పోలీస్ వేట - వెంకటరమణ శర్మ పోడూరి

Police veta

ఇందిరాగాంధీ ఎమెర్జన్సీ ఎత్తేసిన తరవాత నాలుగు సంవత్సరాలు గడిచాయి

సుబ్బరామయ్య ప్రొద్దుటే బ్రేక్ ఫాస్ట్ చేసి కాంట్రాక్ట్ పనులు జరుగుతున్న సైట్ కి వెళ్ళడానికి తయారవుతున్నాడు. ల్యాండ్ లైన్ ఫోన్

రింగ్ అవుతే ఎత్తాడు.

" ఆ సివిల్ కార్పొరేషన్ ఇంజినీరు నకరాలు చేస్తున్నాడు సార్. వాళ్ళు వేసే రేట్లు చెప్పడట. వాడికి మనం ఇచ్చేది సరిపోతున్నట్టు

లేదు. మీరు కలగచేసుకోవాలి. సర్, ఇంకో వార్త, కార్పొరేషన్ కి కొత్త ఎండి ని వేస్తున్నారట. ఐఎస్ వాడు కాకుండా చూసుకోవాలి.

మంత్రిగారితో మాట్లాడండి " అన్నాడు టెండర్ల ఇంచార్జి ఇంజనీర్ నారాయణ. సివిల్

సుబ్బ రామయ్య సాయంత్రం క్లబ్ లో మంత్రి వరహాల రావు గారితో కూర్చుని మందు సేవిస్తూ " ఎవడయినా రిటైర్ అయిన ఇంజనీర్ ని ఎండి గా

వేసేలా చూడండి. ఐఎస్ వాడు తల నొప్పి" అన్నాడు, మంత్రి గారికి జీడిపప్పు ప్లేట్ అందించి. సివిల్ కార్పొరేషన్ ఆయన మంత్రిత్వ

శాఖ అధీనం లో ఉంది

" అవునయ్యా కార్పోరేషన్ పెట్టక ముందు మీ కాంట్రాక్టర్లు అందరూ కూడబలుక్కుని రేట్లు దిగకుండా టెండర్లు వేసి బాగా

దండుకున్నారు కదా? చాల లేదయ్యా" అన్నాడు మంత్రిగారు తన గ్లాసులో విస్కీ నింపుకుంటూ

" మీ పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఏమీ ఇవ్వక్కర లేదంటే మాకు చిన్న లాభాలు చాలు. కాని మీ పార్టీ మీటింగులకి, డిల్లీ నేతలు

వచ్చినప్పుడు జనాన్ని తరలించడాలు చేయాలంటే డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?

" సరే మన మాట వినేవాడు కావాలి అంతేకదా? ఐఎస్ వాడు వద్దంటే , డైరెక్ట్ రిక్రూట్ కాకుండా కిందనుంచి పమోషన్ మీద వచ్చిన

వాడిని చూస్తాలే. వాళ్ళల్లో కూడా చాలా మంది మనం చెప్పిన మాట వింటారు" అన్నాడు భరోసా ఇస్తూ

ఇంతలో అనంతరాం, మరో పెద్ద కాంట్రాక్టర్ వచ్చి చేరాడు. అతను యువకుడు. ఈ మధ్యనే తండ్రి చనిపోతే, విదేశాలనుంచి తిరిగి

వచ్చి తండ్రి వ్యాపారం చూస్తున్నాడు. వచ్చి మంత్రిగారికి విష్ చేసి కూర్చున్నాడు. క్లబ్ స్టువార్డ్ వచ్చి అతనికి గ్లాసు, అదీ అరేంజ్

చేసి మందు బాటిల్ దగ్గరగా పెట్టి వెళ్ళాడు

" ఏమిటి చర్చిస్తున్నారు. కొత్త సమస్య లేమయినా నా ?" అన్నాడు విస్కీ సిప్ చేస్తూ"

" ఏమీ లేదు మన సివిల్ కార్పోరేషన్ ఎండిగా కాస్త మన మాట వినేవాడిని వేయమని అడుగుతున్నాను" అన్నాడు సుబ్బరామయ్య

" అవును ఎన్నాళ్ళు ఈ దేబిరింపు? మనం వేసే టెండర్లకి సివిల్ కార్పొరేషన్ కూడా కాంట్రాక్టర్లా టెండర్లు వేసి తక్కువ రేట్లకి పనులు

చేచిక్కిన్చుకుని తిరిగి మనకే ఇస్తోంది. మొత్తం కార్పోరేషన్నే ఎత్తేస్తే మనం ఇష్టం వచ్చిన రేట్లకి టెండర్లు వేసు కోవచ్చుగా? ఇలా

లంచాలు ఇచ్చి, వాళ్ళు వేసే రేట్లు కనుక్కుని, అంతకన్నా తక్కువ రేట్లు వేసి మనం దక్కించుకుంటే లాభాలు చాలా తగ్గి

పోతున్నాయి కదా? మొత్తానికి కార్పోరేషన్ ఎత్తి పడేస్తే పీడా పోతుంది కదా? అప్పుడు మనం కార్టేల్ గా కూడి ఇష్టం వచ్చిన రేట్లు

వేసుకోవచ్చు కదా?

" అది అంత సులువు కాదు నాయనా. మూడువేలమంది ఉద్యోగులు ఉన్నారు. మీ కాంట్రాక్టర్లు లాభాలు పీల్చేసి వదిలేసిన కష్ట

మయిన పనులన్నీ తీసుకుని, ఆ కార్పోరేషన్ శ్రీ శైలం డాం పూర్తీ చేసింది. దాని వల్ల జల విద్యత్ ప్రారంభమయి రాష్ట్రానికి వందల

కోట్లు మిగిల్చింది" వివరించాడు మంత్రి గారు

" ఈ కార్పోరేషన్ ప్రారంభించి పదేళ్ళు కూడా అవలేదు కదా? రాజకీయ వేత్తలలో చాలా మంది కాంట్రాక్టర్ లే కదా ? అసలు ఈ

కార్పోరేషన్ ని ఎందుకు రానిచ్చారు?" అడిగాడు అనంత రాం

" నువ్వు ఇండియాలో లేవు కదా నీకు తెలియదు. సెపరేట్ ఆంధ్ర ఆందోళన సమయం లో కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు కేంద్రం, రాజకీయ పార్టీలని పక్కన పెట్టిసలహాదారులతో నడిపింది కదా! ఆ సలహాదారులు రాగానే ఒకటి గమనించారు. కాంట్రాక్టర్లుఅందరూ కుమ్మక్కు అయి రేట్లు దిగనివ్వకుండా టెండర్లు వేసి దోచుకుంటున్నారని పసిగట్టారు. అది బ్రేక్ చేయడానికి ఈ సివిల్ కార్పోరేషన్ ని పెట్టి దాని చేత టెండర్లు వేయించి ఎక్కువరేట్లని నియంత్రించారు. అప్పటి నుంచీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దానిని మూసేయడం అంత సులువు కాదు" వివరించాడు మంత్రి గారు

" ఎదో మార్గం ఆలోచించాలి. గోదావరి మీదా, కృష్ణా మీద చాలా పెద్ద ప్రోజక్టులు వచ్చే అవకాశం వుంది. టెండర్లు ఎక్కువ రేటుకి వేసుకోక పోతే మంచి అవకాశాలు చేయి దాటి పోతాయి. నాకు ఒకటి తడుతోంది. ఈ క్లబ్బు లోనే కొత్త సంవత్సరానికి ఆహ్వానం అంటూ డిశంబర్ ఆఖరు తేదీన ఒక పార్టీ ఇచ్చి దానికి అందరినీ పిలుద్దాము. రిటైర్ అయిన ఐఎస్ ఆఫీసర్లనీ, ఇంజినీర్లనీ, ముఖ్యమయిన రాజకీయాల్లో ఉన్న మిగతా వ్యాపారాల వాళ్ళనీ పిలిచి మేధో మధనం చేద్దాము" అన్నాడు

" సరే అయితే ఆ ఆపని మీద ఉందాము" అన్నాడు సుబ్బరామయ్య, అనంతరాం ఆలోచన నచ్చి.

కాని వాళ్ళు అనుక్న్నట్టు గా ఆ మీటింగ్ జరగలేదు. ఎందుచేతనంటే ఆ మరునాడే ఎలెక్షన్ కమిషన్ రాష్రం లో ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడంతో, రాజకీయ వాతావరణం వేడెక్కి అందరూ ఆ గొడవలో పడిపోయారు.

రాజకీయాలలోకి ఒక సినిమా వ్యక్తి కొత్తగా పార్టీ పెట్టి, రాష్ట్ర మంతా తిరిగి పెద్ద సంచలనం చేశాడు. ఆయన పాత వాళ్ళని తన పార్టీలో చేర్చుకోకుండా చాలా మంది కొత్త వాళ్ళని తీసుకుని నిలపెట్టాడు. రాజకేయాలలో ముదుర్లు అవకాశం పోనీయకుండా తమ బెనామీలని అందులో దూర్చారు. పాత రాజకేయాలతో విసిగి ఉన్న ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. దానితో ఆయన పెద్ద మెజారిటీ తో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు.

కొత్త ముఖ్య మంత్రి రాజకీయాలకి కొత్త కాబట్టి, అనంతరాం కి ఒక ఆలోచన వచ్చింది. తాను గతం లో అనుకున్న మేధో మదానానికి సమయం వచ్చిందనుకుని అందరినీ ఒక పార్టీ పేరిట క్లబ్బు లో సమావేశ పరిచాడు.

అందరికీ మందు, రెండు రౌండ్లు అయిన తరువాత, ముఖ్యంగా రిటైర్ అయిన ఆఫీసర్లని ఉద్దేశించి . "సివిల్ కార్పొరేషన్ ని ఎలా మూసివేయాలి? దానికి పథకం ఏమయినా ఉందా ?" అన్నాడు

మహంతి, ఒరిస్సా వాడయినా తెలుగు బాగా వచ్చు. హోం శాఖ సెక్రెటరీ గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు . " నా దగ్గర ఒక పథకం ఉంది . అది చాలా తెలివితేటలుగా చేయాలి. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఆఫీసర్ల సహాయం కూడా తీసుకుని అమలు చేయవచ్చు. వచ్చే వారం ముఖ్య మంత్రి ఒక ఆఫీసర్ల సమావేశం ఏర్పరిచాడని తెలిసింది. పథకం అందులో ప్రారంభం కావాలి. పోలీసులు ఒక్కొక్కప్పుడు, చాలా తెలివయిన నేరస్తుడిని పట్టడానికి ఒక టెక్నీక్ అవలంభిస్తారు. వాడికి చివర దాకా తెలియకుండా, వేరే వాళ్ళని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించి, చివరలో వాడిని వలలో వేస్తారు. అలాంటి టెక్నీక్ ఇక్కడ ఉపయోగించాలి" .అనిప్రారంభించి మొత్తం పథకం వివరించి ఎలా అమలు పరచాలో కూడా వివరించాడు.

******

ఆ రోజు సెక్రెటేరియట్ లో ముఖ్య మంత్రి అన్ని శాఖల కార్య దర్సులతో ఏర్పరిచిన సమావేశం ప్రారంభం అయింది.

ముఖ్య కార్యదర్శి సమావేశం ఉద్దేశ్యం వివరించాడు "ముఖ్య మంత్రి ఛార్జ్ తీసుకోగానే, పాద యాత్రలో ప్రకటించిన అనేక పధకాలు ప్రారంభించాలని ఆయా శాఖల కార్యదర్సులకు చెప్పడం జరిగింది. కాని వాళ్ళు ఆయనకి చెప్పినదేమిటంటే, జీతాలకి తప్ప పెద్దగా డబ్బు ఖజానాలో లేదని, కేంద్రం నుంచి బడ్జట్ నిధులు ఇంకా రాలేదనీ. ఒకవేళ వచ్చినా ప్రస్తుతం ఉన్న ప్రోజక్టులకి తప్ప ముఖ్య మంత్రి కొత్తగా ప్రకటించిన పథకాలకి నిధులు ఉండవని చెప్పారు. ఇప్పడు సమావేశం ఉద్దేశ్యం ముఖ్య మంత్రి ప్రకటించిన పధకాలకి నిధులు ఎలా సమకూర్చాలి అన్నది. ఈ విషయం లో మీ అభిప్రాయాలు, సలహాలు వివరించండి" అని ముగించాడు

ఒక సెక్రెటరీ లేచి ఎక్కడెక్కడ పొదుపు చేయాలో వివరించాడు.

"దానివల్ల ఎంత అదా అవుతుంది?" అడిగాడు ముఖ్య మంత్రి. ఆ సెక్రెటరీ చెప్పిన జవాబు విని అందరూ పెదవి విరిచారు.

క్లబ్బు మీటింగులో పాల్గొన్న మంత్రి వరహాల రావు గారి శాఖ కి సెక్రెటరీ గా ఉన్న పట్నాయక్ " ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చూసుకోవాలి కాని, ప్రభుత్వం డబ్బుని వ్యాపార సంస్థలలో పెట్టుబడి పెట్టి నష్ట పోకూడదు. ప్రభుత్వం, ప్రస్తుతం నలభై కి పైగా కార్పొరేషన్లలో డబ్బు పెట్టి కొన్ని వ్యాపారాలు పరోక్షంగా చేస్తోంది. వాటికి ప్రతి సంవత్సరం మూలధనం కింద బడ్జట్ లో చాలా మొత్తం ఇవ్వడం జరుగుతోంది. ఆ సంస్థలలో చాలా సంస్థలు నష్టాలలో నడుస్తున్నాయి. అవన్నీ లోతుగా పరిశీలించి అవసరం లేని వాటిని మూసి వేస్తె ప్రభుత్వానికి వాటికి ఇచ్చే మూలధనం మిగలడమేకాకుండా, ఆ నష్టాల ద్వారా పోయే డబ్బు కూడా ఆదా అయి, ముఖ్య మంత్రి పథకాలకి నిధులు సమకూర్చవచ్చు" అని చెప్పి ముగించాడు.

ముఖ్య మంత్రికి అతని సలహా నచ్చింది. అప్పటికి అప్పుడే ప్రభుత్వ కార్పోరేషన్ల పని తీరు మీద ఒక కమిటీ వేశాడు.నష్టాలలో నడుస్తున్న కార్పోరేషన్లు మూసేస్తే ఎంత డబ్బు ఆదా అవుతోందో కూడా ఆ కమిటీ తేల్చాలి. కమిటీని తన నివేదిక ఒక నెలలో ఇమ్మని ఆర్డర్లు వేసి సమావేశం ముగించాడు.

కమిటీ నివేదిక సమర్పించిన తరువాత ముఖ్య మంత్రి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేశాడు. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలని చీఫ్ సెక్రెటరీ వివరించాడు. "నలభైకి పైగా ఉన్న కార్పొరేషన్లలో ముఫై కి పైగా నష్టాలలో నడుస్తున్నాయి. అందులో ఇరవై అయిదు కి పైగా సంస్థలు ఆహార పదార్థాల సరఫరా వంటి ప్రజా సంక్షేమ పనులకి సంబంధించినవి. అవి తీసేసినా ప్రభుత్వానికి కలిసి వచ్చేది లేదు. ఇక పూర్తిగా వ్యాపార దృష్టితో నడిచేవి అయిదు మిగిలాయి. అందులో సివిల్ కార్పొరేషన్ ముఖ్య మయినది. దానికి మూలధనం ఎక్కువ ఇవ్వడమే కాకుండా, నష్టాలు కూడా ఎక్కువ వస్తున్నాయి" అని ముగించాడు

" ప్రభుత్వానికి వ్యాపారం ఎందుకు " దానిని మూసేయండి అన్నాడు ముఖ్య మంత్రి మీటింగ్ ముగిస్తూ. జిఓ ఇచ్చి వేయమని చీఫ్ సెక్రెటరీ కి చెప్పాడు

జి ఓ వచ్చిన మరునాడు క్లబ్బు లో పథకం అమలు అయినందుకు అనదోత్సాహాలతో మందు వరదలయి పారింది

కాని ఆ ఆనందం పూర్తిగా దిగే లోపలే . రామ జోగయ్య అనే ఒక ప్రతి పక్ష 'ఎంఎల్ఎ', మూడు వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ముడిపడి ఉందని వినగానే , కార్పోరేషన్ ఉద్యోగులను సంఘటిత పరిచి సుప్రీం కోర్టులో కేసు వేయించాడు. కోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చింది .

వారం రోజులలోనే కేసు వాదనకి వచ్చింది

ఉద్యోగుల తరప్పున అటెండ్ అయిన లాయర్ని, చీఫ్ జస్టిస్ అడిగాడు " నష్టాలలో నడుస్తున్న కార్పోరేషన్ ని ఎందుకు మూయ కూడదో వివరించండి"

" కాంట్రాక్టర్లు కుమ్మక్కయి రేట్లు పెంచేసి ప్రభుత్వ ప్రాజెక్టులకి వందల కొట్లలో వ్యయం పెంచేస్తున్నారని గ్రహించి, తాను కూడా ఒక కాంట్రాక్టర్ గా బిడ్డింగ్లలో పాల్గొని రేట్లు తగ్గించడానికి సివిల్ కార్పోరేషన్ ని ఏర్పరిచారు. ఎందు చేతనంటే గవర్నమెంట్ ప్రత్యక్షం గా కాంట్రాక్టర్ గా వ్యాపారస్తుడిగా పాల్గోలేదు. ఇప్పుడు నష్టాలలో నడుస్తోందని దానిని మూసేస్తా మంటున్నారు. కాని సివిల్ కార్పోరేషన్ పని తీరు పరిశీలించినప్పుడు, అది వేరే కార్పోరేషన్ అన్న ముసుగు ఎత్తి చూడవలసిన అవసరం ఉంది(lifting. అలా చూసినప్పుడు, కార్పోరేషన్ ఉండడం వల్ల ప్రభుత్వానికి వందల కొట్లలో లాభం చేకూరిన సంగతి తెలుస్తుంది. ఒక్క శ్రీశైలం డాం లోనే కొన్ని వందలకోట్లు విలువయిన పనులు సివిల్ కార్పోరేషన్ వల్ల సాధ్య పడింది. పైగా మూడువేల మంది ఉద్యోగాలను ఎ సంక్షేమ ప్రభుత్వమూ విస్మరించలేదు" అని తన వాదనని వినిపించాడు ఉద్యోగస్తుల లాయార్.

ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ " కార్పోరేషన్ పెట్టడం, తీసేయడం ప్రభుత్వం యొక్క సార్వ భౌమ అధికారమనీ, దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు" అని కొన్ని కేసులు ఉదాహరించాడు.

ఇరువర్గాల వాదనలు విన్న తరువాత కోర్టు, ప్రభుత్వ నిర్ణయం లో జోక్యం చేసుకో లేము కాని, మూడు వేల మంది ఉద్యోగాస్తులని ఇతర సంస్థలలో కాని, ప్రభుత్వం లో కాని చేర్చుకుని ఉద్యోగ భద్రత కల్పించి కార్పోరేషన్ మూయ వచ్చు అని ఆర్డర్లు వేసింది.

దాదాపు ఇరవయి సంవత్సరాల తరవాత

ఆదివారం ఆలస్యంగా లేచి అమ్మ ఇచ్చిన కాఫీ తాగి పేపర్ తెరిచాడు కిరణ్. బోర్డర్ లో భారత, పాకిస్తాన్ సైన్యాల మధ్య కాల్పులు. ఉద్రిక్తత. దానితో ప్రారంభించి లోపల పేజీల లోకి వెడితే, అక్కడ ఇంకో వార్త. పాకిస్తాన్ కి కొన్ని మిలియన్ల డాలర్ల అమెరికా సహాయం. వార్త పూర్తి గా చదివిన తరువాత అతనికి సందేహం వచ్చి పక్కనే కుర్చీలో కునికి పాట్లు పడుతున్న తాత, రామ జోగయ్య కేసి చూశాడు. ఆయన గతంలో ఎప్పుడో ఎంఎల్ఏ గా చేశాడని అతనికి తెలుసు. రాజకీయం పూర్తిగా ఒక వ్యాపారం లా అయిపోయిందని చాలా మాట్లు ఆయన అతనితో అనడం అతనికి గుర్తు ఉంది.

తాతయ్య కళ్ళు తెరవడం చూసి అడిగాడు " తాతయ్యా ఈ అమెరికా పాకిస్తాన్ కి ఎందుకు సహాయం చేస్తుంది? అక్కడ కూడా రాజకీయం వ్యాపారమేనా" అడిగాడు, అమెరికాలో రాజకీయం, వ్యాపారం కాదేమో అని

" ఒరేయి మనకున్న వ్యవస్థ లాంటిది అక్కడ చాలాకాలం క్రితం నుంచీ ఉన్నప్పుడు అక్కడ మాత్రం వేరేగా ఎందుకు ఉంటుందిరా?"

"ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ కి సహాయం చేయడం కూడా వ్యాపారమే నంటావా?" అడిగాడు సందేహం వచ్చి

" నిస్సందేహంగా. మామూలుగా అందరూ, ప్రభత్వాలని ప్రజలు ఎన్ను కున్నారు అనుకుంటారు . వాస్తవానికి, ప్రజలు ఎవరిని ఎనుకున్నా వ్యాపారస్తుల హస్తం వెనక ఉంటుంది. ఎన్నికలలో గెలవడానికి అబ్యర్థులకి డబ్బు ఎక్కడినుంచి వస్తుందని అనుకుంటున్నావు? వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టి గెలిపిస్తే, అబ్యర్ధులు గెలిచిన తరువాత పెట్టుబడిదారులకి లాభాలు ఆర్జించి పెట్టాలి"

"ఇక్కడ పాకిస్తాన్ కి అమెరికా సహాయంలో, వ్యాపారం అర్థం కాలేదు" వివరించమన్నట్టు అడిగాడు

'' అమెరికాలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఫైటర్ విమానాల్ని, మిగతా అన్ని రకాల యుద్ధ సామాన్లని తయారు చేస్తాయి. వాటిని అమ్మాలంటే ఎక్కడ అమ్ముతారు? భారత దేశం, పాకిస్తాన్ వంటి దేశాల మధ్య ఎప్పుడూయుద్ధ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ దేశాలకి అవి అవసరం. అవి కొనాలంటే ఆ దేశాలకి అంతపెద్ద మొత్తాలు ఎక్కడినుంచి వస్తాయి. వ్యాపారస్తుల పెట్టుబడితో ఎన్నుకోబడిన సంపన్న దేశాలలోని ప్రభుత్వం, ప్రభుత్వ నిధులు ఎ దేశాలకి సహాయం కింద ఇస్తే, ఆ దేశ ప్రభుత్వాలు సహాయం ఇచ్చిన దేశాలలో ఉన్న వ్యాపారస్తుల నుంచి ఆయుధాలు కొంటారు. అంటే ప్రభుత్వ నిధులు పరోక్షంగా ఆ కంపెనీలకి లాభాలు ఆర్జించి పెడతాయి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా? ఇంకో పక్క నుంచి వాళ్ళ గూఢ చార వ్యవస్థ, భారత పాకిస్తాన్ మధ్య యూద్ధాలకి ఆజ్యం పోస్తారు అని కూడా చాలా మందికి అనుమానం. ప్రజలు ఎదో పార్టీ వాడినే ఎన్నుకోవాలి కదా. ఎవరిని ఎన్నుకున్నా, ప్రజల కంటే ఎక్కువ లాభ పడేది వ్యాపారస్తులే" అర్థం అయిందా అన్నాడు .తాతయ్య

" వ్యాపారస్తులు, రాజకీయనాయకుల సంబంధం విషయంలో మన దేశం లో కూడా ఇలాగే జరుగు తూ ఉంటుందా." కిరణ్ అడిగాడు

" అక్కడ జరుగుతూ ఉన్నంత పచ్చి వ్యభిచారంలా కాక పోయినా, ఇక్కడ కూడా వ్యాపారస్తుల హస్తాలు చాలా పొడవు అని రూడి అయిన సందర్భాలు లేక పోలేదు. మీ సుబ్బారావు మావయ్య గతంలో ఒక ప్రభుత్వ కార్పోరేషన్లో పనిచేసేవాడు గుర్తుందా?" అడిగాడు ఆయన

" ఎందుకు గుర్తులేదు?. చిన్నప్పుడు ఆయన శ్రీ శైలం డాం పనిలో ఉన్నప్పుడు శలవులకి అక్కడికి వెళ్ళే వాళ్ళం కదా" అన్నాడు గుర్తుకు వచ్చి. ఆయన శ్రీశైలం లో చేస్తుండగానే సివిల్ కార్పొరేషన్ ని మూసేశారు కదా ? దానివల్లే ఆయన ఉద్యోగం పోతుందని ఇంట్లో అందరూ ఆందోళన పడ్డారు కదా "

" అదంతా రాజకీయాల మీద పెద్ద వ్యాపారస్తులు తమ ప్రభావం చూపడంవల్ల జరిగింది. ఆ కార్పోరేషన్ మూసేయడం వల్ల, ప్రజలు, రాష్ట్రం మాత్రం పరోక్షంగా నష్ట పోతూనే ఉన్నారు.

" అదెలా జరిగింది. అప్పుడు నువ్వు ఎంఎల్ ఏ గా ఉన్నా వేమో?" అడిగాడు కుతూహలంగా

.రామ జోగయ్య గారు గతం లో జరిగినదంతా మనవడికి వివరించి " ఇప్పుడు ఇంకా అధ్వాన్న మయిపోయింది" అన్నారునిట్టూరుస్తూ

" ఈ దోపిడీని ఆపడానికి మనం ఏమి చేయలేమా?" అన్నాడు ఉక్రోషంగా

" ఏమిచేయ గలం రా? మనం ఇష్టమొచ్చిన పార్టీకి వోటు వేయడం తప్ప మనం ఏమి చేయగలం రా?" అన్నాడు తాతయ్య

" ఎ పార్టీని చూసినా అలాగే ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? ఇటువంటి పరిస్థితి ని ఎలా తీసుకోవాలి ?" అన్నాడు కిరణ్

" బాధ కలిగించే విషయమే, అయినా ఒక విధంగా త్రుప్తి పడాలి. అదేమిటంటే, మనం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని దానిని అమలు చేసుకుంటున్నాము. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నా, మనం అందులో జరుగుతున్న మంచిని చూసి త్రుప్తి పడాలి"

" అంటే ? " అడిగాడు కిరణ్ అర్థం కాక

" స్వేచ్చ లేని కొన్ని దేశాలలో లాగ కాకుండా, అది కాపాడుకుంటూ, ఏంతో కొంత అభివృద్ధి సాధిస్తూ ప్రజల జీవన ప్రమాణం, అనుకున్నంత కాకపోయినా, ఏంతొ కొంత పెంచుకుంటూ వెడుతున్నా ము కదా. మనలాగే బ్రిటిష్ వాళ్ళనుంచి స్వాతత్ర్యం పొందిన అనేక ఆఫ్రికా దేశాలు, ప్రజా స్వామ్యం మాట అటుంచి, అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తునారు. వాళ్ళకంటే మనం చాలా మెరుగు కదా! దానితో త్రుప్తి పడాలి. ఏమార్పు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది."

" అంటే ప్రజా స్వామ్యం లో ప్రజల స్వేఛ్చ, నేతి బీరకాయ లో నెయ్యి లాంటిదే" అన్న మాట . అన్నాడు కిరణ్

సమాప్తం

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.