విశ్వనందుడు - శింగరాజు శ్రీనివాసరావు

Viswanandudu

విశ్వనందుడు తన శక్తికొలది అశ్వాన్ని అదిలించి పరుగులు పెట్టిస్తున్నాడు. తమ ఊరి గుడిలోని పూజారి చెప్పిన మహర్షిని సంధ్యపొద్దు వాలేలోపు కలుసుకుంటే చాలు. అతను ఇచ్చే మంత్రజలాన్ని తెచ్చి అగ్నిప్రమాదంలో నేత్రాలను కోల్పోయిన తన తల్లికి, భార్యకు ఇస్తే, తిరిగి వారికి చూపు వస్తుంది. ఈ తరుణోపాయాన్ని తెలిపిన పూజారి గారు ఖచ్చితంగా సూర్యుడు పడమర చేరేలోపే మహర్షిని చేరుకోమన్నాడు. కనుచూపు మేరలో చుట్టూ ఏపుగా ఎదిగిన చెట్ల మధ్య ఏదో చిన్న కుటీరం కనిపిస్తున్నది. బహుశా అదేనేమో మహర్షి నివసించే చోటని అనుకుని, వారువాన్ని అదిలించాడు విశ్వనందుడు. అతని ప్రయత్నం ఫలించింది. అతను చూసిన కుటీరమే పూజారి గారు చెప్పిన మహర్షి ఆశ్రమం. గుర్రాన్ని దిగి దాన్ని దూరంగా ఉన్న కొయ్యకు కట్టివేసి ఆశ్రమం వెలుపల తిరుగుతున్న మహర్షి శిష్యునికి ప్రణమిల్లి, తను మహర్షిని కలవడానికి వచ్చానని చెప్పాడు. " గురువుగారు అమ్మవారి పూజలో ఉన్నారు. మీరు బహుదూరం నుంచి వచ్చినటులుగా తోస్తున్నది. ఈ మంచినీరు సేవించి, అదిగో అక్కడ కనిపిస్తున్న చెరువులో స్నానంచేసి శుచియై రండి. నేనీలోపున గురువు గారికి మీరాక గురించి చెప్పి, మీకు వారి దర్శనం ఏర్పాటు చేస్తాను" అని చెప్పి విశ్వనందుడికి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు అతను. సరేనని చెప్పి, అతను ఇచ్చిన నీళ్ళు తాగి స్నానం చేసి రావడానికి చెరువు వద్దకు వెళ్ళాడు విశ్వనందుడు. ****** "నమస్కారం స్వామీ" శుచియై వచ్చి మహర్షికి నమస్కరించాడు విశ్వనందుడు. "చిరంజీవ. రానాయనా. కార్యార్థివై ఇంత దవ్వు వచ్చావని అనిపిస్తున్నది. లేకుంటే ఇంతటి కీకారణ్యం లోకి సాహసించి ఎవరూ రాజాలరు. ఇంతకూ వచ్చిన పని ఏమిటి" మందస్మిత వదనంతో అడిగారు మహర్షి. " స్వామీ. అన్నీ తెలిసిన సర్వజ్ఞులు మీరు. మీకు తెలియనిది కాదు. నాలుగు నెలల క్రితం మాఇల్లు అగ్నికి ఆహుతి అయింది. సమయానికి నేను ఇంటివద్ద లేను. ఎట్టకేలకు చుట్టుపక్కల వారి సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు నా తల్లి, భార్య. ఆ ప్రమాదంలో వారిద్దరి కళ్ళు కాలిపోయి అంథులుగా మారారు. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా కంటిచూపును తిరిగి రప్పించలేకపోయారు. నేను అంతటా విచారించగా తుదకు మాప్రక్క గ్రామం పూజారిగారు మీరు మాత్రమే అందుకు సమర్ధులని చెప్పి నన్ను మీవద్దకు పంపారు. తమరే దయచూపి నాకు తరుణోపాయం చెప్పాలి" అని మహర్షి పాదాలమీద వ్రాలాడు. " అయ్యోపాపం. 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అంటారుకదా నాయనా. నీమాటలు వినిన నాకు, నీకు తప్పక సాయం చేయాలనిపిస్తున్నది. కాకపోతే నాసాయం వలన ఎవరో ఒకరికి మాత్రమే చూపు వస్తుంది. ఒకరికి మించితే అమ్మవారు నాకు ఇచ్చిన వరం పనిచేయదు. ఇది అమ్మ ఆజ్ఞ. కాబట్టి నీ తల్లి, భార్యలలో ఎవరికి చూపు కావాలో నీవే నిర్ణయించుకుని నాకు చెప్పు. నిర్ణయం ఇప్పుడే చెప్పనక్కర లేదు. ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి, మా శిష్యులతో పాటు శయనించి రేపు ఉదయాన్నే వచ్చి నీ నిర్ణయాన్ని కారణసహితంగా వివరించు" అని చెప్పి పంపాడు మహర్షి. ఆలోచనలో పడ్డాడు విశ్వనందుడు. ******** రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, ఉదయాన్నే స్నానాన్ని ముగించుకుని మహర్షి రాకకై ఎదురు చూడసాగాడు విశ్వనందుడు. మహర్షి వస్తూనే అడిగాడు. "ఏమి నిర్ణయించుకున్నావు నాయనా" "మాతల్లి గారి కంటికి చూపునివ్వండి స్వామి చాలు" "అదేమిటి నాయనా. కలకాలం నీతో కలసి ఉండవలసిన భార్యకు కాదని, తల్లికి చూపును ఇవ్వమంటున్నావు. ఇది ధర్మమా. ధర్మమని నీవు అనుకుంటే కారణం చెప్పు" "మన్నించండి స్వామీ. తల్లి, భార్య ఇద్దరూ మగవాడికి రెండు కళ్ళలాంటి వారే. కానీ తల్లి త్రిమూర్తుల స్వరూపం కదా. బ్రహ్మగా ఊపిరి పోసింది. విష్ణువై అన్నంపెట్టి పోషించింది. పరమేశుడై నా తప్పులను తనలో లయం చేసుకుంది. నాకంటూ ఒక ఉనికిని ఇచ్చింది నా తల్లి. అంతేకాదు స్వామి. ప్రతి తల్లీ తన మరణం వరకు బిడ్డను కనులారా చూసుకోవాలని పరితపిస్తుంది. దేవుళ్ళలో చాలా మంది తల్లి విలువ లోకానికి తెలియజేయడం కోసమే, తల్లి కడుపున మానవులై జన్మించారు. అటువంటి తల్లికి చూపునిచ్చి ఆమె ఋణం తీర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించండి" వేడుకున్నాడు విశ్వనందుడు. "నీ కోరిక సమర్ధనీయమే. కానీ నీకు తోడుగా ఉండవలసిన భార్యను విస్మరించడం ధర్మమా" అడిగాడు మహర్షి. " స్వామీ. నాలో సగభాగమైన నా అర్ధాంగికి వెంటనంటి నిలిచి, నాకళ్ళతో తనకు లోకాన్ని చూపుతాను. నా తుదిశ్వాస వరకు ఆమె చేయివీడక, నేనే తానై చరిస్తాను. ఆమెకు చూపు లేకపోయినా, నేనే ఆమెకు నేత్రమై నిలుస్తాను" వినమ్రంగా చెప్పాడు విశ్వనందుడు. మహర్షి కళ్ళు చెమర్చాయి. "నాయనా. కలికాలంలో ముసలితల్లిని వదిలించుకోవాలని చూచే మానవులకు భిన్నంగా ధర్మాన్నివీడక, ప్రాణమిచ్చిన తల్లివిలువ తెలిసి మసలుకున్న నీ జన్మ ధన్యం. నీవు కోరినటులుగా నీతల్లికి చూపు వస్తుంది. ఈ సీసాలో జలాన్ని తీసుకువెళ్ళి, అమ్మవారి పాదాలచెంత పెట్టి, నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని ధ్యానంచేసి నీ కోరికను తెలుపు" అని చెప్పాడు మహర్షి. మహర్షి చెప్పినటులుగా చేసి తిరిగి ఆయన వద్దకు వచ్చాడు విశ్వనందుడు. "నాయనా నిన్ను పరీక్షించాలనే ఒకరికి మాత్రమే చూపు వస్తుందని చెప్పాను. తల్లివిలువ తెలిసిన నిన్ను మెచ్చాను. వెళ్ళి నీతల్లి ఆశీర్వాదం తీసుకుని అమ్మవారిని తలుచుకుంటూ ఈ జలంతో వారిద్దరి కళ్ళు తుడు. ఇద్దరికీ చూపు వస్తుంది" అని విశ్వనందుడిని ఆశీర్వదించి, మంత్రజలాన్ని ఇచ్చి పంపాడు మహర్షి. మహర్షికి పాదాభివందనం చేసి ద్విగుణీకృత ఆనందంతో వెనుదిరిగాడు విశ్వనందుడు. *************

మరిన్ని కథలు

Aseerwada mahima
ఆశీర్వాద మహిమ
- ambadipudi syamasundar rao.
Okati tliste marokataindi
ఒకటి తలుస్తే మరొకటైంది
- మద్దూరి నరసింహమూర్తి
Swargalokam vardhillali
స్వర్గలోకం వర్ధిల్లాలి
- సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం
Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vuttaralayya
ఉత్తరాలయ్య
- కామేశ్వర రావు