మారాలి మన భావాలు - B.Rajyalakshmi

Maaraali mana bhavalu

బస్ స్టాప్ నిలబడింది కళ్యాణి . అక్కడ అందరూ బస్సు కోసం ఆత్రుతగా యెదురు చూస్తున్నారు ,కొందరు అసహనంగా అటూయిటూ తిరుగుతున్నారు . కానీ కల్యాణికి యింటికి వెళ్లాలంటే చిరాకు ,యేదో నిర్లిప్తత . తన కోసం యెదురు చూసేవాళ్లు యెవరూ లేరు ,బాధ పడేవాళ్లు లేరు ,త్వరగా యింటికెళ్లి చేసేదిలేదు .

సరిగా రెండెళ్ళక్రిందట యిదే బస్ స్టాప్ లో నిలబడి బస్ కోసం ఆత్రుతగా యెదురు చూసేది . అప్పుడన్నీ తొందరే రంగురంగుల కలల జీవితం . అందంగా తయారయ్యి కాలేజీకి వెళ్లడం ,సరదాగా గడపటం ,మళ్లీ యింటికి చేరాలన్న తొందర . అప్పుడు రంగుల తళుకుల హరివిల్లు కళ్యాణి జీవితం . ఇప్పుడు నిశీధిలో నిశ్శబ్దంగా సాగుతున్న జీవనం .

సంవత్సరం కిందట వరకు కళ్యాణి నవ వధువు . పెళ్లి కళే యింకా మాయలేదు . పెళ్లి పట్టుచీరె మళ్లీ మడత విప్పనేలేదు . తన వైవాహిక జీవితం ముగిసింది . ఇప్పుడు తను వితంతువు . పాతికేళ్లు కూడా నిండని వయస్సు .విరక్తిగా నవ్వుకుంది . చుట్టూ వున్న జనానికి కనిపించకుండా దాచుకున్న కన్నీటిపొర . పుట్టింటికి వచ్చిన రెండునెలలకే చిన్న కంపెనీలో వుద్యోగం లో చేరింది . అదికూడా యింట్లోవాళ్లను ప్రాధేయపడి ఒప్పించి మరీ చేరింది .

బస్ వచ్చింది . మొత్తానికి యిల్లు చేరింది .అమ్మా ,నాన్నా ,అన్నయ్యా ,వదినా అందరూ ముందుగదిలో యేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు . వాళ్లని కారణం అడగాలన్న ఆసక్తి లేదు కళ్యాణికి . అదీకాక వాళ్లకి తానన్నా తనమాటన్నా చిన్నచూపూ ,చులకనా !ఒకనాటి సతీ సహగమనం యిప్పుడు లేకపోయినా ,మానసికంగా చంపేస్తారు మౌనంగా తలొంచుకుని తన గదిలోకి వెళ్లబోయింది .

"కళ్యాణీ ,యిలా రా " తండ్రి పిలుపుతో అమ్మ పక్కన వచ్చి కూర్చుంది .

" మీ మామయ్యగారు నిన్ను వెంటనే పంపమని వుత్తరం వ్రాసారు ,ఒకవిధంగా శాసిస్తున్నట్టుగానే వున్నది యీ వుత్తరం ." కళ్యాణికి కన్నీళ్లు మెల్లమెల్లగా జారుతున్నాయి .

"ఆడపిల్ల వుద్యోగం చెయ్యడం తమ యిళ్లల్లో లేదుట ,తమ కోడలు గడప దాటడం వాళ్ళకిష్టం లేదుట ,దీన్ని చాదస్తపు యింట్లో పడెయ్యవద్దని నెత్తీనోరూ మొత్తుకుని చెప్పినా మీరు వినలేదు . పైగా నిప్పులు కడిగే వంశమని పేరొకటి .మడి ,ఆచారాలూ ,పాతపద్ధతులు "కోపంగా అరిచాడు అన్నయ్య .

"అబ్బాయి బుద్ధిమంతుడు ,ఒక్కడే కొడుకు అనుకున్నాం . ఇలా జరుగుతుందని అనుకున్నామా !కళ్యాణి ని వాళ్లుకూడా మెచ్చుకుని నచ్చి కదా చేసుకున్నారు "అన్నారు తండ్రి . కళ్యాణి మౌనం గా అన్నీ వింటున్నది .

"నిన్ను పంపడం నాకిష్టం లేదే ,చాకిరికోసమే నిన్ను పంపమంటున్నారు . జీతం బత్తెం లేని పనిమనిషివిగా "ఆవేశంతో వూగిపోయాడు అన్నయ్య .

"మీరందరూ యేమని నిర్ణయించినా నాకు అంగీకారమే "కన్నీళ్లు దాచుకుంటూ లేచింది కళ్యాణి .

