పంకజం నవ్వింది ! - తటవర్తి భద్రిరాజు

pankajam navvindi

ఊరిలో రామాలయం పక్కనే ఉన్న మట్టి రోడ్ నుండి కుడి వైపుకు తిరిగితే వచ్చేది పెద్దవీది.

పెద్దవీది పేరుకు తగ్గట్టుగానే చాలా విశాలంగా సిమెంట్ రోడ్ తో బావుంటుంది. ఈ వీధి లో ఉండేవాళ్ళు అంతా సామాజికంగా పెద్దవాళ్లు గా పిలవబడే వాళ్లే. అందరూ బాగా ధనవంతులు. అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి.

పెద్దవీది ప్రారంభం లో సుంకర కృష్ణ ఇంటి బయట పారిజాత చెట్టు పువ్వులు రాలుస్తూ ఆ రోడ్ వెంట వచ్చే వాళ్ళకి స్వాగతం చెప్తూ ఉంటుంది.

ఆ రోడ్ అంతా పెద్ద పెద్ద ఇళ్ళు. కొన్ని పాత కాలం పెంకుతో ఉన్నవి. మరికొన్ని ఈ మధ్యకాలం లో కొత్తగా కట్టినవి.

సుంకర కృష్ణ ఇంటికి ఐదు ఇళ్ళు తర్వాత రాజబాబు పాలకేంద్రం ఉంటుంది.

మూడు అంతస్తుల ఆ ఇల్లు పసుపు రంగు పులుముకుని ఎదో రాజకీయపార్టీ కి మద్దతు ఇస్తున్నట్టు పోజు కొడుతూ ఉంటుంది.

గ్రౌండ్ ఫ్లోర్ అంతా పాలకేంద్రం . గ్రామంలో లో పశువులు ఉన్నవాళ్లు పాలు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది.

రాజబాబు ఈ పాల వ్యాపారం ప్రారంభించి బాగానే సిరపడ్డాడు. మంచి నాణ్యమైన పాలు రైతులు వద్ద నుండి కొనడం. వాటిని దగ్గరలోని విశాఖ డైరీ వాళ్లకు అమ్మడం చేసేవాడు.

మొదట్లో కొంచం నష్టాలు వచ్చినా , తర్వాత తర్వాత వ్యాపారం లో మెలుకవులు నేర్చుకుని బాగా సంపాదించాడు.

పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ....ఎప్పుడో పెళ్లి వయసు దాటిపోయన రాజబాబు కి.

బయట వాళ్ళు ఐతే ఆస్తులు బయటకి పోతాయి. మనవాళ్ళు ఐతే మనలోనే ఉంటాయి అని అక్క కూతురు పంకజాన్ని ఇచ్చి రాజబాబు కు పెళ్లి చేశారు.

వయసు లో 20 ఏళ్ళు చిన్న ఐన పంకజం మామయ్య తో పెళ్లి అనగానే నవ్వింది.

పెద్దలు చెప్పినట్టు గానే తాళి కట్టించుకుంది.

రాజబాబు భార్యను మహారాణి లా చూసుకునే వాడు ఆ నాలుగు గోడల మధ్య.

రాజబాబు ఆలోచనలు ఎప్పుడు వ్యాపారం ఇంకా ఎలా పెంచాలి. ఇంకా ఎన్ని ఆస్తులు సంపాదించాలి అనే.

వ్యాపారం లో సహాయం కోసం ఒక ఉద్యోగి ని పెట్టుకుందామా అని పంకజాన్ని అడిగాడు. పంకజం నవ్వింది.

రమణ అని ఒక ఉద్యోగి ని సహాయం కోసం పెట్టుకున్నాడు. రమణ అన్ని పనులు చూసుకునేవాడు.

రాజబాబు రోజూ సాయంత్రం పాలుతీసుకుని వెళ్లి
విశాఖ డైరీ లో దింపి రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. అలా అలా కష్టపడి ఇంకా సంపాదించాడు.

ఓ రోజు రాత్రి పని ముగించుకుని ,కొంచం మందు తాగి ఇంటికి బయలుదేరాడు రాజబాబు.

ఇంటికి వచ్చేటప్పటికి పంకజం దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టింది. దొంగ గోడ దూకడానికి ప్రయత్నం చేసాడు.
ఎత్తైన ప్రహరీ చాలా కష్టం ఐయింది.

ఈలోపు రాజబాబు దొంగను పట్టుకున్నాడు.

"పంకజం దొంగను పట్టుకున్నాను అని గట్టిగా అరచి చెప్పాడు" రాజబాబు. పంకజం నవ్వింది.

నమ్మకం గా పని చేసే రమణ దొంగతనం చేయడానికి వచ్చాడు. మందు మత్తులో ఉన్న రాజబాబు రమణ ను కొట్టాడు.

ఆ రాత్రి అంతా ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకు కట్టి కొడుతూనే ఉన్నాడు.

రాజబాబు మత్తు దిగింది. కానీ కోపం తగ్గలేదు. ఇంకా కొడుతూనే ఉన్నాడు.

తెల్లవారుతూ ఉంది. కోనేరు పక్కనే ఉన్న సత్య సాయిబాబా గుడిలో నుండి భజన పాటలు వినిపిస్తున్నాయి. తెల్లవారు జామున కూసే కోళ్లు అరవడం మొదలు పెట్టాయి. ఊరు చివర ఉన్న సత్తెయ్య హోటల్లో టీ తాగి పనికి బయలుదేరడానికి కూలీలు సిద్ధం గా ఉన్నారు.

తెల్లవారింది. రాజబాబు కోపం తగ్గింది. కానీ రమణ ప్రాణం పోయింది.

పంకజం మళ్లీ నవ్వింది.

నిన్న రాత్రి తాను దొంగ దొంగ అని అరిచి ఉండకపోతే రమణ ప్రాణం తో పాటు తన ప్రాణం కూడా పోయేది అని తనకు తెలుసు. రమణ ను ఎప్పటి నుండో ఇష్టపడుతున్న పంకజానికి.

తాను ఇష్టపడిన రమణ ప్రాణం వదలడం తట్టుకోలేక , ఆ భాద ను కనబడనీయకుండా దాచడానికి పంకజం నవ్వుతూనే ఉంది....!!

మరిన్ని కథలు

Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి