ్యాంకు వ్యాపార లావాదేవీల సమయం కదా! …"అంటూ గోపి చెప్పడం ప్రారంభించాడు. బ్యాంక్ ఉద్యోగి శ్రీధర్ కి ఊపిరి సలపనంత పనులతో సతమత మవుతున్నాడు ఆ సమయంలో."శ్రీధర్ నాకు అర్ధమయ్యింది

నువ్వు చాలా బిజీగా వున్నావు. ఫర్వాలేదు. వీలు చేసుకుని నువ్వే ఫోన్ చేయి. ఎదురు చూస్తూవుంటా. మర్చిపోకు సుమా.." ఠక్కున ఫోన్ పెట్టేసాడు గోపి. పనులు ముగించుకొని, శ్రీధర్ ఫోన్ చేశాడు. "గోపీ! ఏమిటిరా ఫోన్ చేశావు. అందరూ బాగున్నారా ? ఏమిటి సంగతులు?" అంటూ కుశల ప్రశ్నలడిగాడు. "నీకో శుభవార్త. ఈ రోజు నేను, విశాఖపట్నం ఆఫీసు పని మీద వెళుతున్నా రైలులో. అది చెప్పాలనే ఫోన్ చేశా. వెంటనే శ్రీధర్ అడిగాడు, "విజయవాడలో దిగి ఇంటికి వద్దామనా ? మరి ఆఫీసు పని మీద అంటున్నావు.." గోపీ ఉద్దేశ్యం ఏమిటో తెలియ లేదు శ్రీధర్ కి."ఇంటికి రాలేనురా. కానీ నువ్వు రైలు స్టేషన్ కి రావాలి. నీకు తెలుసుగా ఆ రైలు కనీసం పావు గంట ఆగుతుంది. కలిసి నట్టు వుంటుంది."అన్నాడు హుషారుగా గోపి. శ్రీధర్ ఇబ్బంది పడుతూ, "కానీ,.ఈ రోజుసాయంత్రం, మా వియ్యంకుడు వాళ్లు వస్తున్నారు. కొంచెం షాపింగ్ కూడా వుంది. కుదరక పోవచ్చు…" శ్రీధర్ మాటలు పూర్తి కాకుండానే, గోపీ అన్నాడు,"దయచేసి ఆలా అనకురా. ఐనా, రాత్రి పదకొండు గంటలకి కదరా? అప్పటిదాకా పనులేమి వుంటాయి చెప్పు. వస్తానంటే మీ వియ్యంకుడుని కూడా తీసుకురా. నువ్వు వస్తావని, నిన్ను కలిసే అవకాశం వస్తుందనే ఈ టూర్ వేసుకున్నా. ఇప్పుడు నువ్వు రాలేనని చెబితే ఎలా.."అతని మాటలకి స్పందిస్తూ, శ్రీధర్ మొహమాటంతో," సరే, చూస్తాను.రావడానికే ప్రయత్నం చేస్తా…" మాటలు మధ్యలోనే తెంచుతూ, " థాంక్స్ రా. నాకు తెలుసు నువ్వు కాదనవు.నీ మీద నమ్మకం వుంది. ఇంతకీ అసలు సంగతి మరిచిపోయా. నువ్వు చెల్లాయితో నా మాటగా చెప్పి, నాకిష్టమైన బిర్యానీ చేయించి తీసుకురా. బయట ఆహారం అజీర్తి చేస్తుంది. నీకోసం ఎదురు చూస్తాను. మరిచిపోకు. సరే, రాత్రి కలుస్తున్నాం" అంటూ అవతల సమాధానం పూర్తి గా వినకుండానే ఫోన్ కట్ చేశాడు గోపీ.

💐💐💐

"చెప్పరా కృష్ణ ! ఇన్నాళ్లకు జ్ఞాపకం వచ్చానా? మొన్న ఆదివారం విజయవాడలోనే వున్నా. గేట్ వే హోటల్ లో సెమినార్ లో ప్రసంగం చేయమని, విట్ యూనివర్సిటీ వాళ్లు కోరితే వచ్చాను. కనక దుర్గమ్మ వి. ఐ. పి దర్శనం కూడా వాళ్ళు చేయించారు. అక్కడ సమస్య వుంటే నీకు ఫోన్ చేద్దామనుకొన్నా. నీ స్నేహితుడు శ్రీధర్ కూడా గుడిలో కనబడి పలకరించాడు…." సుబ్బారావు మాట్లాడుతూనే వున్నాడు. కృష్ణకి సుబ్బారావు సంగతి తెలిసిందే. అతి కష్టం మీద అతన్ని ఆపుతూ, "మా అబ్బాయికి పెళ్ళి కుదిరింది.బావా!.ముందుగా. మీకు చెబుతున్నా..'" అని ఇంకా పూర్తి కాకుండానే, " అరుణ్ గాడికి పెళ్ళిట్రాగ్..! వెర్రి వెధవ చిన్నప్పుడు మాటలు సరిగ్గా పలక లేకపోతుంటే మా సుధ వాడ్ని తెగ ఏడిపించేది. బెంగళూరులో చాలా కాలం చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ, చాలా కష్టనష్టాలు పడ్డాడు పాపం. అప్పుడే నేను ఫోన్ చేసి, బ్యాంక్ పరీక్షలకి తయారు కావడమే మంచిదని గట్టిగా చెప్పాను. ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ లో ఆఫీసర్ గా చేరడం కనక దుర్గమ్మ దయ. అసలు, నాతో నువ్వు ఒక్క మాటంటే, ఎప్పుడో ఈ మాత్రం చిన్న ఉద్యోగం నేనే వేయించే వాడ్ని. అప్పట్లో ఆ బ్యాంక్ ఉన్నత ఉద్యోగులందరూ. నా క్లయింట్ లు. నేను ఏమి చెబితే అదే. ఆ రోజు వాడ్ని ఇంజనీరింగ్ లో చేర్పించమని నెత్తి నోరూ మొత్తుకొన్నాను.. నీ మూర్ఖత్వం నీదే కానీ, నా మాట కొట్టి పారేశావు. అప్పుడే మా వాడు, తెలివిగా ఇంజనీరింగ్ లో చేరాడు. దేనికైనా రాసి పెట్టి వుండలిరా. చూడు, ఇప్పుడు కెనెడాలో లక్షలు సంపాదిస్తున్నాడు" అని ఆయాస పడుతూ, ఒక్క క్షణం ఆగాడు. వింటున్న కృష్ణ భార్య, సుజాతకి, ఒంటికి కారం రాసినట్టుంది. ఆమెకు, సుబ్బారావు అన్నయ్య వరుసవుతాడు. " శుభమాని పెళ్ళి సంగతి చెప్పాలని ఫోన్ చేస్తే, ఈ గోల ఏమిటండీ! వయస్సు పెరుగుతున్నా, ఈ డబ్బా కబుర్లు తగ్గలేదు.వీడికి." అని రుసరుస లాడుతూ, మొగుడి చేతిలో ఫోన్ లాక్కుని, "అన్నయ్యా! పెళ్ళి చిన్న తిరుపతిలో చేస్తున్నారు. మీరు ఎంత మంది వస్తారో చెప్పితే, ఇక్కడ నుండి ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తాం.పెళ్ళి ఏప్రిల్ నెల పదవ తారీఖున. శుభలేఖలు వేస్తాము. వదినతో తప్పకుండా రావాలి సుమా!" అంటూ ఫోన్ కట్ చేసింది.

💐💐💐

గోదావరి ఎక్స్ ప్రెస్ కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు శ్రీధర్. అర్ధరాత్రి కావస్తోంది. రేపు బ్యాంక్ లోజరగబోయే 'ఋణమేళా' కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఈ వారంలో ఆడిట్ వుంది. ఒక మూల బుర్రలో ఆలోచనలు పరిగెడుతుంటే, కళ్లు మూతలు పడుతుంటే, నిద్రని బలవంతంగా నియంత్రణ చేసుకొంటూ, చేతిలో వున్న బిర్యానీ ప్యాకెట్, మంచినీటి సీసాని తీసుకొని నిలబడ్డాడు. ఇంతలో మైకులో వస్తున్న ప్రకటన విని, ఏసీ బోగీ ఆగే చోటుకి చేరుకొన్నాడు. బోగీల్లో నుంచి ప్రయాణీకులు దిగుతున్నారు.కొందరు ఎక్కుతున్నారు. కానీ గోపీ జాడ లేదు. రైలు బయలు దేరే సమయం దగ్గర పడుతోంది. నిద్ర పట్టి, పాపం, మెలకువ రాలేదేమోనని, గబ గబా బోగీల్లోకి దూరి, "గోపి.. గోపి.." ఆని అరుస్తూ ఆతృతగా వెతుకుతుంటే, నెమ్మదిగా బండి కదలసాగింది. సాహసం చేసి, శ్రీధర్ కదులుతున్న బోగీ లోంచి క్రిందికి దూకాడు.బిర్యానీ ప్యాకెట్ క్రింది పడి చిరిగి పోయింది. నీళ్ళ సీసా ఎక్కడో దూరంగా పడి పగిలింది. అదృష్టం బాగుండి, ప్లాట్ ఫారం మీదున్న వాళ్ళు, శ్రీధర్ ని గట్టిగా పట్టుకున్నారు. లేకపోతే, రైలు ట్రాక్ మీదకి దొర్లుకొంటూ పడేవాడు. మోకాలుకి దెబ్బె తగిలింది. అలాగే ఇంటికి బయలు దేరాడు కుంటుకొంటూ. అతని అదృష్టం బాగుంది, లేదంటే ఏ వార్త అతని కుటుంబ సభ్యులు వినేవారో తెలియదు. కానీ విశాఖపట్నం టూర్, రద్దయిన వార్త గోపికి తెలుసు. ఆ నెలలో కనీసం ఐదు వేల రూపాయల ఆదాయం అధికంగా వస్తుందని కలలు కన్న గోపీ ఎంతో నిరుత్సాహ పడ్డాడు ఆ వార్త విని. మరి ఆ అదనపు ఆదాయంకోసం అన్వేషణ చేయసాగాడు. స్నేహితుడు శ్రీధర్ కి, తన ప్రయాణం రద్దయనిదని, ఫోన్ లో చెప్పాలనుకొన్నాడు. కానీ, చెప్పకపోతే మాత్రం ఏమి జరుగుతుందట? వచ్చి, వెళతాడంతే కదా! లేకపోతే, శ్రీధర్ ఫోన్ చేస్తాడు,అప్పుడు కూడా చెప్పచ్చు. అది చాలా చిన్న విషయం. ఇది తెలియంది ఎవరికి? "సమయం చాలా విలువైనది. తెలివైన వారు సమయాన్ని వృధా చేయరు."అని సమర్ధించుకొన్నాడు.