"నీకు విడిగా వుత్తరం వ్రాసారు తీసికెళ్లు "అంటూ వదిన యిచ్చిన కవరు తో తన గదిలోకి వెళ్లింది కళ్యాణి .

స్నానం చేసి కాసేపు మౌనంగా అలాగే వుండిపోయింది . మనసులో యే భావమూ లేదు ,నిర్ణయాలూ లేవు . నిర్వికారంగా ఉత్తరం విప్పింది .

"

మా కోడలు కల్యాణికి , ఆశీర్వదించి వ్రాయునది , నువ్వు మా రాజశేఖరం చనిపోయిన పన్నెండో రోజు పుట్టింటికి వెళ్లావు . కానీ ఆరునెలలయినా యింకా అక్కడేవున్నావు .నువ్వు అక్కడే వుండడం మాకు నచ్చలేదు . కనీసం ఒక వుత్తరమైనా నీ దగ్గర్నించి లేదు ,ఎక్కడ వుండాల్సిన వాళ్ళు అక్కడే వుండాలి ,. నీకు అత్తవారిల్లు అనేది వున్నది ,వుద్యోగం మానేసి వెంటనే వచ్చెయ్యి .

ఆశీస్సులతో అత్తయ్య ,మామయ్య -----------------------------------------------------------------------------------------------------------------------------

కళ్యాణిని అత్తవారింటికి పంపాలని అమ్మా ,నాన్నా అన్నయ్యా ,వదినా నిర్ణయించుకున్నారు . కళ్యాణి యిష్టాయిష్టాలతో పని లేదు . వుద్యోగానికి రాజీనామా యిస్తుంటే అందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూసారు . ఈ వుద్యోగం దొరకడానికి తను యెంత కష్టపడిందో తన మనసుకు తెలుసు . భర్త చనిపోవడం ,తను కష్టపడి యీ వుద్యోగం సంపాదించడం గుర్తుకొచ్చి కన్నీళ్ల పర్యంతం అయ్యింది .

అమ్మా ,నాన్నా కాళ్లకు నమస్కరించింది . వాళ్లు కన్నీళ్లతో దీవించారు . కట్టుకునే చీరెలు మాత్రం తీసుకుంది . అన్నయ్యా ,వదినా రైలెక్కించడానికి వచ్చారు . దోవలోకూడా యెవరూ మాట్లాడుకోలేదు . కళ్యాణి రైల్లో కిటికీ దగ్గర కూర్చుంది .

ఇంతలో అన్నయ్య "సీతా నేను చెప్పిన పని చేసావా ?"వదినను అడిగాడు .

"అదే యెలా చెయ్యాలా !ఆలోచిస్తున్నాను "అన్నది వదిన .

"ఏమిటి వదినా ' కళ్యాణి అడుగుతూ ఉండగానే సీత లోపలికి వచ్చి గబగబా బొట్టు బిళ్ల లాగేసి చటుక్కున పెట్టె దిగింది . " మీ అత్తవారింటికి బొట్టుబిళ్లతో వెళ్తే మమ్మల్ని తిట్టుకుంటారు "అంటూ అన్నయ్యా ,వదినా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయారు . కళ్యాణిని తోటి ప్రయాణికులు అదోరకంగా చూసారు .వాళ్ల చూపులను తప్పించుకోవడానికి పుస్తకంలో తల దూర్చింది . కొద్దిసేపటికి నిద్ర వచ్చేసింది .

-------------------------------------------------------------------. ----------------------------------------------------------

కళ్యాణి సూట్ కేసు తో అత్తవారింటి ముందు ఆటో దిగింది . గేట్ తీసింది .

"కళ్యాణీ ,అక్కడే ఆగు "మామయ్యగారి కంచుకంఠం విని అక్కడే నిలబడిపోయింది . అత్తయ్యగారు గబగబా గేటు తీసి బయటకు వచ్చారు .

"ఏమిటమ్మా యీ వాలకం !"అంటూ కళ్యాణి నుదుట కుంకుమ బొట్టు గుండ్రంగా దిద్దారు . రెండుచేతులకు మట్టిగాజులు తొడిగారు .

"ఇప్పుడు లోపలికి రామ్మా " అంటూ చేయిపట్టుకుని ఆప్యాయంగా నవ్వుతూ లోపలికి తీసుకెళ్లారు . కళ్యాణికి అడుగులు తడబడ్డాయి ,కళ్లనీళ్లతో అత్తగారికి నమస్కరించింది తన అత్తగారు వితంతువు అయిన తన కోడలికి స్వయంగా బొట్టుదిద్దింది . పుట్టింట్లో తన తల్లి బొట్టు తుడిపింది . ఎవరు తన జీవితాన్నీ ,తననూ సరిగా అర్ధం చేసుకున్నారు ??

కళ్యాణిని త్వరగా స్నానము చేసిరమ్మన్నారు . ఇల్లంతా సందడిగా వుంది . అత్తగారు పట్టుచీరె ,జాకెట్ కళ్యాణికి యిచ్చి తయారవమన్నారు . ఆవిడ కళ్యాణి చేతులకు నిండుగా గాజులు తొడిగి బొట్టు దిద్ది ,జడవేసి పూలు పెట్టారు . కళ్యాణికి అంతా కలలాగా అనిపిస్తున్నది కానీ చెయ్యి గిల్లుకుంటే కల కాదు యథార్థం అని తెలుస్తున్నది . కళ్యాణిని అత్తగారు హాల్లోకి తనతోపాటు పక్కన కూర్చోబెట్టుకున్నారు . అక్కడ సుమారు యిరవైమందిదాకా బంధువులూ ,తెలిసినవారూ వున్నారు .

--------------------------------------------------------------------------------------------------------------------------------కార్యక్రమం దత్తత స్వీకారం మొదలయ్యింది . సుమారు యిరవైయెనిమిది సంవత్సరాల యువకుడిని కళ్యాణి అత్తగారు ,మామగారు తమ కొడుకుగా దత్తత తీసుకున్నారు . కార్యక్రమం త్వరగా ముగించారు . తర్వాత మామయ్యగారు మాట్లాడారు .

"అందరికీ నమస్కారాలు . నా కన్న కొడుకు రాజశేఖరం మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు . తన పితృలోకానికి తర్పణం వదలవలసినవాడు వెళ్లిపోయాడు . తనకూ తర్పణాలు పెట్టేవాడు లేకుండా వెళ్లిపోయాడు . ఇప్పుడు రాఘవ మా బిడ్డ . నా కొడుకు . చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకున్న రాఘవ కష్టపడి చదువుకుని వుద్యోగం చేస్తున్నాడు . మంచివాడు . "అంటూ ఆయన తన ప్రసంగాన్ని ఆపి ఒకసారి అందరినీ చూసారు . అందరూ ఆయన మాటలను సీరియస్ గా వింటున్నారు .

ఆయన కళ్యాణిని దగ్గరగా రమ్మని పిలిచారు . లక్ష్మీ కళ తో కళ్యాణి వచ్చి నిలబడింది .

"ముఖ్యమైన వారంతా యిక్కడే వున్నారు కనుక అందరికీ యిక్కడే యిస్తున్నాను ,కల్యాణీ మీ పుట్టింటివారికి పోస్ట్ లో పంపాను "అంటూ కళ్యాణికి శుభలేఖ ఒకటి యిచ్చి ,మిగిలినవి అందరికీ ఆయన పంచారు .

కళ్యాణి శుభలేఖ తెరిచింది అందులో "మా యేకైక పుత్రుడు చి . రాఘవకు ,చి . ల . సౌభాగ్యవతి కళ్యాణిని యిచ్చి వివాహం చేయ నిశ్చయించామని తెలియచేయుటకు సంతసిస్తున్నాము "

నివ్వెర పోయింది కళ్యాణి . బంధువర్గం నివ్వెరపోయారు .

"మాకు ఆచారాలూ పట్టింపులూ యెక్కువే ,కానీ వాటికోసం ఒక ఆడపిల్ల భవిష్యత్తుని శిథిలం చేసే కర్కోటకుడిని కాదు .ఏడాది క్రిందట మా కోడలు మహాలక్ష్మి గా కళకళలాడుతూ మా యింటికొచ్చింది . కానీ విధివశాత్తు మా రాజశేఖరం మరణం ఆమెకు వితంతువు అని ముద్ర వేసింది . మా కోడలు నిండు భవిష్యత్తును మేము కోరుకుంటున్నాం . అందుకే మేము యీ పని చేసాం . మా రానున్న తరాన్ని వీళ్లు ముందుకు తీసుకెళ్తారు .మీరందరూ నిండు మనసుతో వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించండి "అంటూ కళ్యాణి అత్తగారూ ,మామగారూ అందరినీ చూస్తూ చేతులు జోడించారు .

మేరు పర్వతం లా నిలబడ్డ మామయ్యగారు కళ్యాణికి భగవంతుడిలా కనిపించారు . అత్తగారికి ,మామగారికి పాదాభివందనం చేసింది .

రాఘవను ,కల్యాణిని ఆయన అక్కునచేర్చుకుని ఆశీర్వదించారు . రాఘవ కళ్యాణి ని మూడుముళ్ల బంధం తో సుమంగళిగా వసంతాన్ని చిగురించాడు .

కళ్యాణికి యిప్పుడు అత్తగారూ ,మామయ్యగారూ అభ్యుదయ సంస్కర్తలుగా ,యెంతో వున్నతులుగా కనిపించారు .-------------------------------------------------------------------------------------------------------------------------------

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్