ధూ. పా. ని. కంకణం - బుద్ధవరవు కామేశ్వరరావు

Dhoo paa ni kankanam

"ఏమిటి మహాశయా ! ఏకంగా ఇంట్లోనే మేఘాలు సృష్టించేస్తున్నారు ?" వంటింట్లోంచి కేక వేసింది, రెండు రోజుల క్రితమే కొత్తగా కాపురానికి వచ్చిన ధూమప్రియ, వీధి గదిలో కూర్చుని విలాసంగా సిగరెట్ కాలుస్తున్న తన భర్త ధూమరాజుకి వినపడేలా. "నీకు మొన్న పెళ్లి రోజునే చెప్పాను కదోయ్ ! నిన్ను మబ్బుల్లో తిప్పుతానని!" చెప్పాడు ధూమరాజు, ఫోజు కొడుతూ ! "మబ్బుల్లో తిప్పడం అంటే ఇదా? మబ్బులు మాట దేముడెరుగు. ముందు ఉబ్బసంతో చచ్చేలా ఉన్నా" అంటూ మబ్బులు చీల్చుకుంటూ విమానం వెళ్తున్నట్లు, సిగరెట్ పొగను తోసుకుంటూ వంటింట్లోంచి వీధి గదిలోకి వచ్చింది ధూమప్రియ. "ఔనూ, నీ పేరు ధూమప్రియ కదా ! అలాంటి పేరు ఉన్న నువ్వు ఈ పొగను ప్రేమించాలి కానీ ఇదేమిటి ఇలా ??"

పొగను సుతారంగా ఆమె మీదకు వదులుతూ అడిగాడు. "ఈ పొగను ప్రేమించడానికి, మా తాత ఏమీ సిగరత్తుల కంపెనీలో కంపెనీలో పనిచేయలేదు అగరొత్తుల కంపెనీలో పనిచేసేవాడు. ఆ కంపెనీ పేరే అభిమానంగా నాకు పెట్టుకున్నాడు. ఔనూ మీ పేరేమిటి ? ఏదో పెద్ద ధర్మరాజులా , ధూమరాజు అని ? కొంపతీసి మీ వాళ్లంతా స్మోకింగ్ కింగులా?" మీదికి వచ్చిన పొగను తిరిగి అతని వైపు వెళ్ళేలా ఊదుతూ చెప్పింది. "అబ్బే, స్మోకింగ్ కింగులు కాదు. వెదురుబొంగులు, బొగ్గులు అమ్ముకొనేవాడు మా తాత. ఆయన పేరు రాజు. అందుకే అభిమానంగా ఆ వ్యాపారం పేరు, ఆయన పేరు కలిసేలా నాకు ఆ పేరు పెట్టారు" పొగను రింగులుగా వదులుతూ చెప్పాడు ధూమరాజు. "సరేకానీ, ఈ దిక్కుమాలిన ధూమపానం అలవాటు ఏమిటండీ మీకు ?" ముక్కు మూసుకుని అడిగింది. "చూడూ! జూదం వ్యసనంతో ఆలిని అమ్మకున్నట్టు, సురాపానం కోసం దేవదానవులు కొట్టుకున్నట్టు పురాణాలలో ఉంది కానీ, ధూమపానం కోసం గొడవలు పడ్డట్టు ఎక్కడా ఏ చరిత్ర లోనూ లేదు. అందుకే దీనిని అలవాటు చేసుకున్నా !" గుండెలనిండా పొగ పీల్చి, ముక్కు లోంచి వదులుతూ, చెవి నులుము కుంటూ నోటితో చెప్పాడు, రజనీ స్టైల్లో. "బాగానే ఉంది కానీ , ఆ వ్యసనాల వలన వాళ్ళు వాళ్ళూ కొట్టుకు చచ్చేరు. కానీ ఈ ధూమపానం వలన ఎదుటవారిని కూడా పట్టుకు చంపుతున్నారు కదా ?" ముక్కు మూసుకుంటూ చెప్పింది. "ఈ రోజున ఈ మాత్రం తిండి మనం తింటున్నాం అంటే దానికి కారణం మా ధూమపానమే తెలుసా ?" అన్నాడు యమ్మెస్ నారాయణ బాణీలో. "ఒహో. అర్ధమయ్యింది. మీరు సిగరెట్లు కొనడం వలనే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది అనే కాదా మీరు చెప్పేది ?" "అంతే కాదు, మేము వదిలే పొగ వలనే ఆకాశంలో మబ్బులు ఏర్పడి, వానలు కురిసి భూములు తడిసి పంటలు పండు తున్నాయి. మనం బతకాలంటే తిండి ఉండాలిగా ?" ఆనందంగా చెప్పాడు ధూమరాజు. "కానీ, తినాలంటే ముందు మీరు బతికి ఉండాలిగా, అంత వరకూ ?" అని విసురుగా లోపలికి వెళ్లింది ధూమప్రియ.

***** ***** ***** *****

ఓ మూడు నెలల తర్వాత, భర్త చేత ఎలాగైనా ఈ వ్యసనం మాన్పించాలని, ఎవరో చెప్పగా విని, సకల ధోష నివారణ సామ్రాట్ అని పిలవబడే సద్గుణరావు అనే సిద్ధాంతి గారి వద్దకు వెళ్లి, తన బాధలు చెప్పి, ఓ ఐదు వేలు పెట్టి అయన మంత్రించి ఇచ్చిన రాగి ధూమ పాన నివారణ కంకణం, అనబడే ధూ.పా.ని కంకణం తన చేతికి కట్టుకుంది ధూమప్రియ. ఓ రోజు సాయంత్రం వేళ... సిగరెట్ కాలుస్తున్న భర్తతో, "ఏమండీ.... ఊపిరి తిత్తుల కేన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లు" పాడింది రాగ యుక్తంగా. "కాదన్నారులే పెద్ద యాక్టర్లు" బదులిచ్చాడు, అదే బాణీలో. "అబ్బో, ఆ పాట మీకు పూర్తిగా వచ్చన్న మాట. ఏదీ ముందు పల్లవి పాడండి" "సరదా సరదా సిగరెట్టూ, ఇది దొరలు తాగు భల్ సిగరెట్టూ , కంపు...." "ఆగండాగండి. ఇది దొరలు కాల్చే సిగరెట్ కదా ? మరి మీరు దొరలు కాదు కదా ? ఎందుకు కాలుస్తున్నారు ?" పాయింట్ లాగింది ధూమప్రియ. కాసేపు, బుర్ర గోక్కున్న ధూమరాజు, "ఔనౌను, నువ్వన్నది రైటే. ఆ దొరలు దీనిని మనకి అంటించి వెళ్లిపోయారు. వాళ్లే వెళ్లి పోయిన తరువాత ఈ సిగరెట్ మనకెందుకు ? నిజమే, ఈ రోజు నుంచి మానేస్తాను" అంటూ ఆఖరి దమ్ము లాగి యాష్ ట్రేలో పడేసాడు మిగిలిన సిగరెట్ పీకని. తన ఆశయం నెరవేరినందున, చేతికి కట్టుకున్న ధూ పా ని కంకణాన్ని ఆనందంగా తీసేసింది ధూమప్రియ.

***** ***** ***** *****

మర్నాడు సాయంత్రం.... "ఏంటండీ ! కడుపులో కొంచెం వికారంగా ఉంది ? ఏమయ్యిందంటారు ?" ఆందోళనగా అడిగింది ధూమప్రియ. "వావ్!! ఔనా ? గుడ్ న్యూస్. అయితే ధూమ్ టూ రెడీ అన్నమాట. పుట్టబోయేది ఎవరైనా పేరు మాత్రం ధూమ్ టింగ్. ఇది కన్ఫర్మ్" "మిమ్మల్ని తగలెయ్యా ! వచ్చేది ధూమ్ టింగ్ కాదు వామిటింగ్" అంటూ నోరు మూసుకుని వాష్ రూమ్ వైపు దౌడు తీసింది ధూమప్రియ..... పది నిమిషాల తరువాత బయటకు వచ్చి, భర్తను చూసి, "అయ్యో, అయ్యో ! నోట్లో ఏమిటది ? అలా కాలుస్తున్నారు ? అయితే ఈ పొగవలనేనా నాకు వికారంగా ఉన్నది ?" ఆశ్చర్యంగా అడిగింది ధూమప్రియ, నోట్లో తూటాలా ఉన్న ఓ వస్తువును పెట్టుకుని, దానిని బొటకెన వ్రేలుతోనూ, చూపుడు వ్రేలుతోనూ సుతారంగా తిప్పుతూ, నోట్లోంచి పొగ వదులుతున్న ధూమరాజుని చూసి. "ఓహ్, అదా ? నిన్న నువ్వే కదా చెప్పావు. సిగరెట్లు దొరలు కాలుస్తారని. అందుకే అవి మానేసి ఈ రోజు నుంచి ప్రశస్తమైన మన లంక పొగాకు చుట్టలు కాల్చడం ప్రాక్టీసు చేస్తున్నా" చుట్టను తిప్పతూ చెప్పాడు. "మీ చుట్టకు పాడె కట్టా ! ఈ చుట్ట వాసనకి నేను బతికి బట్టకట్టేలా లేను కానీ, ఇంకెందుకు ? ఆ సిగరెట్టే తగలెట్టండి" విసురుగా అనేసి లోపలికి వెళ్లి పోయింది ధూమప్రియ. "అమ్మా... ! నాకు నీతులు చెబుతావా ! నాతో పెట్టుకోకు" అంటూ తన ఐడియా ఫలించినందుకు ఆనందపడుతూ చుట్ట ఆర్పి సిగరెట్ వెలిగించాడు ధూమరాజు, ఆనందంగా ! ఎలాగైనా సరే ఈ వ్యసనం మాన్పించాలని, ఉస్సూరుమని నిట్టూరుస్తూ, మళ్ళీ చేతికి కంకణం కట్టుకుంది ధూమ ప్రియ,

***** ***** ***** *****

ఓ వారం రోజులు తరువాత..... ఆఫీసు నుంచి వచ్చి, హాయిగా సిగరెట్ కాలుస్తున్న భర్తతో, "ఇదిగో, ఈ సిగరెట్లు ఓ మూడు దమ్ములు కూడా రావడంలేదు. రేపటి నుండి కింగ్ సైజు సిగరెట్లు తీసుకురండి !" అంది ధూమప్రియ, తనూ ఓ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ. "ఏంటీ ? నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావా ? వద్దు వద్దు. నువ్వు కాలిస్తే భవిష్యత్తులో మనకు పుట్టబోయే బిడ్డలకు ప్రమాదమట. అందుకే నువ్వు కాల్చవద్దు. అవసరమైతే నేనే కాల్చడం మానేస్తా " అంటూ ఆమె నోట్లో సిగరెట్ తీసేసి, తన కాలుస్తున్న సిగరెట్ తో సహా యాష్ ట్రేలో కుక్కేసాడు ధూమరాజు. యురేకా అంటూ గెంతుతూ తన స్నేహితురాలు ఇచ్చిన ఉపాయం పారి నందుకు ఆనందంగా కంకణాన్ని మళ్ళీ తీసేసింది ధూమప్రియ.

***** ***** ***** *****

ఆ మర్నాడు సాయంత్రం ఆఫీసు నుంచి, ఏదో పెద్ద పేకెట్ తో ఇంటికి వచ్చిన ధూమరాజు.... "ఓయ్, కమాన్ కమాన్ నీ కోసం ఏం తెచ్చానో చూసుకో ?" అరిచాడు ఆనందంగా. "ఏంటి ఇవి కాజూ స్వీట్లా ?" ఆనందంగా అడిగింది. "కాజూ స్వీట్లు కాదు కింగ్ సైజు సిగరెట్లు. నీ కోసం తెచ్చా ! ఎందుకంటే, నిన్న నేను అన్నది తప్పు అని తెలుసుకున్నా ! విదేశాల్లో గర్భిణీ స్త్రీలు కూడా సిగరెట్లు కాలుస్తారుట. వాళ్ళ పిల్లలకు ఏమీ కానప్పుడు మన పిల్లలకు కూడా ఏమీ కాదులే. నీ సంతోషం నేనెందుకు కాదనాలి. ప్రస్తుతం తొమ్మిది పేకట్లు కొంటే ఓ పేకట్ ఫ్రీ ఆఫర్ ఉంది. అందుకే ఓ పది తెచ్చి పడేసా ! కమాన్ ఒకటి వెలిగించు" అంటూ తను ఒక వత్తి వెలిగించి, ధూమప్రియకి ఒకటి ఆఫర్ చేసాడు ధూమరాజు. "ఛస్తున్నా నాయనా , ఈ దిక్కుమాలిన పొగతో. ఆ కిటికీ తలుపులు తీస్తే కొంచెం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ! లేకపోతే ఈ పొగతో పాటే నా ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయేలా ఉన్నాయి" అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్లి పోయింది ధూమప్రియ. తిన్నది అరగక ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే తన స్నేహితురాలు అజీర్తి అగర్వాల్ ను మనసులో తిట్టకుంటూ మళ్ళీ చేతికి కంకణం కట్టుకుంది ధూమ ప్రియ. "హహహ. హమ్మ .. నాతొ పెట్టుకుంటావా ?" అని మనసులో అనుకుంటూ తన తెలివితేటలకు ఆనంద పడుతూ మరో సిగరెట్ వెలిగించాడు ధూమరాజు

. ***** ***** ***** *****

ఓ పది రోజుల తర్వాత "ఏమండీ, రేపు సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేయండీ. ఆ డాక్టర్ వాయునందనరావు గారి అపాయింట్ మెంట్ తీసుకున్నాను. ఆయన ఇలాంటి దురలవాట్లుకు మంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారుట" చెప్పింది ధూమప్రియ. "ఎవరూ ? వాయునందనరావా ? రేపు సాయంత్రం కదా ? అలాగే వస్తాలే" చెప్పాడు ధూమరాజు

. ***** ***** ***** *****

మర్నాడు సాయంత్రం, డాక్టర్ వాయునందనరావుతో ధూమరాజు సిగరెట్ వాడకం గురించి అన్ని విషయాలు చెబుతూ.. "అదీ డాక్టర్ గారూ, ఈయన వరుస. బహిరంగ ప్రదేశాల్లోనూ, ఆఫీసులోనూ నిషేధం కాబట్టి, ఆ కాస్త సేపూ ఏదో వేడి పెనం మీద కూర్చున్నట్లు కూర్చొని, ఇంటికి రాగానే తలుపులు బిడాయించి అగ్నిహోత్రం మొదలెట్టేస్తున్నారు" వివరంగా చెప్పింది ధూమప్రియ. "చూడమ్మా, నువ్వు అనుకున్నట్లుగా ఈ అలవాటు పెద్ద జబ్బు ఏమీ కాదు. కొన్నాళ్ళు తర్వాత అదే పోతుంది" శాంతంగా చెప్పాడు వానరావు. "ఔనా ? అదెలా డాక్టర్ ?" అమాయకంగా అడిగింది ధూమప్రియ. "చూడమ్మా, చిన్న పిల్లలు వాళ్ళ ఒంట్లో కాల్షియం లెవల్ తక్కువగా ఉంటే తరచుగా ఏం తింటారు ?" అడిగాడు డాక్టర్. "ఆ...సుద్దముక్కలు, గోడ సున్నం పెచ్చులు" చెప్పింది. "ఔనా. మరి తగినంత కాల్షియం సమకూర గానే వాళ్ళు అవి తినడం మానేస్తారుగా ? అలాగే మీ ఆయన ఒంట్లో కూడా కాలూష్యం, కార్బన్, నికోటిన్ ల శాతం తక్కువగా ఉండడం వలన సిగరెట్లు కాలుస్తున్నాడు. అంతే ! ఒక్కసారి ఆ నిల్వలు సమకూరితే ఆయనే మానేస్తాడు" అంటూ గాలి కబుర్లు చెప్పాడు వాయునందనరావు. "సరే డాక్టర్. ఓ నెల తరువాత మళ్ళీ వస్తాం" అంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు ధూమప్రియరాజులు.

***** ***** ***** *****

ఇంటికి వచ్చి స్టైలుగా సిగరెట్ వెలిగిస్తూ, "పాపం, నేను ఈ రోజు ఉదయమే డాక్టర్ వాయునందనరావు ని కలసి, ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి పైన చెప్పిన డైలాగులు చెప్పమని చెప్పినట్లు, పాపం ధూమప్రియకు తెలియదు" అనుకున్నాడు ధూమరాజు, స్టైలుగా సిగరెట్ వెలిగిస్తూ

***** ***** ***** *****

ఓ మూడు నెలల తర్వాత.. సాయంత్రం, కుర్చీలో కులాసాగా కూర్చుని, విలాసంగా పొగ వదులుతున్న ధూమరాజు దగ్గరకు వచ్చి, "ఇదిగో ! మిమ్మల్నే, ఈసారి సిగరెట్ కాల్చే ముందు ఓసారి నేను మీకు ఫార్వార్డ్ చేసిన ఆ భయంకరమైన వీడియో చూడండి" అంది ధూమప్రియ. "హేమిటో, నీకు అన్నీ భయాలే. సరే ఇప్పడే చూస్తా." అంటూ ఆ వీడియో ఓపెన్ చేసాడు ధూమరాజు. వీడియో ప్లే చేయడం మొదలయ్యింది. ఎవడో ఓ యాంకర్ కుర్రాడు తెర మీదకు వచ్చి ఇలా చెబుతున్నాడు... "హలో, మిమ్మల్నే ! మీకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉందా ? అయితే ఈ సారి సిగరెట్ అంటించేముందు ఓసారి ఇది చూడండి" అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో, ... ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి నోట్లో సిగరెట్ పెట్టకుని, లైటర్ తో వెలిగించాడు. ఓ రెండు దమ్ములు పీల్చి పొగ బయటకు వదిలాడు. మూడో దమ్ము లాగడానికి నోట్లో సిగరెట్ పెట్టుకుని బలంగా లోపలికి దమ్ము లాగాడు. అంతే... ఢమాల్ ......అంటూ పెద్ద విస్పోటనం, పొగ....... ఓ పది సెకన్ల తరువాత ఆ సిగరెట్ కాల్చిన మనిషి ఛిద్రమైన మొహంతో, వేలాడిపోయిన దవడతో నేలమీద పడిపోయి ఉన్నాడు. మళ్ళీ యాంకర్ కుర్రాడు తెరమీదకు వచ్చాడు. "చూసారా ? ఇది ఎక్కడో కాదు. మన దేశంలోనే అది కూడా మన రాష్ట్రంలోనే జరిగింది. ఎలాగంటే, కొన్ని శత్రుదేశాలు కరోనా పురుగును మానవాళి మీదికి వదిలి నట్టుగానే, పెను విధ్వంసం సృష్టించడానికి చిన్న చిన్న బాంబులను సిగరెట్లలో పెట్టి జనం మీదికి వదులు తున్నారు. అందుకే సిగరెట్ ప్రియులూ బీ కేర్ ఫుల్. " అంటూ ముగించాడు.

***** ***** ***** *****

ఆ వీడియో చూసి, బెంబేలెత్తిపోయిన ధూమరాజు, "ఏమిటీ, ఇది నిజమేనంటావా ?" కాలుస్తున్న సిగరెట్ యాష ట్రేలో పడేసి అడిగాడు, కొంచెం భయంభయంగా, పొగ చూరిన మొహంతో. "నిజమా అంటే ఏం చెబుతాం ? మొన్న టీవీలో చూసారుగా ? తినే పండ్లలో చిన్న చిన్న బాంబులను పెట్టి పాపం ఓ ఏనుగును, ఓ ఆవును ఎలా హింస పెట్టారో ? అలాగే సిగరెట్లలో బాంబులు పెట్టి హింసరచన చేయడానికి ఎవరైనా ప్లాన్ వేస్తున్నారేమో ? మీరే ఆలోచించుకోవాలి. ఏ బాక్సులో ఏ బాంబు ఉందో ? " చెప్పింది ధూమప్రియ. ఇక, ...... సిగరెట్ వైపు చూద్దామంటే, ..సినిమా ముందర వచ్చే "నా పేరు ముఖేష్" అనే ధూమపానం ఎడ్వర్టైజుమెంటులో కనబడే మొహాలు ఒకవైపు, అలాగే వీడియోలో ఉన్న ఛిద్రమైన ఆ మనిషి మొహం ఒకవైపు కనబడుతూంటే,...... భయపడుతూ సిగరెట్ పేకెట్ రోడ్డు మీదికి విసిరేసాడు ధూమరాజు, ప్రాణాలుంటే పిప్పరమెంట్లు తిని బతకొచ్చని.

***** ***** ***** *****

ఓ వారం తర్వాత తన చిన్నాన్న కొడుకుకి ఫోన్ చేసిన ధూమప్రియ "ఒరే తమ్మడూ, నా బాధ చెప్పగానే మీ బావగారికి బుద్ధి వచ్చేలా భలే వీడియో పంపేవురా. అప్పటినుండి భయపడి సిగరెట్లు మానేసి, పిప్పరమెంట్లు నములు తున్నార్రా . ఔనూ! పాపం, ఆ సంఘటన నిజంగా జరిగిందా ?" అమాయకంగా అడిగింది ధూమప్రియ. "అబ్బే, లేదు అక్కా ! నేను వీడియో మిక్స్ చేసి అలా తయారు చేసా. ఆ యాంకరూ, అలాగే ముందు సిగరెట్ కాల్చినవాడూ ఇద్దరూ మా ఫ్రెండ్స్. ఆ ఢమాల్ అన్నది దీపావళి బాంబు వీడియో. ఆ మొహం ఛిద్రమైన వ్యక్తి, యుద్ధంలో బాంబు దాడిలో గాయపడ్డ ఓ పాలస్తీనా సైనికుడు. ఇవన్నీ కలిపి ఓ వీడియో చేసా !" చెప్పాడు వీడియో ఎడిటర్ అయిన ఆమె తమ్ముడు. ఇక తన ఆశయం నెరవేరడంతో, ఆనందించిన ధూమప్రియ ఓ సారి సిద్ధాంతి గారిని కలుసుకుని, వారికి కృతజ్ఞతలు తెలిపి అక్కడే కంకణం శాశ్వతంగా తీసేయొచ్చు అనుకుని అక్కడికి బయలుదేరింది. సిద్ధాంతి గారి ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉండడంతో, మెల్లగా తీసిన ధూమప్రియ, అక్కడ సోఫాలో కూర్చుని విలాసంగా పొగ వదులుతూ, సిగరెట్ కాలుస్తున్న సద్గుణరావు సిద్ధాంతిని చూసి, ఆ కంకణం అక్కడే విసిరికొట్టి ఇంటికి బయలుదేరింది, తన భర్త సిగరెట్లు మానివేసింది ఈ దొంగ సిద్ధాంతి ఇచ్చిన కంకణం వలన కాదు, తన తమ్ముడు తెలివితేటల వలన అని మనసులో అనుకుంటూ.

***** *** శుభం *** *****

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్