💐💐💐

బెంగళూరు నుండి సుబ్బారావు కూతురు సుధ, అల్లుడు, మనవడు కూడా విజయవాడ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ కి స్వయంగా సుబ్బారావు వెళ్లి, వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చాడు. రెండు రోజుల నుండి కృష్ణ, సుజాత పెళ్ళి పనులతో చాలా బిజీగా వున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులతో ఇల్లంతా కోలాహలంగా వుంది. చిన్న చిన్న ఇబ్బందులు వున్నా అందరూ సర్దుబాటు చేసుకొంటున్నారు. సుబ్బారావు & కో మాత్రంఏ సి పడక గది ఆక్రమించారు. గది మధ్యలో సరిగ్గా పంకా క్రింద, అతని భార్యా,మనవడు, కూతురు,అల్లుడు కోసం పడకలు వేశాడు. వీరందరికీ శ్రీరామరక్షగా, అక్కడే ఒక మడత మంచం మీద, క్షీరసాగరంలో ఆది శేషుడి మీద విష్ణువులా పవళించాడు సుబ్బారావు. పెళ్ళి పనులు మీద తిరుగుతున్న వాళ్లకి, ఆతని మంచం వలనఎంతో అసౌకర్యంగా వుంది. కొంతమంది నిద్ర పోడానికి చోటు లేక యాతన పడ్డారు.పాపం సుబ్బారావు మాత్రం హాయిగా, గుర్రు పెడుతూ సుఖ నిద్ర చేశాడు. పెళ్లివారు మరునాడు ఉదయం ద్వారకా తిరుమల బస్సులో బయలు దేరారు. పెళ్లికొచ్చిన కుర్రాళ్ళకి తగిన సూచనలు, సలహాలు చేస్తూ, మొత్తం తన సూట్ కేసులు, బ్యాగులు జాగ్రత్తగా సర్దించుకొన్నాడు సుబ్బారావు. పెళ్ళి సామాను పెట్టడానికి జాగా లేక, కొంతమందికి సీట్లు లేక నిలబడ్డారు. బస్సు ప్రయాణంలో తన భార్యకు వాంతులు వచ్చే అవకాశం వుంది,జాగ్రత్తగా పథక రచన చేసి, ముందు సీట్లు ఆక్రమించారు సుబ్బారావు & కో. చేసేది ఏమీ లేక,

"వీడింతే, వీడు మారడు," అని చెల్లెలు సుజాత మనసులో బాధ పడి, కళ్లు తుడుచుకొంటుంటే, రహస్యంగా ఓదార్చడం భర్త కృష్ణ వంతయ్యింది. కృష్ణ పరిస్థితి తెలిసిన శ్రీధర్, తన కారులో పెళ్ళికి

వెళ్ళాడు.

💐💐💐

కుర్చీలో కూర్చోని పెళ్లి తంతుని శ్రద్ధగా గమనించ సాగాడు కృష్ణ. శ్రీధర్ కూడా అతని ప్రక్కనే కూర్చొని, మాటల్లో,ఆనాడు రైల్వే స్టేషన్లో జరిగిన సంగతి చెప్పాడు. వెంటనే కృష్ణ ఆలోచనలు గోపి మీదకి, సుబ్బారావు మీదకి మళ్ళాయి.

"సుబ్బారావు, గోపి లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప సూక్తులు, వేదాంత వాక్యాలు వల్లిస్తారు. మానవ సేవ గురించి ఉపన్యాసాలిస్తారు. తమ ఘన కార్యాలను,దైవ కార్యాలను,దాతృత్వాన్ని డోలు కట్టుకొని దండోరా వేసుకొంటారు. కానీ, ఆ 'పుణ్య పురుషులు'...

ఎదుటి వాడు దాహంతో గొంతు పిడచ కట్టుకొని దైన్యంగా చూస్తుంటే, మంచినీళ్ళు ఇవ్వండని చుట్టుపక్కల వాళ్ళని హెచ్చరిస్తారు. దాహంతో అలమటిస్తూ తమ కనులు ముందే ప్రాణం పోతున్నా సాక్షులుగా చూస్తుంటారు. గమ్మత్తు ఏమంటే, వీళ్ల దగ్గరే మంచి నీటి సీసా వుంటుంది. కానీ ఆది వారి దృష్టిలో పవిత్ర కాశీ గంగ. ఎవరికీ పడితే వారికీ, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని చూపించకూడదు.ఇవ్వకూడడు. ఆది వారి నిష్ట. ఆ పవిత్రతను సదా కాపాడుకోవడమే వారి కర్తవ్యం.వీరిని ఏమని పిలవాలనిపిస్తుంది.?"

ఇంతలో పురోహితులు," కృష్ణ గారూ! వేదిక మీదకి వచ్చి, ముందుగా మీ దంపతులు, నూతన వధూవరులకి అక్షింతలు వేయండి" అన్న కేకకు, ఆలోచనల నుండి, ఉలిక్కిపడి పరుగున వేదిక మీదకి చేరాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు