ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
అలా జరగకుండా ఉండుంటే బావుణ్ణు అని ఎన్ని సార్లనుకున్నానో లెక్కలేదు. కానీ మన చేతిలో ఏమి లేదు కద.
సిక్త్స్ సెన్సో , సెవెన్త్స్ సెన్సో అని అనను కానీ అసలా రోజు ఉదయం లేవంగానే అనిపించింది ’ఈ రోజు సజావుగా సాగబోవడం లేదు’ అని.
అసలేం జరిగిందో చెప్తాను. ఇది తెలుసుకోవాలి అంటే మనం కడపకు వెళ్ళాలి. ఇందులో విధి ఆడే వింతనాటకం ఉంటుంది.
****
"ఐ ట్రీట్-హీ క్యూర్స్"
పై కొటేషన్ మొదటిసారిగా కడపలో డాక్టర్ .రాధికగారి హాస్పిటలో చూశాను. ఏసు క్రీస్తు ది ఒక పెద్ద తైల వర్ణ చిత్రం, ఆ పటంలో ఒక మూలగా పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్. ’నేను వైద్యురాలిగా చికిత్స చేసినా, తగ్గించేది, బాగు చేసేది ఆయనే. నేను నిమిత్తమాత్రురాలిని సుమా!’ అన్న భావం ఈ వాక్యాలలో కనిపిస్తుంది.
ఇంత వేదాంతంతో నిండిన కొటేషన్ పెట్టుక్కూర్చుంది కద, ఆవిడ ప్రశాంతంగా, జాలి దయ ఉట్టిపడే చూపులు చూస్తూ ఆదరంగా మాట్లాడుతూ ఉంటుంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే సుమా.
ఆవిడకి ముక్కుమీదనే కోపం ఉండేది. తెగ చిరాకుపడిపోయేది అందరిమీద. అమె ప్రతి అడుగులోనూ, పలుకులోను విపరీతమైన డిసిప్లిన్ కనిపించేది. ఆవిడది అహంకారమో కోపమో కాదు, ఆత్మవిశ్వాసం అని ఆవిడని దగ్గర నుంచి చూసి అర్థం చేసుకున్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఆవిడ తనచుట్టూ ఒక గిరిగీసుకుని ఉంటారు. ఆవిడ వయసు ముఫై అయిదు కి లోపలే ఉంటాయి. చూడంగానే ఆకట్టుకునే రూపం ఆమెది. ఒక సారి చూసిన వారు చటుక్కుమని చూపు తిప్పుకోలేరు ఆమె పై నుంచి.
ఆవిడ భర్త కూడా డాక్టరే, ఆయన ఎక్కడో దూరదేశంలో ఉండేవారు ఆరోజుల్లో.
చొరవతీసుకుని ఎవ్వరూ ఆమెతో చనువుగా ఉండే ప్రయత్నం చేయకుండా, ఇలా ఆమె చిర్రుబుర్రులాడుతుంటారని దగ్గరవారికి మాత్రమే తెలుస్తుంది.
నిజానికి ఆమె చాలా దయగల మనిషి. చాలా మంచి మనిషి అని నేను స్వయంగా తెలుసుకున్నాను.
నేను ఆవిడ కోపానికి ప్రత్యక్షంగా గురయ్యాను, ఆవిడ దయని కూడా కళ్ళారా చూశాను. ఇవన్నీ చెబుతాను ఈ కథలో.
***
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ అన్న పదం కూడా తెలియని రోజులు అవి. అప్పుడు యువతకి ముందున్న ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితం. ఏదైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోవటం లేదా బ్యాంక్ ఉద్యోగం లో చేరిపోవటం మాత్రమే అప్పుడున్న ప్రధాన ఉద్యోగ అవకాశాలు. అయితే ఇవి కూడా అంత సునాయాసంగా ఏమీ వచ్చేవి కావు.
అతి కష్టం మీద బ్యాంకు ప్రవేశ పరీక్షలు పాసయి ఒకట్రెండు బ్యాంకు ఉద్యోగాలు ఇంటర్వ్యూ వరకు వచ్చినట్టే వచ్చి , నాకు దక్కకుండా పోయాయి.
’కోరుకున్నది దొరకకుంటే, దొరికిన దాన్నే కోరుకోవాలి’ అన్నంత బరువైన డైలాగేమీ చెప్పను. నాకు ఎందుకో మొదట్నుంచీ మెడికల్ రెప్రెజెంటేటివ్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం ఉండేది.
రోగి కోరినదే వైద్యుడు పథ్యం చెప్పాడు అన్నట్టు, నాకెంతో ఇష్టమైన మెడికల్ రెప్ అవతారం ఎత్తాను. చక్కగా పాలిష్ చేసిన బూట్లు, ఎప్పుడూ మడత నలగని దుస్తులు, మెడలో టై, కంపెనీ వారు ఇచ్చిన మోటారు సైకిల్, ఎక్కడికి వెళ్ళీనా స్టార్ హోటల్లో బస, ఫస్ట్ క్లాస్ ఏసీలో లేదా విమానంలో ప్రయాణం ఇలా చాలా జోరు మీద ఉండేది జీవితం. కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు అవి.
కొందర్ని చూస్తూనే వీరికి బ్రతకనేర్చిన తనం ఉంది అని అంటుంటాం. అలాంటి స్ట్రీట్ స్మార్ట్ కాను నేను. నెమ్మదస్తుడిని అని అప్పటికే పేరుతెచ్చుకున్న నేను ఈ ఉద్యోగంలో ఎలా రాణిస్తానో అని ఇంట్లో వాళ్ళు కాస్తా కంగారు పడ్డ మాట వాస్తవం. ఎందుకంటే ఈ వృత్తిలో విపరీతమైన టూర్లు, టార్గెట్ సంబంధిత వత్తిళ్ళు ఉంటాయనేది జగమెరిగిన సత్యం.
ఇంకో రహస్యం చెబుతాను, మెడికల్ రెప్రజేంటేటివ్స్ కి పిల్ల దొరకడం కష్టం అని, నా పెళ్ళి ఎలా అవుతుందిరా భగవంతుడా అని కూడా మా అమ్మానాన్నలు భయపడ్డారు. ఏది ఏమయినా ’మొండి వాడు రాజుకంటె బలవంతుడు’ అంటారు కద, అలా నా ఇతర ఉద్యోగ ప్రయత్నాలన్నింటికి స్వస్తి పలికి నాకిష్టమైన ఉద్యోగంలో చేరిపోయాను.
దేశంలోని పెద్ద కంపెనీలలో ఒకటైన మా కంపెనీకి కాస్తా ’చాదస్తం కంపెనీ’ అని పేరుండేది. కానీ అందరూ చాలా గౌరవించేవారు మా కంపెనీని.
నేను ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే, హైదరాబాద్ నుండి మా రీజినల్ మేనేజర్ మురళీ గారు నాతో కలిసి పని చేయటనికి జాయింట్ ఫీల్డ్ వర్క్ కి వచ్చారు. ఆయన ఇవ్వబోయే నివేదిక మీద ఆధారపడి నా ఉద్యోగం కన్ఫర్మ్ అవటం జరుగుతుంది. ఈ విధంగా తీసుకుంటే ఆయన పర్యటన చాలా ప్రాముఖ్యతతో కూడినది అని చెప్పవచ్చు.
నన్ను మిగతా రెప్రజెంటేటివ్స్ అందరూ విపరీతంగా భయపెట్టారు. సాధారణంగా ఇలా మేనేజర్ వచ్చి వెళ్ళాక ఉద్యోగం కోలోయిన రెప్రెజెంటేటివ్స్ అనేక మంది ఉన్నారని, ఎందుకయినా మంచిది వచ్చి యూనియన్ లో చేరమని, నీ తరఫున పోరాడుతాం అని నన్ను అయోమయానికి గురిచేశారు.
సరే ఇక ఆయన కడపకి రానే వచ్చారు. రీజినల్ మేనేజర్ గారి పర్యటన అంటే అదో గొప్ప సందర్భం అని చెప్పవచ్చు. ఆయన నుంచి ఒక మూడు రోజులపాటు ఙ్జానాన్ని పొందవచ్చు, ఆయనతో బాటే స్టార్ హోటల్లో చక్కటి భోజనం లభించేది.
సాయంత్రం ఫీల్డ్ వర్క్ కి మురళీ గారితో బయలుదేరాను. ఆ రోజుల్లో నా వద్ద పాత టీవీఎస్ 50 మోపెడ్ ఉండేది. దానిపై ఆయన్ని కూర్చోబెట్టుకుని బయలుదేరాను.
ఆయన చాలా చక్కగా ఉండేవాడు మనిషి. ఆయన కర్ణాటక ప్రాంతాలకు చెందిన మధ్వ బ్రాహ్మిణ్ అనుకుంటా. సన్నగా ఉండే వారు. గిల్లితే కందిపోతారేమో అన్నట్టు తెల్లటి తెలుపు, బట్టతల, సౌమ్యంగా మాట్లాడేవారు. తెలుగు ధారాళంగా మాట్లాడలేకపోయేవారు. కన్నడం ఆయన మాతృభాష. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, చాలా తియ్యగా ఉంటుంది. ఎంత తియ్యగా అంటే,చెరకుముక్కలాంటి ప్రతి పలుకుని తేనెలో ముంచి, ఆపై దానికి చక్కెర అద్ది ఆపై పలికినట్టు ఉండేది.
కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మాటని నేను ప్రాక్టికల్ గా అతి దగ్గరనుండి చూసిన సందర్భాలు అవి.
’మేనేజర్లందరూ నరరూప రాక్షసులని, మెడికల్ రెప్స్ ని ఇబ్బంది పెట్టటానికే ఫీల్డ్ వర్క్ కి వస్తారని, తస్మాత్ జాగ్రత, జాగ్రత’ అని అందరూ భయపెట్టినట్టేమీ లేదు మేనేజర్ గారి పర్యటన. నిజానికి చాలా ఆహ్లాదంగా గడిచింది. కాకపోతే ఒక గొప్ప ప్రమాదం జరగనే జరిగింది. అయితే, ముప్పు ఆయన వైపు నుంచి కాక ఊహించని వైపు నుంచి వచ్చింది.
ఈ సంఘటన తో ఆయన నాదృష్టిలో ఎంతో ఎత్తుకు వెళ్ళి కూర్చున్నారు.
నేను ఈ కథ ప్రారంభంలో ప్రస్తావించిన సంఘటన ఇదే.
ఏమి జరిగిందో చెప్తాను వినండి.
మేము స్నాక్స్, టీలు అయ్యాక ఫీల్డ్ వర్క్ కి బయలు దేరాము.
మేము హరిఓం అని డాక్టర్ రాధిక గారి ఆసుపత్రి కి వెళ్ళాం మొదట. నేను ఆవిడని అప్పటికే ఒక సారి విడిగా కలిసి ఉన్నాను నా ఫీల్డ్ వర్క్ లో భాగంగా. ఆవిడ క్లినిక్ కడప స్టేషన్ రోడ్ లో ఉండేది ఆ రోజుల్లో.
***
పెద్దగా రద్దీగాలేదు ఆ రోజు. ఒక అయిదారుగురు పేషంట్లు మాత్రమే ఉన్నారు.
కాస్తా బక్కపలచగా చామనఛాయలో ఉన్న ఒక నర్సు మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి, కూర్చోమంది. మురళీగారి విజిటింగ్ కార్డ్ తీస్కుని డాక్టర్ గారి కేబిన్ లోకి వెళ్ళింది.
ఒక అయిదు నిమిషాల తర్వాత ఆ నర్స్ కారణంగా ఒక పెద్ద ఉత్పాతం జరగబోతోంది మాకు ఏ మాత్రం తెలియదు.
అది ఒక సీదా సాదా ఆసుపత్రి. పెద్ద అట్టహాసం ఏమీ ఉండేది కాదు.
మురళీ గారు నాపక్కనే కూర్చుని వృత్తికి సంబంధించిన కీలక మెళకువలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబందించి టిప్స్ చెబుతూ ఉన్నారు. ఒక పది పదిహేను నిమిషాలు గడిచిపోయాయి.
***
ఇందాకటి నర్సు డాక్టర్ ఛాంబర్ కి ఉన్న ముదురాకుపచ్చ తెరలని మధ్యలో తొలగించుకుని ఉత్తి తల మాత్రమే బయటకి పెట్టి మా వంక చూసింది. కళ్ళతోటే సైగలు చేస్తూ , ’పసలపూడి వంశీ’ సినిమా పాటల్లో, హీరోయిన్ లాగా కళ్ళ భాషతో మమ్మల్ని లోనికి రమ్మని చెప్పి తాను తిరిగి లోనికి వెళ్ళీపోయింది.
అది మురళీ గారి సమక్షంలో నాకు మొదటి డాక్టర్ విజిట్. అంటె ఆయన నా వర్క్ ని ప్రత్యక్షంగా చూడబోతున్నాడు.
గోడ మీద ఉన్న ఏసుప్రభువు మా ఇద్దరి వంక జాలిగా చూస్తున్నట్టు నాకు తోచింది ఎందుకో, అది కూడా క్షణంలో వెయ్యవ వంతు మాత్రమే.
నెలక్రితమే బొంబాయిలో ట్రెయినింగ్ పీరియడ్ లో చాలా మంచి పేరుతెచ్చుకున్నాను, ఇంటర్నల్ రిపోర్ట్స్ ద్వారా ఆయనకు ఆ విషయం తెలుసు. గత నెలగా నా ఫీల్డ్ వర్కు తాలుకూ డైలీ రిపోర్ట్స్ ద్వారా కూడా ఆయన నన్ను గమనిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఆయనకు నా మీద మంచి అభిప్రాయమే ఉంది. కంగారు పడవలసింది ఏమీ లేదు అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని అడుగు ముందుకు వేసాను.
ఇంక కొద్ది క్షణాలలో ప్రళయం రాబోతోంది అని మాకు చూచాయగా కూడా తెలియదు.
ఆ నర్స్ అందించిన చూపుల ఆహ్వానాన్ని అందుకుని ఆకుపచ్చని తెర తొలగించుకుని లొపలికి వెళ్ళాము.
ఈ చిన్ని ఆసుపత్రిలో ఆవిడకి ప్రత్యేకంగా కన్శల్టేషన్ రూం అని నిర్మాణం ఏదీ లేదు. ముదురు ఆకుపచ్చ తెరలు చుట్టూ ఏర్పాటు చేయటం ద్వారా లోపలి విషయాలు బయటకి కనపడకుండా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, ఇక్కడ ఆమెకి విపరీతమైన పేషంట్లు వచ్చేవారు.
***
అక్కడ డాక్టర్ రాధిక గారు తన టేబుల్ ముందు కూర్చుని ఉంటారనుకుని వెళ్ళిన మాకు కాస్త వేరే దృశ్యం కనిపించింది. అదే గదిలో ఒక మూలగా ఎత్తైన ఒక టేబుల్ పై ఒక గర్భిణి పడుకుని ఉంది, ఆ పేషంట్ పల్స్ రేట్ ని పరీక్షిస్తూ, మా వైపు వీపు చేసి నిలబడి ఉన్నారు డాక్టర్ రాధిక గారు.
డాక్టర్ గారు పరీక్షిస్తూ ఉండటం వల్ల ఆ గర్బిణి తాలూకు వస్త్రాలు, పడుకున్న భంగిమ చూపరులకు కాస్తా ఇబ్బంది కలిగించే ఉన్నాయి. క్షణంలో వెయ్యవ వంతులో మేము జాగురూకులం అయ్యి బయటికి కదిలే లోగా, మా అలికిడి విన్న ఆవిడ, వచ్చింది ఆ గర్బిణి తాలూకు తల్లి అనుకుని,
"రండమ్మ, మీ అమ్మాయికి గర్భంలో నీరు కాస్తా తగ్గింది..." అని ఏదో అంటూ ఇటు వైపు తిరిగారు.
ఊహించని విధంగా మమ్మల్ని అక్కడ చూసి వెయ్యి టన్నుల బాంబు పక్కనే పడ్డట్టు ఆమె ఉలిక్కిపడ్డారు. తక్షణమే ఆమె చేసిన మొదటి పని, ఆ పేషంట్ ని అడ్డగిస్తూ నిలబడి, తన వెనుకె ఉన్న మరో తెరని మెరుపువేగంతో మూసేశారు.
కనులు మాట్లాడతాయి అంటే ఏమో అనుకుంటాము కానీ ఆ క్షణంలో నేను ఆమె కనుల్లో భావాలు చదవగలిగాను. ఆమె మమ్మల్ని సంస్కార విహీనుల్ని చూసినట్టు చూసింది. మనం ఒక నీచమైన జంతువుని కూడా అంత అసహ్యంగా చూడము బహుశా.
ఆమెకి వచ్చిన కోపానికి ఆమె ఎలాంటి మాటలయినా వాడి ఉండవచ్చు. కానీ ముక్కు పుటాలు అదిరేలా ఊపిరిపీల్చటం ద్వారా, అరుణిమ దాల్చిన కనులతో మమ్మల్ని చూడ్డం ద్వారా ఆమె కోపాన్ని వ్యక్త పరుస్తూ,
"వై ది హెల్ ఆర్ యూ హియర్?" అని మాత్రమే ఇంగ్లీష్ లో అడిగారు. ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నాము.
నా నోటి నుంచి వచ్చిన మొదటి మాట "సారీ" ఆ తర్వాత కొనసాగించాను "క్షమించండి, ఆ నర్స్ మమ్మల్ని లోనికి రమ్మని పిలవటం వల్ల వచ్చాము, వచ్చిన క్షణంలోనే అర్థం అయింది, ఏదో పొరపాటు జరిగిపోయిందని" అని నీళ్ళు నమిలాను.
ఆవిడ కోపంగా నర్సు వంక చూస్తున్నారు.
అప్పుడు మా రీజినల్ మేనేజర్ మురళీ గారు కలగజేసుకుని "క్షమించండి మేడం. తప్పంతా నాది. ఆ అమ్మాయి మమ్మల్ని పిలుస్తోందా లేదా మా పక్కనే కూర్చుని వెయిట్ చేస్తున్న పేషంట్ గారి తల్లిగారినా అని నిర్ధారణ చేసుకోకుండా దూసుకు రావటం ముమ్మాటికి నాది తప్పు. ఇందులో ఈ అమ్మాయి (నర్స్)ది గానీ, మా కొలీగ్ (నేను) ది గానీ ఎటువంటి తప్పు లెదు. ఎక్కడికయినా లోపలికి వెళ్ళే ముందు తలుపుతీసి ఉంచినా సరే ’మే ఐ కమిని ప్లీజ్’ అని అడిగాకే లోనికి రావాలి అనే కనీస విఙ్జత నేను పాఠించి ఉండాల్సింది. అది స్వంత కొడుకు గది అయినా, కూతురు గది అయినా, కోడలి గది అయినా. ఇది పెద్దల నుంచి నేను నేర్చుకున్నపాఠాలలో ఒకటి, అలాంటిది ఈ వేళ అది మరచి పోయాను. గొప్పపొరపాటు జరిగిపోయింది. ఈ కుర్రాడు (నేను) కొత్తగా ఈ టెరిటరీలో చేరాడు. చాలా ప్రామిసింగ్ గా ఉంది ఇతని పర్ఫార్మెన్స్, ఈ నర్స్ ని చూడంగానే తెలుస్తొంది కొత్తగా చేరింది అని. ఆమెకి ఉత్సాహమే తప్ప అనుభవం లేదని అర్థం అవుతోంది. కానీ ఆ అమ్మాయి ఆనందంగా పని చేస్తుండడాన్ని బట్టి ఆమె కోరి ఈ వృత్తిలో చేరింది అని అర్థం అవుతోంది. క్రమశిక్షణ పేరిట వీరిద్దరి మీద కానీ ఏ ఒక్కరి మీదో గానీ చర్య తీసుకుని వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీయటం వద్దు. కోరి చేరిన వృత్తులలో వీళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. ఇలాంటి వారు కాస్తా శిక్షణ ఇస్తే ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. శిక్ష కంటే, శిక్షణ బాగా పని చేస్తుంది. వీరిద్దరిని క్షమించండి. మీ కోపం మొత్తం నామీద చూపించండి. అందుకు పూర్తిగా నేను అర్హుడిని" మృదువైన కంఠంతో స్వచ్చమైన ఇంగ్లీష్ లో చెప్పేసి, ఆయన రెండు చేతులు జోడించి నిలబడి పోయాడు మౌనంగా.
వర్ఛస్సు ఉట్టి పడుతున్న విగ్రహం, సంస్కారం ఉట్టిపడేలాంటి ఆయన మాటలు, ఆయన హావభావాలు ఆ క్షణంలో తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి. అంతటి ఆగ్రహం ప్రదర్శించిన ఆవిడ ’ఇట్స్ ఓకే’ అని మౌనంగా గొణిగి, తన కుర్చీలో కూర్చుండి పోయింది.
’మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి మేడం, "మా చర్య తప్పుగా ఉండి ఉండవచ్చు కానీ మా ఉద్దేశం మాత్రం సరి అయినదే" ( ఫర్ ది ఆబ్వియస్ రీజన్స్ అవర్ ఆక్షన్ ఈస్ అన్-డవుటెడ్లీ రాంగ్, బట్ అవర్ ఇంటేన్షన్స్ వర్ నాట్ రాంగ్’) అని చెప్పేసి మురళీ గారు మౌనంగా బయటికి వచ్చేశారు. ఆయన వెనుకే నేనున్నూ.
లోపల ఇంత తుఫాను చెలరేగింది అన్న విషయం తెలియని బయటి వారందరూ మామూలుగానే ఉన్నారు. ఇంకా కొత్త పేషంట్లు చాలా మంది పోగయ్యారు బయట ఈలోగా.
మేము బయటకు రాంగానే చాలా మంది పేషంట్లు "మా టైం అంతా వృధా చేస్తారా దుర్మార్గులారా" అన్నట్టు చూపులతో విసుక్కోవడం కద్దే. మాకు అదేమి అర్థం కానట్టు బయటికి వచ్చాము.
అప్పుడే చీకటి పడిపోయింది. షాప్స్ అన్నీ విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగలాడి పోతున్నాయి.
దగ్గర్లోనే ఉన్న ఏడు రోడ్ల కూడలి వద్ద సిగ్నల్స్ కి అనుగుణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. చిరాకు పుట్టించేలా హారన్లు మ్రోగిస్తూ అనేక వాహనాలు తిరుగుతున్నాయి రోడ్డు మీద. క్లినిక్ ముందు ఆపిన నా మోపెడ్ వద్దకు వచ్చాము. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు కాసేపు.
"దీనిని గూర్చి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు" అని నా వంక చూస్తూ చెప్పారు ఆయన. నేను తలూపాను. ఆ తరువాత ఆయనే అడిగారు "ఈ సంఘటన ద్వారా నీవు నేర్చుకున్న గుణపాఠం ఏమిటి?"
నేను ఒక్కొక్కపదాన్నే కూడబలుక్కుంటున్న వాడిలా "మే....ఐ....కమిన్....ప్లీజ్?" అని షేక్స్పీరియన్ నాటకాలలోని పాత్రలాగ డ్రమాటిక్ గా పలికాను.
ఆయన గంభీరంగా తలపంకించి "గుడ్, ఈ పాఠం ఒక్కటీ జీవితాంతం గుర్తుంచుకో, ఈ విషయానికి ప్రచారం కల్పించకు. నన్నేమి గొప్ప వాడిలాగా చిత్రీకరించాల్సిన పనిలెదు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్" అన్నాడు.
నిజానికి నేను నేర్చుకున్న పాఠం ఈ ’మే ఐ కమిన్’ అన్నదొక్కటే కాదు, ఒక నాయకుడు ఎలా ఉండాలి అన్న విషయం ఈ సంఘటన ద్వారా మురళీ గారు నాకు ప్రాక్టికల్ గా బోధించారు.
ఇటీవల యూట్యూబ్ లో కలాం గారి ఇంటర్వ్యూ చూస్తుంటే, నాకు ముప్పై ఏళ్ళ నాటి ఈ సంఘటన గుర్తు వచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో ఏపీజే కలాంగారు చెప్పుకొస్తారు తన సీనియర్ సతీష్ ధావన్ గారి గూర్చి. అపజయం ఏర్పడినప్పుడు జూనియర్ల మనో స్థయిర్యం దెబ్బతినకుండా, సతీష్ ధావన్ గారు, ఆ అపజయాన్ని తన భుజాలమీదకి తీసుకుని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారట. తిరిగి మరోసారి విజయం లభిస్తే దాన్ని జూనియర్స్ కి ఆపాదించి, కలాం గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడమన్నారట. జూనియర్ల మనో స్థయిర్యం పెంచటం, ఒక నిజమైన లీడర్ లక్షణం అని చెప్పుకొస్తారు ఏపీజే కలాం గారు.
దాదాపు ముప్పై సంవత్సరాలు నాలోనే ఉండిపోయింది ఈ ఙ్జాపకం, ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను ఈ కథ రూపంలో.
ఆ వేళ్టి నుంచి ఈ "మే ఐ కమిన్ ప్లీజ్" అన్న అలవాటు మానలేదు నేను. గడప దాటి లోనికి వెళ్ళబోయిన ప్రతీ సారి ’లోనికి రావచ్చా’ అని విధిగా అడుగుతాను. నన్ను చాలామంది, చాలా సందర్భాలలో ఛాదస్తుడి కిందకూడా జమకట్టారు, ఎందుకు ఇంత లాంఛనప్రాయంగా ఉండాలి అని. కానీ నేను మానలేదు నాయనా ఈ అలవాటు.
ఈ సంఘటన తరువాత మురళీగారి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆధారంగా నేను అదే ఉద్యోగంలో స్థిరపడ్డాను. త్వరిత గతిలో పదోన్నతులు పొందాను. ఆ తరువాత ఆ సంఘటనని మరచి పోయి, ఆమె కూడా మా కంపెనీ ఉత్పత్తులకు చక్కటి ప్రోత్సాహం ఇచ్చేది.
ఈ ఉత్పాతం, టీ కప్పులో తుఫానులాగ సమసిపోయింది. అందరం మరచి పోయాం కూడ.
***
టైం లైన్ లో ఓ రెండేళ్ళు ముందుకెళదాము.
ఈ తెరలు, గిరలు లేకుండా చక్కటి ఏసీ ఛాంబర్స్ తో కూడిన మల్టీ స్పెషాలిటీ అసుపత్రి నిర్మించుకున్నారు రాధిక గారు. ఆవిడ జీవితం సజావుగా సాగిపోతోంది.
ఒకేలాగా నడిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? ఆమె జీవితం ఇలా నల్లేరు మీద బండి నడకలాగా సాగిపోతు ఉండగా ఒక సంఘటన పెద్ద కుదుపే కుదిపింది ఆమె జీవితాన్ని.
***
గోదావరి నదిలో నీళ్ళు ప్రవహించడం గోదావరి జిల్లాలవారికి విశేషం కాకపోవచ్చు, అదే విధంగా కావేరి నదిలో నీరు ప్రవహించడం కర్ణాటక ప్రాంతాల వారికి పెద్ద వింతగా అనిపించకపోవచ్చు.
కానీ పెన్నా నదిలో నీరు ప్రవహించడం కడప జిల్లా వాసులకు ఖచ్చితంగా వింతే. ఎప్పుడో అరుదుగా నీళ్ళు ప్రవహిస్తాయి ఆ నదిలో.
అలాంటి అరుదైన సందర్భం అది.
కడప జిల్లా చెన్నూరు దగ్గర పుష్పగిరి మఠం సమీపంలో పెన్నానది తీరం. నది గట్లు తన్నుకుని ప్రవహిస్తోంది.
ఏడవ శతాబ్దానికి చెందిన ఆ శంకరాచార్య స్థాపిత క్షేత్రం శైవులకు, వైష్ణవులకి కూడా ప్రాముఖ్యత గలిగినది. శంకరాచార్యులు వచ్చి ఆశీర్వదించి ప్రొత్సహించిన మఠంగా పేరు ఉంది అక్కడి మఠానికి.
ఆ సమీపంలోని నది ఒడ్డుకు ఒక కుటుంబం విహార యాత్రకి వచ్చారు. కాకపోతే వారు గుడికి రాలేదు. నడి ఒడ్డున పిక్నిక్ కి వచ్చారు.
ఇంకా ఎండ ఎక్కువ కాలేదు. ఉదయం నుంచే వాతావరణం వేడిగా ఉండటం కడప జిల్ల ప్రత్యేకత. ఎండ చుర్రుమంటోంది.
జరగబోయే ఘోర ప్రమాదాన్ని వారికి చెప్పాలనుకుంటుందేమో అన్నట్టు గాలి రివ్వు రివ్వున వీస్తోంది.
చాలా ఆనందంగా ఉన్నారు వారు. సాయంత్రం దాకా సరదాగా గడపటానికి అన్ని విధాల సిద్దపడి వచ్చారు. పిక్నిక్ టెంట్, టిఫిన్, భోజనం కారియర్స్, ఫిషింగ్ రాడ్స్, సైక్లింగ్ కోసం సైకిళ్ళు, స్టీరియో కాసెట్ ప్లేయర్ ఇలా అన్ని తెచ్చుకున్నారు.
వారు ఎవరో కాదు మన రాధిక డాక్టర్ గారు, ఆవిడ చెల్లి. రాధికగారి భర్త , వారి పదహారేళ్ళ కుమారుడు. వారికి సాయం అందించటానికి ఒక నౌకరు, డ్రయివరు కూడా వచ్చారు.
అందుకే ఆ కుటుంబం సరదాగా నదీ తీరానికి వచ్చారు. టేప్ రికార్డర్ లో ఏదో పాప్ సాంగ్ మోగుతోంది.
నది ఒడ్డున ఆపిన కారు పక్కగా కాంపింగ్ టెంట్ ఏర్పాటు చేశారు. అందులో ఓ చాప పరిచి కారియర్ లలో తెచ్చుకున్న టిపిన్ సర్ది పిల్లవాడిని, భర్తని పిలవమని డ్రైవర్ ని పురమాయించింది రాధిక.
ఆవిడకి సాయంగా ఆవిడచెల్లెలు కూడా ఓ చేయి వేస్తున్నారు ఏర్పాట్లలో.
అప్పుడే ఫిషింగ్ ముగించుకుని విజయగర్వంతో ఓ బాస్కెట్ నిండుగా చేపలుపట్టుకొచ్చారు ఆవిడ భర్త. ఆయన విదేశాల నుంచి వచ్చిన అరుదైన సందర్భం అది. సంవత్సరంలో ఎప్పుడో అరుదుగా గడుపుతారు ఆయన ఇండియాలో. వైద్య సేవలు అందిస్తూ ఆయన విదేశాలలో , ఈవిడ కడపలో ఉంటుంటారు. వారు ఇలా ఆనందంగా గడిపే సందర్భాలు వారికి నిజమైన పండగ లాంటివే.
’ఒక్క నిమిషం డియర్, కాస్తా స్విమ్మింగ్ చేసి టిఫిన్ కి వస్తా. మనబ్బాయి ఇప్పుడే స్విమ్మింగ్ కి వెళ్ళాడు నన్ను రమ్మని కేకేస్తున్నాడు" అని ఆయన ఈత కొట్టటానికి వెళ్ళారు.
అంతే అదే చివరి చూపవుతుందని ఎవ్వరికీ తెలియదు.
కాసేపట్లో "ఓ మైగాడ్, ఓ మైగాడ్ ఇట్స్ ఎ క్విక్ సాండ్. సేవ్ అస్" అంటూ ఆర్తనాదాలు వినిపించాయి.
వాళ్ళ అబ్బాయి ఈత కొడుతూ కాస్తా ముందుకు వెళ్ళి ఊబిలో చిక్కుకుపోయాడు. అతనే ఆర్తనాదాలు చేస్తున్నాడు ’డాడి సేవ్ మీ’ అంటూ. డ్రయివర్ కి, నౌకర్ కీ ఈత రాకపోవటం వల్ల నిస్సహాయంగా నిలబడిపోయారు.
ఇటుగా ఈత కొడుతున్న ఈవిడ భర్త గారు ముందు వెనుక ఆలోచించకుండా పుత్రుడి దిశగా సాగిపోయారు నదిలో.
టెంట్ నుంచి పరిగెత్తి వచ్చారు డాక్టర్ రాధిక గారు ఆవిడ చెల్లెలు.
వారి కళ్ళ ముందే ఆయన మరియు పదహారేళ్ళ వాళ్ళ అబ్బాయి రాధిక గారిని వంటరిని చేస్తూ పరలోకానికి వెళ్ళిపోయారు.
టీవీలో సవివరంగా వేస్తూనే ఉన్నారు వార్తా స్రవంతిలో ఈ దృశ్యాలు.
****
ఈ సంఘటన తర్వాత రాధిక గారి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. అధిక భాగం మౌనంలోనే గడిపేవారు. వీలయినంత సేపు పెషంట్ల సేవలో గడపటం ప్రారంభించారు ఆవిడ.
కొత్తగా నిర్మించిన నర్సింగ్ హోం స్థాయిని బట్టి, అక్కడ ఆవిడ ఏర్పాటు చేసుకున్న ఆధునిక ఉపకరణాలని బట్టి, ఎక్కువ చార్జి చేయదగ్గ అవకాశం ఉన్నప్పటికి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ నామమాత్ర రుసుము మాత్రమే వసూలు చేయటం మొదలెట్టారు. కొందరు పేదలకు పూర్తి ఉచితంగా కూడా సేవలు అందించే వారు.
ఆమెలోని ఆగ్రహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నా కళ్ళారా చూశాను. ఇలా దయకి సేవకి మారుపేరుగా శాంతమూర్తిగా మారిన అమె రూపాన్నీ చూశాను.
కొన్ని జీవితాల్ని భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తాడో మనకు ఎన్నటికీ అర్థం కాదు.
-సమాప్తం-
రచయిత చిరునామ:
డాక్టర్. రాయపెద్ది వివేకానంద్
డోర్ నెంబర్: 5-7-1/1 ప్లాట్ నెం. 1
హరిహరపురం కాలనీ
వనస్థలిపురం,
హైదరాబాద్ 500070
ఫోన్: 9246371893
ఈ మెయిల్: [email protected]